coffee garden
-
ఏపీఎఫ్డీసీ అధికారులు కాఫీ తోటలను వదిలివెళ్లాలి
విశాఖపట్నం , గూడెంకొత్తవీధి(పాడేరు): కాఫీ తోటలను గిరిజనులకు అప్పగించి ఏపీఎఫ్డీసీ అధికారులు ఏజెన్సీ ప్రాంతాన్ని వదిలివెళ్లాలని మావోయిస్టుపార్టీ గాలికొండ ఏరియా కమిటీ పేరుతో గురువారం బ్యానర్లు , కరపత్రాలు వెలిశాయి. వివరాలు ఇలా ఉన్నాయి. తాము పంచిపెట్టిన కాఫీతోటలను గిరిజనులు సాగు చేసుకుంటున్నారని, అడవిపై హక్కు ఆదివాసీలదేనని, గ్రామరాజ్యం కమిటీలతో సర్వ అధికారం పొందారని అందువల్ల కాఫీ తోటలను వదిలి ఏపీఎఫ్డీసీ అధికారులు వెళ్లిపోవాలని పేర్కొంటూ మండలంలోని కుంకుంపూడి ఘాట్‌రోడ్డులో గురువారం తెల్లవారు జామున గాలికొండ ఏరియా కమిటీ పేరిట బ్యానర్లు వెలిశాయి. జి.మాడుగుల మండలం నుర్మతి సమీపంలో పోలీసులను లక్ష్యంగా చేసుకుని మందుపాతర పేల్చి అలజడి సష్టించిన మావోయిస్టులు, ఇప్పుడు కాఫీతోటల వివాదం తెరపైకి తేవడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. -
మాటేశారు... కాటేశారు
పచ్చటి ఆకులపై తుషార బిందువులు... దేవుడికి అభిషేకం చేశాక భూమి మీద రాలిపడ్డ ముత్యాలు... అలాంటి పచ్చటి అమాయక నిష్కల్మష కొండలలో విషపు కోరికలతో తోడేళ్లు మాటేశాయి... కాటేశాయి... అమాయకత్వానికి మూఢనమ్మకానికి పీటముడి వేసి కాల్చేశాయి. మూఢనమ్మకం వాడుకలో ఉందని తెలుసుకాని వాడుకోవడానికి ఉందని ఈ కథనం తెలుపుతోంది... ‘అటెళ్లకు తోడేళ్లుంటాయ్’ అన్నాడు ఎర్రోడు. ‘నువ్వున్నావుగా. ఎర్ర తోడేలువి. ఇంకా అడవిలో తోడేళ్లెక్కడివి?’ అని గట్టిగా అంటించింది ముత్తి. పక్కన ఉన్న స్నేహితురాలు కిసుక్కున నవ్వింది. ఇద్దరూ కలిసి కట్టెలకు వెళుతున్నారు. ఎర్రోడు ప్రతిసారీ వెంట పడుతున్నాడు. అడవిలో పూలైనా సరే ఎవరో ఒకరి కంట పడతాయి. ముత్తి పదహారేళ్ల పువ్వు. ఎర్రోడి కన్ను ఇప్పుడా పువ్వు మీద ఉంది. అరకు ప్రాంతంలో ఒక చిన్న పల్లె అది. చెట్టు, చేమలతో నిండిన పచ్చటి ప్రదేశం. బుడ్డి దీపాలే వారికి వెలుగు దివ్వెలు. కాఫీ తోటల్లో పనే అక్కడివారికి జీవనాధారం. బయటి ప్రపంచంతో వేరే సంబంధమే ఉండని ప్రాంతం. పగలంతా కష్టం. రాత్రయితే ఆటా పాటా... ముత్తి చాలా చక్కగా పాడుతుంది. అచ్చు మీ అమ్మలాగే పాడుతావు అంటారు అందరూ. ముత్తి తల్లి హంస కూడా మంచి గాయని. మగదిక్కు లేని ఇంటినీ ఒక్కగానొక్క కూతురిని చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ నిర్వహించుకుంటూ వస్తోందామె. కూతురి మనువు ఒక్కటే ఆమెకు బెంగ. ఈలోపు ఏ తోడేలూ ముట్టకుండా కూడా జాగ్రత్త పడాలి. అందుకే కూతురి మీద ఒక కన్నేసి పెడుతోంది. ఎర్రోడు వెంట పడుతున్నాడని తెలుసు. అతనికి ఎలా బుద్ధి చెప్పాలి? ‘ఏమైంది నీ ప్రయత్నం పిట్టను కొట్టావా?’ అడిగాడు కొమ్మోడు ఎర్రోణ్ణి. ‘అవుతుంది అవుతుంది’ అన్నాడు ఎర్రోడు. ‘నీ ముఖంలే’ అని నవ్వాడు కొమ్మోడు. ఎర్రోడి ప్రయత్నం కొమ్మోడికి తెలుసు. ఇంకా వాడి ఇద్దరు ముగ్గురు స్నేహితులకు తెలుసు. మొదట ఎర్రోడు సాధిస్తే తర్వాత తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామని ఉన్నారు వాళ్లు. అప్పుడే అటుగా హంస వచ్చింది. ‘సూడండయ్యా.. ఊరికే నా కూతురి వెంటపడి మా బతుకు బజారను పడేయకండి. మీకు దండం ఉంటుంది. నా మాట వింటే సరే. లేదంటే మీ సంగతి ఊరి పెద్దల ముందు పెడతాను’ మంచిగానే వాళ్లకు హెచ్చరిక చేసింది హంస. మిత్రులందరూ ఆమె వైపు కోపంగా చూశారు. కాని ఊరి పెద్దలు అటుగా వస్తుండటంతో మాట మాట్లాడలేదు. వారం రోజులు గడిచాయి. ఊళ్లోని ముసలయ్యా అర్ధరాత్రి పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ప్రాణాలు విడిచాడు. అలా ఒక మనిషి హటాత్తుగా చచ్చిపోవడంతో ఊరంతా ఆందోళనగా గుమిగూడింది. ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వారు చేశారు. అప్పటికే హాయిగా స్వేచ్ఛగా బతికే హంస మీద, ముత్తి మీద ఊరి ఆడవాళ్లకు అసూయ ఉంది. మరుసటిరోజు కాఫీ తోటల్లో సంభాషణ ఇలా సాగింది: ‘హంస పనికి ఒకరోజొస్తే ఒకరోజు రావట్లేదు. డబ్బెక్కువైందో ఏంటో’ కాఫీ గింజలు ఒలుస్తూ అంది ఒకామె. ‘‘ఈ మధ్య తల్లీకూతుళ్లు ఎవరితోనూ కలవడం లేదు. ఎటెళ్తున్నారో ఏంటో. ఇంకేదైనా పనులకు పోతున్నారేమో’’ సమాధానంతోపాటు సందేహాన్ని కూడా ఒలికించింది మరొకామె.. ‘ఇద్దరూ చేతబడి చేస్తున్నార్ట. రాత్రి పూట ఊరంతా తిరుగుతున్నారట. కుర్రాళ్లంతా అదే మాట అంటున్నారు’ తాను విన్నవీ, తనకు తోచినవీ కలిపి వంతపాడింది మరొకామె. ‘‘అయినా హంస ఎక్కడికెళ్లినా అడగడానికి మొగుడు లేడు, అడ్డుచెప్పేవాళ్లు లేకపోతే ఏ ఆటైనా ఆడవచ్చు’ తన మనసులోని అసూయనంతా ఒలకబోసింది మరొకామె. ‘అరే! ఇది విన్నారా! ముసలయ్యను హంసే చంపేసిందట. చేతబడి చేసింది. అందుకే ఏ పసరు వేసినా నయం కాక పైకి పోయాడు’ యథాలాపంగా అన్నట్లు అన్నాడు ఎర్రోడు. మిగిలిన కుర్రాళ్లు నిజమే కావచ్చు అన్నట్లు ముఖం పెట్టారు. ఈ మాటలన్నీ తల్లీకూతుళ్ల చెవిన కూడా పడుతున్నాయి. కూతురి భద్రతను మరింత కట్టుదిట్టం చేసుకుంటోంది హంస. అంతలో ఓ రోజు... ఊరంతా హంస ఇంటి నుంచి కేకలు వింది. రాత్రికి రాత్రి హంసని, ముత్తిని చంపేశారు. వారి గుడిసెలోనే చంపేశారు. మంచానికి కట్టేసి కిరోసిన్ పోసి తగులబెట్టేశారు. ప్రాణభయంతో అరిచిన అరుపులకు ఊరు మేల్కొంది. కొన ఊపిరితో మంటల్లో కాలుతున్న వారిని అందరూ చూస్తున్నారు, కానీ కాపాడడానికి ఎవరూ ముందుకు రాలేదు. తెల్లవారింది. హంస ఇంటి ముందు ఊరి పెద్ద నులకమంచం మీద కూర్చుని ఉన్నాడు. ఈ పని చేసిందెవరంటే అందరూ అందరి వైపూ చూసుకుంటున్నారు. ఎవరూ ఎవరినీ వేలెత్తి చూపించట్లేదు. ఎర్రోనితోపాటు అతడి స్నేహబృందం ఓ పక్కగా నిలబడి ఉంది. ఎవరిలోనూ తప్పు చేసిన భావన లేదు. విచారణను మరుసటి రోజుకి వాయిదా వేశాడు పెద్ద. ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారు. మరుసటిరోజు పోలీసులు రంగప్రవేశం చేశారు. ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రావడం లేదు. ఇంటింటికీ వెళ్లి తలుపుకొడుతున్నారు. బయటకు వచ్చిన వాళ్లు పోలీసుల ప్రశ్నలకు తమకు తోచినది చెప్పి తప్పించుకుంటున్నారు. ఇరవై ఇళ్ల వాళ్లతో మాట్లాడేటప్పటికి పోలీస్‌కి ఓ పిక్చర్ వచ్చింది. ఇక ఊహాజనితమైన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. సాయంత్రానికి ఎర్రోడి బ్యాచ్‌ని అదుపులోకి తీసుకున్నారు. చేతబడులు, క్షుద్రపూజలు ఉండవని, ఒకవేళ ఎవరైనా అలాంటి పూజలు చేసినా వాటి వల్ల ఎవరికీ నష్టం జరగదని నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. అదెవరికీ నచ్చడం లేదని పది నిమిషాల్లోనే అర్థమైంది. కొండ వాలులో చెట్టు ఊగితే దెయ్యం జడలు విప్పిందని భయపడే అమాయకత్వం వారిది. అదే అమాయకత్వంలో పెరిగి పెద్దయిన వారిలో అజ్ఞానం కూడా స్థిరంగా నాటుకుపోయి ఉంది. వారిని సమాధానపరచడం కంటే మాట కటువుతో దారిలోకి తేవడమే తమకు చేతనైన పని అనుకున్నారు. అదే ఫార్ములాను ఆచరణలో పెట్టడంతోపాటు సామాజిక కార్యకర్తల చేత సమావేశం ఏర్పాటు చేసి చెప్పించారు. (గమనిక: గోప్యతకోసం ఊరూ, పేర్లూ మార్చాం) ఎందుకు చంపేశారు! హంస చేతబడి చేయడం లేదని, చేతబడి ముద్ర ఆమె మీద మోపారని ఎర్రోడు బృందానికి తెలుసు. ముత్తి మీద కన్నేసిన ఎర్రోడు తల్లీకూతుళ్లను ఎన్ని రకాలుగా వేధించాడో స్నేహబృందంలో అందరికీ తెలుసు. కడుపులో అల్సర్‌తో చనిపోయిన ముసలయ్య మరణాన్ని సాకుగా తీసుకుని, ఆ రాత్రి ఇంట్లో దూరి తల్లీకూతుళ్ల మీద అఘాయిత్యానికి పాల్పడిన సంగతిని ఇద్దరు కుర్రాళ్లు బయటపెట్టారు. అఘాయిత్యంతో ఆగిపోతే ఊరి ముందు నేరగాళ్లుగా తలదించుకోవాలి. కనుక ఏం జరిగిందో చెప్పడానికి వాళ్లు ఉండకూడదు. అందుకే వారిని మంటలకు ఆహుతి చేశారు. కుక్కను చంపాలంటే దానిని పిచ్చికుక్క అని నమ్మించాలి. అలాగే లైంగిక నేరాలకు పాల్పడే వాళ్లు మహిళల మీద అసాంఘిక శక్తి, క్షుద్రశక్తులను సాధన చేస్తోంది... అనే ముద్ర వేయడం ఆదివాసీ గ్రామాల్లో సర్వసాధారణమైపోయింది. ఆ ముసుగులో ఏం చేసినా ఊరి మద్దతు ఉంటుంది. - పోలీస్ అధికారి -
రూ.29.3 కోట్ల కాఫీ పరిహారం
పాడేరు : హుద్‌హుద్ తుఫాన్‌తో ఏజెన్సీలో ధ్వంసమైన కాఫీ, మిరియాల తోటలకు సంబంధించి బాధిత రైతులకు రూ.29.3 కోట్ల నష్టపరిహారం విడుదల చేశామని ఐటీడీఏ పీఓ వి.వినయ్‌చంద్ తెలిపారు. తుఫాను నష్టపరిహారం చెల్లింపులపై మంగళవారం తన కార్యాలయంలో ఉపాధి హామీ పథకం ఏపీడీలు, 11 మండలాల ఉద్యానవన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వ తుఫాన్‌తో 31,050 మంది గిరిజన రైతులకు చెందిన 37,665 ఎకరాల్లో కాఫీ, సిల్వర్‌ఓక్ తోటలు ధ్వంసమయ్యాయని పీఓ చెప్పారు. వీరిలో 27,157మంది రైతులకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయని ఈ ఖాతాల్లో నష్టపరిహారం సొమ్మును వెంటనే జమ చేస్తామన్నారు. ఇంకా 3,893 మంది రైతులు బ్యాంకు ఖాతాలను ప్రారంభించాల్సి ఉందని, వారంతా వచ్చే నెల 3వ తేదిలోగా బ్యాంకు ఖాతాలు తెరిచే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నష్టపరిహారం బుధవారం నుంచి ఆయా రైతుల ఖాతాల్లో జమ అవుతుందన్నారు. నష్టం నమోదుకు ఫొటోలు లేనిపక్షంలో గ్రామాలకు కెమెరాలతో వెళ్లి ఫొటోలు తీయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. నేలకొరిగిన చెట్టును తొలగించిన వెంటనే ఆ చెట్టుకు రూ.100 చొప్పున పరిహారం చెల్లించాలని, జాబ్‌కార్డులు లేని రైతులకు వెంటనే జాబ్‌కార్డులు మంజూరు చేయాలని ఆదేవించారు. చింతపల్లి, కొయ్యూరు, జీకేవీధి మండలాల్లో తుఫాను నష్టాన్ని ఆన్లైన్ చేయడంలో వెనుకబడి ఉండటాన్ని పీఓ తప్పుపట్టారు. 3వ తేదిలోగా ఆన్లైన్ పనులను పూర్తి చేసి బాధిత రైతులకు పరిహారం అందించాలన్నారు. సమావేశంలో పీహెచ్ఓ చిట్టిబాబు, ఉపాధి హామీ పథకం ఏపీడీలు ప్రసాద్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ భవన నిర్మాణాలకు సర్పంచ్‌లు ముందుకురావాలి ఏజెన్సీలో మంజూరైన పంచాయతీ భవన నిర్మాణాలు చేపట్టేందుకు సంబంధిత పంచాయతీల సర్పంచ్‌లంతా ముందుకు రావాలని పీఓ వినయ్‌చంద్ కోరారు. కితలంగి, బాకూరు, సీకుమద్దిల, మఠంభీమవరం, గత్తుం, పైనంపాడు, కొరవంగి, గోమంగి, బొంగరం, సుంకరమెట్ట, పట్టాం, రంగశీల పంచాయతీల సర్పంచ్‌లతో ఆయన సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది మార్చి నెలలోగా పంచాయతీ భవనాల నిర్మాణాలను పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఇప్పటికే 68 చెక్‌డ్యాం పనులు పూర్తి చేశామని, మరిన్ని చెక్‌డ్యాంల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. -
కాఫీ తోటలపై మావోయిస్టుల దృష్టి
చింతపల్లి: ఏజెన్సీలో ఏపీఎఫ్డీసీ సాగు చేస్తున్న కాఫీ తోటలపై మావోయిస్టుల మరోసారి దృష్టి సారించారు. చింతపల్లి, జీకేవీధి మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఈ తోటలను మరికొందరికి పంపిణీకి దళసభ్యులు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఏజెన్సీ వ్యాప్తంగా ఏపీఎఫ్డీసీ సుమారు 4 వేల హెక్టార్లలో కాఫీ తోటలు సాగు చేస్తున్నది. చింతపల్లి, జీకేవీధి మండలాల్లోనే 3,600 హెక్టార్లలో సంస్థకు చెందిన కాఫీ తోటలు ఉన్నాయి. ఏజెన్సీలో ప్రభుత్వపరంగా సాగవుతున్న కాఫీతోటలను 1/70 యాక్టు ప్రకారం గిరిజనులకే పంపిణీ చేయాలని ఏడేళ్ల నుంచి మావోయిస్టులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో జీకేవీధి మండలంలోని మర్రిపాకలు ఎస్టేట్‌లో ఉన్న 60 హెక్టార్ల తోటలను భూమి లేని ఆదివాసీ గిరిజనులకు, మూడేళ్ల క్రితం చింతపల్లి మండలం బలపం ప్రాంతంలోని 100 హెక్టార్ల కాఫీ తోటలను ఆ ప్రాంత గిరిజనులకు పంపిణీ చేశారు. ఈ క్రమంలోకాఫీతోటల ఆక్రమణలకు సంబంధించి సుమారు 100 మంది గిరిజనులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అనంతరం దేవరాపల్లి, ఈతదొరబ్బలు, చెరపల్లి ప్రాంతాల్లో మళ్లీ కాఫీతోటలను గిరిజనులకు పంపిణీకి మావోయిస్టులు సిద్ధమైనప్పటికి పోలీసుల కేసుల కారణంగా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో కాఫీతోటల పంపిణీ జరగలేదు. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల ప్రకటనతో మరోసారి మావోయిస్టులు ఉద్యమాలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వపరంగా సాగవుతున్న కాఫీ తోటలను గిరిజనులకు అప్పగించడం ద్వారా బాక్సైట్ ఉద్యమాన్ని బలోపేతం చేయవచ్చని భావిస్తున్నట్లు తెలిసింది. పలు గ్రామాల్లో భూమిలేని ఆదివాసీలకు కాఫీతోటలు పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నారు. దీంతో ఏపీఎఫ్డీసీ అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. -
సిల్వర్ ఓక్.. అక్రమార్కులకదే కేక్!
మన్యంలో వృక్షాలపై కలప వ్యాపారుల కన్ను కాఫీ తోటలకు పొంచివున్న ముప్పు ఐటీడీఏ అడ్డుకట్ట వేయాలని స్థానికుల డిమాండ్ పాడేరు : మన్యంలో దాదాపు 1.40 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలు పచ్చగా విరాజిల్లుతున్నాయంటే దానికి కారణం సిల్వర్ ఓక్ వృక్షాల నీడ. అంతటి ప్రాధాన్యత ఉన్న ఈ వృక్షాలపై అక్రమార్కుల కన్ను పడింది. నిన్నటి వరకూ నీలగిరి వృక్షాలను కూల్చివేసి దండిగా సంపాదించుకున్న కలప వ్యాపారులు ఇప్పుడు సిల్వర్ ఓక్ చెట్లతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఐదేళ్ల క్రితం వరకూ కాఫీ రైతులను మాయచేసి సిల్వర్‌ఓక్ వృక్షాలను విచ్చలవిడిగా నరికివేశారు. ఫలితంగా పాడేరు ప్రాంతంలోని వనుగుపల్లి, లగిసపల్లి, వంజంగి పంచాయతీల పరిధిలో కాఫీ తోటలు నాశనమయ్యాయి. తాత్కాలిక డబ్బు ఆశతో కాఫీ రైతులు సిల్వర్ ఓక్ చెట్లను వ్యాపారులకు అమ్మేసి.. ఏటా ఫలసాయం అందించే కాఫీ తోటలను చేజేతులా నాశనం చేసుకున్నారు. దీంతో అప్రమత్తమైన ఐటీడీఏ అధికారులు... సిల్వర్‌ఓక్ కలప వ్యాపారానికి అడ్డుకట్ట వేశారు. పాడేరు ఘాట్‌తోపాటు పలు చోట్ల ప్రత్యేకంగా చెక్‌పోస్టులను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మళ్లీ కలప వ్యాపారుల కన్ను సిల్వర్ ఓక్ వృక్షాలపై పడింది. వాటిని అమ్మేస్తే మంచి లాభాలు వస్తాయంటూ మళ్లీ గిరిజన కాఫీ రైతులను వలలో వేసుకోవడానికి ఓ అక్రమ కలప ముఠా ప్రయత్నాలు ముమ్మరం చేసిందని సమాచారం. పట్టా భూముల్లోని కాఫీ తోటల్లో ఉన్న సిల్వర్ ఓక్ వృక్షాలను నరికివేయడానికి, ఆ దుంగల రవాణాకు ప్రభుత్వం అనుమతులు ఇస్తుందని గిరిజ నులను నమ్మించడానికి ఆ ముఠా ప్రయత్నిస్తోంది. ఈ కలప అక్రమ వ్యాపారానికి పాడేరు ప్రధాన కేంద్రంగా మారింది. కాఫీ మొక్కలకు నీడనిచ్చే సిల్వర్ ఓక్ చెట్లను రక్షించుకోపోతే గిరిజన రైతులకు దీర్ఘకాలం తీవ్ర నష్టం తప్పదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఐటీడీఏ అధికారులు మరోసారి ఈ కలప అక్రమ వ్యాపారంపై దృష్టి సారించి, అడ్డుకట్ట వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.