పచ్చటి కొండలు, భారీ వృక్షాలతో ఎటు నుంచి చూసినా హరిత వనంలా కనిపించే విశాఖను హుదూద్ తుపాను మటుమాయం చేసింది.
నగరంలో 10 వేల చెట్లు నేలమట్టం
వందేళ్ల నాటి భారీ వృక్షాలూ నేలకొరిగాయి
ఉష్ణోగ్రత, కాలుష్యం పెరుగుతాయని ప్రజల ఆందోళన
మళ్లీ పచ్చటి విశాఖ కనిపించాలంటే పదేళ్లు పట్టే అవకాశం
పచ్చటి కొండలు, భారీ వృక్షాలతో ఎటు నుంచి చూసినా హరిత వనంలా కనిపించే విశాఖను హుదూద్ తుపాను మటుమాయం చేసింది.పర్యావరణానికి మారుపేరుగా నిలిచిన విశాఖ నగరంలో ఇప్పుడు పర్యావరణ పరిరక్షణే పెద్ద సవాలుగా మార్చింది. సముద్రం ఒడ్డున స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందబోతున్న ఉక్కు నగరాన్ని ఒక్క రోజులోనే అందవిహీనంగా మార్చింది. హూదూద్ ధాటికి నగరంలో 10 వేలకు పైగా చెట్లు నేలమట్టమయ్యాయి. వందేళ్లకు పైగా పర్యావరణానికి అండగా నిలుస్తున్న భారీ వృక్షాలు సైతం పెనుగాలులకు నేలకొరిగాయి. దీంతో విశాఖకు తీరనం నష్టం కలిగింది. కశింకోట నుంచి విశాఖ శివారు వరకు ఎక్కడ చూసిన నేలకొరిగిన చెట్లే కనిపిస్తున్నాయి. మళ్లీ విశాఖ ఇలాంటి చెట్లతో అలరారాలంటే అనేక ఏళ్లు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంత పెద్ద చెట్లు పెరగడానికి పదేళ్లకు పైగానే పడుతుందని నగరంలోని సీనియర్ సిటిజన్ నరసింహాచార్యులు ఆవేదన వ్యక్తంచేశారు. నగర ప్రజలు మొక్కల పెంపకాన్ని ఉద్యమంలా చేపట్టి, అన్ని చెట్లూ పెరగాలన్న గట్టి ప్రయత్నంతో పనిచేస్తేనే గానీ మళ్లీ పచ్చదనం పరుచుకునే అవకాశం లేదని ఆయన చెప్పారు. అందమైన గ్రేటర్ విశాఖలో చెట్లే ప్రధానమైనవి. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఎండ కూడా నేలను తాకలేనంత స్థాయిలో గుబురైన భారీ చెట్లు ఉండేవి. నగరం చుట్టుపక్కల కూడా భారీ సంఖ్యలో చెట్లు నగరానికి అందాన్నిచ్చేవి. వేసవి కాలంలో ఎంత ఎండ తీవ్రత ఉన్నా, ప్రజలకు ఈ చెట్లు ఉపశమనాన్ని కలిగించేవి.
నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని సైతం ఇవే అదుపు చేసేవి. జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఆంధ్రా యూనివర్శిటీ, కేజీహెచ్, జూపార్కు, శివాజి పార్కు, కైలాసగిరి, పాత జైలు, ఉడా కార్యాలయం ప్రాంతాల్లో ఉన్న వందేళ్ల నాటి భారీ వృక్షాలు తుపాను ధాటికి కూకటి వేళ్లతో సహా కూలిపోయాయి. విశాఖ కొండల్లోని చెట్లన్నీ కూలిపోయి అవన్నీ ఇప్పుడు బోడిగా కనిపిస్తున్నాయి. నగరంలోని ప్రతి వీధిలో కూలిపోయిన చెట్లు కనిపిస్తున్నాయి. ఇళ్లు, కార్యాలయాలు, రోడ్లు, వాహనాల మీద పడి వాహనాల రాకపోకలకు అడ్డంకిగా మారాయి. ఇంత భారీ సంఖ్యలో చెట్లు నేలకూలడంతో రాబోయే రోజుల్లో విశాఖ నగరంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతాయని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. వేసవిలో ఉక్కపోతలు కూడా పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. నగరం చుట్టూ ఉన్న పరిశ్రమలు, పోర్టుల నుంచి వెలువడుతున్న కాలుష్యం కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం నుంచి నగరంలో ఎండ పెరగడం, విద్యుత్ లేక పోవడంతో నగరవాసులు విపరీతమైన ఉక్కపోతతో తల్లడిల్లారు.