సిల్వర్ ఓక్.. అక్రమార్కులకదే కేక్!
- మన్యంలో వృక్షాలపై కలప వ్యాపారుల కన్ను
- కాఫీ తోటలకు పొంచివున్న ముప్పు
- ఐటీడీఏ అడ్డుకట్ట వేయాలని స్థానికుల డిమాండ్
పాడేరు : మన్యంలో దాదాపు 1.40 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలు పచ్చగా విరాజిల్లుతున్నాయంటే దానికి కారణం సిల్వర్ ఓక్ వృక్షాల నీడ. అంతటి ప్రాధాన్యత ఉన్న ఈ వృక్షాలపై అక్రమార్కుల కన్ను పడింది. నిన్నటి వరకూ నీలగిరి వృక్షాలను కూల్చివేసి దండిగా సంపాదించుకున్న కలప వ్యాపారులు ఇప్పుడు సిల్వర్ ఓక్ చెట్లతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు.
ఐదేళ్ల క్రితం వరకూ కాఫీ రైతులను మాయచేసి సిల్వర్‌ఓక్ వృక్షాలను విచ్చలవిడిగా నరికివేశారు. ఫలితంగా పాడేరు ప్రాంతంలోని వనుగుపల్లి, లగిసపల్లి, వంజంగి పంచాయతీల పరిధిలో కాఫీ తోటలు నాశనమయ్యాయి. తాత్కాలిక డబ్బు ఆశతో కాఫీ రైతులు సిల్వర్ ఓక్ చెట్లను వ్యాపారులకు అమ్మేసి.. ఏటా ఫలసాయం అందించే కాఫీ తోటలను చేజేతులా నాశనం చేసుకున్నారు. దీంతో అప్రమత్తమైన ఐటీడీఏ అధికారులు... సిల్వర్‌ఓక్ కలప వ్యాపారానికి అడ్డుకట్ట వేశారు. పాడేరు ఘాట్‌తోపాటు పలు చోట్ల ప్రత్యేకంగా చెక్‌పోస్టులను కూడా ఏర్పాటు చేశారు.
ఇప్పుడు మళ్లీ కలప వ్యాపారుల కన్ను సిల్వర్ ఓక్ వృక్షాలపై పడింది. వాటిని అమ్మేస్తే మంచి లాభాలు వస్తాయంటూ మళ్లీ గిరిజన కాఫీ రైతులను వలలో వేసుకోవడానికి ఓ అక్రమ కలప ముఠా ప్రయత్నాలు ముమ్మరం చేసిందని సమాచారం. పట్టా భూముల్లోని కాఫీ తోటల్లో ఉన్న సిల్వర్ ఓక్ వృక్షాలను నరికివేయడానికి, ఆ దుంగల రవాణాకు ప్రభుత్వం అనుమతులు ఇస్తుందని గిరిజ నులను నమ్మించడానికి ఆ ముఠా ప్రయత్నిస్తోంది.
ఈ కలప అక్రమ వ్యాపారానికి పాడేరు ప్రధాన కేంద్రంగా మారింది. కాఫీ మొక్కలకు నీడనిచ్చే సిల్వర్ ఓక్ చెట్లను రక్షించుకోపోతే గిరిజన రైతులకు దీర్ఘకాలం తీవ్ర నష్టం తప్పదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఐటీడీఏ అధికారులు మరోసారి ఈ కలప అక్రమ వ్యాపారంపై దృష్టి సారించి, అడ్డుకట్ట వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.