నష్టం అపారం! | Loss immensly! | Sakshi
Sakshi News home page

నష్టం అపారం!

Published Tue, Oct 14 2014 12:38 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 PM

నష్టం అపారం!

నష్టం అపారం!

  • భారీగా నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
  •  48 గంటలుగా అంధకారంలో జిల్లా
  •  పూర్తి పునరుద్ధరణకు మరో 2 రోజులు
  •  వేల ఇళ్లు నేలమట్టం
  •  నష్టం రూ.1500 కోట్లు పైమాటే
  • విశాఖ రూరల్: విశాఖ మోడులా మారింది. హుదూద్ తుపాను జిల్లా రూపురేఖలను మార్చేసింది. పెనుగాలులు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. విశాఖ చరిత్రలో కనీవిని ఎరుగని స్థాయిలో తీరని నష్టాన్ని తెచ్చిపెట్టాయి. జిల్లాలో ఏడుగురి ప్రాణాలను హరించాయి. లెక్కలేనంత మందిని క్షతగాత్రులను చేశాయి. పైకప్పులు లేని ఇళ్లతో, కన్నీరు ఉప్పొంగుతున్న కళ్లతో ప్రజానీకం బావురుమంటోంది. ప్రజలకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది.

    జిల్లాను విషాదంలో ముంచేసింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు హుదూద్ తుపాను కారణంగా జిల్లా రూపురేఖలు మారిపోయాయి. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. వేల మంది నిరాశ్రయులయ్యారు. 48 గంటలుగా జిల్లా అంధకారంలో మగ్గుతోంది. కమ్యూనికేషన్ వ్యవస్థ స్తం భించింది. తాగడానికి నీరు లేదు. తినడానికి తిండి లేదు. ఉండడానికి నిలువ నీడలేదు. పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టినా ప్రకృతి ప్రకోపం ముందు నిలవలేకపోయారు. నస్టాన్ని నివారించలేకపోయారు. ఈ తుపాను కారణంగా జిల్లాలో రూ.1500 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు అధికారులు అంచనాలు వేస్తున్నారు.
     
    వేల ఇళ్లు నేలమట్టం : శనివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన పెను గా లులకు వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి. పూరిళ్లు, రేకులు, పెంకుటిళ్లే కాకుండా పక్కా ఇళ్లు కూడా భారీగా దెబ్బతిన్నా యి. 10 వేలకు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని అధికారులు భావిస్తున్నారు.
     
    అంధకారంలో జిల్లా : పెనుగాలులకు భారీ సంఖ్యలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు నేలకొరిగాయి. అన్ని శాఖల కంటే విద్యుత్ శాఖకు భారీగా నష్టం వాటిల్లింది. ప్రస్తుత పరిస్థితుల్లో చెట్లను పూర్తిగా తొలగిస్తేనే గాని విద్యుత్‌ను పునరుద్ధరించే అవకాశం లేదు. దీంతో చెట్ల నరికివేతను వేగవంతంగా చేపడుతున్నారు. పూర్తి స్థాయిలో విద్యుత్‌ను పునరుద్ధరించాలంటే కనీసం 48 గంటలు పడుతుందని అధికారులు చెబుతున్నారు. రూ.500 నుంచి రూ.600 కోట్లు వరకు నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
     
    స్తంభించిన కమ్యూనికేషన్

    హుదూద్ తుపాను కారణంగా కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తి స్తంభించి పోయింది. టెలికాం సంస్థల సెల్ టవర్లకు పెద్దగా నష్టం వాటిల్లనప్పటికీ విద్యుత్ అంతరాయం కారణంగా జిల్లాలో ఫోన్ సిగ్నల్‌కు అంతరాయం ఏర్పడింది. వీటిని పునరుద్ధరించడానికి అధికారులు చర్యలు చేపట్టారు.
     
    దెబ్బతిన్న పంటలు : ప్రస్తుతం జిల్లాలో 1,78,743 హెక్టార్లలో పంటలు సాగవుతున్నాయి. ఇందులో ప్రధానంగా వరి 88,893 హెక్టార్లలోను, చెరకు 37,459 హెక్టార్లలోను, రాగి 20,324 హెక్టార్లలోను సాగు జరుగుతోం ది. మరికొద్ది రోజుల్లో కోతకు సిద్ధమవుతున్న తరుణంలో హుదూద్ తుపాను పంటలను తీవ్రంగా దెబ్బతీసింది. రూ.75 కోట్లు వరకు నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
     
    దెబ్బతిన్న రోడ్లు : భారీ వర్షం కారణంగా రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జిల్లాలో దాదాపుగా 100 కిలోమీటర్ల మేర రోడ్లు పాడైనట్లు ఆర్ అండ్ బీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీని నష్టం రూ.40 కోట్లు వరకు ఉంటుందని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement