మాటేశారు... కాటేశారు | Mother daughter story at Coffee garden | Sakshi
Sakshi News home page

మాటేశారు... కాటేశారు

Published Tue, Apr 26 2016 1:15 AM | Last Updated on Thu, Jul 11 2019 7:48 PM

మాటేశారు... కాటేశారు - Sakshi

మాటేశారు... కాటేశారు

పచ్చటి ఆకులపై తుషార బిందువులు... దేవుడికి అభిషేకం చేశాక భూమి మీద రాలిపడ్డ ముత్యాలు...
అలాంటి పచ్చటి అమాయక నిష్కల్మష కొండలలో విషపు కోరికలతో తోడేళ్లు మాటేశాయి... కాటేశాయి...
అమాయకత్వానికి మూఢనమ్మకానికి పీటముడి వేసి కాల్చేశాయి.
మూఢనమ్మకం వాడుకలో ఉందని తెలుసుకాని వాడుకోవడానికి ఉందని ఈ కథనం తెలుపుతోంది...

 

‘అటెళ్లకు తోడేళ్లుంటాయ్’ అన్నాడు ఎర్రోడు. ‘నువ్వున్నావుగా. ఎర్ర తోడేలువి. ఇంకా అడవిలో తోడేళ్లెక్కడివి?’ అని గట్టిగా అంటించింది ముత్తి. పక్కన ఉన్న స్నేహితురాలు కిసుక్కున నవ్వింది. ఇద్దరూ కలిసి కట్టెలకు వెళుతున్నారు. ఎర్రోడు ప్రతిసారీ వెంట పడుతున్నాడు. అడవిలో పూలైనా సరే ఎవరో ఒకరి కంట పడతాయి. ముత్తి పదహారేళ్ల పువ్వు. ఎర్రోడి కన్ను ఇప్పుడా పువ్వు మీద ఉంది.
   
అరకు ప్రాంతంలో ఒక చిన్న పల్లె అది.
చెట్టు, చేమలతో నిండిన పచ్చటి ప్రదేశం.  బుడ్డి దీపాలే వారికి వెలుగు దివ్వెలు. కాఫీ తోటల్లో పనే అక్కడివారికి జీవనాధారం. బయటి ప్రపంచంతో వేరే సంబంధమే ఉండని ప్రాంతం. పగలంతా కష్టం. రాత్రయితే ఆటా పాటా... ముత్తి చాలా చక్కగా పాడుతుంది. అచ్చు మీ అమ్మలాగే పాడుతావు అంటారు అందరూ. ముత్తి తల్లి హంస కూడా మంచి గాయని. మగదిక్కు లేని ఇంటినీ ఒక్కగానొక్క కూతురిని చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ నిర్వహించుకుంటూ వస్తోందామె.
 కూతురి మనువు ఒక్కటే ఆమెకు బెంగ.
 ఈలోపు ఏ తోడేలూ ముట్టకుండా కూడా జాగ్రత్త పడాలి.
 అందుకే కూతురి మీద ఒక కన్నేసి పెడుతోంది.
 ఎర్రోడు వెంట పడుతున్నాడని తెలుసు.
 అతనికి ఎలా బుద్ధి చెప్పాలి?
   
‘ఏమైంది నీ ప్రయత్నం పిట్టను కొట్టావా?’ అడిగాడు కొమ్మోడు ఎర్రోణ్ణి.
 ‘అవుతుంది అవుతుంది’ అన్నాడు ఎర్రోడు.
 ‘నీ ముఖంలే’ అని నవ్వాడు కొమ్మోడు.
 ఎర్రోడి ప్రయత్నం కొమ్మోడికి తెలుసు. ఇంకా వాడి ఇద్దరు ముగ్గురు స్నేహితులకు తెలుసు. మొదట ఎర్రోడు సాధిస్తే తర్వాత తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామని ఉన్నారు వాళ్లు.
 అప్పుడే అటుగా హంస వచ్చింది.
 ‘సూడండయ్యా.. ఊరికే నా కూతురి వెంటపడి మా బతుకు బజారను పడేయకండి. మీకు దండం ఉంటుంది. నా మాట వింటే సరే. లేదంటే మీ సంగతి ఊరి పెద్దల ముందు పెడతాను’ మంచిగానే వాళ్లకు హెచ్చరిక చేసింది హంస.
 మిత్రులందరూ ఆమె వైపు కోపంగా చూశారు.
 కాని ఊరి పెద్దలు అటుగా వస్తుండటంతో మాట మాట్లాడలేదు.
   
