ఇదేం పరిహారం? | Watch compensation? | Sakshi
Sakshi News home page

ఇదేం పరిహారం?

Published Sun, Oct 26 2014 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 PM

ఇదేం పరిహారం?

ఇదేం పరిహారం?

  • కాఫీ రైతులకు మొక్కుబడి సాయం
  •  జీఓను తప్పుబడుతున్న గిరిజనులు
  •  ఎకరానికి రూ.10 వేలేనని ఉత్తర్వులు
  •  50 శాతం నిబంధనలతో అందేది నామమాత్రమే
  • హుదూద్ తుపానుకు దెబ్బతిన్న కాఫీ రైతులకు ప్రభుత్వం మొక్కుబడి పరిహారాన్ని ప్రకటించింది. గిరిజన రైతులు 15 ఏళ్ల నుంచి ఫలాశయం పొందుతున్న కాఫీ తోటలు ధ్వంసమై ఆయా కుటుంబాలు వీధిన పడగా ఆదుకోవలసిన వేళ ప్రభుత్వం తూతూమంత్రంగా సాయం ప్రకటిస్తోంది. పలు నిబంధనలతో అతి తక్కువ పరిహార జీఓను విడుదల చేయడాన్ని బాధిత రైతులు తప్పుపడుతున్నారు.
     
    పాడేరు:  ఏడాదికి ఎకరం కాఫీ, మిరియాల పంటల ద్వారా రూ.లక్ష వరకు ఆదాయం పొందే కాఫీ రైతులను హుదూద్ తుపాను కోలుకోలేని దెబ్బతీసింది. కాఫీ మొక్కలన్నీ నీడ నిచ్చే చెట్ల సంరక్షణలోనే ఎదిగి ఫలసాయాన్ని ఇస్తాయి. తుపానుకు నీడనిచ్చే చెట్లు, వాటికి అల్లుకున్న మిరియాల పాదులన్నీ నేలకూలడంతో కాఫీ రైతులకు భారీ నష్టం వాటిల్లింది. ఏజెన్సీ వ్యాప్తంగా 11 మండలాల పరిధిలో లక్షా 40 వేల ఎకరాల విస్తీర్ణంలో కాఫీ తోటలు ఉండగా 96 వేల ఎకరాల తోటలు ఫలసాయాన్ని ఇస్తున్నాయి. ఇందులో సుమారు 30 వేల ఎకరాల్లో పంట తుపాను ధాటికి ధ్వంసమైంది. ఫల సాయానికి దగ్గరగా ఉన్న మరో 10 వేల ఎకరాల్లో కాఫీ తోటలు కూడా నాశనమయ్యాయి. నీడనిచ్చే చెట్లు నేలకూలడంతో కాఫీ మొక్కలకు రక్షణ కరువైంది. ఇవన్నీ వాడిపోయి పూర్తిగా నాశనం అయ్యే పరిస్థితి నెలకొంది.
     
    విరగ్గాసినా దక్కని ఫలం : ఈ ఏడాది విరగ్గాసిన కాఫీ తోటల్లో ఫల సాయాన్ని నవంబరు మొదటివారంలో సేకరించాల్సిన తరుణంలో హుదూద్ తుపాను గిరిజన రైతుల ఆశలను అడియాసలు చేసింది. కోలుకోలేని దెబ్బను మిగిల్చిన తరుణంలో ప్రభుత్వం ఎకరం పంటకు రూ.లక్ష ఇచ్చినా కాఫీ రైతులకు ఏర్పడిన నష్టాన్ని పూడ్చలేం. అయితే తక్షణ సహాయం కింద ఎకరానికి రూ.లక్ష చెల్లించి మళ్లీ నీడనిచ్చే సిల్వర్‌ఓక్ వృక్షాల పెంపకం, అవి ఎదిగిన తరువాత కాఫీ సాగుకు ప్రోత్సాహం అందించాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల ఏజెన్సీలో పర్యటించి హెక్టార్ పంటకు రూ.10 వేల నుంచి 20 వేలు మాత్రమే పరిహారం కింద ప్రకటించారు.

    ఇటీవల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మోదాపల్లి ప్రాంతంలో ధ్వంసమైన కాఫీ తోటలను పరిశీలించి ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందే పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ధ్వంసమైన కాఫీ తోటలన్నింటిని పరిశీలించి ఎకరానికి రూ.1 లక్ష నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాఫీ రైతులకు ఏర్పడిన అపార నష్టాన్ని జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లగా ఆయన కూడా తీవ్రంగా స్పందించి ఎక రం కాఫీ పంటకు రూ.లక్ష చెల్లించేంత వరకు బాధిత రైతుల తరఫున పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
     
    అతి తక్కువ పరిహార జీవో

    ప్రభుత్వం తాజాగా నష్టపరిహారంపై ఉత్తర్వులు జారీచేసింది. పలు నిబంధనలతో అతి తక్కువ పరిహార జీఓను విడుదల చేసి బాధిత కాఫీ రైతులకు మొక్కుబడి సాయాన్నే అందించేందుకు సిద్ధమవడాన్ని గిరిజన రైతులంతా తప్పుపడుతున్నారు. 50 శాతం కాఫీ పంట ధ్వంసమైతేనే నష్టపరిహారం చెల్లిస్తామని జీఓలో పేర్కొనడం బాధిత కాఫీ రైతులను మరింత బాధిస్తోంది. 10 ఏళ్ల దాటిన కాఫీ తోట 50 శాతం పైగా ధ్వంసమైతే ఎకరానికి రూ.10 వేలు, 5 నుంచి 10 ఏళ్ల లోపు తోటకు రూ.ఆరు వేలు, 5 ఏళ్లలోపు గల తోటలకు ఎకరానికి రూ.నాలుగు వేలు అతి తక్కువ పరిహారాన్ని ప్రభుత్వం అమలు చేయడం దారుణమని బాధిత కాఫీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    ఏజెన్సీలోని ధ్వంసమైన కాఫీ తోటలను పూర్తిగా తొలగించి కొత్తగా కాఫీసాగు చేపట్టాలంటే మరో ఆరేళ్లపాటు గిరిజన రైతులు అష్టకష్టాలు పడాల్సి ఉంది. ఫలసాయం వచ్చే వరకు రైతులకు ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఈ నేపథ్యంలో ఎకరానికి రూ.లక్ష చెల్లించి అన్ని విధాలా ఆదుకోవలసిన ప్రభుత్వం మొక్కుబడి సాయం ప్రకటించడంతోపాటు 50 శాతం నిబంధనలను అమలు చేయడం కూడా బాధిత కాఫీ రైతులకు అన్యాయం చేయడమేనని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement