Maybe
-
మావోయిస్టులకు మనుగడ లేనట్టే
మన్యంలో మావోయిస్టులు ఇక మనుగడ సాగించలేరని జిల్లా ఎస్పీ కె.ప్రవీణ్, చింతపల్లి డీఎస్పీ ఈ.జి.అశోక్‌కుమార్ అన్నారు. సోమవారం చింతపల్లి వచ్చిన ఎస్పీ దళసభ్యులను హతమార్చిన గిరిజనులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏజెన్సీలో మావోయిస్టుల చర్యల వల్ల గిరిజనులు పలు విధాలుగా నష్టపోయారన్నారు. కొన్నేళ్లుగా మావోయిస్టులపై తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నప్పటికీ అవకాశం కోసం ఎదురుచూశారన్నారు. సాగులలో గిరిజనులు తిరగబడినప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు. ఫలితంగానే ఈరోజు బలపంలో మావోయిస్టులను గిరిజనులే స్వచ్ఛందంగా హతమార్చారన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతమయ్యే అవకాశముందని పేర్కొన్నారు. బూజుపట్టిన సిద్ధాంతాలను కోసం పనికిమాలిన పోరాటాలు చేయకుండా ఇప్పటికైనా మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోవాలని లేకుంటే ప్రజలే సరైన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ ప్రసాద్, ఎస్ఐ తారకేశ్వరరావు పాల్గొన్నారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా ర్యాలీ మావోయిస్టుల చర్యలకు నిరసనగా సోమవారం చింతపల్లిలో నిరసన ర్యాలీలు నిర్వహించారు. బలపంలో మావోయిస్టులు హతమార్చిన సంజీవరావు మృతదేహంతో ఈ ర్యాలీని నిర్వహించారు. ఆధ్యాత్మిక భావంతో మాలలు వేసుకొని పూజ లు చేస్తున్న గిరిజనులను అన్యాయంగా హతమారుస్తున్నారంటూ గిరిజనులు వాపోయారు. మావోయిస్టుల ఆగడాలను ఇక ముందు సాగనీయబోమని ప్రతీనబూనారు. మృతుల బంధువులతో పోలీస్‌స్టేషన్ ప్రాంతం కిక్కిరిసిపోయింది. వారిని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున జనం తరలివచ్చారు. -
మన్యంలో మళ్లీ అలజడి
ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడి కాల్చివేత మృతుడు మాజీ ఎల్జీఎస్ కమాండర్ నరేష్ ఇన్ఫార్మర్ కాదు : భార్య మావోయిస్టులు మళ్లీ పెట్రేగారు. ఇన్ఫార్మర్ నెపంతో మాజీ మావోయిస్టును చంపి పోలీసులకు సవాల్ విసిరారు. విశాఖ-తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దులో జరిగిన ఈ సంఘటనతో మన్యంలో మళ్లీ అలజడి రేగింది. కొయ్యూరు: విశాఖ మన్యంలో పోలీస్ ఇన్ఫార్మర్ పేరిట మావోయిస్టులు ఓ గిరిజనుడిని తుపాకీతో కాల్చి చంపారు. గతంలో దళంలో పనిచేసి లొంగిపోయిన మువ్వల లచ్చి అలియాస్ లక్ష్మణరావు అలియాస్ నరేష్(25)ను తూర్పు గోదావరి విశాఖ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన జంగాలతోట సమీపంలో శనివారం తెల్లవారుజామున గాలికొండ ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టు నేతలు ఆజాద్, ఆనంద్ మరో నలుగురు కలిసి కాల్చి చంపా రు. నరేష్ ఇన్ఫార్మర్ నెట్‌వర్క్‌లో చేరి ప్రజలకు అన్యాయం చేయడంతో హతమార్చినట్లు మావోయిస్టులు అక్కడ వదిలిన లేఖలో పేర్కొన్నారు. నరేష్ నేపథ్యం యు.చీడిపాలెం పంచాయతీ ఎండకోటకు చెందిన మువ్వల నరేష్ 2001లో మావోయిస్టుల్లో చేరి 2005 వరకు పనిచేశాడు. తర్వాత ఏరియా కమిటీ సభ్యునిగా, పలకజీడి ఏరియా కమిటీకీ కమాండర్‌గా పనిచేశారు. 2006లో కాకినాడలో లొంగిపోయాడు. 2007లో ధారకొండలో పదవ తరగతి వరకు చదివాడు. అది పూర్తయిన వెంటనే ఎండకోట వచ్చి వ్యవసాయం చేసేవాడు. 2009 వరకు ఎండకోటలో ఉన్న నరేష్ మావోయిస్టుల నుంచి ఇబ్బందులు వస్తాయని వై.రామవర ం వెళ్లిపోయాడు. తర్వాత పోలీసు ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నారని అనుమానించిన మావోయిస్టులు వారి హిట్ జాబితాలో చేర్చారు. సంఘటన ఎలా జరిగిందంటే! : వై.రామవరంలో మకాం పెట్టిన నరేష్ జీవన భృతి కోసం కొంతకాలంగా రోజ్‌వుడ్, నేరేడు కలప ముక్కలను కొయ్యూరు సంతలో విక్రయిస్తూ కాలం నెట్టుకొస్తున్నాడు. ఈ క్రమంలో నరేష్ బుధవారం ఈ కలప కోసం వేమపాలెం వచ్చాడు. నరేష్ వేమపాలెంలో ఉన్నారని తెలుసుకున్న మావోయిస్టులు ఆ ఇంటిని శుక్రవారం అర్ధరాత్రి చుట్టుముట్టారు. ఇంటి తలుపుకొట్టి నరేష్ వద్ద ఉన్న సెల్ఫోన్లు ఇవ్వాలంటూ అడిగారు. లేవని చెప్పడంతో నరేష్‌ను వారి వెంట తీసుకెళ్లారు. నరేష్ మావయ్య రామారావు అడ్డుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో నరేష్‌ను వేమపాలేనికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న జంగాలతోట వద్దకు తీసుకెళ్లి తుపాకీతో కాల్చి చంపారు. నా భర్త ఇన్ ఫార్మర్ కాదు: మావోయిస్టులు తన భర్త నరేష్‌ను అన్యాయంగా చంపేశారని భార్య హేమలత బోరుమని రోదిస్తోంది. ఆమె తమ రెండేళ్ల కూతురు రోజాను విలేకరులకు చూపిస్తూ కన్నీరుమున్నీరయింది. వై.రామవరంలో కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నామని చెప్పింది. కుటుంబం గడవడం కష్టం కావడంతో నరేష్ ప్రతి శనివారం కొయ్యూరుకు కలప ముక్కలు తీసుకెళ్లి విక్రయించి, సరకులు తెస్తారని పేర్కొంది. నరేష్ అంటే గిట్టని ఎండకోట, ఈదులబందతో పాటు మరో గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఇచ్చిన తప్పుడు సమాచారం నమ్మి మావోయిస్టులు హతమార్చారని వాపోయింది. నరేష్ మృతదేహం వద్ద తండ్రి అప్పారావు, తల్లి లచ్చి బోరున విలపించారు. ఏ తప్పూ చేయని తమ బిడ్డ ఉసురు తీసేశారని బోరుమన్నారు. -
