అంధులు.. దృష్టిదోషమున్నా మనసుతో లోకాన్ని చూసేవారు. ఊహలతో, ఊసులతో ప్రపంచాన్ని వీక్షించేవారు. వీరు సమాజంతో సంబంధాలు నెరవేర్చేందుకు ఏర్పడినదే బ్రెయిలీ లిపి. ఇది అంధులకు వరంలాంటిదని చెప్పుకోవచ్చు.
ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని ప్రతీఏటా జనవరి 4న జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా దృష్టిలోపంతో జీవితం గడుపుతున్న వారికి ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. లూయిస్ బ్రెయిలీ అనే మహనీయుని పుట్టినరోజు సందర్భంగా బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈయనే బ్రెయిలీ లిపిని ఆవిష్కరించారు. బ్రెయిలీ లిపి అనేది అంధులు చదవడానికి, రాయడానికి ఉపయోగించే భాష. పుట్టుకతోనో, లేదా ఇతరత్రా కారణాలతో కంటి చూపు కోల్పోయిన వారు చదువుకు దూరమవకుండా ఉండేందుకే ఈ బ్రెయిలీ లిపిని రూపొందించారు.
అంధత్వంతో బాధపడుతున్న వారు తమ స్వశక్తితో సమాజంలో ఇతరులతో సమానంగా నిలిచేందుకు బ్రెయిలీ లిపి దోహదపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా దృష్టిలోపంతో సతమతమవుతున్నవారికి లూయిస్ బ్రెయిలీ తన ఆవిష్కరణతో మార్గదర్శిగా నిలిచారు. లూయీస్ బ్రెయిలీ జీవించి ఉన్నప్పుడు దక్కని గౌరవం అతని మరణాంతరం దక్కింది. ఆయన పుట్టినరోజును ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంగా జరపుకోవడమే ఆయనకు దక్కిన అత్యున్నత గౌరవం.
లూయిస్ బ్రెయిలీ 1809, జనవరి 4న ఫ్రాన్స్‌లోని కూప్రే అనే గ్రామంలో జన్మించారు. అతని తండ్రి పేరు సైమన్ రాలీ బ్రెయిలీ. అతను నాటిరోజుల్లో రాజ గుర్రాలకు జీనులు తయారు చేసేవాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో లూయిస్ తన మూడేళ్ల వయసు నుండే తన తండ్రితో కలిసి పని చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో జరిగిన ఒక ప్రమాదంలో ఒక కత్తి అతని ఒక కన్నుకు గుచ్చుకుని, అతని చూపు దెబ్బతింది. కొద్దికాలానికి మరో కంటి చూపు కూడా పోయింది. సరైన వైద్యం అందక లూయీస్ ఎనిమిదేళ్ల వయసులోనే పూర్తిగా చూపు కోల్పోయాడు.
తరువాత లూయిస్ బ్రెయిలీ అంధుల పాఠశాలలో చేరాడు. చీకట్లో కూడా మెసేజ్‌లను చదవడంలో సహాయపడే సైనిక కోడ్ గురించి లూయిస్‌కు బాగా తెలుసు. అంధుల కోసం అలాంటి స్క్రిప్ట్ రూపొందించాలనే ఆలోచన అతని మదిలో మెదిలింది. దీంతో అతను బ్రెయిలీ లిపిని రూపొందించారు. ఇది అంధులు చదవడానికి, రాయడానికి ఉపయుక్తమయ్యే ఒక స్పర్శ కోడ్. ఈ లిపి కోసం ఎంబోస్డ్ పేపర్‌ను వినియోగిస్తారు. దానిపై ఉన్న చుక్కలను స్పర్శిస్తూ చదవవచ్చు. బ్రెయిలీ లిపిని టైప్‌రైటర్‌తో సమానమైన బ్రెయిల్‌రైటర్ ద్వారా రాయవచ్చు. ఇదేకాకుండా స్టైలస్, బ్రెయిలీ స్లేట్ ఉపయోగించి కూడా రాయవచ్చు. బ్రెయిలీ లిపిలో ఉపయోగించే చుక్కలను సెల్ అని అంటారు.
ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ వెలువరించిన నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 39 మిలియన్ల మంది అంధత్వంతో బాధపడుతున్నారు. సుమారు 253 మిలియన్ల మంది దృష్టిలోపానికి గురయ్యారు. దీనిని గుర్తించిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2018లో లూయిస్ బ్రెయిలీ జన్మదినమైన జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకోవాలని తీర్మానం చేసింది. అదిమొదలు ప్రతీయేటా జనవరి 4న ప్రపంచవ్యాప్తంగా బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Newton Birthday: ఆ మహాశాస్త్రవేత్తకు రెండు జననమరణాలు
Comments
Please login to add a commentAdd a comment