రోడ్డు భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికత వాడకంలో పురస్కారాలు
2022–23కు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏఎస్‌ఆర్‌టీయూ
ఈ నెల 15న ఢిల్లీలో అవార్డుల ప్రదానం
రవాణా మంత్రి పొన్నం హర్షం.. దేశానికే రోల్ మోడల్: సంస్థ ఎండీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)ను జాతీయ స్థాయిలో ఐదు నేషనల్ బస్ ట్రాన్స్‌పోర్ట్ ఎక్సలెన్స్ పురస్కారాలు వరించాయి. రోడ్డు భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికత వాడకంలో ఈ అవార్డులు లభించాయి. నష్టాలను అధిగమించడంతోపాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశలో అంతర్గతంగా చేస్తున్న కొత్త ఆవిష్కరణలకుగాను కేంద్ర ప్రభుత్వ సంస్థ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండర్‌టేకింగ్స్ (ఏఎస్‌ఆర్టీయూ) 2022–23కుగాను తెలంగాణ ఆర్టీసీని ఈ అవార్డులకు ఎంపిక చేసింది.
నాలుగు ఫస్ట్.. ఒకటి సెకండ్..
రోడ్డు భద్రత విభాగానికి సంబంధించి మఫిసిల్ కేటగిరీ (బస్సుల సంఖ్య 4,001–7,500 ఉన్న సంస్థల పరిధి)లో ఆర్టీసీ మొదటి స్థానంలో నిలిచింది. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ... రోడ్డు ప్రమాదాల్లో ఆర్టీసీ బస్సుల ప్రమేయం తక్కువ ఉండేలా చూడటంలో టీఎస్‌ఆర్టీసీ తొలి నుంచీ టాపర్‌గా ఉంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్టీసీ బస్సులు రోడ్డు ప్రమాదాలకు కారణమైన నిష్పత్తి 0.05గా ఉంది. ఇంధన పొదుపులోనూ ఆర్టీసీ బస్సులు సగటున ప్రతి లీటరుకు తిరిగే కిలోమీటర్ల (కేఎంపీఎల్) విషయంలో ఉత్తమంగా నిలిచింది.
మఫిసిల్ కేటగిరీలో 5.35 కేఎంపీఎల్‌తో మొదటి స్థానం, పట్టణ ప్రాంతాల కేటగిరీలో 4.61 కేఎంపీఎల్‌తో రెండో స్థానంలో నిలిచింది. టీఎస్‌ఆర్టీసీ బస్సులు సగటున ప్రతి లీటరు డీజిల్‌కు దాదాపు 5.14 కి.మీ. మేర తిరుగుతున్నాయి. ఇక సిబ్బంది సంక్షేమం, ఉత్పాదకత కేటగిరీలో తొలి స్థానంలో నిలిచింది. గతేడాది ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి వారి హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేసింది. తీవ్ర గుండె సమస్యలున్న 250 మందిని గుర్తించి వారికి చికిత్సలు అందిస్తోంది. సిబ్బంది నైపుణ్యం పెరిగేలా సామూహిక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. వాటికి ఈ పురస్కారం లభించింది.
డిజిటల్ కార్యక్రమాల అమలు విభాగంలోనూ సంస్థకు మొదటి స్థానం సాధించింది. ప్రయాణికులు, సిబ్బంది కోసం కొత్త యాప్‌లు, టికెట్ల రిజర్వేషన్ పద్ధతిలో మార్పులు, బస్ ట్రాకింగ్ కోసం గమ్యం యాప్ తదితరాలకు ఈ పురస్కారం లభించింది. ఈ నెల 15న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులకు ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. అధికారులు, సిబ్బంది కృషి ఫలితంగానే ఈ పురస్కారాలు లభించాయని, ఇందుకు బాధ్యులైన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొనగా ఉత్తమ పనితీరుతో టీఎస్‌ఆర్టీసీ దేశంలోని ఇతర ఆర్టీసీలకు ఆదర్శంగా నిలిచిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment