
ముప్పు తొలగిపోలేదు...
ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి, దక్షిణ ఒడిశాలకు హుదూద్ తుపాను ముప్పు ఇంకా తొలగిపోయాలేదు. ఆదివారం మధ్యాహ్నం విశాఖ వద్ద తీరం దాటిన తుపాను ఆరేడు గంటల్లో బలపీనపడి అల్పపీడనంగా మారుతుందని మొదట భారత వాతావరణ శాఖ అంచనావేసింది. అయితే ఐఎండీ ఊహించినట్లుగా తుపాను త్వరగా బలహీనపడలేదు. ఇది నెమ్మదిగానే బలహీనపడుతూ వస్తోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి ఒకరు తెలిపారు. ‘‘అతి తీవ్ర తుపాను ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారింది’’ అని ఆ అధికారి వివరించారు. దీనిప్రభావంతో ఆదివారం రాత్రికి ఉత్తరాంధ్రలో ఇంకా బలమైన పెను గాలులు, భారీ వర్షాలు కొనసాగుతున్నాయి.
తుపాను క్రమేపీ బలహీనపడి సోమవారం మధ్యాహ్నానికి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దాని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి, దక్షిణ ఒడిశా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా సాధారణ నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. తెలంగాణలో కూడా కొన్ని చోట్ల సాధారణ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.