Consulting
-
టెక్నాలజీయేతర రంగాల్లో టెకీలకు డిమాండ్
ముంబై: టెక్నాలజీయేతర రంగాల్లో సాంకేతిక నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. 2027–28 నాటికి 6 పరిశ్రమలు 10 లక్షల మందికి పైగా టెకీలను నియమించుకోనున్నాయి. టీమ్‌లీజ్ సర్వీసెస్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం టెక్నాలజీయేతర రంగాలైన బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా).. కన్సల్టింగ్, కమ్యూనికేషన్ మీడియా, రిటైల్, లైఫ్ సైన్సెస్.. హెల్త్‌కేర్ తదితర రంగాల సంస్థలు 2028 ఆర్థిక సంవత్సరం నాటికి 11.15 లక్షల మంది టెక్ నిపుణులను రిక్రూట్ చేసుకోనున్నాయి. ప్రస్తుతం ఈ రంగాల్లో 7 లక్షల మంది పైగా ప్రొఫెషనల్స్ ఉన్నారు. ‘ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ టెక్నాలజీ ప్రమేయం ఉంటోంది. 5జీ సేవలు ప్రారంభం కావడం, డిజిటల్ చెల్లింపుల వృద్ధి, కొత్త తరం వ్యాపారాల వస్తుండటం, ఆటో మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల ఆధిపత్యం పెరుగుతుండటం, డిజిటల్ పరివర్తన మొదలైన పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీనితో టెక్నాలజీయేతర రంగాల్లోనూ టెకీలకు డిమాండ్ ఏర్పడుతోంది‘ అని టీమ్‌లీజ్ డిజిటల్ సీఈవో సునీల్ సీ తెలిపారు. నిపుణుల కొరత.. ఉద్యోగావకాశాలు పెరుగుతున్నప్పటికీ నిపుణుల లభ్యత ఆ స్థాయిలో లేకపోవడం పరిశ్రమలకు పెద్ద సవాలుగా ఉంటోందని టీమ్‌లీజ్ డిజిటల్ బిజినెస్ హెడ్ (స్పెషలైజ్డ్ స్టాఫింగ్ విభాగం) మునీరా లోలివాలా తెలిపారు. టెకీలను నియమించుకోవడంతో పాటు సిబ్బందిలో సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవడంపైనా కంపెనీలు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తద్వారా నిర్వహణ వ్యవస్థను నైపుణ్యాల ఆధారితమైనదిగా తీర్చిదిద్దుకునేందుకు పటిష్టమైన పునాది వేసుకోవచ్చని మునీరా వివరించారు. ‘ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. టెక్నాలజీయేతర రంగాల్లో ఇప్పటికీ నియామకాలనేవి పర్మనెంట్ ఉద్యోగాల ప్రాతిపదికన ఉండటం లేదు. 54 శాతం సంస్థలు మాత్రమే పర్మనెంట్ సిబ్బందిని రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఏకంగా 30 శాతం సంస్థల్లో నియామకాలు రకరకాల కాంట్రాక్టుల రూపంలో ఉంటున్నాయి‘ అని ఆమె పేర్కొన్నారు. నివేదిక ప్రకారం ప్రాంతం, వేతనాలపరంగా చూస్తే బెంగళూరు, హైదరాబాద్, గుర్గావ్ మెరుగ్గా ఉంటున్నాయి. బెంగళూరులో టెకీల్లో 27 శాతం మందికి, హైదరాబాద్‌లో 16 శాతం, ఢిల్లీ.. పుణెల్లో 13 శాతం మందికి అత్యధిక వేతనాలు లభిస్తున్నాయి. -
మీడియా మింట్ కొనుగోలు ఒప్పందం రద్దు: బ్రైట్‌కామ్
న్యూఢిల్లీ: మీడియామింట్ సంస్థ కొనుగోలు కోసం కుదుర్చుకున్న ఒప్పందం రద్దయినట్లు డిజిటల్ మార్కెటింగ్ సొల్యూషన్స్ సంస్థ బ్రైట్‌కామ్ వెల్లడించింది. దీనికి ప్రత్యామ్నాయంగా కంపెనీతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకోనున్నట్లు తెలిపింది. ‘కొనుగోలు లావాదేవీ కోసం కుదుర్చుకున్న ఒప్పందాన్ని వ్యూహాత్మక భాగస్వామ్య డీల్‌గా మార్చుకోవాలని, బ్రైట్‌కామ్ భవిష్యత్తులో చేపట్టే కొనుగోళ్లకు బ్యాక్ఎండ్ సేవలు అందించాలని ఇరు సంస్థలూ నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో 2021 డిసెంబర్ 7న కుదుర్చుకున్న షేర్ల కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాయి‘ అని స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. మీడియామింట్ ఇటీవల దక్కించుకున్న కొంత మంది క్లయింట్ల కార్యకలాపాలు .. బ్రైట్‌కామ్ ప్రస్తుతం నిర్వహిస్తున్న వ్యాపారం కోవకే చెందినవని, దీని వల్ల విలీన సంస్థ వృద్ధి అవకాశాలపై ప్రభావం పడవచ్చనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. -
సైయంట్ చేతికి వర్క్‌ఫోర్స్ డెల్టా
న్యూఢిల్లీ: కన్సల్టింగ్ సంస్థ వర్క్‌ఫోర్స్ డెల్టాను కొనుగోలు చేయనున్నట్లు ఐటీ ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయంట్ వెల్లడించింది. కంపెనీ విలువను 2.7 మిలియన్ డాలర్లుగా (రూ. 21.5 కోట్లుగా) లెక్కగట్టి ఈ డీల్ కుదుర్చుకున్నట్లు తెలిపింది. తమ అనుబంధ సంస్థ సైయంట్ ఆస్ట్రేలియా ద్వారా వర్క్‌ఫోర్స్ డెల్టాను కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొంది. వారం రోజుల వ్యవధిలో ఈ ఒప్పందం పూర్తి కాగలదని భావిస్తున్నట్లు వివరించింది. మొబైల్ వర్క్‌ఫోర్స్ నిర్వహణకు సంబంధించి ప్రాసెస్ కన్సల్టింగ్ నుంచి సొల్యూషన్స్ అమలు దాకా సమగ్రమైన సేవలు అందించేందుకు ఈ కొనుగోలు తోడ్పడగలదని సైయంట్ ఎండీ కృష్ణ బోదనపు తెలిపారు. 2015లో ఏర్పాటైన వర్క్‌ఫోర్స్ డెల్టాలో 11 మంది కన్సల్టెంట్లు ఉన్నారు. 2021 ఆర్థిక సంవత్సరంలో 2.9 మిలియన్ డాలర్ల ఆదాయం నమోదు చేసింది. -
డిజిటల్ పేమెంట్స్ మార్కెట్ 2025నాటికి మూడింతలు
న్యూఢిల్లీ: భారత్‌లో డిజిటల్ పేమెంట్స్ మార్కెట్ 2025నాటికి మూడింతల వృద్ధిని సాధించి రూ.7,092 ట్రిలియన్లకు చేరుకోవచ్చని బెంగళూరు ఆధారిత రీసెర్చ్ సంస్థ రెడ్‌సీర్ కన్సల్టింగ్ అంచనా వేసింది. ప్రభుత్వ ఆర్థిక విధానాల్లో డిజిటల్ పేమెంట్స్‌కు పెరుగుతున్న ప్రాధాన్యత, వ్యాపారుల డిజిటలైజేషన్‌ల వృద్ధి దేశంలో డిజిటల్ పేమెంట్స్ మార్కెట్ విస్తరణకు తోడ్పడతాయని రీసెర్చ్ పేర్కొంది. ఆర్థిక సంవత్సరం 2019–20లో భారత డిజిటల్ పేమెంట్ మార్కెట్ విలువ దాదాపు రూ.2,162 కోట్లుగా ఉన్నట్లు రీసెర్చ్ తెలిపింది. ఈ వృద్ధి అనేక డిమాండ్, సరఫరా అంశాలతో ముడిపడి ఉన్నట్లు కన్సల్టెన్సీ సర్వేలో తెలిపింది. డిజిటల్ పేమెంట్స్ మార్కెట్లో ప్రస్తుతం 1శాతంగా ఉన్న మొబైల్ పేమెంట్స్ 2025నాటికి 3.5శాతానికి పెరగవచ్చని నివేదిక అంచనా వేసింది. ఇదే సమయంలో 162 మిలియన్లు ఉన్న మొబైల్ పేమెంట్ యూజర్లు 800 మిలియన్లకు చేరుకొనే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. డిజిటల్ పేమెంట్స్‌లోకీలకపాత్ర పోషిస్తున్న వాలెట్ ఆధారిత పేమెంట్స్... ఫ్రీక్వెన్సీ, యూజర్ బేస్ రెండింటిలో నిరంతర వృద్ధి చెందుతూ రానున్న డిజిటల్ మార్కెట్ పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంది. 2025 నాటికి, వాలెట్ల ద్వారా చెల్లింపులు అధికంగా ఉండవచ్చని, చివరికి తక్కువ–ఆదాయ చెల్లింపుగా భావించే మల్టీపుల్ స్మాల్–టికెట్ లావాదేవీలు కూడా వాలెట్ల ద్వారానే జరగవచ్చని రీసెర్చ్ సంస్థ భావిస్తోంది. కరోనా వ్యాప్తి డిజిటల్ పేమెంట్స్‌కు ఒక ఉత్ప్రేరకంగా పనిచేసిందని తెలిపింది. కరోనా భద్రత ఆందోళనలతో ప్రజలు మొబైల్ ఫోన్ల ద్వారా చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వడంతో గ్రాసరీ స్టోర్‌లో డిజిటల్ పేమేంట్స్ 75% పెరిగినట్లు నివేదిక తెలిపింది. -
విజయ్ మాల్యాను వెనక్కి రప్పిస్తాం
న్యూఢిల్లీ: బ్యాంకులకు వేలకోట్లు ఎగనామం పెట్టిన విజయ మాల్యాను స్వదేశానికి రప్పించే విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభ్యర్థనకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) స్పందించింది. అతడిని విచారణ నిమిత్తం భారత్ కు రప్పించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. తొమ్మిదివేల కోట్ల బ్యాంకు రుణ కుంభకోణం కేసుకు సంబంధించి మాల్యాపై ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే ముందు నిపుణులను సంప్రదిస్తున్నట్లు తెలిపింది. తన విదేశీ ఆస్తుల వివరాలను అడిగే అధికారం బ్యాంకులకు లేదని, తన భార్యా, పిల్లలు ఎన్నారైలు కావడంతో తన ఆస్తుల వివరాలను వెల్లడించక్కర లేదని మాల్యా ఇప్పటికే సుప్రీం కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాల్యా కేసుపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఈడీ సంప్రదించింది. దీంతో మాల్యా తమ న్యాయవాదులకు అందుబాటులో ఉన్నారని, అతడిని వెనక్కి తీసుకు వచ్చేందుకు (డిపోర్టేషన్) తదుపరి చర్యలకు అనుమతి కోరుతూ ఈడీ ఇచ్చిన అభ్యర్థన తమ శాఖకు అందిందని, ఆయా విషయాలపై తాము న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. మాల్యాను స్వదేశానికి రప్పించే డిపోర్టేషన్ ప్రక్రియ ప్రారంభించాలంటూ విదేశీ వ్యవహారాల శాఖను ఈడీ గురువారం ఆశ్రయించింది. ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన నేపథ్యంలో ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు (ఆర్సీఎన్) వచ్చేలా సీబీఐ కి త్వరలోనే ఈడీ లేఖ రాయనుంది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కు తీసుకున్న రుణంలో మాల్యా 430 కోట్ల రూపాయల వరకూ విదేశాలకు మళ్ళించారన్నది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వాదన. ఇదే కేసుపై విచారించిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గతవారం మాల్యా దౌత్య పాస్ పోర్ట్ ను సస్పెండ్ చేసింది. అయితే సదరు వ్యాపారవేత్త డబ్బు లావాదేవీల్లో చట్టాన్ని ఉల్లంఘించారని, కేసు విచారణకు సరిగా సహకరించడంలేదని ఈ నేపథ్యంలో మాల్యా పాస్ పోర్టు ఎందుకు రద్దు చేయకూడదంటూ ఈడీ ప్రశ్నిస్తోంది.