బాక్సైట్ జోలికొస్తే.. బుల్లెట్‌తో బుద్ధి
- మావోయిస్టుల హెచ్చరిక
- కారడవుల్లో భారీ సమావేశం
- పోరుకు రాజకీయ నేతలకు పిలుపు
- పెద్ద ఎత్తున గిరిజనుల హాజరు
- అనేక గ్రామాల్లో గిరిజనుల ర్యాలీలు, నిరసనలు
చింతపల్లిరూరల్: విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాల జోలికి వస్తే ఆయుధాలతో బుద్ధి చెబుతామని గాలికొండ ఏరియా కమిటీ, ఆదివాసీ విప్లవ రైతుకూలీ సంఘం నేతలు హెచ్చరించారు. శనివారం కొయ్యూరు, జీకేవీధి మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలో బాక్సైట్‌కు వ్యతిరేకంగా గిరిజన సంప్రదాయ ఆయుధాలతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. వందలాదిగా తరలి వచ్చిన ఆదివాసీలను ఉద్దేశించి సమావేశంలో విప్లవ నేతలు మాట్లాడారు.
అడవిపై సర్వాధికారాలు ఆదివాసీలకే ఉన్నప్పటికీ అడవుల్లో ఉన్న ఖనిజ సంపదను దోచుకుపోయేందుకు ప్రయత్నం చేపడుతున్న తెలుగుదేశం ప్రభుత్వానికి ఆదివాసీలంతా బుద్ధి చెప్పాలని కోరారు. సంవత్సరాల కాలంగా అడవిలో ఉన్న సంపదను కాపాడుకుంటున్న ఆదివాసీలకు అన్ని రకాలుగా ముప్పు వాటిల్లే ప్రయత్నాన్ని చేపడుతున్న ప్రభుత్వాన్ని గ్రామగ్రామాన ఆదివాసీలంతా ఎదురొడ్డి పోరాటం చేయాలన్నారు.
మన్యం పితూరి సైన్యంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై ఉద్యమాన్ని చేపట్టాలని కోరారు. విలువైన బాక్సైట్‌ను ఏదో ఒకలా తరలించుకుపోయేందుకు ప్రతి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. నిన్న మొన్నటి వరకు తాము బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకమని చెప్పిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ఏవేవో బూటకాలు చెబుతూ ఐటీడీఏ పేరున దొడ్డిదారిన బాక్సైట్ తవ్వకాలను చేపడతామని ప్రకటించిందని మావోయిస్టు నేతలు గుర్తు చేశారు.
ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించడాన్ని బట్టి అడవిలో ఉన్న సంపదపై సామ్రాజ్యవాదులు దృష్టి సారించారని అర్ధమవుతోందని చెప్పారు. బాక్సైట్ తవ్వకాలతో మన్యసీమకు ఎంతో నష్టం వాటిల్లుతుందని చెప్పారు. ఈ తవ్వకాలకు వ్యతిరేకంగా గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్కరు పోరాటం చేయాలని, అన్ని రాజకీయ పక్షాలు చిత్తశుద్ధితో ఉద్యమాలు చేపట్టాలని కోరారు. ఏజెన్సీలో మావోయిస్టు పార్టీని పూర్తిగా నిర్మూలించే విధంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేపడుతోందని విమర్శించారు. ప్రతి ఒక్కరూ ఉద్యమకారులై పోరాడాలని సూచించారు. తుపాకీ తూటాలతోనే నూతన ప్రజాస్వామ్యం ఏర్పాటుకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలన్నారు.
బాక్సైట్ తవ్వకాలకు వచ్చే దొంగలను తరిమి కొట్టేందుకు సంప్రదాయ ఆయుధాలను సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మన్యంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు బాక్సైట్ తవ్వకాల వ్యతిరేక ఉద్యమంలో పాత్ర వహించాలని కోరారు. కొయ్యూరు, జీకేవీధి మండలాల నుంచి ఆదివాసీ గిరిజనులు తమ సాంప్రదాయ కత్తి, గొడ్డలి, విల్లంబులతో ఆడ, మగ తేడా లేకుండా ఈ సమావేశానికిహాజరయ్యారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా మావోయిస్టు నేతలతో కలిసి పెద్ద ఎత్తున ఆదివాసీలు నినాదాలు చేశారు. ఈ నినాదాలతో అటవీ ప్రాంతం దద్దరిల్లింది.