మన్యంలో వర్ష బీభత్సం | Maybe the rain havoc | Sakshi
Sakshi News home page

మన్యంలో వర్ష బీభత్సం

Published Tue, Jul 22 2014 12:38 AM | Last Updated on Sat, Sep 2 2017 10:39 AM

మన్యంలో వర్ష బీభత్సం

మన్యంలో వర్ష బీభత్సం

  •      కుండపోత వర్షాలతో కకావికలం
  •      కూలిన విద్యుత్ స్తంభాలు
  •      పొంగి ప్రవహిస్తున్న వాగులు
  • పాడేరు, పాడేరు రూరల్:  మన్యంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. జోలాపుట్టు జలాశయానికి నీరందించే మత్స్యగెడ్డలో వరద ఉధృతి నెలకొంది. జి.మాడుగులలోని మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో మత్స్యగెడ్డ పొంగి ప్రవహిస్తోంది. దీంతో జి.మాడుగుల, పాడేరు మండలాల్లోని కుంబిడిసింగి, సింధుగుల, సరియపల్లి ప్రాంతాల్లోని పలు గిరిజన గ్రామాలకు రవాణా సంబంధాలు తెగిపోయాయి.

    బొయితిలి గెడ్డ పొంగి ప్రవహిస్తుండటంతో కిల్లంకోట, ఇంజరి పంచాయతీ గిరిజనులు గెడ్డను దాటేందుకు భయపడుతున్నారు. డుంబ్రిగుడ, పాడేరు మండలాల్లోని సోమవారం ఈదురుగాలులు భీభత్సం సృష్టించాయి. పాడేరు ఘాట్‌లోని చెట్లు, విద్యుత్ స్థంబాలు నేలకూలాయి. ఆదివారం అర్థరాత్రి నుంచే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

    హుకుంపేట, పాడేరు, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ మండలాల్లో విద్యుత్ సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంచంగిపుట్టులో 18.8 మిల్లీమీటర్లు, పెదబయలులో 14.6, హుకుంపేటలో 16.8, డుంబ్రిగుడలో 13.2, అరకులోయలో 11.8, అనంతగిరిలో 12.6, పాడేరులో 23.6, జి.మాడుగులలో 26, చింతపల్లి 21, జికేవీధిలో 42.8, కొయ్యూరులో 3.2 మిల్లీమీటర్ల వర్షపాతం సోమవారం నమోదైంది.

    ఈదురుగాలులతో కూడిన వర్షానికి ఏజెన్సీలోని మొక్కజొన్నకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముందస్తుగా పంటను సాగు చేసిన ప్రాంతాల్లో మొక్కజొన్న మొక్కలన్నీ నేలవాలాయి. మరో పది రోజుల్లో కోత దశకు చేరుకోనున్న మొక్కజొన్నకు ఈదురుగాలులు భారీ నష్టాన్ని చేకూర్చాయి.
     
    నేలకూలిన భారీ వృక్షాలు
     
    మినుములూరు అమ్మవారి పాదాలు, పోతురాజు స్వామి గుడి ప్రాంతాల్లో 4 భారీ వృక్షాలు రోడ్డుకు అడ్డంగా నేలకూలడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మినుములూరు విద్యుత్ ఫీడర్‌లోని ఓనూరుకు పోయే లైన్‌లో 6 విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. కోడిగుడ్లు గ్రామ సమీపంలో కూడా మరో మూడు విద్యుత్ స్థంభాలు నేలకూలాయి. సమాచారం తెలుసుకున్న పాడేరు ఎస్‌ఐ ధనుంజయ్, కాఫీబోర్డు సిబ్బంది, వాహనాల డ్రయివర్లు చెట్లను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement