mineral wealth
-
క్వార్డ్జ్ గనుల్లో.. ఘనుల లూటీ!
సాక్షి టాస్క్‌ఫోర్స్: కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా ‘ముఖ్య’ నేత పర్యవేక్షణలో జరుగుతున్న ‘తెల్ల’బోయే లూటీ కథ ఇదీ! పరిశ్రమ ఏర్పాటు ముసుగులో ప్రకృతి సంపదను పిండి చేసే ఘనాపాటీల వ్యూహం దీని వెనుక దాగి ఉంది. ‘ముఖ్య’నేత ఆదేశాలతో స్వయంగా ఆయన కార్యాలయమే రంగంలోకి దిగి ఈ వ్యవహారాలను చక్కబెడుతోంది. ఇక ఈ మైనింగ్ దోపిడీలో అధికారికం.. అనధికారికం అనే తేడాలే లేవు. అనుమతుల పట్టింపే లేదు. గనులు ఎవరివైనా సరే.. ఖనిజాన్ని మాత్రం వారు చెప్పిన ధరకు అప్పగించాల్సిందే. ఇస్తావా..? లేదంటే చస్తావా?.. అంతే!! ఐదేళ్లలో రూ.వేల కోట్లను ఆర్జించే ఎత్తుగడ ఇదీ. రాష్ట్రంలోని క్వార్ట్జ్ (తెల్లరాయి) గనుల్లో నిక్షిప్తమైన అపార ఖనిజ సంపద దోపిడీ కుట్రలు టీడీపీ పెద్దల కనుసన్నల్లో సాగుతుండగా.. నెల్లూరుకు చెందిన ఓ సీనియర్ ప్రజాప్రతినిధిని ముందుపెట్టి ‘ముఖ్య’నేత కార్యాలయం అనునిత్యం దీన్ని పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. సైదాపురం పరిసరాల్లో క్వార్ట్జ్ ఆధారిత పరిశ్రమ ఏర్పాటు ముసుగులో ఈ దందాకు తెర తీశారు. ఇందుకు సీనియర్ ప్రజాప్రతినిధి 50 శాతం పెట్టుబడి పెడితే ఆయనకు వాటాలు దక్కేలా డీల్ కుదిరినట్లు సమాచారం. దీంతో సైదాపురం పరిసర ప్రాంతాల నుంచి నిత్యం రాత్రి పూట వందల లారీల్లో ఖనిజాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. తమకు ముడిసరుకు మొత్తం అప్పగించకుంటే గనుల నుంచి మీ లారీలు వెళ్లలేవని, కేసులు బనాయించి లీజులు రద్దు చేయిస్తామని బెదిరించినట్లు అన్ని అనుమతులున్న గనుల యజమానులు వాపోతున్నారు. తమ మైన్లకు అన్ని అనుమతులు ఉన్నాయని, గత 50 ఏళ్లుగా ‘డెడ్ రెంట్’ సైతం చెల్లిస్తున్నామని, గత ఆర్నెళ్లుగా మైనింగ్‌ను అడ్డుకుని బెదిరింపులకు దిగుతున్నారని పేర్కొంటున్నారు.వేస్ట్ మెటల్‌తో కోట్లు..స్థానిక సీనియర్ ప్రజాప్రతినిధి కీలక అనుచరుడి చేతిలో నాలుగు మైన్లు ఉన్నాయి. సైదాపురం సమీపంలోని శ్రీనివాస పద్మావతి, చాగణం సమీపంలో ఉన్న సిద్ధి వినాయక, తుమ్మలతలుపూరులో ఉన్న జయలక్ష్మి కనకదుర్గా, కలిచేడు సమీపంలో ఉన్న రాఘవేంద్ర గనులు ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఈ గనుల్లో గతంలో ఎందుకు పనికి రాదని గుట్టలు గుట్టలుగా వదిలేసిన వేస్ట్ ఖనిజమే మైకా క్వార్డ్జ్. ఈ ఖనిజానికి ప్రస్తుతం విపరీతమైన డిమాండ్ ఉండడంతో ఆ వేస్ట్ మెటల్‌తోనే కోట్లు ఆర్జించే దందాలో భాగస్వాములయ్యారు.తాజాగా మరో 4 గనులకు..! స్థానిక ప్రజాప్రతినిధి బంధువులు, అనుచరులకు రెండు రోజుల క్రితం మరో నాలుగు గనులకు అనుమతి ఇచ్చారు. ఆయన బంధువుకు రెండు, జోగుపల్లికి చెందిన దళారీకి పొక్కందల సమీపంలో ఒక గని, చాకలికొండ వద్ద ఉన్న మరో గనికి అనుమతి ఇచ్చారు. సైదాపురం మండలంలోని రామసాగరం, చిల్లకూరు మండలంలోని రెట్టపల్లిలో ఉన్న గనికి కూడా అనుమతులు మంజూరు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధికి వ్యతిరేకంగా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు పావులు కదపడంతో తాత్కాలికంగా నిలుపుదల చేశారు.