‘ఓ కప్పు అరకు కాఫీ తాగుదాం డియర్.. ఇండియా నుంచి వచ్చి మన మనసు దోచుకుందంటే నమ్ము.. అరకు కాఫీ లేకుండా రోజు గడవడం లేదోయ్..’ అంటున్నారు ప్రస్తుతం విదేశీయులు. సహజ సిద్ధంగా కుళ్లిన ఆకులు వేసి పెంచిన ఆర్గానిక్ అరకు కాఫీ విదేశాల్లోనూ దూసుకెళ్తోంది. విశాఖ మన్యంలో సాగవుతున్న అరబికా రకం కాఫీ పారిస్‌లో ఇప్పటికే పాగా వేసింది. జపాన్, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్ దేశాల్లోనూ విక్రయాలు పెరిగి అక్కడి కాఫీ ప్రియులకూ మన కాఫీ నోరూరిస్తూ సత్తా చాటుతోంది.
– సాక్షి, విశాఖపట్నం
2017లోనే పారిస్‌లో పాగా
ఫ్యాషన్ ప్రపంచ రాజధాని పారిస్‌లోనూ అరకు కాఫీ బ్రాండ్‌తో 2017, ఫిబ్రవరిలోనే కాఫీ షాప్ వెలిసింది. నాంది ఫౌండేషన్‌కు అనుబంధంగా మహీంద్రా గ్రూప్‌నకు చెందిన అరకు గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ దీన్ని అక్కడ ఏర్పాటు చేసింది. కాఫీ సాగు విస్తరణలో మనదేశంలో తమిళనాడును వెనక్కినెట్టి కర్ణాటక తర్వాత రెండో స్థానం కోసం కేరళతో పోటీపడుతోంది. విశాఖ మన్యంలో పండించిన కాఫీ గింజలను గిరిజన రైతుల నుంచి వివిధ సంస్థలతో పాటు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఇందులో ప్రధానమైంది. నాంది ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ 20 వేల ఎకరాల్లో కాఫీ గింజలను పదేళ్లుగా కొనుగోలు చేస్తూ విదేశాలకు ఎగుమతి చేస్తోంది.
విస్తరణే లక్ష్యంగా ప్రణాళిక
కాఫీ తోటలు విస్తరించాలనే లక్ష్యంతో పాడేరు ఐటీడీఏ ప్రణాళిక అమలు చేస్తోంది. గత నాలుగేళ్లలో మొత్తం 42 వేల ఎకరాల్లో కాఫీ తోటలు విస్తరించాయి. వీటిని 2025–26 నాటికి మరో 58 వేల ఎకరాలకు విస్తరించాలనేది లక్ష్యం. ఇందుకోసం చింతపల్లి మండలంలో పైలట్ ప్రాజెక్టుగా రైతు సంఘాలను ఏర్పాటు చేశారు. మూడేళ్లపాటు సిల్వర్ ఓక్ చెట్లు పెరిగిన తర్వాత వాటి మధ్య అంతర పంటగా కాఫీ మొక్కలు, మిరియాల పాదులు నాటుకోవడానికి ఐటీడీఏ సహకరిస్తోంది.
దేశంలో మూడో స్థానం
2025–26 నాటికి మన్యంలో 2 లక్షల విస్తీర్ణంలో కాఫీ తోటలు విస్తరిస్తే దేశంలోనే 20 వేల మెట్రిక్ టన్నుల కాఫీ ఉత్పత్తితో కర్ణాటక తర్వాత ద్వితీయ స్థానానికి ఏపీ చేరుకుంటుంది. ప్రస్తుతం 1.50 లక్షల ఎకరాల్లో కాఫీ సాగుతో తమిళనాడును వెనక్కినెట్టి మూడో స్థానానికి చేరింది. ఒక మొక్క నుంచి క్లీన్ కాఫీ గింజలు ఏటా కిలో నుంచి 1.20 కిలోల వరకు దిగుబడి వస్తుంది. ఒక మెట్రిక్ టన్ను కాఫీ గింజల ధర ప్రస్తుతం రూ.1.50 లక్షల వరకు ఉంది.
విదేశీ ఎగుమతులే కీలకం
భారతదేశంలో పండుతున్న కాఫీలో 80 శాతం విదేశాలకే ఎగుమతి అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో కాఫీ సాగు చేస్తున్నా ఎగుమతుల్లో భారత్ ఆరో స్థానంలో ఉంది. కర్ణాటకలో కార్పొరేట్ స్థాయిలో సాగు చేస్తుండటంతో ఎకరానికి 225 కిలోలు దిగుబడి వస్తుండగా, విశాఖ మన్యంలో 100 నుంచి 120 కిలోల వరకు వస్తోంది. కాఫీ, అంతరపంటగా మిరియాల సాగు లాభసాటిగా ఉండటంతో గిరిజన రైతులు ఇటువైపు మొగ్గు చూపిస్తున్నారని, దీంతో మరో లక్ష ఎకరాల్లో కాఫీ విస్తరించే అవకాశం ఉందని పాడేరు ఐటీడీఏ కాఫీ ప్రాజెక్టు సహాయ సంచాలకులు రాధాకృష్ణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment