
టెక్నాలజీతో అడ్డుకున్నాం: చంద్రబాబు
హైదరాబాద్: సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా హుదూద్ తుపాను విపత్కర పరిస్థితులను అధిగమించగలిగామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. మూ డు రోజులనుంచి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రాణ, ఆస్తి నష్టం నివారించగలిగామని చెప్పారు. ఆదివారం విజయవాడ వెళ్లే ముందు తుపాను ప్రభావం, సహాయక చర్యలపై సచివాలయంలో అధికారులతో సమీక్షించిన అనంతరం చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకునేందుకు తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని 1,200 మంది సర్పంచులతో మాట్లాడేందుకు ప్రయత్నించగా వంద మంది మాత్రమే లైన్లోకి వచ్చారన్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందన్నారు.
విశాఖపట్నం దగ్గర్లోని పూడిమడక వద్ద తుపాను తీరం దాటిందన్నారు. ఏ సమయంలో దాటిందో తెలుసుకునేందుకు రాడార్ కేంద్రం పనిచేయడం లేదని, రాడార్‌తో అనుసంధానం తెగిపోయిందన్నారు. జీడి, కొబ్బరి తోటలు, వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, నష్టం వివరాలు సేకరించేందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు. ప్రాణ నష్టం ఏమాత్రం ఉండరాదని లక్ష్యంగా పెట్టుకున్నా ఇప్పటివరకూ ముగ్గురు మరణించినట్లు తమకు సమాచారం అందిందన్నారు.
‘విండ్ మెజర్ మెకానిజమ్’ అందుబాటులో లేదు
తుపాను గాలుల వేగం గంటకు 180 నుంచి 200 కిలోమీటర్లుగా ఉందని చంద్రబాబు చెప్పారు. అయితే ‘విండ్ మెజర్ మెకానిజమ్’ అందుబాటులో లేదని, నేవీ సమాచారం ప్రకారం గాలుల తీవ్రత తెలిసిందన్నారు. నష్టం గురించి తెలుసుకునే వ్యవస్థ కూడా మనవద్ద లేదన్నారు. తుపాను సహాయక చర్యలు, నష్టం అంచనా వేసేందుకు ప్రభుత్వం మొబైల్ యాప్ రూపొందించిదని, తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు దీన్ని డౌన్‌లోడ్ చేసుకుని సమాచారం అందించాలని కోరారు. డ్వాక్రా మహిళలు తుపాను బీభత్సానికి సంబంధించి ఫోటోలు తీసి స్మార్ట్ ఫోన్ల ద్వారా సమాచారం పంపించాలని సూచించారు.
తక్షణం రూ.2,000 కోట్లివ్వండి
హుదూద్ భారీ నష్టాన్ని కలిగించిన నేపథ్యంలో జాతీయ విపత్తుగా ప్రకటించాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. తక్షణ సాయంగా రాష్ట్రానికి రూ.2,000 కోట్లు అందచేయాలని విజ్ఞప్తి చేశారు.