
సాక్షి,నాగోలు : హైదరాబాద్‌లోని నాగోలులో పోలీసులను కంటతడి పెట్టించే హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మూడు రోజుల క్రితం కుమారుడు చనిపోయినా అంధ వృద్ధ తల్లిదండ్రులు గుర్తించకపోవడం కలచి వేస్తుంది. నాగోలు పోలీసుల కథనం ప్రకారం.. నాగోలులో అంధుల కాలనీలో కలువ రమణ, శాంతికుమారి దంపతులు నివసిస్తున్నారు. వారి చిన్న కుమారుడు ప్రమోద్(32) పెయింటింగ్ పనిచేస్తుంటాడు. మూడు రోజుల క్రితం ప్రమోద్ మద్యం మత్తులో మరణించారు.

అయితే కుమారుడు మరణించిన విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించ లేకపోయారు. ఓ వైపు ఆకలి.. మరోవైపు కుమారుడు చనిపోయిన విషయాన్ని గుర్తించ లేక మూడు రోజుల పాటు ఏం చేయాలో పాలుపోక అలాగే ఉండిపోయారు. మూడు రోజుల త్వరాత ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు నాగోలు పోలీసులకు సమాచారం అందించారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న నాగోలు సీఐ సూర్యనాయక్, ఎస్ఐ శివనాగప్రసాద్‌లు మానవత్వం చాటుకున్నారు. ఇంట్లో కుళ్లిన స్థితిలో మృతదేహం ఉండగా.. మంచంపై తల్లిని, కొద్ది దూరంలో తండ్రిని గుర్తించి కన్నీటి పర్యంతమయ్యారు. ఇంట్లో ఉన్న దంపతుల్ని మాట్లాడించే ప్రయత్నం చేసినా ఆహారం తీసుకోకపోవడంతో ఇద్దరూ మాట్లాడలేకపోతున్నారు. వెంటనే వాళ్లిద్దరిని ఇంట్లో నుంచి బయటకు తీసుకువచ్చారు. దంపతులకు స్నానం చేయించారు. ఆహారం,మంచినీళ్లు అందించారు.అనంతరం, వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.

Comments
Please login to add a commentAdd a comment