నురగలు కక్కుతూ నిద్ర మత్తును వదలగొట్టే పానీయం.. మదిని ఉత్తేజపరచే ఔషధం.. అవనిలో దొరికే ఆ అమృతం.. చిక్కటి.. చక్కటి రుచిగల ఉదయాలకు ప్రారంభం! ఈ కాంప్లిమెంట్‌కి కాఫీనే ఎలిజిబుల్!
‘అనుదినమ్మును కాఫీయే అసలు కిక్కు.. కొద్దిగానైన పడకున్న పెద్ద చిక్కు.. కప్పు కాఫీ లభించుటే గొప్ప లక్కు.. అమృతమన్నది హంబక్కు అయ్యలార.. జై కాఫీ’ అంటూ ‘మిథునం’ సినిమా కోసం జొన్నవిత్తుల కూడా కాఫీ మహిమను కీర్తించారు. ఇలా జనుల జిహ్వన నానుతున్న కాఫీ మన అరకు లోయలోనూ సాగవుతోంది. నిజమే కానీ ఈ ఘుమఘుమల ప్రస్తావన ఇప్పుడెందుకు? జూన్ 30న ప్రధాని మోదీ తన ‘మన్ కీ బాత్’లో ‘అరకు వ్యాలీ కాఫీని ప్రపంచానికి పరిచయం చేసిన కృషి అభినందనీయం .. అరకు కాఫీని ఆస్వాదించండి’ అని ప్రత్యేకంగా ప్రశంసించినందుకు!
టేస్ట్‌పుల్ ఇమేజ్‌తో అనేక దేశాలు గ్రోలుతున్న ఈ వండర్‌ఫుల్ అరకు కాఫీకి వందేళ్లకుపైగా ఘన చరిత్ర ఉంది. 1898లో.. ఓ ఆంగ్లేయ అ«ధికారి.. తూర్పుగోదావరి జిల్లా, పాములేరు లోయలో కాఫీ పంటను వేశారు. 1920 నాటికి విశాఖ ఏజెన్సీలోని అరకు, అనంతగిరి, జీకే వీథి, చింతపల్లి, పెదబయలు, ఆర్వీ నగర్, మినుమలూరు, సుంకరమెట్ట తదితర ప్రాంతాల్లోనూ కాఫీ తోటల పెంపకాన్ని మొదలుపెట్టారు.
స్వాతంత్య్రానంతరం ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ 1960లో విశాఖ జిల్లా రిజర్వ్ అటవీ ప్రాంతంలో కాఫీ పంటను వేసింది. ఆ తోటలను 1985లో అటవీ అభివృద్ధి సంస్థకు అప్పగించింది. ఆపై గిరిజన సహకార సంస్థ(జీసీసీ) ద్వారా ప్రత్యేకంగా కాఫీ తోటల అభివృద్ధి విభాగమొకటి ఏర్పాటైంది. కాఫీ బోర్డు సహకారంతో గిరిజన ప్రాంతాల్లో సుమారు పదివేల ఎకరాల్లో సేంద్రియ (ఆర్గానిక్) పద్ధతిలో కాఫీ తోటల పెంపకాన్ని ప్రారంభించారు. దీనివల్ల పెద్ద ఎత్తున గిరిజనులు పోడు వ్యవసాయం నుంచి కాఫీ సాగు వైపు మళ్లి ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.
అరకులో కాఫీ తోటలు సరే.. కాఫీ చరిత్రను చాటే కాఫీ మ్యూజియం కూడా ఉంది. 16వ శతాబ్దంలో సూఫీ సన్యాసి బాబా బుడాన్ .. కర్ణాటకలోని చిక్ మగళూరు నుంచి ఏడు కాఫీ గింజలను తెచ్చి తన ఆశ్రమంలో నాటారని కాఫీ బోర్డు వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.
వాతావరణం అనుకూలం..
సముద్ర మట్టానికి 3,600 అడుగుల ఎత్తులో ఉండే విశాఖ ఏజెన్సీ.. కాఫీ తోటల పెంపకానికి అనువైన ప్రదేశం. అందుకే పదివేల ఎకరాల్లో మొదలైన కాఫీ సాగు ఇప్పుడు లక్షన్నర ఎకరాలకు పైగా విస్తరించింది. ఇక్కడ పొడవైన సిల్వర్ ఓక్ చెట్లు, టేకు చెట్ల నీడలో.. ఏటవాలు ప్రాంతాల్లో కాఫీ తోటలను పెంచుతున్నారు. ఆ నేలల్లో క్షారగుణం తక్కువగా ఉండటం వల్ల ఆ కాఫీకి ప్రత్యేక రుచి వస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఆ తోటలకు నీడ కోసం.. ఓక్ చెట్ల మొదళ్లలో మిరియాలు వేసి.. అవి ఓక్ చెట్ల మీదుగా పాకేలా చేస్తున్నారు. దీనివల్ల మిరియాలు అదనపు పంటగా మారి.. అదనపు ఆదాయాన్నీ వాళ్లు పొందుతున్నారు.
అంతర్జాతీయ ఖ్యాతి..
ప్రపంచంలో అధికంగా కాఫీ పండించే దేశాల్లో .. మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల కాఫీ ఉత్పత్తితో మనం ఏడవ స్థానంలో ఉన్నాం. 25 లక్షల మెట్రిక్ టన్నుల కాఫీ ఉత్పత్తితో బ్రెజిల్ మొదటిస్థానంలో ఉంది. మన దేశంలో 12 రాష్ట్రాలు కాఫీని పండిస్తుండగా.. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచే ఎక్కువ ఉత్పత్తి అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీలో అరబికా రకం కాఫీని సాగు చేస్తున్నారు. ఈ కాఫీని బెంగళూరులో ప్రాసెస్ చేసి జర్మనీ, వియత్నాం, బ్రెజిల్, ఇంగ్లండ్, అమెరికా వంటి దేశాలకు ఎగుమతి చేస్తుంటారు.
2007లో ఆదివాసీ రైతులు ఉత్పత్తి చేసిన అరకు కాఫీ.. దేశంలోనే మొట్టమొదటి ఆర్గానిక్ కాఫీ బ్రాండ్‌గా గుర్తింపు పొందింది. ప్యారిస్‌లో ‘అరకు కాఫీ బ్రాండ్’ పేరుతో ఓ కాఫీ షాప్ తెరిచారు. దీని టేస్ట్ జపాన్, దక్షిణ కొరియా, స్విట్జర్లండ్ దేశాలకూ పాకింది. బెస్ట్ కాఫీ బ్రాండ్‌లకు పేరొందిన బ్రెజిల్, సుమత్రా, కొలంబోలు.. అరకు స్ట్రాంగ్ కాఫీ ముందు లైట్ అయిపోతున్నాయి. తద్వారా అరకు కాఫీకి అంతర్జాతీయ డిమాండ్‌నే కాదు ఫేమ్‌నీ పెంచుతున్నాయి. అరకు కాఫీ బేవరేజ్‌గానే మిగిలిపోలేదు. పలు రకాల పండ్లు, ఫ్లేవర్స్‌తో కలసి చాకోలెట్స్‌గానూ చవులూరిస్తోంది.
జగన్ మోహన్ రెడ్డి హయాంలోనే..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అటవీ ఫలసాయం, వ్యవసాయోత్పత్తుల కొనుగోలులో రికార్డు స్థాయిలో గిరిజనులకు మేలు జరిగింది. గిరిజన రైతులకు పెట్టుబడి సాయం, యంత్ర పరికరాలను అందించింది. దీనికితోడు జీసీసీ సైతం గిరిజన రైతుల వ్యవసాయానికి, కాఫీ సాగుకు రుణాలు మంజూరు చేసి, అంతర్జాతీయ మార్కెట్ ధరల కంటే అధికంగా మద్దతు ధరను చెల్లించింది. అరకు కాఫీకి అంతర్జాతీయ బ్రాండింగ్ కల్పించడంతోపాటు ఆర్గానిక్ సిర్టిఫికేషన్ కోసం ప్రత్యేక చర్యలూ చేపట్టి గిరిజన రైతులను ప్రోత్సహించింది.
అవార్డులు.. ప్రశంసలు!
గతేడాది సెప్టెంబర్ 25 నుంచి 29 వరకు బెంగళూరులో నిర్వహించిన ప్రపంచస్థాయి ‘ఫైన్ కప్’ పోటీలో ఏపీ ప్రభుత్వం తరఫున కాఫీ పెవిలియన్ ఏర్పాటు చేశారు. దీంట్లో ప్రథమ స్థానంలో నిలిచిన అరకు కాఫీ ‘ఫైన్ కప్’ అవార్డును దక్కించుకుంది. పెదబయలు మండలం లక్ష్మీపురం పంచాయతీ కప్పల గ్రామానికి చెందిన కిల్లో అశ్విని ఈ ఘనతను సాధించడం విశేషం. ప్రపంచ కాఫీ పోటీల్లో 12 ఏళ్ల తర్వాత మన కాఫీకి అంతర్జాతీయ అవార్డు దక్కింది. కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయో సోషల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సంస్థ 2022 ఆగస్టు 9 నుంచి 11 వరకు కోల్‌కతాలో నిర్వహించిన జాతీయ సదస్సులో 14 రాష్ట్రాలు పాల్గొనగా.. మన కాఫీ మొదటిస్థానంలో నిలవడంతో జాతీయ అవార్డు దక్కింది. న్యూఢిల్లీలో నిర్వహించిన జి–20 సదస్సులోనూ సర్వ్ అయిన అరకు కాఫీకి ప్రపంచ దేశాల ప్రతినిధులు హాట్ ఫేవరెట్స్ అయిపోయారు. గతంలో పారిస్‌లో ప్రి ఎపిక్యూర్స్ పోటీలో అరకు కాఫీ గోల్డ్ మోడల్ గెల్చుకుంది. – యిర్రింకి ఉమమహేశ్వరరావు, సాక్షి, అమరావతి
Comments
Please login to add a commentAdd a comment