వారం రోజులు గడిచాయి. ఊళ్లోని ముసలయ్యా అర్ధరాత్రి పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ప్రాణాలు విడిచాడు. అలా ఒక మనిషి హటాత్తుగా చచ్చిపోవడంతో ఊరంతా ఆందోళనగా గుమిగూడింది. ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వారు చేశారు. అప్పటికే హాయిగా స్వేచ్ఛగా బతికే హంస మీద, ముత్తి మీద ఊరి ఆడవాళ్లకు అసూయ ఉంది. మరుసటిరోజు కాఫీ తోటల్లో సంభాషణ ఇలా సాగింది:
 ‘హంస పనికి ఒకరోజొస్తే ఒకరోజు రావట్లేదు. డబ్బెక్కువైందో ఏంటో’ కాఫీ గింజలు ఒలుస్తూ అంది ఒకామె. ‘‘ఈ మధ్య తల్లీకూతుళ్లు ఎవరితోనూ కలవడం లేదు.

ఎటెళ్తున్నారో ఏంటో. ఇంకేదైనా పనులకు పోతున్నారేమో’’ సమాధానంతోపాటు సందేహాన్ని కూడా ఒలికించింది మరొకామె.. ‘ఇద్దరూ చేతబడి చేస్తున్నార్ట. రాత్రి పూట ఊరంతా తిరుగుతున్నారట. కుర్రాళ్లంతా అదే మాట అంటున్నారు’ తాను విన్నవీ, తనకు తోచినవీ కలిపి వంతపాడింది మరొకామె. ‘‘అయినా హంస ఎక్కడికెళ్లినా అడగడానికి మొగుడు లేడు, అడ్డుచెప్పేవాళ్లు లేకపోతే ఏ ఆటైనా ఆడవచ్చు’ తన మనసులోని అసూయనంతా ఒలకబోసింది మరొకామె.
   
‘అరే! ఇది విన్నారా! ముసలయ్యను హంసే చంపేసిందట. చేతబడి చేసింది. అందుకే ఏ పసరు వేసినా నయం కాక పైకి పోయాడు’ యథాలాపంగా అన్నట్లు అన్నాడు ఎర్రోడు. మిగిలిన కుర్రాళ్లు నిజమే కావచ్చు అన్నట్లు ముఖం పెట్టారు.  ఈ మాటలన్నీ తల్లీకూతుళ్ల చెవిన కూడా పడుతున్నాయి. కూతురి భద్రతను మరింత కట్టుదిట్టం చేసుకుంటోంది హంస. అంతలో ఓ రోజు...
 ఊరంతా హంస ఇంటి నుంచి కేకలు వింది. రాత్రికి రాత్రి హంసని, ముత్తిని చంపేశారు. వారి గుడిసెలోనే చంపేశారు. మంచానికి కట్టేసి కిరోసిన్ పోసి తగులబెట్టేశారు.

ప్రాణభయంతో అరిచిన అరుపులకు ఊరు మేల్కొంది. కొన ఊపిరితో మంటల్లో కాలుతున్న వారిని అందరూ చూస్తున్నారు, కానీ కాపాడడానికి ఎవరూ ముందుకు రాలేదు. తెల్లవారింది. హంస ఇంటి ముందు ఊరి పెద్ద నులకమంచం మీద కూర్చుని ఉన్నాడు. ఈ పని చేసిందెవరంటే అందరూ అందరి వైపూ చూసుకుంటున్నారు. ఎవరూ ఎవరినీ వేలెత్తి చూపించట్లేదు. ఎర్రోనితోపాటు అతడి స్నేహబృందం ఓ పక్కగా నిలబడి ఉంది. ఎవరిలోనూ తప్పు చేసిన భావన లేదు. విచారణను మరుసటి రోజుకి వాయిదా వేశాడు పెద్ద. ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారు.
   
