రైతు చిత్తు! | Farmer pictures! | Sakshi
Sakshi News home page

రైతు చిత్తు!

Published Sun, Nov 9 2014 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 4:06 PM

రైతు చిత్తు!

రైతు చిత్తు!

‘తెల్లబంగారం'గా ముద్దుగా పిలుచుకునే పత్తి పంట ఈ ఏడాది  రైతులను నిలువునా ముంచింది. ఎన్నో ఏళ్లుగా ఆర్థిక భరోసానిస్తున్న పంట ఈ సారి కంట నీరు పెట్టిస్తోంది. కొద్ది రోజుల కిందట సంభవించిన హుదూద్ తుపాను ప్రభావంతో పల్నాట కురిసిన వర్షాలు పత్తి పంటకు ఎసరు తెచ్చాయి. ఆ సమయంలో పడిన వర్షాలు ఆమ్ల గుణం కలిగి ఉండడంవల్ల పత్తి పంట పూర్తిగా దెబ్బతిన్నట్టు రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన పంటలు కూడా పూర్తిగా ఎండిపోయాయని వాపోతున్నారు.
 

 కారంపూడి
 ఈ ఖరీఫ్‌లో వర్షాలతోపాటు, కాలువలకు సాగర్ జలాలు ఆలస్యంగా రావడంతో ఎక్కువ సంఖ్యలో రైతులు పత్తి సాగు చేపట్టారు. వరికి బదులు మాగాణి భూముల్లో కూడా సాగు చేశారు. ఏపుగా పెరిగిన పైరును చూసి రైతులు ఆనందంగా ఉన్నారు. ఆ సమయంలో హుదూద్ తుపాను ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసింది. దాని ప్రభావంతో ఇక్కడ కురిసిన వర్షాలకు పత్తి పంట అప్పటివ రకు బాగానే వున్నా క్రమేపి  దెబ్బతినడం ప్రారంభించింది.

పత్తి మొక్కలు నల్లగా మారి ఆకులు రాలి పోతున్నాయి. చివరకు మొక్కలు మోడు వారుతున్నాయి. మెట్ట భూములతోపాటు నీటి వసతి వున్న నేలల్లో సైతం ఇలా జరుగుతుండడంతో రైతులు సస్య రక్షణ చర్యలు చేపడుతున్నా ఫలితం లేకుండాపోతోంది. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదని రైతాంగం చెపుతోంది. హుదూద్ తుపాను తరువాత పత్తి రైతు పరిస్థితి తలకిందులైంది. పంట పూర్తిగా దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీరేదారేదంటున్నారు.

ఎకరాకు కౌలు కలుపుకుని  దాదాపు 43 వేల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు. ఇప్పటి వరకు వచ్చిన దిగుబడి మూడు క్వింటాళ్లు మాత్రమే. మరో మూడు క్వింటాళ్ల వరకు రావచ్చంటున్నారు. ఆరు క్వింటాళ్లు రూ. 3,200 చొప్పున అమ్మినా రూ. 19,200 వస్తాయి. పెట్టుబడులు కూడా రాని పరిస్థితి. ఈ ఏడాది రెక్కల కష్టానికి తోడు పెట్టుబడులు బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయంటున్నారు.

 పొలం చూడబుద్ధి కావడం లేదు...
 ఏడెకరాలు వేశా. ఇప్పటికి 8 క్వింటాళ్లు వచ్చింది. తుపాను తరువాత పైరంతా క్రమేణా నల్లగా అయ్యింది. పొలం చూడబుద్ధి కావడం లేదు. ఈ పరిస్థితి ఎప్పుడూ చూడ లేదు. కౌలు ఎకరా 20 వేలు. ఇంక మా పరిస్థితి మీకే అర్థం అవుతుంది. ఇంత కష్టం వున్నా ధర వుందా అంటే అదీ లేదు. పెట్టుబడులు బాగా పెరిగాయి. ధర మాత్రం కొన్నేళ్లుగా అంతే వుంటోంది. - రేళ్ల యల్లారెడ్డి, కౌలురైతు, లక్ష్మీపురం

 పెట్టుబడులు ఎలా తీర్చాలి
 ఎకరం 18 వేలు కౌలు. ఐదెకరాలు వేశా. లక్ష దాకా పెట్టుబడి అయ్యింది. ఇప్పటికి ఎకరాకు రెండు క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇంకా నాలుగు క్వింటాళ్లు రావచ్చు. ధర చూస్తే రూ.2,950. క్వింటా పత్తి తీసినందుకు కూలీలకు వెయ్యి ఖర్చు. తుపాను తరువాత పైరు రోజు రోజుకు క్షీణించింది. ఆకులు నల్లగా మారి రాలి పోయాయి. పెట్టుబడులు ఎలా తీర్చాలి.         - నడికోట చిరంజీవి, కౌలు రైతు, లక్ష్మీపురం

 సొంత పొలమైనా నష్టమే..
 ఈ ఏడాది 13 ఎకరాలు వేశా. నాలుగు లక్షల పెట్టుబడి అయింది. ఇప్పటికి 20 క్వింటాళ్లు వచ్చింది. ఇంకా ఎకరాకు మూడు క్వింటాళ్లు రావచ్చు. గతంలో ఎకరాకు 20 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. తుపాను వర్షం ఏమీ చేయదనుకున్నాం. కాని అప్పుడు కురిసిన వానలో తేడా వుంది. ఇప్పటికీ పంట పరిస్థితిని ప్రభుత్వం కనిపెట్టలేకపోయింది. వ్యవసాయాధికారులు ఇతరులు ఏమి చేస్తున్నట్లు. సొంత పొలమైనా నష్టం ఈ సారి ఎక్కువగా వుంది. ఈ పరిస్థితి ఎప్పుడూ రాలేదు.                  - గోగిరెడ్డి కృష్ణారెడ్డి, రైతు
 
 సరస్వతి భూముల కేసులో మరో 23 మంది కోర్టుకు హాజరు
 పిడుగురాళ్ల: మాచవరం మండలం చెన్నాయపాలెంలో ఇటీవల జరిగిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూముల కేసులో శనివారం మరో 23 మందిని పోలీసులు కోర్టుకు హాజరు పరిచారు. ఈ కేసులో శుక్రవారం 13 మందిని కోర్టుకు తీసుకెళ్లగా శ నివారం డీఎస్పీ వెంకటేశ్వరనాయక్ ఆధ్వర్యంలో మరో 23 మందిని నిందితులుగా పేర్కొంటూ స్థానిక జూనియర్ సివిల్ జడ్జికోర్టు జడ్జి ఎస్ సుజాత ముందు హాజరు పరిచారు. నిందితులకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో మొత్తం ఈకేసులో 92 మందిని కోర్టుకు హాజరు పరిచినట్లయింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement