అప్రమత్తం | set up 12 rehabilitation centers | Sakshi
Sakshi News home page

అప్రమత్తం

Published Sat, Oct 11 2014 3:32 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 PM

set up 12 rehabilitation centers

* లోతట్టు ప్రాంతాలకు ముంపు భయం
* పూరిళ్లు, నాసిరకం ఇళ్లు కూలిపోయే ప్రమాదం
* నేడు గంటకు 50 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం  
* విద్యుత్ వ్యవస్థకూ నష్టం వాటిల్లే ఆస్కారం
* ఇప్పటికే 12 పునరావాస కేంద్రాలు ఏర్పాటు

సాక్షి ప్రతినిధి, విజయనగరం : హుదూద్ తుపాను దూసుకొస్తోంది. ఇది   పెను తుపానుగా మారి  ఉప్పెనై విరుచుకుపడొచ్చన్న వాతావరణం శాఖ హెచ్చరికలు తీవ్ర భయాందోళన కల్గిస్తున్నాయి.  సముద్రం అల్లకల్లోలంగా ఉంది. కెరటాలు ఎగసిపడుతున్నాయి. శుక్రవారం చింతపల్లి తదితర తీరప్రాంత గ్రామాల వద్ద సముద్రం కొంత ముందుకు చొచ్చుకు రావడంతో పాటు పెరిగిన గాలుల తీవ్రతతో మత్స్యకారులు  వణికిపోతున్నారు.  తుపాను  తీరం దాటే సమయంలో విధ్వంసం సృష్టించి లోతట్టు ప్రాంతాలు ముంచెత్తే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

సహాక చర్య లు చేపట్టడానికి జాతీయ విపత్తు నివారణ బలగాలు జిల్లాకు చేరుకున్నాయి. పోలీసులు బలగాలు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. లోతట్టు  ప్రాంతాలు, తీర ప్రాంతాల ప్రజల్ని తరలించేందుకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వారికి  అవసరమైన భోజన ఏర్పాట్లు చేశారు.శనివారం ఉదయం నుంచి గంటకు 50 కిలో మీటర్ల నుంచి 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. సాయంత్రానికి ఆ గాలుల వేగం మరింత పెరిగే అవకాశాలున్నాయి.

ఇప్పటికే మూడో నంబర్ హెచ్చరిక జారీ చేశారు. పెనుగాలులు వీచి  చెట్లు, విద్యుత్ స్తంభాలు పెద్ద ఎత్తున నేలకొరిగి,  విద్యుత్, సమాచార వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమా దం ఉంది. పూరిళ్లు, నాసిరకం నిర్మాణం గల నివాసాలు కూలిపోయే ప్రమాదం ఉంది. అలాగే లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికానున్నాయి. ఈ పరిస్థితుల్ని ముందే అంచనా వేస్తూ యంత్రాంగం తగు ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధమైంది.
 
తొమ్మిది మండలాలపై ప్రభావం
తుపాను ప్రభావం ప్రధానంగా జిల్లాలోని తొమ్మిది మండలాలపై  ప్రభావం చూపే అవకాశం ఉంది .  భోగాపురం, పూసపాటిరేగ, విజయనగరం, ఎస్‌కోట, బొండపల్లి, గుర్ల,  పార్వతీపురం, కొమరాడ, జామి మండలాల్లో నష్టం వాటిల్లనుంది.  భారీ వర్షాల కారణంగా కొన్ని మండలాల్లో, నాగావళి నది వరద నీటితో మరి కొన్ని  మండలాలకు, పెనుగాలుల వల్ల తీర ప్రాంతాలకు ప్రమాదం పొంచి ఉంది.
 
42 లోతట్టు ప్రాంతాలు
ఈ మండలాల్లోని  దాదాపు 42 లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. ఇవి ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. వీటిలో ముఖ్యంగా విజయనగరం రాజీవ్ నగర్ కాలనీ, బుచ్చన్నకోనేరు ఏరియా, భోగాపురం మండలంలోని ముక్కాం, చోడపల్లిపేట, చినకొండరాజుపాలెం, కొంగవానిపాలెం, చేపలకంచేరు, ఎర్ర ముసలయ్యపాలెం, పూసపాటిరేగ మండలంలోని తిప్పలవలస, కొత్తూరు, పెద్దూరు, పులిగెడ్డ, తమ్మయ్యపాలెం, బర్రిపేట, నీలగెద్దపేట, ఎస్‌కోట మండలం చామలాపల్లి, ముషిడిపల్లి, గోపాలపల్లి, మామిడిపల్లి, వేములాపల్లి, జామి మండలం కొట్టాం, బొండపల్లి మండలం గరుడుబిల్లి, పార్వతీపురం మండలం వరహాలెగడ్డ, కొమరాడ మండలం కూనేరు, చోళ్లపదం లోతట్టు గ్రామాలు ముంపు బారిన పడే అవకాశం ఉంది.
 
12 పునరావాస కేంద్రాలు ఏర్పాటు
తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న పూసపాటిరేగ, భోగాపురం మండలాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.  పెనుగాలులు, సముద్రం కెరటాల తాకిడికి నష్టం జరిగే అవకాశమున్న లోతట్టు ప్రాంతాలైన 21గ్రామాల ప్రజల కోసం ఇప్పటికే 12పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. భోగాపురం మండలంలో ఐదు,  పూసపాటిరేగ మండలంలో  ఏడు కేంద్రాలను సన్నద్ధం చేశారు. 24,337మందిని తరలించేందుకు రంగం సిద్ధం చేశారు.

కోనాడ బీజీపేటకు  సంబంధించి కోనాడ ఉన్నత పాఠశాల, తుపాను  షెల్టర్ వద్ద, తిప్పవలసకు సంబంధించి ఆ గ్రామ ఉన్నత పాఠశాల వద్ద, పులిగెడ్డకు సంబంధించి సమీపంలో తుపాను షెల్టర్ వద్ద, తమ్మయ్యపాలెం, బర్రిపేటకు సంబంధించి ఆ గ్రామాల్లో ఉన్న ఎంపీయూపీ స్కూల్‌లో, పెద్దూరు, బర్రిపేటకు సంబంధించి చింతపల్లి ఎంపీయూపీ స్కూల్‌లో, నీలగెద్దపేట, కొత్తూరుకు సంబంధించి చింతపల్లి తుపాను షెల్టర్ వద్ద పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ముక్కాం, చినకొండరాజుపాలెంకు సంబంధించి పెద్ద కొండరాజుపాలెం ప్రాథమిక పాఠశాల వద్ద, చేపలకంచేరు, దిబ్బపాలెంకు సంబంధించి కొంగవానిపాలెం ప్రాథమిక పాఠశాల వద్ద, ఎర్రముసలయ్యపాలెం, బోయపాలెంకు సంబంధించి కంచేరు ఉన్నత పాఠాశాల వద్ద పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు.
 
అప్రమత్తమైన వివిధ శాఖలు
భారీ వర్షాలకు  జిల్లాలో 21 ఇరిగేషన్ చెరువులు, 44 రైల్వే ట్రాక్‌కు ఆనుకుని ఉన్న చెరువులకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. దీని దృష్ట్యా ఇరిగేషన్ ఇంజి నీరింగ్  అధికారులను అప్రమత్తం చేశారు. ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క డీఈ, ఏఈలను ప్రత్యేక అధికారులగా నియమించారు. అలాగే తాగునీటికి ఇబ్బందిలేకుండా  ఎప్పటికప్పుడు సరఫరా చేసేందుకు  మత్స్యకార గ్రామాల కోసం ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు 10 ట్యాంకులను సిద్ధం చేస్తున్నారు.

పెనుగాలులకు విద్యుత్ స్తంభాలు విరిగిపోయే ప్రమాదం ఉన్నందున ట్రాన్స్‌కో అధికారులు కొన్ని విద్యుత్  స్తంభాలను అందుబాటులో ఉంచుతున్నారు. వర్షాలకు అధ్వాన్నంగా తయారయ్యే ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టడమే కాకుండా క్లోరినేషన్ చేసి తాగునీరును అందించేందుకు జిల్లా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకున్నారు. ముంపు ప్రభావిత ప్రాంతాలకు నిత్యావసర  సరుకులను సరఫరా చేసేలా పౌర సరఫరా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

రోడ్లు కోతకు గురైన చోట ప్రజలకు అవసరమైన సేవలందించేందుకు రోప్‌లు, ఇసుకబ్యాగులు, జేసీబీలను ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ అధికారులు అందుబాటులో ఉంచుతున్నారు. వ్యాధులు ప్రబల కుండా ఉండేందుకు, సందర్బోచిత వైద్యం అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వైద్యులు, సిబ్బందినందరినీ విధుల్లో ఉండాలని ఇప్పటికే ఆదేశించారు. తగు మందులు సిద్ధం చేశారు.    
 
తుపాను నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలు
* పూరిళ్లలో ఉండకూడదు.
* పెనుగాలులు దృష్ట్యా రాకపోకలు మానుకోవాలి.
* ప్రయాణాలు చేయకూడదు.
* లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
* సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి
* నాలుగైదు రోజులకు తగ్గట్టుగా నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలి.
* అధికారుల సూచనలు, సలహాలను పాటించాలి.
* సీజనల్ వ్యాధులకు తగ్గట్టుగా మందులను ఉంచుకోవాలి.
* ట్రాన్స్‌పోర్ట్‌కు ఉపయోగపడే విధంగా వాహనాలను అందుబాటులో ఉంచుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement