
మరో 3 రోజులు చీకటే!
4 రోజులుగా చీకట్లో మగ్గుతున్న విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు
పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరాకు మరో వారం!
విశాఖ నగరానికి పాక్షిక సరఫరా.. నేడు మరికొంత విద్యుత్
కూలిపోయిన భారీ టవర్లు, స్తంభాల తొలగింపులో సమస్యలు
ఎస్పీడీసీఎల్, తమిళనాడు, ఒడిశాల నుంచి వేలాది నిపుణుల తరలింపు
హైదరాబాద్ : హుదూద్ తుపాను ధాటికి విలవిల్లాడిన ఉత్తరాంధ్ర అంధకారంలో మగ్గిపోతోంది. తుపాను వచ్చి నాలుగు రోజులైనా ఇప్పటికీ విద్యుత్ వ్యవస్థ కొంచెం కూడా కోలుకోలేదు. పెద్ద పెద్ద టవర్లు కూడా కూలిపోవడం, సబ్‌స్టేషన్లు పూర్తిగా దెబ్బ తినడం, వేలాది విద్యుత్ స్తంభాలు నేలకొరగడం, కిలోమీటర్ల కొద్దీ లైన్లు దెబ్బ తినడంతో విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ అగ్ని పరీక్షగా మారింది. దీంతో ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని 22 లక్షల మంది విద్యుత్ వినియోగదారులకు మరో మూడు రోజులు చీకట్లు తప్పేలా కనిపించడంలేదు. పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరాకు మరో వారం పట్టవచ్చని తెలుస్తోంది. ఇప్పటివరకు గాజువాక సబ్ స్టేషన్‌లో కొంత మేరకు మరమ్మతులు పూర్తిచేసి, విశాఖ నగరానికి పాక్షికంగా పునరుద్ధరించగలిగారు.బుధవారం రాత్రికి విశాఖలోని గాజువాక, గోపాలపట్నం, ఎన్‌ఏడీ, విశాఖ కలెక్టరేట్, కేజీహెచ్, సర్క్యూట్ హౌస్, వైజాగ్ సెంట్రల్, విక్టోరియా ఆస్పత్రి, ఓల్డ్ పోస్టాఫీస్ ప్రాంతాలకు ప్రయోగాత్మకంగా విద్యుత్ సరఫరా చేశారు.
గురువారం సాయంత్రానికి నగరంలో 50 శాతం ప్రాంతాలకు విద్యుత్ సరఫరా జరిగే అవకాశం వుంది. చత్తీస్‌గడ్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఈఆర్‌ఎస్ (ఎమర్జెన్సీ రెస్టోర్ సిస్టం) పరికరాలను అమర్చి శనివారం రాత్రికి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించే పనులు జరుగుతున్నాయి. నగర ప్రజల తాగు నీటి అవసరాలు, వైద్య సేవలకు ఇది ఉపయోగపడుతోంది. రైల్వే లైన్లకు కూడా కొంతవరకూ విద్యుత్ అందుతోంది. తాజా సమాచారం ప్రకారం కేవలం 70 వేల వినియోగదారులకు మాత్రమే విద్యుత్ సరఫరా జరుగుతోంది. వాస్తవ వినియోగంలో విశాఖ జిల్లా వ్యాప్తంగా 12 శాతం, నగర పరిధిలో 12 శాతం మేర సరఫరా చేస్తున్నారు. సింహాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంటు ఇప్పటికీ పనిచేయడంలేదు. సీలేరులో విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నా లైన్లు తెగి వాడుకోలేని పరిస్థితి ఏర్పడింది.
తొలగించడమే కష్టం
విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు 5 వేల మందికి పైగా ఉద్యోగులు, అధికారులు పని చేస్తున్నప్పటికీ, పనులు కొలిక్కి రావడంలేదు.విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 450 భారీ విద్యుత్ టవర్లు కుప్పకూలాయి. దాదాపు 20 వేల స్తంభాలు విరిగిపోయాయి. వీటన్నింటినీ తొలగిస్తే తప్ప కొత్త వాటిని వేయడం కష్టమని గుర్తించారు. ఆ తర్వాత సబ్ స్టేషన్లను పునరుద్ధరించినా, అవి రీఛార్జ్ అవడానికి 24 గంటలు పడుతుంది. ఇలా మరో వారం పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు అంధకారం తప్పకపోవచ్చు. వివిధ ప్రాంతాల నుంచి 2 వేల మంది సిబ్బందిని రప్పించారు. వీళ్ళంతా తీగలు వేయడానికి, స్తంభాలు అమర్చడానికి, టవర్లు బాగు చేయడానికే ఉపయోగపడుతున్నారు. అయితే టెలిఫోన్, ఇతర కేబుల్స్ కూడా కలిసిపోవడంతో వాటిని వేరు చేయడం కష్టంగా ఉంది. తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) వినతి మేరకు ఎస్పీడీసీఎల్ నుంచి 2 వేల మందిని, ఒడిశా నుంచి 1,000 మందిని, తమిళనాడు నుంచి 1,500 మందిని రప్పిస్తున్నారు.
జిల్లాల పరిస్థితి మరీ ఘోరం!
విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. పెందుర్తి, గరివిడి లైన్ల ద్వారా విద్యుత్ సరఫరాకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. ఈ మార్గంలో 8 ప్రధాన టవర్లు కూలిపోయాయి. దీంతోపాటు మూడు జిల్లాల్లో 132 కేవీ సబ్‌స్టేషన్లు 25, 33/11 కేవీ సబ్‌స్టేషన్లు 287, 11 కేవీ సబ్‌స్టేషన్లు 1,411, మరో 10,500 ఫీడర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వీటిని దారికి తెస్తే తప్ప ఈ మూడు జిల్లాల్లో పరిస్థితి మెరుగవదు.వీటన్నింటినీ బాగు చేయడానికి 4 నుంచి 7 రోజులు పడుతుందని అధికారులు అంటున్నారు.
జనరేటర్ అద్దె గంటకు రూ.3 వేలు
జనరేటర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. సాధారణ రోజుల్లో రోజుకు రూ.1,000 వసూలు చేసే జనరేటర్ల వారు ఇప్పుడు విశాఖలో గంటకు రూ.3 వేలు డిమాండ్ చేస్తున్నారు.
నీటి కోసం జనం పాట్లు
ఉత్తరాంధ్రలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలకు నీరు సరఫరా కావడంలేదు. తాగడానికి, కాలకృత్యాలకు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదనుగా నీటి వ్యాపారులు రేట్లు పెంచేశారు. మామూలుగా రూ. 20కి లభించే 20 లీటర్ల వాటర్ క్యాన్‌కు ఇప్పుడు రూ. 70 నుంచి రూ.100 దాకా వసూలు చేస్తున్నారు. ఇంత డబ్బు చెల్లించి నీళ్లు కొనుక్కోలేని సాధారణ ప్రజలు కార్పొరేషన్, స్వచ్ఛంద సంస్థలు పంపే ట్యాంకర్ల కోసం రోడ్లపై బిందెలు, గిన్నెలతో నిరీక్షిస్తున్నారు. అపార్ట్‌మెంట్‌వాసులు గంటకు రూ.3 వేలు చెల్లించి జనరేటర్లతో నీటి ఏర్పాట్లు చేసుకున్నారు. మురికివాడల్లో నివసించే వారు సుదూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి నీటి ట్యాంకర్లు వచ్చినప్పటికీ, స్థానిక అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో అవి జనానికి పెద్దగా ఉపయోగపడట్లేదు.
48 గంటల్లో పునరుద్ధరణ: అజయ్‌జైన్
విశాఖపట్నం: విశాఖ మహానగరానికి మరో 48 గంటల్లో 70 శాతం వరకు విద్యుత్ పునరుద్ధరించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఎనర్జీ కార్యదర్శి అజయ్‌జైన్ తెలిపారు. సీతమ్మధార తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో బుధవారం విలేకరుల తో ఆయన మాట్లాడారు. ఇప్పటికే గాజువాక, గోపాలపట్నం సబ్‌స్టేషన్లు పునరుద్ధరించినట్టు చెప్పారు. పెందుర్తి, గరివిడి పునరుద్ధరించి మరో 48 గంటల్లో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు. ఇప్పటికే ఒరిస్సా రాష్ట్రం నుంచి 10 నుంచి 20 మెగావాట్ల ఉత్పత్తిని తీసుకుని శ్రీకాకుళం, పార్వతీపురం పరిసర ప్రాంతాలకు అందిస్తున్నామన్నారు. నక్కవానిపాలెం సబ్‌స్టేషన్ పునరుద్ధరించి సీతమ్మధార ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు. బుధవారం రాత్రికి 40 సబ్‌స్టేషన్లు పున రుద్ధరించి 50 నుంచి 70 వేలమంది వినియోగదారులకు విద్యుత్ అందిస్తామన్నారు.