నిర్ల‘క్షయం పై పీఓ సీరియస్
ఆస్పత్రుల్లో వెలుగు చూస్తున్న లోపాలు అనుబంధ ఆహారానికి నిర్ణయం మన్యంలో 500 మంది రోగులకు మేలు కొయ్యూరు: మన్యంలో మలేరియా తగ్గుము ఖం పట్టినా క్షయ మాత్రం అదుపులోకి రావ డం లేదు. దీనిపై దృష్టి సారించిన ఐటీడీఏ పీవో వినయ్‌చంద్ పీహెచ్సీ తనిఖీల్లో ను క్షయపై వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యాన్ని చూ స్తున్నారు. లోపాలను సరిదిద్దుకోవాలని హె చ్చరిస్తున్నారు. మన్యంలో 500 మందికి పైగా ఉన్న క్షయ రోగులకు పౌష్టికాహారం అందించేందుకు ఆయన చర్యలు తీసుకుంటున్నారు. క్షయపై సరైన పర్యవేక్షణ లేక చాలా మంది సకాలంలో గుర్తింపునకు నోచక వ్యాధి ముదిరి మరణిస్తున్నారు. మొదటి పరీక్ష అనంతరం మందులిస్తారు. రెండు నెల ల తరువాత రెండోసారి ఉ మ్ము పరీక్షను చేయాలి. కా నీ ఒకసారి మందులిచ్చాక రోగు లు ఏమవుతున్నారో, వారి ఆరోగ్యం ఎలా ఉందో ప ర్యవేక్షించే వారు కరవయ్యారు. కొందరికి సరైన అవగాహన లేక మందులు వాడుతూ సారా తాగి చని పోతున్నారు. రోగి ని ఆస్పత్రికి తీసుకువచ్చే బాధ్యత క్షేత్ర స్థాయిలో పనిచేసే ఆశ వర్కర్లదని వైద్య సిబ్బంది చెబుతున్నారు. వాస్తవానికి ఈ విషయం ఆశ వర్కర్లకు కూడా పూర్తిగా తెలియదు. క్షయను నయం చేయాల్సిన వైద్యులు నిర్లక్ష్యంగా ఉం టున్నారని పీవో తనిఖీల్లో తేటతెల్లమవుతోం ది. సరైన రికార్డులు లేకపోవడం, మందులు ఒక పద్ధతి లో ఇవ్వకపోవడం బయట పడ్డాయి. పీవో వైఖరిని గమనిం చిన నర్సీపట్నం క్లస్టర్ ఎస్పీహెచ్వో గురువా రం తన పరిధిలో వైద్యులతో సమావేశం ఏర్పా టు చేశారు. అనుబంధ ఆహారం ఇస్తాం: పీవో క్షయ రోగులకు అనుబంధ ఆహారం ఇస్తామని ఐటీడీఏ పీవో వినయ్‌చంద్ తెలిపారు. దీనిలో భాగంగానే క్షయ రోగులపై పూర్తిగా దృష్టి పెట్టామన్నారు. ఆస్పత్రుల్లో వారిపై నిర్లక్ష్యం కనిపిస్తుందన్నారు. రికార్డులు సరిగా నిర్వహించకపోయినా, మందులు సరిగా ఇవ్వకపోయినా చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
పారాహుషార్!
జిల్లాపోలీసులకు త్వరలో 150 కొత్త వాహనాలు మన్యంలో కూంబింగ్ ఆపరేషన్లు ఇక ముమ్మరం మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీలో కొత్త పోలీసు వాహనాలు రయ్ రయ్ మంటూ పరుగులు పెట్టనున్నాయి. ఏజెన్సీని జల్లెడ పట్టడమే లక్ష్యంగా జిల్లా పోలీసు యంత్రాం గానికి ఈ వాహనాలను సమకూరనున్నాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : మావోయిస్టుల కదలికలు మళ్లీ ఊపందుకుంటున్నాయన్న సమాచారంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ ఆపరేషన్లకు సమాయత్తమవుతున్న పోలీసు శాఖ మౌలిక వసతుల మెరుగుదల, అదనపు హంగులపై దృష్టిసారించింది. అందుకు తొలి అడుగుగా పోలీసు శాఖకు అధునాతన వాహనాలను సమకూర్చనున్నారు. ఏజెన్సీని జల్లెడ పట్టేందుకు పోలీసు శాఖకు ఈ కొత్త వాహనాలను ఇవ్వనున్నారు. ఈమేరకు జిల్లా పోలీసు అధికారుల ప్రతిపాదనకు రాష్ట్ర పోలీసు రవాణా విభాగం ఆమోదం తెలిపింది. సుమోలు ఔట్... బొలేరోలు ఇన్ పోలీసు అధికారులు ఇంతవరకు ఎక్కువగా తెల్లరంగు సుమోలనే వాడుతుండడంతో అవి పోలీసులవని అందరికీ చిరపరిచితమైపోయాయి. దీంతో ఏజెన్సీలో పోలీసులు ఎక్కడ తిరిగినా ఇట్టే తెలిసిపోతోంది. పైగా, ఏజెన్సీ రోడ్లపై తెల్లసుమోలు కావాల్సినంత వేగంగా పరిగెత్తలేకపోతున్నాయి. వీటి స్థానంలో ప్రైవేటు వాహనాల మాదిరిగా నల్లరంగు బొలేరోలు సమకూర్చాలని జిల్లా అధికారులు ప్రతిపాదించారు. వాటితోపాటు అదనపు వాహనాలను ఇవ్వాలని కోరగా ఆమోదం లభించింది. 150 కొత్త వాహనాలు! : మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అవసరాల మేరకు జిల్లాకు 150 వరకు కొత్త వాహనాలను సరఫరా చేయనున్నారు. వాటిలో పోలీసు అధికారులు ఉపయోగించేందుకు నల్లరంగు బొలేరో వాహనాలు 40 ఉన్నట్లు భోగట్టా. ప్రధానంగా కూంబింగ్ పార్టీల పర్యవేక్షణ, పోలీసు స్టేషన్ల తనిఖీలు, గస్తీ తదితర కార్యక్రమాల కోసం పోలీసు అధికారులు వీటినే ఉపయోగిస్తారు. ఇవి కాకుండా కొత్తగా 5 మారుతీ డిజైర్ వాహనాలను కేటాయించారు. ఇక కూంబింగ్ ఆపరేషన్ల కోసం ఏజెన్సీకి బలగాల తరలింపుపైనా పోలీసు శాఖ ప్రత్యేక దృష్టిసారించింది. అందుకోసం ప్రత్యేకంగా వాహనాలను సమకూర్చనున్నారు. కొత్తగా 25 మినీ ట్రక్కులు, 10 బస్సులను ఇవ్వనున్నారు. ఏజెన్సీలో పోలీసుల గస్తీ కోసం కొత్తగా 60 మోటారు బైక్‌లను కేటాయించనున్నారు. పోలీసు సామగ్రి తరలింపు కోసం మరో 5 ఆటో మ్యాక్స్‌లు కూడా జిల్లా పోలీసు శాఖకు ఇవ్వాలని నిర్ణయించారు. కొత్త వాహనాలు వస్తే ఏజెన్సీలో పోలీసింగ్ మరింత పటిష్టమవుతుందని జిల్లా పోలీసులు ఆశిస్తున్నారు. -
రాజ్మా పంటకు వేళాయె..
సాగుకు గిరిజనులు సన్నద్ధం చల్లని వాతావరణం అనుకూలం మన్యం సిరుల పంట రాజ్మా చిక్కుళ్లు. దీని సాగుకు గిరిజనులు సన్నద్ధం అవుతున్నారు. కాఫీ తరువాత గిరిజనులు దీనినే ప్రధాన వాణిజ్య పంటగా చేపడతారు. ఏజెన్సీలో 10 వేల హెక్టార్లలో సాగవుతోంది. ఏజెన్సీలో ఏటా సుమారు 16 వేల టన్నుల దిగుబడి వస్తోంది. ఇక్కడ పండిన రాజ్మాను ముంబయ్, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. మార్కెట్లో ఈ పంటకు మంచి ధర పలుకుతుండటంతో రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు. కొద్దిపాటి సస్యరక్షణ చేపడితే ఎక్కువ దిగుబడులు సాధించ వచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. చింతపల్లి: ఏజెన్సీలోని చల్లని వాతావరణం రాజ్మా సాగుకు అనుకూలం. ఇది స్వల్పకాలిక పంట. అధిక మంచు, ఉష్ణోగ్రతలను తట్టుకొనలేదు. ఉత్తరాదిలో సూప్‌గా వినియోగించే వీటికి మంచి డిమాండ్. ఇందులో ఆరు రకాలు ఉన్నప్పటికి గిరిజనులు ముఖ్యంగా ఎరుపు, తెలుపు రకాలనే పండిస్తున్నారు. 90 శాతం మంది ఎరుపు రాజ్మానే చేపడుతున్నారు. ఎకరాకు మూడు క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఇవి గతేడాది కిలో రూ.60 నుంచి 80లు ధర పలికాయి. పంట కాలపరిమితి 3 నెలలు. ఎరుపు రాజ్మాకు డిమాండ్ ఉండటంతో సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. 50 రోజులలోపు దిగుబడి వచ్చే కంటైండరీ, బౌంట్ఫుల్, ఆర్కాకోమల్, రిమూవర్ వంటి రకాలను రైతులు ఇంటి అవసరాల కోసం పండిస్తున్నారు. సాగు విధానం: ఏజెన్సీలో సెప్టెంబరు నుంచి నవంబరు వరకు దీనిని పండిస్తారు. ఇసుకతో కూడిన గరుకు నేలలు, సారవంతమైన గరపనేలలు, బరువైన నేలలు దీనికి అనుకూలం. ఎకరాకు10 నుంచి 12 కిలోల విత్తనం అవసరమవుతుంది. భూమిని బాగా దున్ని చక్కని పదును వచ్చేట్లు చేయాలి. 30 నుంచి 45 సెం.మీ బోదెలు చేసి వాటిపై 25 నుంచి 30 సెం.మీ దూరంలో విత్తనాలు నాటుకోవాలి. భూమిలో కావలసినంత తేమ ఉండేట్లు చూసుకోవాలి. విత్తన శుద్ధి: రాజ్మా విత్తనాలను రైజోబియం జపానికం అనే బాక్టీరియాతో విత్తన శుద్ధి చేయాలి. ఇలా చేయడం వల్ల వాతావరణంలోని నత్రజని మొక్కలకు లభ్యమవుతుంది. ఎరువుల యాజమాన్యం: ఎకరాకు 10 టన్నుల పశువుల గెత్తం వేసి బాగా కలియదున్నాలి. విత్తనాలు వేసే వారం రోజుల ముందు 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ ఆఖరి దుక్కులో వేసుకోవాలి. అంతరకృషి: ఒకటి రెండు సార్లు గొప్పు తవ్వి కలుపు మొక్కలు రాకుండా చూసుకోవాలి. రాజ్మా మొక్కల వేళ్లు పైపైనే ఉంటాయి. అధిక తేమను తట్టుకోలేవు. పూత దశకు ముందు, కాయలు ఏర్పడిన తరువాత రెండుసార్లు నీటి తడులు అందించాలి. ఆశించే కీటకాలు: రసంపీల్చు పురుగులైన తేనెబంక, తెల్లదోమ, కాయతొలుచు పురుగులు ఈ పంటను ఎక్కువగా ఆశిస్తాయి. రైతులు వీటిని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి. ఐదు మిల్లీలీటర్ల పాస్మామిడాన్ లీటరు నీటిలో కలిపి నెల రోజుల తర్వాత పిచికారీ చేయాలి. హెక్టారుకు 450 లీటర్ల మందు ద్రావణం అవసరం అవుతుంది. ప్రధానంగా ఆశించే తెగుళ్లు: వెర్రి తెగులు, కాయకుళ్లు, తుప్పు, ఆకుమచ్చ తెగుళ్లు ఎక్కువగా రాజ్మా పంటను ఆశిస్తుంటాయి. వీటిని సకాలంలో గుర్తించకపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. వీటి నివారణకు 30 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ 10 లీటర్లు నీటిలో కలిపి విత్తిన 7 వారాల తర్వాత చేనులో జల్లుకోవాలి. హెక్టార్‌కు 540 లీటర్ల మందు ద్రావణం అవసరం అవుతుంది. సస్యరక్షణ తప్పనిసరి రాజ్మా సాగులో రైతులు సస్యరక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలి. దుక్కులు దున్నేటప్పుడు మొదలుకొని పంట చేతికి అందేంత వరకు ప్రత్యేక దృష్టి సారించాలి. ఏజెన్సీవాతావరణం ఈ సాగుకు అనుకూలంగా ఉండటం వల్ల కొద్దిపాటి జాగ్రతలు తీసుకున్నా మరింత దిగుబడులు సాధించ వచ్చు. - డాక్టర్ ఉమా మహేశ్వరరావు, శాస్త్రవేత్త, చింతపల్లి, 9441075852 మంచి ఆదాయం నాది చింతపల్లి మండలం చిక్కిసలబంద. నాకు ఆరు ఎకరాల భూమి ఉంది. అందులో మూడు ఎకరాల్లో పదేళ్లుగా రాజ్మా పంట చేపడుతున్నాను గతేడాది వెయ్యి కిలోల దిగుబడి వచ్చింది. రూ.65వేలు ఆదాయం సమకూరింది. సేంద్రియ పద్ధతిలో పండించడం, ఇంటిల్లిపాదీ కష్టపడడంతో మదుపులు రూ. 10వేలకు మించలేదు. ఈ ఏడాది శాస్త్రవేత్తల సలహాలతో దిగుబడి పెంచుకునేందుకు కృషి చేస్తున్నాను. - జి.రాజుబాబు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి నాది చింతపల్లి మండలం సమ్మగిరి. రెండు ఎకరాలలో గతేడాది పంట చేపట్టాను. ఈ ఏడాదీ అదే స్థాయిలో పంటకు అనుకూలంగా భూములను సిద్ధం చేశాను. రాజ్మ్లాకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే మరిన్ని లాభాలు వస్తాయి. ప్రధాన వాణిజ్య పంటగా సాగు చేస్తున్నప్పటికి ప్రభుత్వపరంగా కొనుగోలు చేయడం లేదు. దీంతో దళారులు నిర్ణయించిన ధరలకే విక్రయించాల్సి వస్తోంది. మార్కెటింగ్ ఉంటే మరిన్ని లాభాలు సాధిస్తాం. - వి.వెంకటరావు -
బాక్సైట్ జోలికొస్తే.. బుల్లెట్‌తో బుద్ధి
మావోయిస్టుల హెచ్చరిక కారడవుల్లో భారీ సమావేశం పోరుకు రాజకీయ నేతలకు పిలుపు పెద్ద ఎత్తున గిరిజనుల హాజరు అనేక గ్రామాల్లో గిరిజనుల ర్యాలీలు, నిరసనలు చింతపల్లిరూరల్: విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాల జోలికి వస్తే ఆయుధాలతో బుద్ధి చెబుతామని గాలికొండ ఏరియా కమిటీ, ఆదివాసీ విప్లవ రైతుకూలీ సంఘం నేతలు హెచ్చరించారు. శనివారం కొయ్యూరు, జీకేవీధి మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలో బాక్సైట్‌కు వ్యతిరేకంగా గిరిజన సంప్రదాయ ఆయుధాలతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. వందలాదిగా తరలి వచ్చిన ఆదివాసీలను ఉద్దేశించి సమావేశంలో విప్లవ నేతలు మాట్లాడారు. అడవిపై సర్వాధికారాలు ఆదివాసీలకే ఉన్నప్పటికీ అడవుల్లో ఉన్న ఖనిజ సంపదను దోచుకుపోయేందుకు ప్రయత్నం చేపడుతున్న తెలుగుదేశం ప్రభుత్వానికి ఆదివాసీలంతా బుద్ధి చెప్పాలని కోరారు. సంవత్సరాల కాలంగా అడవిలో ఉన్న సంపదను కాపాడుకుంటున్న ఆదివాసీలకు అన్ని రకాలుగా ముప్పు వాటిల్లే ప్రయత్నాన్ని చేపడుతున్న ప్రభుత్వాన్ని గ్రామగ్రామాన ఆదివాసీలంతా ఎదురొడ్డి పోరాటం చేయాలన్నారు. మన్యం పితూరి సైన్యంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై ఉద్యమాన్ని చేపట్టాలని కోరారు. విలువైన బాక్సైట్‌ను ఏదో ఒకలా తరలించుకుపోయేందుకు ప్రతి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. నిన్న మొన్నటి వరకు తాము బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకమని చెప్పిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ఏవేవో బూటకాలు చెబుతూ ఐటీడీఏ పేరున దొడ్డిదారిన బాక్సైట్ తవ్వకాలను చేపడతామని ప్రకటించిందని మావోయిస్టు నేతలు గుర్తు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించడాన్ని బట్టి అడవిలో ఉన్న సంపదపై సామ్రాజ్యవాదులు దృష్టి సారించారని అర్ధమవుతోందని చెప్పారు. బాక్సైట్ తవ్వకాలతో మన్యసీమకు ఎంతో నష్టం వాటిల్లుతుందని చెప్పారు. ఈ తవ్వకాలకు వ్యతిరేకంగా గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్కరు పోరాటం చేయాలని, అన్ని రాజకీయ పక్షాలు చిత్తశుద్ధితో ఉద్యమాలు చేపట్టాలని కోరారు. ఏజెన్సీలో మావోయిస్టు పార్టీని పూర్తిగా నిర్మూలించే విధంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేపడుతోందని విమర్శించారు. ప్రతి ఒక్కరూ ఉద్యమకారులై పోరాడాలని సూచించారు. తుపాకీ తూటాలతోనే నూతన ప్రజాస్వామ్యం ఏర్పాటుకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలన్నారు. బాక్సైట్ తవ్వకాలకు వచ్చే దొంగలను తరిమి కొట్టేందుకు సంప్రదాయ ఆయుధాలను సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మన్యంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు బాక్సైట్ తవ్వకాల వ్యతిరేక ఉద్యమంలో పాత్ర వహించాలని కోరారు. కొయ్యూరు, జీకేవీధి మండలాల నుంచి ఆదివాసీ గిరిజనులు తమ సాంప్రదాయ కత్తి, గొడ్డలి, విల్లంబులతో ఆడ, మగ తేడా లేకుండా ఈ సమావేశానికిహాజరయ్యారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా మావోయిస్టు నేతలతో కలిసి పెద్ద ఎత్తున ఆదివాసీలు నినాదాలు చేశారు. ఈ నినాదాలతో అటవీ ప్రాంతం దద్దరిల్లింది. -
మన్యంలో ‘బాక్సైట్’పై యుద్ధమేఘాలు!
తవ్వకాలకు వ్యతిరేకంగా ‘మావో’ల కమిటీలు! మూడు వారాల నుంచి నియామకాలు? కమిటీల నిర్వహణలో యువతకు భాగస్వామ్యం పెదబయలు : మన్యంలో బాక్సైట్ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. పీసా చట్టం అమలుకు ప్రభుత్వం గ్రామసభల ద్వారా కమిటీలు ఏర్పాటు చేస్తుంటే, దానికి దీటుగా ప్రభుత్వ చర్యలను తిప్పికొట్టేందుకు మావోయిస్టులు మన్యంలోని 11 మండలాల్లోనూ బాక్సైట్ వ్యతిరేక కమిటీల ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. మూడు వారాల నుంచి కమిటీల ఏర్పాటు జరుగుతుండగా, గ్రామాల్లో ఉన్న మిలీషియా కమిటీలు, మండలాల్లో దళాలు నూతనంగా ఏర్పడిన బాక్సైట్ వ్యతిరేక కమిటీలకు సూచనలు, సలహాలిస్తూ పని చేస్తుందని సమాచారం. మన్యంలో ఉన్న బాక్సైట్ ఖనిజాన్ని వెలికి తీస్తామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఢంకాపథంగా చెబుతుండంతో ఇప్పటికే గిరిజన సంఘాలు గిరిజనులను ఉద్యమాలకు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఇక్కడ మావోయిస్టుల ఉనికి బలహీన పడిందని ప్రభుత్వం, పోలీసు నిఘావర్గాలు వెల్లడిస్తున్న ఈ తరుణంలో, వారు తమ ఉనికి కోల్పోకుండా గిరిజనులకు మరింతా చేరువయ్యేందుకు తమ వంతుగా బాక్సైట్ ఉద్యమానికి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నూతన కమిటీల ద్వారా గ్రామాల్లో బస చేసి బాక్సైట్ తవ్వకాల వల్ల జరిగే నష్టాలు, ప్రభుత్వ చర్యలను తిప్పికొట్టే వ్యూహంపై కార్యాచరణ ప్రారంభించినట్లు తెలిసింది. దీనికి కీలకంగా యువతపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు భోగట్టా. గ్రామాల్లో ఉన్న యువతను, ముఖ్యంగా మహిళలను ఎక్కువగా ఈ కమిటీల్లో చేర్పి ఉద్యమాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లాలని యోచిస్తున్నట్లు వినికిడి. బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం మన్యంలో ఎక్కడ రోడ్లు వేసినా, ప్రత్యక్ష కార్యాచరణలో భాగంగా వాటిని అడ్డుకోవాలని కమిటీలకు సూచనలు చేస్తున్నట్లు తెలిసింది. -
బాక్సైట్ గభగలు
మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతున్న గిరిజనులు గిరిజన సంఘాల ఆందోళన, రాస్తారోకో ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం అధినేత వైఖరితో టీడీపీలోనూ అంతర్మథనం మన్యంలో బాక్సైట్ వివాదానికి మరోసారి తెరలేపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిపై గిరిజనులు భగ్గుమంటున్నారు. విశాఖ ఏజెన్సీలో ఉన్న అపారమైన ఈ ఖనిజాన్ని ఐటీ డీఏ ఆధ్వర్యంలో వెలికితీయడానికి అనుమతిస్తున్నట్టు శనివారం గిరిజన సదస్సులో ఆయన ప్రకటించడంపై అడవిబిడ్డలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ సంపద జోలికొస్తే ఖబడ్దార్ అంటూ ఏజెన్సీవ్యాప్తంగా మరో బాక్సైట్ వ్యతిరేక ఉద్యమానికి గిరిజనులు సిద్ధమవుతున్నారు. పాడేరు: బాక్సైట్‌ను అక్రమంగా తవ్వి గిరిజనుల ఉనికినే ప్రశ్నార్థకం చేసేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారంటూ ఏజెన్సీలో అన్ని వర్గాల గిరిజనులు విమర్శిస్తున్నారు. గిరిజన చట్టాలు, హక్కులను నిర్వీర్యం చేసి అటవీ సంపదను దోచుకోవడానికి టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు మళ్లీ బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు సమాయత్తమవుతున్నా రు. ఇందుకోసం వివిధ రాజకీయ పక్షాలు, గిరి జన సంఘాల నాయకులు సన్నద్ధమవుతున్నా రు. బాక్సైట్ జోలికి వస్తే ప్రాణాలైనా ఒడ్డి గిరి జ నుల సంపదను కాపాడుతామని ఇప్పటికే వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు హెచ్చరించారు. మరోవైపున బాబు వైఖరితో స్థానిక టీడీపీ నేతలు కూడా సతమతమవుతున్నారు. పదేళ్లుగా బాక్సైట్‌కు వ్యతిరేకంగా ప్రకటనలు జారీ చేసిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించి బాక్సైట్‌ను తవ్వి అభివృద్ధి చేస్తానని ప్రక టించడాన్ని ఆ పార్టీ నేతలే ఖండిస్తున్నారు. ఏజెన్సీలో టీడీపీ ఇప్పటికే మనుగడ కోల్పోయింది. సర్పంచ్, స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని గిరిజనులు తిరస్కరించారు. వారి విశ్వాసాన్ని చూరగొనాల్సిందిపోయి ‘దేశం’ ప్రభుత్వాధినేత గిరిజనుల సంపదనే దోచుకునే విధంగా ప్రకటించడం మన్యం లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏపీ గిరిజ న సంఘం జిల్లా అధ్యక్షుడు కిల్లో సురేం ద్ర ఆధ్వరంయలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించి, వైఎస్సార్ జంక్షన్లో సీఎం చంద్రబాబునాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. మండల కేంద్రం డుం బ్రిగుడలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. పెదబయలులో చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాక్సైట్ జోలికొస్తే తరిమి కొడతామంటూ హెచ్చరించారు. ముంచంగిపుట్టులో వైఎస్సార్ సీపీ నాయకుడు పాంగి పాండురంగస్వామి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. జి.మాడుగుల, చింతపల్లి ప్రాంతాల్లోనూ ఆందోళనలు కొనసాగాయి. గిరిజన సంఘం ఆందోళన ఏజెన్సీలోని బాక్సైట్ జోలికి వస్తే ఖబడ్దా ర్ అంటూ గిరిజన సంఘం, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదివారం పాడేరులో ఆం దోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ముందు గా పాడేరు వీధుల్లో ర్యాలీ నిర్వహించి బాక్సైట్ తవ్వకాల యోచనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఐటీడీఏ ఎదు ట రాస్తారోకో చేపట్టి సీఎం చంద్రబాబు వైఖరిని దుయ్యబట్టారు. బాబును గిరిజ న ద్రోహిగా పేర్కొంటూ దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శ్రీను మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అవహేళన చేశారని విమర్శించారు. పీసా చట్టం ప్రకారం మైనిం గ్‌కు గ్రామ సభల అనుమతి తప్పనిసరి అయినా సీఎం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని, బడాబాబులకు గిరిజన సంపదను దోచి పెట్టేందుకు పూనుకుంటున్నారని మండిపడ్డారు. బాక్సైట్ తవ్వకాల వ్యతిరేక ఉద్యమాన్ని ఏజెన్సీవ్యాప్తంగా ఉధృతం చేస్తామని, అన్ని రా జకీయ పక్షాలు, ప్రజా సంఘాలతో ఐక్యపోరాటం చేస్తామని చెప్పారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పి.అప్పారావు, సీఐటీయూ నేత ఎల్.సుందరరావు, గిరిజన సంఘం నాయకులు రాందాసు, విశ్వనాథం పాల్గొన్నారు. టీడీపీ ఆలోచన దుర్మార్గం బాక్సైట్ తవ్వకాలు చేపడతామని సీఎం ప్రకటించడం అత్యంత దుర్మార్గమని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అన్నారు. దీనికి వ్యతిరేకంగా ఏజెన్సీ అంతటా మహోద్యమం చేపడతామన్నారు. గిరిజనాభివృద్ధిని బాక్సైట్‌తో ముడిపెట్టడం టీడీపీ ద్వంద్వ పాలనకు నిదర్శనమన్నారు. గిరిజనులంతా వైఎస్సార్సీపీ పక్షాన ఉన్నారనే అక్కసుతోనే చర ద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. దీనిని ప్రతి గిరిజనుడు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ అన్ని రాజకీయ పక్షాలు, గిరిజన ఉద్యోగ, విద్యార్థి సంఘాలతో కలిసి ఐక్య ఉద్యమం చేస్తుందన్నారు. అవసరమైతే ప్రాణాలను పణంగా పెట్టి ఢిల్లీస్థాయిలో బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాన్ని చేపడతానని స్పష్టం చేశారు. - సర్వేశ్వరరావు, అరకు ఎమ్మెల్యే -
సిల్వర్ ఓక్.. అక్రమార్కులకదే కేక్!
మన్యంలో వృక్షాలపై కలప వ్యాపారుల కన్ను కాఫీ తోటలకు పొంచివున్న ముప్పు ఐటీడీఏ అడ్డుకట్ట వేయాలని స్థానికుల డిమాండ్ పాడేరు : మన్యంలో దాదాపు 1.40 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలు పచ్చగా విరాజిల్లుతున్నాయంటే దానికి కారణం సిల్వర్ ఓక్ వృక్షాల నీడ. అంతటి ప్రాధాన్యత ఉన్న ఈ వృక్షాలపై అక్రమార్కుల కన్ను పడింది. నిన్నటి వరకూ నీలగిరి వృక్షాలను కూల్చివేసి దండిగా సంపాదించుకున్న కలప వ్యాపారులు ఇప్పుడు సిల్వర్ ఓక్ చెట్లతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఐదేళ్ల క్రితం వరకూ కాఫీ రైతులను మాయచేసి సిల్వర్‌ఓక్ వృక్షాలను విచ్చలవిడిగా నరికివేశారు. ఫలితంగా పాడేరు ప్రాంతంలోని వనుగుపల్లి, లగిసపల్లి, వంజంగి పంచాయతీల పరిధిలో కాఫీ తోటలు నాశనమయ్యాయి. తాత్కాలిక డబ్బు ఆశతో కాఫీ రైతులు సిల్వర్ ఓక్ చెట్లను వ్యాపారులకు అమ్మేసి.. ఏటా ఫలసాయం అందించే కాఫీ తోటలను చేజేతులా నాశనం చేసుకున్నారు. దీంతో అప్రమత్తమైన ఐటీడీఏ అధికారులు... సిల్వర్‌ఓక్ కలప వ్యాపారానికి అడ్డుకట్ట వేశారు. పాడేరు ఘాట్‌తోపాటు పలు చోట్ల ప్రత్యేకంగా చెక్‌పోస్టులను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మళ్లీ కలప వ్యాపారుల కన్ను సిల్వర్ ఓక్ వృక్షాలపై పడింది. వాటిని అమ్మేస్తే మంచి లాభాలు వస్తాయంటూ మళ్లీ గిరిజన కాఫీ రైతులను వలలో వేసుకోవడానికి ఓ అక్రమ కలప ముఠా ప్రయత్నాలు ముమ్మరం చేసిందని సమాచారం. పట్టా భూముల్లోని కాఫీ తోటల్లో ఉన్న సిల్వర్ ఓక్ వృక్షాలను నరికివేయడానికి, ఆ దుంగల రవాణాకు ప్రభుత్వం అనుమతులు ఇస్తుందని గిరిజ నులను నమ్మించడానికి ఆ ముఠా ప్రయత్నిస్తోంది. ఈ కలప అక్రమ వ్యాపారానికి పాడేరు ప్రధాన కేంద్రంగా మారింది. కాఫీ మొక్కలకు నీడనిచ్చే సిల్వర్ ఓక్ చెట్లను రక్షించుకోపోతే గిరిజన రైతులకు దీర్ఘకాలం తీవ్ర నష్టం తప్పదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఐటీడీఏ అధికారులు మరోసారి ఈ కలప అక్రమ వ్యాపారంపై దృష్టి సారించి, అడ్డుకట్ట వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
మన్యం నుంచి మైదానానికి...గంజాయ్
అడ్డుకట్ట లేని వైపరీత్యం కేడీపేట మీదుగా యథేచ్ఛగా రవాణా దొరికితే దొంగ.. లేకపోతే దొర.. అన్న చందంగా గంజాయి రావాణా సాగుతోంది. ఏజెన్సీ ప్రాంతాలకు పరిమితమైన గంజాయి రవాణా ప్రస్తుతం మైదాన ప్రాంతాలకు అంచెలంచెలుగా విస్తరిస్తోంది. చింతపల్లి, జీకేవీధి, సీలేరు, పాడేరు ప్రాంతాల్లో పండించిన గంజాయిని మైదాన ప్రాంతాల గుండా రవాణా జరుగుతోంది. ఒకప్పుడు రోలుగుంట, రావికమతం మీదుగా వెళ్లే గంజాయి ప్రస్తుతం కేడీపేట మీదుగా అధిక సంఖ్యలో జరుగుతోంది. గొలుగొండ: గడచిన 14 నెలల వ్యవధిలో కేడీపేట, గొలుగొండ ప్రాంతాల్లో రూ. 2.64 కోట్లు విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. గంజాయి రవా ణా ఎంత విస్తరిస్తోందనడానికి ఇది స్పష్టమైన నిదర్శనం. ఇది పోలీసులకు చిక్కిం ది మాత్రమే. పోలీసులకు తెలియకుండా మరెన్నో వాహనాలు జిల్లా సరిహద్దులు దాటిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి రవాణాకే కేడీపేట సులువైన మార్గంగా మారింది. రంపుల మీదుగా కేడీపేట చేరుకుంటే గంజాయి వాహ నం గమ్యం చేరినట్టే. ఎందుకంటే కేడీపేట మీదుగా ఏలేశ్వరం, రాజమండ్రి నుంచి ఇతర రాష్ట్రాలకు రవాణా చేయవచ్చు. దీన్ని గమనించిన స్మగ్లర్లు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. చింతపల్లి నుంచి ఏటిగైరంపేట మీదుగా చీడిగుమ్మల చేరుకుంటే గంజాయి స్మగ్లర్లకు పంట పండినట్టే. ఈ మార్గంలో ఎక్కడా చెక్‌పోస్టులు లేకపోవడం గమనార్హం. దీంతో గంజాయి స్మగ్లర్లకు ఇది రాజమార్గంగా మారిపోయింది. పాకలపాడు వద్ద ఏడాది క్రితం 2,800 కిలోలతో రెండు వాహనాలను సీజ్ చేశారు. కేడీపేటలో అధిక సంఖ్యలో పోలీసులే గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఏడాదిలో ఆరు వాహనాలను సీజ్ చేసి వందలాది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేడీపేటలో ఇన్ఫార్మర్ల వ్యవస్థ రంపుల మీదుగా గంజాయి కేడీపేట చేరాలంటే ఫైలట్లు తప్పనిసరి. గంజాయి వాహనానికి ముందు ఈ ఫెలైట్లు లైన్ క్లియర్ చేస్తారు. ఎవరూ లేకపోవడం చూసి వాహనాన్ని గమ్యస్థానానికి చేరుస్తారు. ఇలా గంజాయి రవాణా ఈ ప్రాంతంలో ఎక్కువగా సాగడానికి కేడీపేటలో కొంతమంది స్మగ్లర్లకు చేయూతనిస్తున్నట్టు తెలుస్తోంది. ఎక్కువ సంఖ్యలో ఈ ఏడాది ఈ మార్గంలో వాహనాలు పట్టుకోవడం విశేషం. పోలీసులు నిత్యం తనిఖీలు చేయాలంటే ఈ ప్రాంతం ఏజెన్సీకి ఆనుకుని ఉండడం వల్ల ఇబ్బందులెదురౌతున్నాయి. కేడీపేట పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనమవుతోంది. అదేవిధంగా శుక్రవారం నాడు వాహనాల తనిఖీలో భాగంగా అల్లూరి పార్కు వద్ద కుళ్లిపోయిన పనసకాయల మాటున ఉన్న గంజాయిని పట్టుకున్నారు. భీమవరం చెక్‌పోస్టు వద్ద అటవీశాఖ సిబ్బంది శనివారం తెల్లవారుజామున కూడా గంజాయి తరలిస్తున్న వాహనాలను పట్టుకున్నారు. -
విత్తు లేక విపత్తు
మన్యంలో ‘రాజ్మా’యం విత్తనాల కొరత రెండేళ్లుగా పంపిణీ చేయని ఐటీడీఏ ఈ ఏడాది ప్రతిపాదనలకే పరిమితం పాడేరు: విశాఖ ఏజెన్సీలో ప్రధాన వాణిజ్య పంట అయిన రాజ్మాకు విత్తనాల కొరత ఏర్పడింది. ప్రస్తుత వాతావరణం అనుకూలంగా ఉన్నా విత్తనాలు లేకపోవడంతో గిరిరైతులు దిక్కులు చూస్తున్నారు. విత్తే సమయం ఆసన్నమైనప్పటికీ విత్తనాల పంపిణీకీ ఐటీడీఏ, వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. రెండేళ్ల నుంచీ సబ్సిడీ విత్తనాల్లేవు రెండేళ్ల నుంచి ఐటీడీఏ, వ్యవసాయశాఖ సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేయకపోవడంతో ఏజెన్సీవ్యాప్తంగా రాజ్మా సాగు విస్తీర్ణం కూడా బాగా తగ్గింది. గతేడాది దిగుబడి తక్కువ కావడంతో మంచి ధర పలకడంతో రైతులు వ్యాపారులకు విక్రయించేశారు. కొద్దిమంది మాత్రమే దాచుకున్నారు. వాస్తవానికి ఏజెన్సీ వ్యాప్తంగా మూడు వేల ఎకరాల్లో రాజ్మా సాగవుతున్నట్లు అంచనా. కానీ రెండేళ్ల నుంచి వెయ్యెకరాలు కూడా దాటినట్లు లేదు. ప్రతిపాదనలకే పరిమితం ఈ ఏడాది వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో వెయ్యెకరాల విస్తీర్ణానికి సరిపడా రాజ్మా విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేస్తామని సంబంధిత అధికారులు ప్రకటించడంతో గిరిజన రైతులంతా సంతోష పడ్డారు. అయితే నెల రోజుల నుంచి ప్రతిపాదనలకే పరిమితమైంది. ప్రైవేటు మార్కెట్లో అధిక ధరలు మార్కెట్లో కిలో రాజ్మా విత్తనాలు రూ.80 నుంచి 90 పలకడంతో గిరి రైతులు వెనుకంజ వేస్తున్నారు. గిరిజన సహకార సంస్థ గత ఏడాది పూర్తిస్థాయిలో కొనుగోలు చేయకపోవడంతో ఆ సంస్థ వద్ద కూడా రాజ్మా నిల్వలు లేకపోయాయి. గిరిజన రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే రాజ్మా విత్తనాలనుపంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం ఏజెన్సీలో కనీసం వెయ్యెకరాల్లో రాజ్మా సాగు లక్ష్యంగా విత్తనాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని వ్యవసాయశాఖ జేడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే సబ్సిడీపై వీటిని గిరి రైతులకు పంపిణీ చేస్తామని చెప్పారు. -
నిరుపేద గిరిజనం
పేదరికం గుప్పెట్లో మన్యం ప్రయోగాల పేరుతో నిధులు వృథా ఐటీడీఏకు 38 ఏళ్లు వ్యయం వేలకోట్లు అయినా బాగుపడని ఆదివాసీ బతుకులు విశాఖ ఏజెన్సీలో అభివృద్ధి జాడలు కానరావడం లేదు. గిరిజనుల సంక్షేమం కోసం ఐటీడీఏ ఏర్పడి 38 ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ మారుమూల గూడేల్లోని వారి జీవనంలో మార్పు కానరాదు. రోడ్లు, రక్షిత తాగునీరు, విద్య, వైద్య వంటి మౌలిక వసతులకు దూరంగానే ఉన్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా కేంద్ర ప్రణాళిక సంఘం విడుదల చేసిన ‘పేదరిక సూచిక’దీనికి అద్దం పడుతోంది. రాష్ట్రంలోని116 మండలాల వివరాలు ప్రకటించగా, వాటిలో జిల్లాలోని పెదబయలు మండలం అత్యంత వెనుకబడి ఉండడం విశేషం. తర్వాత స్థానాల్లో జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, హుకుంపేట, డుంబ్రిగుడ, అనంతగిరి మండలాలు ఉన్నాయి. ఇది మన్యంలోని దుస్థితికి తార్కాణంగా నిలుస్తోంది. పాడేరు: ఏజెన్సీ11 మండలాలు పరిధిలోని 3,574 గిరిజన గ్రామాలతోపాటు, సబ్ ప్లాన్ మండలాల్లోని గిరిజనుల సంక్షేమానికి ఐటీడీఏ 1975లో ఏర్పడింది. ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల కోసం రూ. వందల కోట్లు కేటాయిస్తున్నాయి. నాబార్డు, ప్రపంచబ్యాంకుల వంటి ఆర్థిక సంస్థలు కూడా గిరిజనుల కోసం ఎన్నో వినూత్న కార్యక్రమాల అమలుకు భారీగా నిధులు వెచ్చిస్తున్నాయి. కానీ సంపూర్ణ గిరిజనాభివృద్ధి కలగానే మారింది. ఐటీడీఏకు పీవోలుగా వస్తున్న అధికారులు గిరిజనాభివృద్ధికి ప్రయోగాలతో నిధులను వృథా చేయడం తప్పా ఎలాంటి ప్రగతిని సాధించ లేకపోతున్నారు. తొమ్మిదేళ్లుగా ఐటీడీఏకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల కేటాయింపు తగ్గింది. అంతకు ముందు ఐఫాడ్ తదితర నిధులు పుష్కలంగా ఉండేవి. ఏ పీవో ఏ పథకానికి ఎంత ఖర్చు పెట్టారో కూడా అంచనా వేయడానికి కూడా వీలుండేది కాదు. రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం, వ్యవసాయం తదితర ముఖ్యమైన కార్యక్రమాలకు ఇప్పటికి సుమారు రూ. వెయ్యి కోట్లకు పైనే ఖర్చు పెట్టారు. కానీ ఈ రంగాల్లో ప్రగతి కానరాలేదు. సుమారు 1500 గ్రామాల గిరిజనులకు సురక్షిత తాగునీరు కరువైంది. గిరిజనులు తరచూ రోగాల బారిన పడేందుకు కలుషిత నీరే కారణమని అధికారులకు తెలిసినా సమస్య పరిష్కారం కావడం లేదు. మారుమూల ప్రాంతాల రోడ్లు ఇప్పటికి అభివృద్ధికి నోచుకోలేదు. కాలినడకతోనే తెల్లారుతున్న దుస్థితి నెలకొంది. వ్యవసాయరంగానికి రూ. వందల కోట్లు ఖర్చు పెట్టినా వర్షం పడితేనే పంటలు దక్కే పరిస్థితి. సాగునీటి రంగం కూడా అభివృద్ధి చెందలేదు. విద్య, వైద్యరంగాల్లో కూడా నిర్లక్ష్యం కొట్టొస్తోంది. ఇప్పటికి ఐటీడీఏకు వి.వినయ్‌చంద్‌తో కలిసి మొత్తం 49 మంది ప్రాజెక్టు అధికారులు పని చేశారు. కానీ సంపూర్ణ గిరిజనాభివృద్ధి కానరాలేదు. -
రంగురాళ్ల క్వారీలపై వ్యాపారుల కన్ను
మన్యంలో విస్తృత సర్వే పాడేరు: మన్యంలో లభించే విలువైన రంగురాళ్ల క్వారీలపై బడా వ్యాపారులు కన్ను పడింది. ఒడిశా, రాజస్థాన్ సహా జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారులు ప్రస్తుతం మన్యంలో అధికంగా సంచరిస్తున్నారు. గొలుగొండ మండలం కరక, జీకే వీధి మండలం గుర్రాలగొంది క్వారీలను అటవీ, పోలీసు శాఖలు మూసివేసాయి. ఈ రంగురాళ్ల క్వారీల్లో రంగురాళ్ల మట్టి తవ్వకాలపై నిషేధం ఉండటంతో వ్యాపారం నిలిచిపోయింది. ఈ పరిస్థితుల్లో వ్యాపారులంతా కొత్త క్వారీల్లో తవ్వకాలపై దృష్టి సారించారు. చింతపల్లి, జి.మాడుగుల, పాడేరు ప్రాంతాల్లో పలు చోట్ల గతంలో తవ్వకాలు జరిపిన క్వారీల్లో మళ్లీ మట్టి తవ్వకాలకు వ్యాపారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక గిరిజనులతో మంతనాలు జరుపుతున్నారు. విలువైన క్యాట్స్ ఐ రకం రంగురాళ్లు లభించే కొత్త క్వారీలను కూడా వ్యాపారులు అన్వేషిస్తున్నారు. అబ్రకం ఖనిజం జాడలు కనిపించిన భూముల్లో మట్టి తవ్వకాలు జరిపి నమూనాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతం రంగురాళ్ల వ్యాపారులు పాడేరు, జి.మాడుగుల,చింతపల్లి, జీకే వీధి ప్రాంతాల్లో అధికంగా సంచరిస్తున్నారు. నర్సీపట్నం, విశాఖపట్నం కేంద్రాలుగా బడా వ్యాపారులు మకాం వేసి రంగురాళ్ల క్వారీల వేటలో నిమగ్నమయ్యారు. హైదరాబాద్‌లోని పేరొందిన రంగురాళ్ల ముఠా కూడా ఏజెన్సీలోని రంగురాళ్ల సంపదపై కన్నేసింది. గతంలో వారు పాడే రు మండలం మినుములూరు క్వారీలో అక్రమంగా మట్టిని తవ్వించారు. విలువైన రంగురాళ్లు లభించడంతో రాజకీయ అండదండలతో శ్రీలంకకు తరలించి రూ.కోట్లలో వ్యాపారం చేసారు. అప్పట్లో పోలీసుశాఖ కూడా రాజకీయ ఒత్తిళ్లకు గురైందనే ఆరోపణలు వినిపించాయి. వ్యాపారుల మధ్య పోటీతత్వం నెలకొనడంతో చివరికి ఫిర్యాదులు అధికమై పోలీసులు, రెవెన్యూ అధికారులు మినుములూరు క్వారీని రెండేళ్ల కిందట మూసివేసారు. వ్యాపారులు మాత్రం ఈ క్వారీలో తవ్వకాలకు నిరంతరం ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. క్వారీ ఉన్న ప్రాంతం పట్టా భూమి కావడంతో భూమి యజమాని తవ్వకాలకు అనుమతి మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. దీంతో రంగురాళ్ల వ్యాపారులంతా ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలోని కొందరు పెద్దలను కూడా వ్యాపారులు ప్రసన్నం చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. -
మన్యంలో వర్ష బీభత్సం
కుండపోత వర్షాలతో కకావికలం కూలిన విద్యుత్ స్తంభాలు పొంగి ప్రవహిస్తున్న వాగులు పాడేరు, పాడేరు రూరల్: మన్యంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. జోలాపుట్టు జలాశయానికి నీరందించే మత్స్యగెడ్డలో వరద ఉధృతి నెలకొంది. జి.మాడుగులలోని మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో మత్స్యగెడ్డ పొంగి ప్రవహిస్తోంది. దీంతో జి.మాడుగుల, పాడేరు మండలాల్లోని కుంబిడిసింగి, సింధుగుల, సరియపల్లి ప్రాంతాల్లోని పలు గిరిజన గ్రామాలకు రవాణా సంబంధాలు తెగిపోయాయి. బొయితిలి గెడ్డ పొంగి ప్రవహిస్తుండటంతో కిల్లంకోట, ఇంజరి పంచాయతీ గిరిజనులు గెడ్డను దాటేందుకు భయపడుతున్నారు. డుంబ్రిగుడ, పాడేరు మండలాల్లోని సోమవారం ఈదురుగాలులు భీభత్సం సృష్టించాయి. పాడేరు ఘాట్‌లోని చెట్లు, విద్యుత్ స్థంబాలు నేలకూలాయి. ఆదివారం అర్థరాత్రి నుంచే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. హుకుంపేట, పాడేరు, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ మండలాల్లో విద్యుత్ సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంచంగిపుట్టులో 18.8 మిల్లీమీటర్లు, పెదబయలులో 14.6, హుకుంపేటలో 16.8, డుంబ్రిగుడలో 13.2, అరకులోయలో 11.8, అనంతగిరిలో 12.6, పాడేరులో 23.6, జి.మాడుగులలో 26, చింతపల్లి 21, జికేవీధిలో 42.8, కొయ్యూరులో 3.2 మిల్లీమీటర్ల వర్షపాతం సోమవారం నమోదైంది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి ఏజెన్సీలోని మొక్కజొన్నకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముందస్తుగా పంటను సాగు చేసిన ప్రాంతాల్లో మొక్కజొన్న మొక్కలన్నీ నేలవాలాయి. మరో పది రోజుల్లో కోత దశకు చేరుకోనున్న మొక్కజొన్నకు ఈదురుగాలులు భారీ నష్టాన్ని చేకూర్చాయి. నేలకూలిన భారీ వృక్షాలు మినుములూరు అమ్మవారి పాదాలు, పోతురాజు స్వామి గుడి ప్రాంతాల్లో 4 భారీ వృక్షాలు రోడ్డుకు అడ్డంగా నేలకూలడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మినుములూరు విద్యుత్ ఫీడర్‌లోని ఓనూరుకు పోయే లైన్లో 6 విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. కోడిగుడ్లు గ్రామ సమీపంలో కూడా మరో మూడు విద్యుత్ స్థంభాలు నేలకూలాయి. సమాచారం తెలుసుకున్న పాడేరు ఎస్ఐ ధనుంజయ్, కాఫీబోర్డు సిబ్బంది, వాహనాల డ్రయివర్లు చెట్లను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.