
కాఫీ తోటలపై మావోయిస్టుల దృష్టి
చింతపల్లి: ఏజెన్సీలో ఏపీఎఫ్‌డీసీ సాగు చేస్తున్న కాఫీ తోటలపై మావోయిస్టుల మరోసారి దృష్టి సారించారు. చింతపల్లి, జీకేవీధి మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఈ తోటలను మరికొందరికి పంపిణీకి దళసభ్యులు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఏజెన్సీ వ్యాప్తంగా ఏపీఎఫ్‌డీసీ సుమారు 4 వేల హెక్టార్‌లలో కాఫీ తోటలు సాగు చేస్తున్నది. చింతపల్లి, జీకేవీధి మండలాల్లోనే 3,600 హెక్టార్‌లలో సంస్థకు చెందిన కాఫీ తోటలు ఉన్నాయి.
ఏజెన్సీలో ప్రభుత్వపరంగా సాగవుతున్న కాఫీతోటలను 1/70 యాక్టు ప్రకారం గిరిజనులకే పంపిణీ చేయాలని ఏడేళ్ల నుంచి మావోయిస్టులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో జీకేవీధి మండలంలోని మర్రిపాకలు ఎస్టేట్‌లో ఉన్న 60 హెక్టార్‌ల తోటలను భూమి లేని ఆదివాసీ గిరిజనులకు, మూడేళ్ల క్రితం చింతపల్లి మండలం బలపం ప్రాంతంలోని 100 హెక్టార్ల కాఫీ తోటలను ఆ ప్రాంత గిరిజనులకు పంపిణీ చేశారు.
ఈ క్రమంలోకాఫీతోటల ఆక్రమణలకు సంబంధించి సుమారు 100 మంది గిరిజనులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అనంతరం దేవరాపల్లి, ఈతదొరబ్బలు, చెరపల్లి ప్రాంతాల్లో మళ్లీ కాఫీతోటలను గిరిజనులకు పంపిణీకి మావోయిస్టులు సిద్ధమైనప్పటికి పోలీసుల కేసుల కారణంగా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో కాఫీతోటల పంపిణీ జరగలేదు.
ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల ప్రకటనతో మరోసారి మావోయిస్టులు ఉద్యమాలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వపరంగా సాగవుతున్న కాఫీ తోటలను గిరిజనులకు అప్పగించడం ద్వారా బాక్సైట్ ఉద్యమాన్ని బలోపేతం చేయవచ్చని భావిస్తున్నట్లు తెలిసింది. పలు గ్రామాల్లో భూమిలేని ఆదివాసీలకు కాఫీతోటలు పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నారు. దీంతో ఏపీఎఫ్‌డీసీ అధికారులు ఆందోళనకు గురవుతున్నారు.