coffee farmers
-
కాఫీ.. రైతులు హ్యాపీ
(చింతపల్లి నుంచి సాక్షి ప్రతినిధి యిర్రింకి ఉమామహేశ్వరరావు) : దేశంలోనే గర్వించదగ్గ స్థాయిలో నిర్మించిన ఏఎస్ఆర్ జిల్లా చింతపల్లిలోని కాఫీ ఎకో పల్పింగ్ యూనిట్ లాభాల పంట పండిస్తోంది. కాఫీ రైతులకు మద్దతు ధర దక్కేలా చేయడంతోపాటు అంతకు మించి బోనస్ రూపంలో ఆదాయాన్ని రుచి చూపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 2020లో రూ.4.56 కోట్లతో పైలట్ ప్రాజెక్ట్‌గా దీనిని నిర్మించింది. 3 ఎకరాల విస్తీర్ణంలో ఎకో పల్పింగ్ యూనిట్‌ను నెలకొల్పింది. దీనికి అనుబంధంగా మరో రెండు ఎకరాల్లో రూ.1.68 కోట్లతో వెయ్యి మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో గోడౌన్లు నిర్మించింది. ప్రాసెస్ అయిన పార్చ్మెంట్ కాఫీ గింజల్ని త్వరగా ఆరబెట్టుకునేలా గతేడాది మరో రూ.45 లక్షలతో రోటరీ డ్రయ్యర్‌ను ఐటీడీఏ ఏర్పాటు చేసింది. పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పల్పింగ్ యూనిట్ నిర్వహించేలా ఎకో ఫ్రెండ్లీగా నిర్మించడం విశేషం. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ), గిరిజన సహకార సంస్థ(జీసీసీ) నేతృత్వంలో ఏజెన్సీలోని 11 మండలాలకు చెందిన కాఫీ పండ్ల (ఫ్రూట్స్)ను సేకరిస్తున్నారు. ఏటా అపెక్స్ కమిటీ నిర్ణయించిన మద్దతు ధరకు కాఫీ పండ్లను సేకరించడంతో బయటి డీలర్లు సైతం అంతకు మించిన ధర చెల్లించి కొనుగోలు చేసేలా పోటీ మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. కాగా, చింతపల్లి ఎకో పల్పింగ్ యూనిట్ సేకరించిన కాఫీ పండ్లను ప్రాసెస్ చేసి (కాయలపై తొక్క తొలగించి) పార్చ్మెంట్ (కాఫీ గింజలు)గా చేస్తారు. ఇక్కడ ప్రాసెస్ చేసిన పార్చ్మెంట్ కాఫీకి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో వాటిని విక్రయించి లాభాల పంట పండిస్తున్నారు. మరో రెండు యూనిట్లు చింతపల్లి ఎకో పల్పింగ్ యూనిట్ మంచి ఫలితాలు సాధించడంతో ప్రభుత్వం మరో రెండు ఎకో పల్పింగ్ యూనిట్లు నిర్మిస్తోంది. జి.మాడుగుల, జీకే వీధిలో రూ.7 కోట్ల 70 లక్షల 32 వేలతో వీటిని నెలకొల్పుతోంది. గిరిజన సంక్షేమ శాఖ పర్యవేక్షణలో ఈ రెండు యూనిట్లు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 5 మెట్రిక్ టన్నుల కాఫీ గింజల ప్రాసెస్ చేసే సామర్థ్యం కలిగిన యంత్రాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. 2024 సీజన్ నాటికి పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చేలా కార్యాచరణ చేపట్టారు. – ఎన్.అశోక్, అసిస్టెంట్ డైరెక్టర్, పాడేరు ఐటీడీఏ కాఫీ ప్రాజెక్ట్ లాభాలు సాధిస్తోంది దళారుల ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా గిరిజన రైతుల ఉన్నతికి ప్రాధాన్యత ఇస్తోంది. గిరిజన సంక్షేమ, ఐటీడీఏ, ఏపీ ట్రైకార్ అధికారుల పర్యవేక్షణలో చింతపల్లి ఎకో పల్పింగ్ యూనిట్‌ను లాభాల బాటలో నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం సహకార సంఘంలో 1,500 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. మరో వెయ్యి మందిని చేర్చుకునేందుకు కార్యాచరణ చేపట్టాం. రైతులకు మద్దతు ధర అందించడంతోపాటు ఈ ప్రాంత గిరిజనులకు రోజువారీ పనులు కల్పించి ఉపాధి చూపిస్తున్నాం. పల్పింగ్ యూనిట్లో పార్చ్మెంట్ కాఫీ ప్రాసెస్‌కు రోజుకు కనీసం వంద మందికి పైగా పనిచేస్తారు. పగటిపూట మహిళలకు రూ.320, మగవాళ్లకు రూ.350, రాత్రి వేళ అయితే రూ.450 చొప్పున వేతనం చెల్లిస్తున్నాం. – సెగ్గే కొండలరావు, అధ్యక్షుడు, విశాఖ ఏజెన్సీ గిరిజన కాఫీ ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం గిరిజన రైతులకు ఏటా బోనస్ ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్‌గా ఏర్పాటు చేసిన చింతపల్లి ఎకో పల్పింగ్ యూనిట్ లాభాలు సాధించడంతోపాటు కాఫీ రైతులకు ఏటా బోనస్ అందిస్తోంది. కలెక్టర్ సుమిత్ కుమార్, ఐటీడీఏ పీవో అభిషేక్ హామీతో చింతపల్లి యూనిట్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైబల్ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ సంస్థ రూ.1.56 కోట్ల రుణం ఇచ్చింది. రుణ మొత్తాన్ని గత ఏడాది చెల్లించాం. రూ.2 కోట్లు లాభాలు సాధించాం. ప్లాంట్ నిర్వహణ వ్యయం పోగా మిగిలిన సొమ్ముతో కాఫీ ఫ్రూట్ సేకరణ చేపట్టాం. – పీవీవీ సత్యనారాయణ, ఇన్చార్జ్, చింతపల్లి కాఫీ పల్పింగ్ యూనిట్ -
అరకు కాఫీ.. అంతర్జాతీయ ఖ్యాతి!
‘ఓ కప్పు అరకు కాఫీ తాగుదాం డియర్.. ఇండియా నుంచి వచ్చి మన మనసు దోచుకుందంటే నమ్ము.. అరకు కాఫీ లేకుండా రోజు గడవడం లేదోయ్..’ అంటున్నారు ప్రస్తుతం విదేశీయులు. సహజ సిద్ధంగా కుళ్లిన ఆకులు వేసి పెంచిన ఆర్గానిక్ అరకు కాఫీ విదేశాల్లోనూ దూసుకెళ్తోంది. విశాఖ మన్యంలో సాగవుతున్న అరబికా రకం కాఫీ పారిస్‌లో ఇప్పటికే పాగా వేసింది. జపాన్, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్ దేశాల్లోనూ విక్రయాలు పెరిగి అక్కడి కాఫీ ప్రియులకూ మన కాఫీ నోరూరిస్తూ సత్తా చాటుతోంది. – సాక్షి, విశాఖపట్నం 2017లోనే పారిస్‌లో పాగా ఫ్యాషన్ ప్రపంచ రాజధాని పారిస్‌లోనూ అరకు కాఫీ బ్రాండ్‌తో 2017, ఫిబ్రవరిలోనే కాఫీ షాప్ వెలిసింది. నాంది ఫౌండేషన్‌కు అనుబంధంగా మహీంద్రా గ్రూప్‌నకు చెందిన అరకు గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ దీన్ని అక్కడ ఏర్పాటు చేసింది. కాఫీ సాగు విస్తరణలో మనదేశంలో తమిళనాడును వెనక్కినెట్టి కర్ణాటక తర్వాత రెండో స్థానం కోసం కేరళతో పోటీపడుతోంది. విశాఖ మన్యంలో పండించిన కాఫీ గింజలను గిరిజన రైతుల నుంచి వివిధ సంస్థలతో పాటు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఇందులో ప్రధానమైంది. నాంది ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ 20 వేల ఎకరాల్లో కాఫీ గింజలను పదేళ్లుగా కొనుగోలు చేస్తూ విదేశాలకు ఎగుమతి చేస్తోంది. విస్తరణే లక్ష్యంగా ప్రణాళిక కాఫీ తోటలు విస్తరించాలనే లక్ష్యంతో పాడేరు ఐటీడీఏ ప్రణాళిక అమలు చేస్తోంది. గత నాలుగేళ్లలో మొత్తం 42 వేల ఎకరాల్లో కాఫీ తోటలు విస్తరించాయి. వీటిని 2025–26 నాటికి మరో 58 వేల ఎకరాలకు విస్తరించాలనేది లక్ష్యం. ఇందుకోసం చింతపల్లి మండలంలో పైలట్ ప్రాజెక్టుగా రైతు సంఘాలను ఏర్పాటు చేశారు. మూడేళ్లపాటు సిల్వర్ ఓక్ చెట్లు పెరిగిన తర్వాత వాటి మధ్య అంతర పంటగా కాఫీ మొక్కలు, మిరియాల పాదులు నాటుకోవడానికి ఐటీడీఏ సహకరిస్తోంది. దేశంలో మూడో స్థానం 2025–26 నాటికి మన్యంలో 2 లక్షల విస్తీర్ణంలో కాఫీ తోటలు విస్తరిస్తే దేశంలోనే 20 వేల మెట్రిక్ టన్నుల కాఫీ ఉత్పత్తితో కర్ణాటక తర్వాత ద్వితీయ స్థానానికి ఏపీ చేరుకుంటుంది. ప్రస్తుతం 1.50 లక్షల ఎకరాల్లో కాఫీ సాగుతో తమిళనాడును వెనక్కినెట్టి మూడో స్థానానికి చేరింది. ఒక మొక్క నుంచి క్లీన్ కాఫీ గింజలు ఏటా కిలో నుంచి 1.20 కిలోల వరకు దిగుబడి వస్తుంది. ఒక మెట్రిక్ టన్ను కాఫీ గింజల ధర ప్రస్తుతం రూ.1.50 లక్షల వరకు ఉంది. విదేశీ ఎగుమతులే కీలకం భారతదేశంలో పండుతున్న కాఫీలో 80 శాతం విదేశాలకే ఎగుమతి అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో కాఫీ సాగు చేస్తున్నా ఎగుమతుల్లో భారత్ ఆరో స్థానంలో ఉంది. కర్ణాటకలో కార్పొరేట్ స్థాయిలో సాగు చేస్తుండటంతో ఎకరానికి 225 కిలోలు దిగుబడి వస్తుండగా, విశాఖ మన్యంలో 100 నుంచి 120 కిలోల వరకు వస్తోంది. కాఫీ, అంతరపంటగా మిరియాల సాగు లాభసాటిగా ఉండటంతో గిరిజన రైతులు ఇటువైపు మొగ్గు చూపిస్తున్నారని, దీంతో మరో లక్ష ఎకరాల్లో కాఫీ విస్తరించే అవకాశం ఉందని పాడేరు ఐటీడీఏ కాఫీ ప్రాజెక్టు సహాయ సంచాలకులు రాధాకృష్ణ తెలిపారు. -
నాణ్యమైన కాఫీకి ప్రణాళిక
ఏజెన్సీలోని ఈ పంటకు బంగారు భవిష్యత్ ప్రభుత్వ కాఫీ సలహాదారుడు కృష్ణారావు పాడేరు : విశాఖ ఏజెన్సీలోని కాఫీ పంటకు బంగారు భవిష్యత్ ఉందని రాష్ట్ర ప్రభుత్వ కాఫీ సలహాదారులు కృష్ణారావు అన్నారు. స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో కాఫీ సాగుకు సంబంధించి గిరిజన సంక్షేమ డెరైక్టర్ ఎం.పద్మ, జీసీసీ ఎండీ డి.రవిప్రకాష్,ఇతర అధికారులతో కలిసి ఆయన స్థానిక అధికారులు,కాఫీ రైతులతో గురువారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సలహాదారులు కృష్ణారావు మాట్లాడుతు పాడేరు, అరకు ప్రాంతాల్లో గిరిజనులు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న కాఫీకి అంతర్జాతీయంగా పేరుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి సమావేశంలోను ఈ ప్రాంత కాఫీ సాగు గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారని ఆయన తెలిపారు. కాఫీ రైతులకు మార్కెటింగ్ సౌకర్యంతోపాటు నాణ్యమైన కాఫీ గింజలను తయారు చేసేందుకు ప్రొసెసింగ్ యూనిట్లను నెలకొల్పుతామన్నారు. ఏజెన్సీలోని కాఫీ సాగు ద్వారా మరింత అధిక దిగుబడులకు అవసరమైన చర్యలను కూడా చేపడతామన్నారు. కాఫీ పంటకు నీడనిచ్చే సిల్వర్ ఓక్ చెట్లకు ప్రత్యామ్నాయంగా పనస, నారింజ, కమల, సంపెంగ తదితర చెట్లను పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటామన్నారు. తద్వారా రైతులకు అదనపు ఆదాయం పుష్కలంగా ఉంటుందన్నారు. ఏజెన్సీలోని కాఫీ సాగును విస్తరించేందుకు అవసరమైన చర్యలపై ఐటీడీఏ ఉద్యానశాఖ అధికారులు, కాఫీ సబ్ అసిస్టెంట్లతో కూడా ఆయన సమీక్షించారు. ఐటీడీఏ పీవో హరినారాయణన్, గిరిజన సంక్షేమశాఖ ఏడీ పి.చినవీరభద్రుడు, ట్రైకార్ డీజీఎం ఆదినారాయణరావు, కేంద్ర కాఫీబోర్డు డిప్యుటి డెరైక్టరు రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. పలువురు రైతుల అభిప్రాయాలు కాఫీ సాగుకు సంబంధించి ఏజెన్సీలోని పలువురు కాఫీ రైతులు తమ అభిప్రాయాలను ఈ సమావేశంలో తెలిపారు. పాడేరు మండలం లాడాపుట్టు గ్రామానికి చెందిన బోద నారాయణ మాట్లాడుతు కాఫీ పంటకు మార్కెటింగ్ సదుపాయం లేనందున దళారీ వ్యాపారులంతా మోసాలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది కిలో కాఫీ గింజలను రూ.180 నుంచి 200 ధరతో అమ్మకాలు జరపగా ఈ ఏడాది మాత్రం రూ.150 నుంచి 155 ధరతోనే కొనుగోలు చేస్తుండటంతో ఆర్థికంగా నష్టపోయామని వాపోయారు. ధాన్యం మిల్లుల ద్వారా ప్రాసెసింగ్ యూనిట్లను పంపిణీ చేస్తే నాణ్యమైన కాఫీ గింజలను కూడా తయారు చేయగలమన్నారు. హుకుంపేటకు చెందిన రైతులు బొండా వెంకటరమణ, బోయిన సన్నిబాబు, చిట్టినాయుడులు మాట్లాడుతు నాంది సంస్థకు కాఫీ సాగుతో ఆర్థికంగా లాభాలు వస్తున్నా మార్కెటింగ్ సౌకర్యానికి ఇబ్బందులు పడుతున్నామన్నారు. నాంది సంస్థకు పండ్లనే కిలో రూ.25 అమ్ముకుంటున్నామన్నారు. కాఫీ రైతులకు సొసైటీలను ఏర్పాటు చేసి పంట దిగుబడిని ఒకేసారి అమ్మకాలు జరిపే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. నాంది ఫౌండేషన్ ప్రతినిధి వినోద్ హెగ్డే మాట్లాడుతు నాంది ఫౌండేషన్ ద్వారా కాఫీ రైతులకు అనేక ప్రయోజనాలను చేకూరుస్తున్నామన్నారు. -
ఇదేం పరిహారం?
కాఫీ రైతులకు మొక్కుబడి సాయం జీఓను తప్పుబడుతున్న గిరిజనులు ఎకరానికి రూ.10 వేలేనని ఉత్తర్వులు 50 శాతం నిబంధనలతో అందేది నామమాత్రమే హుదూద్ తుపానుకు దెబ్బతిన్న కాఫీ రైతులకు ప్రభుత్వం మొక్కుబడి పరిహారాన్ని ప్రకటించింది. గిరిజన రైతులు 15 ఏళ్ల నుంచి ఫలాశయం పొందుతున్న కాఫీ తోటలు ధ్వంసమై ఆయా కుటుంబాలు వీధిన పడగా ఆదుకోవలసిన వేళ ప్రభుత్వం తూతూమంత్రంగా సాయం ప్రకటిస్తోంది. పలు నిబంధనలతో అతి తక్కువ పరిహార జీఓను విడుదల చేయడాన్ని బాధిత రైతులు తప్పుపడుతున్నారు. పాడేరు: ఏడాదికి ఎకరం కాఫీ, మిరియాల పంటల ద్వారా రూ.లక్ష వరకు ఆదాయం పొందే కాఫీ రైతులను హుదూద్ తుపాను కోలుకోలేని దెబ్బతీసింది. కాఫీ మొక్కలన్నీ నీడ నిచ్చే చెట్ల సంరక్షణలోనే ఎదిగి ఫలసాయాన్ని ఇస్తాయి. తుపానుకు నీడనిచ్చే చెట్లు, వాటికి అల్లుకున్న మిరియాల పాదులన్నీ నేలకూలడంతో కాఫీ రైతులకు భారీ నష్టం వాటిల్లింది. ఏజెన్సీ వ్యాప్తంగా 11 మండలాల పరిధిలో లక్షా 40 వేల ఎకరాల విస్తీర్ణంలో కాఫీ తోటలు ఉండగా 96 వేల ఎకరాల తోటలు ఫలసాయాన్ని ఇస్తున్నాయి. ఇందులో సుమారు 30 వేల ఎకరాల్లో పంట తుపాను ధాటికి ధ్వంసమైంది. ఫల సాయానికి దగ్గరగా ఉన్న మరో 10 వేల ఎకరాల్లో కాఫీ తోటలు కూడా నాశనమయ్యాయి. నీడనిచ్చే చెట్లు నేలకూలడంతో కాఫీ మొక్కలకు రక్షణ కరువైంది. ఇవన్నీ వాడిపోయి పూర్తిగా నాశనం అయ్యే పరిస్థితి నెలకొంది. విరగ్గాసినా దక్కని ఫలం : ఈ ఏడాది విరగ్గాసిన కాఫీ తోటల్లో ఫల సాయాన్ని నవంబరు మొదటివారంలో సేకరించాల్సిన తరుణంలో హుదూద్ తుపాను గిరిజన రైతుల ఆశలను అడియాసలు చేసింది. కోలుకోలేని దెబ్బను మిగిల్చిన తరుణంలో ప్రభుత్వం ఎకరం పంటకు రూ.లక్ష ఇచ్చినా కాఫీ రైతులకు ఏర్పడిన నష్టాన్ని పూడ్చలేం. అయితే తక్షణ సహాయం కింద ఎకరానికి రూ.లక్ష చెల్లించి మళ్లీ నీడనిచ్చే సిల్వర్‌ఓక్ వృక్షాల పెంపకం, అవి ఎదిగిన తరువాత కాఫీ సాగుకు ప్రోత్సాహం అందించాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల ఏజెన్సీలో పర్యటించి హెక్టార్ పంటకు రూ.10 వేల నుంచి 20 వేలు మాత్రమే పరిహారం కింద ప్రకటించారు. ఇటీవల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మోదాపల్లి ప్రాంతంలో ధ్వంసమైన కాఫీ తోటలను పరిశీలించి ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందే పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ధ్వంసమైన కాఫీ తోటలన్నింటిని పరిశీలించి ఎకరానికి రూ.1 లక్ష నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాఫీ రైతులకు ఏర్పడిన అపార నష్టాన్ని జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లగా ఆయన కూడా తీవ్రంగా స్పందించి ఎక రం కాఫీ పంటకు రూ.లక్ష చెల్లించేంత వరకు బాధిత రైతుల తరఫున పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అతి తక్కువ పరిహార జీవో ప్రభుత్వం తాజాగా నష్టపరిహారంపై ఉత్తర్వులు జారీచేసింది. పలు నిబంధనలతో అతి తక్కువ పరిహార జీఓను విడుదల చేసి బాధిత కాఫీ రైతులకు మొక్కుబడి సాయాన్నే అందించేందుకు సిద్ధమవడాన్ని గిరిజన రైతులంతా తప్పుపడుతున్నారు. 50 శాతం కాఫీ పంట ధ్వంసమైతేనే నష్టపరిహారం చెల్లిస్తామని జీఓలో పేర్కొనడం బాధిత కాఫీ రైతులను మరింత బాధిస్తోంది. 10 ఏళ్ల దాటిన కాఫీ తోట 50 శాతం పైగా ధ్వంసమైతే ఎకరానికి రూ.10 వేలు, 5 నుంచి 10 ఏళ్ల లోపు తోటకు రూ.ఆరు వేలు, 5 ఏళ్లలోపు గల తోటలకు ఎకరానికి రూ.నాలుగు వేలు అతి తక్కువ పరిహారాన్ని ప్రభుత్వం అమలు చేయడం దారుణమని బాధిత కాఫీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీలోని ధ్వంసమైన కాఫీ తోటలను పూర్తిగా తొలగించి కొత్తగా కాఫీసాగు చేపట్టాలంటే మరో ఆరేళ్లపాటు గిరిజన రైతులు అష్టకష్టాలు పడాల్సి ఉంది. ఫలసాయం వచ్చే వరకు రైతులకు ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఈ నేపథ్యంలో ఎకరానికి రూ.లక్ష చెల్లించి అన్ని విధాలా ఆదుకోవలసిన ప్రభుత్వం మొక్కుబడి సాయం ప్రకటించడంతోపాటు 50 శాతం నిబంధనలను అమలు చేయడం కూడా బాధిత కాఫీ రైతులకు అన్యాయం చేయడమేనని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
సిల్వర్ ఓక్.. అక్రమార్కులకదే కేక్!
మన్యంలో వృక్షాలపై కలప వ్యాపారుల కన్ను కాఫీ తోటలకు పొంచివున్న ముప్పు ఐటీడీఏ అడ్డుకట్ట వేయాలని స్థానికుల డిమాండ్ పాడేరు : మన్యంలో దాదాపు 1.40 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలు పచ్చగా విరాజిల్లుతున్నాయంటే దానికి కారణం సిల్వర్ ఓక్ వృక్షాల నీడ. అంతటి ప్రాధాన్యత ఉన్న ఈ వృక్షాలపై అక్రమార్కుల కన్ను పడింది. నిన్నటి వరకూ నీలగిరి వృక్షాలను కూల్చివేసి దండిగా సంపాదించుకున్న కలప వ్యాపారులు ఇప్పుడు సిల్వర్ ఓక్ చెట్లతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఐదేళ్ల క్రితం వరకూ కాఫీ రైతులను మాయచేసి సిల్వర్‌ఓక్ వృక్షాలను విచ్చలవిడిగా నరికివేశారు. ఫలితంగా పాడేరు ప్రాంతంలోని వనుగుపల్లి, లగిసపల్లి, వంజంగి పంచాయతీల పరిధిలో కాఫీ తోటలు నాశనమయ్యాయి. తాత్కాలిక డబ్బు ఆశతో కాఫీ రైతులు సిల్వర్ ఓక్ చెట్లను వ్యాపారులకు అమ్మేసి.. ఏటా ఫలసాయం అందించే కాఫీ తోటలను చేజేతులా నాశనం చేసుకున్నారు. దీంతో అప్రమత్తమైన ఐటీడీఏ అధికారులు... సిల్వర్‌ఓక్ కలప వ్యాపారానికి అడ్డుకట్ట వేశారు. పాడేరు ఘాట్‌తోపాటు పలు చోట్ల ప్రత్యేకంగా చెక్‌పోస్టులను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మళ్లీ కలప వ్యాపారుల కన్ను సిల్వర్ ఓక్ వృక్షాలపై పడింది. వాటిని అమ్మేస్తే మంచి లాభాలు వస్తాయంటూ మళ్లీ గిరిజన కాఫీ రైతులను వలలో వేసుకోవడానికి ఓ అక్రమ కలప ముఠా ప్రయత్నాలు ముమ్మరం చేసిందని సమాచారం. పట్టా భూముల్లోని కాఫీ తోటల్లో ఉన్న సిల్వర్ ఓక్ వృక్షాలను నరికివేయడానికి, ఆ దుంగల రవాణాకు ప్రభుత్వం అనుమతులు ఇస్తుందని గిరిజ నులను నమ్మించడానికి ఆ ముఠా ప్రయత్నిస్తోంది. ఈ కలప అక్రమ వ్యాపారానికి పాడేరు ప్రధాన కేంద్రంగా మారింది. కాఫీ మొక్కలకు నీడనిచ్చే సిల్వర్ ఓక్ చెట్లను రక్షించుకోపోతే గిరిజన రైతులకు దీర్ఘకాలం తీవ్ర నష్టం తప్పదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఐటీడీఏ అధికారులు మరోసారి ఈ కలప అక్రమ వ్యాపారంపై దృష్టి సారించి, అడ్డుకట్ట వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
Mills, farmers in trouble
పాడేరు, న్యూస్‌లైన్: ఏజెన్సీలోని కాఫీ రైతులందరికీ బ్యాంకు ఖాతాల ద్వారానే ప్రోత్సాహక సొమ్ము చెల్లించాలని ఐటీడీఏ పీవో వి.వినయ్‌చంద్ ఆదేశించారు. గురువారం తన కార్యాలయంలో బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జీరో బ్యాలెన్స్‌తో ఖాతాలు తెరవడం, మండల కేంద్రాల్లో కొత్త బ్యాంకుల ఏర్పాటు, అదనపు సిబ్బంది నియామకం, కాఫీ రైతులు, ఉపాధి కూలీలకు చెల్లింపులు, బ్యాంకు లింకేజి రుణాలపై పీవో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాఫీ ప్రాజెక్టు ద్వారా అమలు చేస్తున్న ప్రోత్సాహక నగదు సక్రమంగా అందకపోవడంతో బ్యాంకు ఖాతాల ద్వారానే న్యాయం జరుగుతుందన్నారు. ఏజెన్సీ 11 మండలాల్లో 7786 మంది కాఫీ రైతుల్లో 4704 మందికి మాత్రమే బ్యాంకు ఖాతాలు ఉన్నాయన్నారు. మిగిలిన 3082 మంది యుద్ధప్రాతిపదికన ఖాతాలను తెరిచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతీ మండలంలోను 3 నుంచి 4వరకు బ్యాంకులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఎల్డీఎం బి.జయబాబును పీవో ఆదేశించారు. చింతపల్లి, ముంచంగిపుట్టు మండల కేంద్రాల్లో బ్యాంకుల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తామన్నారు. భౌగోళికంగా 60 శాతం విస్తీర్ణంలో గిరిజన ప్రాంతాలు ఉన్నాయని, జనాభా ప్రతిపాదికన చూసుకుంటే బ్యాంకులు అదనంగా అవసరమన్నారు. ఉపాధి కూలీలకు గ్రామైఖ్య సంఘాల ఖాతాల్లో జమ అవుతాయని, అయితే కూలీలకు చెల్లింపులు జరపకుండా బ్యాంకు అధికారులు వీవోల ఖాతాల నుంచి బకాయిలను రీకవరి చేయడం నేరమన్నారు. గొలుగొండ, ఐఎల్పురం, శరభన్నపాలెం, కేడీ పేటల్లో బ్యాంకుల ద్వారా జీడి తోటల రైతులకు కూడా ఖాతాలను వెంటనే ప్రారంభించాలన్నారు. ఏజెన్సీలోని 9500 స్వయం సహాయ సంఘాలు ఉన్నాయని, వాటి బలోపేతానికి కూడా ఐటీడీఏ చర్యలు తీసుకుంటుందని పీవో తెలిపారు. సమావేశంలో ఐటీడీఏ ఏపీవో పి.వి.ఎస్.నాయుడు, అన్ని బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.