మరుసటిరోజు పోలీసులు రంగప్రవేశం చేశారు. ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రావడం లేదు. ఇంటింటికీ వెళ్లి తలుపుకొడుతున్నారు. బయటకు వచ్చిన వాళ్లు పోలీసుల ప్రశ్నలకు తమకు తోచినది చెప్పి తప్పించుకుంటున్నారు. ఇరవై ఇళ్ల వాళ్లతో మాట్లాడేటప్పటికి పోలీస్‌కి ఓ పిక్చర్ వచ్చింది. ఇక ఊహాజనితమైన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. సాయంత్రానికి ఎర్రోడి బ్యాచ్‌ని అదుపులోకి తీసుకున్నారు.  చేతబడులు, క్షుద్రపూజలు ఉండవని, ఒకవేళ ఎవరైనా అలాంటి పూజలు చేసినా వాటి వల్ల ఎవరికీ నష్టం జరగదని నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు.

అదెవరికీ నచ్చడం లేదని పది నిమిషాల్లోనే అర్థమైంది. కొండ వాలులో చెట్టు ఊగితే దెయ్యం జడలు విప్పిందని భయపడే అమాయకత్వం వారిది. అదే అమాయకత్వంలో పెరిగి పెద్దయిన వారిలో అజ్ఞానం కూడా స్థిరంగా నాటుకుపోయి ఉంది. వారిని సమాధానపరచడం కంటే మాట కటువుతో దారిలోకి తేవడమే తమకు చేతనైన పని అనుకున్నారు. అదే ఫార్ములాను ఆచరణలో పెట్టడంతోపాటు సామాజిక కార్యకర్తల చేత సమావేశం ఏర్పాటు చేసి చెప్పించారు.
 (గమనిక: గోప్యతకోసం ఊరూ, పేర్లూ మార్చాం)
 
ఎందుకు చంపేశారు!
హంస చేతబడి చేయడం లేదని, చేతబడి ముద్ర ఆమె మీద మోపారని ఎర్రోడు బృందానికి తెలుసు. ముత్తి మీద కన్నేసిన ఎర్రోడు తల్లీకూతుళ్లను ఎన్ని రకాలుగా వేధించాడో స్నేహబృందంలో అందరికీ తెలుసు. కడుపులో అల్సర్‌తో చనిపోయిన ముసలయ్య మరణాన్ని సాకుగా తీసుకుని, ఆ రాత్రి ఇంట్లో దూరి తల్లీకూతుళ్ల మీద అఘాయిత్యానికి పాల్పడిన సంగతిని ఇద్దరు కుర్రాళ్లు బయటపెట్టారు.

అఘాయిత్యంతో ఆగిపోతే ఊరి ముందు నేరగాళ్లుగా తలదించుకోవాలి. కనుక  ఏం జరిగిందో చెప్పడానికి వాళ్లు ఉండకూడదు. అందుకే వారిని మంటలకు ఆహుతి చేశారు. కుక్కను చంపాలంటే దానిని పిచ్చికుక్క అని నమ్మించాలి. అలాగే లైంగిక నేరాలకు పాల్పడే వాళ్లు మహిళల మీద అసాంఘిక శక్తి, క్షుద్రశక్తులను సాధన చేస్తోంది... అనే ముద్ర వేయడం ఆదివాసీ గ్రామాల్లో సర్వసాధారణమైపోయింది. ఆ ముసుగులో ఏం చేసినా ఊరి మద్దతు ఉంటుంది.
 -  పోలీస్ అధికారి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement