మన్యం నుంచి మైదానానికి...గంజాయ్
- అడ్డుకట్ట లేని వైపరీత్యం
- కేడీపేట మీదుగా యథేచ్ఛగా రవాణా
దొరికితే దొంగ.. లేకపోతే దొర.. అన్న చందంగా గంజాయి రావాణా సాగుతోంది. ఏజెన్సీ ప్రాంతాలకు పరిమితమైన గంజాయి రవాణా ప్రస్తుతం మైదాన ప్రాంతాలకు అంచెలంచెలుగా విస్తరిస్తోంది. చింతపల్లి, జీకేవీధి, సీలేరు, పాడేరు ప్రాంతాల్లో పండించిన గంజాయిని మైదాన ప్రాంతాల గుండా రవాణా జరుగుతోంది. ఒకప్పుడు రోలుగుంట, రావికమతం మీదుగా వెళ్లే గంజాయి ప్రస్తుతం కేడీపేట మీదుగా అధిక సంఖ్యలో జరుగుతోంది.
గొలుగొండ: గడచిన 14 నెలల వ్యవధిలో కేడీపేట, గొలుగొండ ప్రాంతాల్లో రూ. 2.64 కోట్లు విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. గంజాయి రవా ణా ఎంత విస్తరిస్తోందనడానికి ఇది స్పష్టమైన నిదర్శనం. ఇది పోలీసులకు చిక్కిం ది మాత్రమే. పోలీసులకు తెలియకుండా మరెన్నో వాహనాలు జిల్లా సరిహద్దులు దాటిపోతున్నాయి.
ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి రవాణాకే కేడీపేట సులువైన మార్గంగా మారింది. రంపుల మీదుగా కేడీపేట చేరుకుంటే గంజాయి వాహ నం గమ్యం చేరినట్టే. ఎందుకంటే కేడీపేట మీదుగా ఏలేశ్వరం, రాజమండ్రి నుంచి ఇతర రాష్ట్రాలకు రవాణా చేయవచ్చు. దీన్ని గమనించిన స్మగ్లర్లు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. చింతపల్లి నుంచి ఏటిగైరంపేట మీదుగా చీడిగుమ్మల చేరుకుంటే గంజాయి స్మగ్లర్లకు పంట పండినట్టే.
ఈ మార్గంలో ఎక్కడా చెక్‌పోస్టులు లేకపోవడం గమనార్హం. దీంతో గంజాయి స్మగ్లర్లకు ఇది రాజమార్గంగా మారిపోయింది. పాకలపాడు వద్ద ఏడాది క్రితం 2,800 కిలోలతో రెండు వాహనాలను సీజ్ చేశారు. కేడీపేటలో అధిక సంఖ్యలో పోలీసులే గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఏడాదిలో ఆరు వాహనాలను సీజ్ చేసి వందలాది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
కేడీపేటలో ఇన్‌ఫార్మర్ల వ్యవస్థ
రంపుల మీదుగా గంజాయి కేడీపేట చేరాలంటే ఫైలట్లు తప్పనిసరి. గంజాయి వాహనానికి ముందు ఈ ఫెలైట్లు లైన్ క్లియర్ చేస్తారు. ఎవరూ లేకపోవడం చూసి వాహనాన్ని గమ్యస్థానానికి చేరుస్తారు. ఇలా గంజాయి రవాణా ఈ ప్రాంతంలో ఎక్కువగా సాగడానికి కేడీపేటలో కొంతమంది స్మగ్లర్లకు చేయూతనిస్తున్నట్టు తెలుస్తోంది. ఎక్కువ సంఖ్యలో ఈ ఏడాది ఈ మార్గంలో వాహనాలు పట్టుకోవడం విశేషం. పోలీసులు నిత్యం తనిఖీలు చేయాలంటే ఈ ప్రాంతం ఏజెన్సీకి ఆనుకుని ఉండడం వల్ల ఇబ్బందులెదురౌతున్నాయి.
కేడీపేట పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనమవుతోంది. అదేవిధంగా శుక్రవారం నాడు వాహనాల తనిఖీలో భాగంగా అల్లూరి పార్కు వద్ద కుళ్లిపోయిన పనసకాయల మాటున ఉన్న గంజాయిని పట్టుకున్నారు. భీమవరం చెక్‌పోస్టు వద్ద అటవీశాఖ సిబ్బంది శనివారం తెల్లవారుజామున కూడా గంజాయి తరలిస్తున్న వాహనాలను పట్టుకున్నారు.