నడిపించండి మా జీవన నావ
పార్వతీపురంరూరల్: ఆ భార్యాభర్తలిద్దరూ పుట్టుకతో అంధులు. అయినా సరే వారి ఆత్మవిశ్వాసమే అందరిలా వారిని ముందుకు నడిపిస్తోంది. అయితే ఆ దంపతులకు రోజురోజుకూ బతుకుభారం పెరిగిపోవడంతో ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు ఆ దంపతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో దాంపత్య జీవితాన్ని సాగిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బందలుప్పి గ్రామానికి చెందిన బోగారపు లక్ష్మణరావు పుట్టుకతో అంధుడు, ఆయన తన జీవనం కోసం ఒక వైపు ఆర్కెస్ట్రాలో పాటలు పాడుతూ బీఏ పూర్తి చేశాడు. జీవనభృ తికోసం ఈ ప్రాంతంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పలు ఆర్కెస్ట్రా బృందాల్లో పాటలు పాడుతున్నాడు. ఈ తరుణంలో ఆయనకు ప్రకాశంజిల్లా ఒంగోలుకు చెందిన అంధురాలు అనూరాధతో పరిచయమయ్యింది. ఆమె ఇంటర్మీడియెట్ చదువుకుంది.
ఆమెకూడా ఆర్కెస్ట్రా బృందాల్లో పాటలు పాడడంతో వీరిద్దరి పరిచయం స్నేహంగా మారి పెళ్లికి దారితీసింది. ఇద్దరూ ఒక ఇంటివారై సంచార జీవనం వీడి బందలుప్పిలో ఉన్న లక్ష్మణరావు ఇంటికి చేరుకున్నారు. అయితే పెరుగుతున్న నిత్యావసర ధరలు వీరి బతుకును భారంగా మార్చాయి. దీంతో ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల గ్రామంలో అంగన్‌వాడీ కార్యకర్త పోస్టు వికలాంగుల కోటాలో మంజూరైంది. దీనికోసం అనూరాధ దరఖాస్తుచేసుకుంది. అయితే రాజకీయ నాయకుల పలుకుబడి ఆమెకు ఆ పోస్టు రానీయకుండా అడ్డుకుంది. సరే పోస్టు పోతే పోయింది కనీస సహాయం ఏదైనా తమకు అందించాలంటూ ఈ దంపతులు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. కనీసం వికలాంగుల పింఛనునైనా ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికైనా ఏదో ఒక సహాయం చేసి తమను ఆదుకోవాలని ఆ దంపతులిద్దరూ వినయపూర్వకంగా కోరుకుంటున్నారు.