క్వార్ట్జ్ ఆధారిత పరిశ్రమ పేరుతో..సైదాపురం పరిసరాల్లో క్వార్ట్జ్ ఆధారిత పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదన తెరపైకి తెచ్చి మొత్తం మైనింగ్‌పై పెత్తనాన్ని ప్రభుత్వ పెద్దలు స్థానిక సీనియర్ ప్రజాప్రతినిధికి అప్పగించారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల సైదాపురం వ్యవహారంపై ప్రభుత్వ పెద్దలతో చర్చించేందుకు వెళ్లిన ఆయన... ప్రస్తుతం చైనాలో ఉన్న క్వార్ట్జ్ ఆధారిత పరిశ్రమను మన రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేస్తామని ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా 50 శాతం పెట్టుబడి పెడితే వాటాలు ఇచ్చే ఒప్పందంతో సైదాపురం గనులను ఆయనకు అప్పగించారనే ప్రచారం సాగుతోంది. దీంతో క్వార్ట్జ్ మెటల్‌ను వ్యాపారులు ఇకపై ఆయన అనుచరులు నిర్ణయించిన ధరకే ఇచ్చేలా చూడాలని అధికారులకు ఆదేశాలు అందినట్లు చెబుతున్నారు. ‘ముఖ్య’నేత కార్యాలయం నుంచి అధికారులకు ఈమేరకు ఆదేశాలు రావడంతో జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, మరో కీలకనేత దీనిపై మైనింగ్ మంత్రితో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారం అంతా ‘ముఖ్య’నేత కార్యాలయం పర్యవేక్షిస్తోందని, ఇకపై ఎవరూ కూడా ఈ దందా విషయంలో కలగజేసుకోవద్దని మంత్రి కార్యాలయం చేతులెత్తేసినట్లు సమాచారం.మైకా క్వార్ట్జ్ ఖనిజం టన్ను రూ.2 లక్షలు!సైదాపురం మండలంలో దొరికే మైకా క్వార్ట్జ్ ఖనిజం టన్ను రూ.20 వేల నుంచి మొదలై రూ.2 లక్షల వరకు పలుకుతోంది. దీంతో కాలం చెల్లిన గనుల్లో ఉన్న ఈ ఖనిజాన్ని దోచుకునేందుకు, మిగిలిన గనులను సొంతం చేసుకునేందుకు కూటమి నేతలు రాజకీయ పైరవీలు సాగిస్తున్నారు. ఇప్పటికే అనధికారికంగా మైనింగ్ చేస్తున్న కూటమి నేతలు చీకటి పడితే చాలు దండులా వాహనాలతో తెల్లరాయి అక్రమ రవాణా సాగిస్తున్నారు. టన్నుల లెక్కన అనధికారికంగా వసూలు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ముగ్గురు అధికారుల పాత్ర కూడా ఉండడంతో అక్రమ రవాణాకు ఎక్కడా అడ్డు చెప్పడం లేదని తెలుస్తోంది. దీనిపై ముగ్గురు ఎమ్మెల్యేలు, మరో కీలక నేత రగిలిపోతున్నారు. తమ జేబులోకి వచ్చి పడే సొమ్మును లాక్కెళ్లిపోతున్నారని గుర్రుమంటున్నారు.80 గనులు ఓపెన్?– ఖనిజం విలువ రూ.10 వేల కోట్లు..గత ఆర్నెళ్లుగా నిలిచిపోయిన 80 గనులకు రాష్ట్ర గనుల శాఖ నుంచి అనుమతులు మంజూరు చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల గనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రాష్ట్ర అధికారులకు నివేదిక పంపారు. అన్ని గనుల్లో ఉన్న ఖనిజం విలువ రూ.10 వేల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు ప్రభుత్వ పెద్దలకు రహస్య నివేదిక ఇవ్వడంతో కప్పం వసూలుకు సిద్ధమయ్యారు. లీగల్ మైన్లు తాము నిర్దేశించిన వారి చేతికి అప్పగిస్తేనే వాటికి పర్మిషన్లు ఇస్తామంటున్నారు. దీంతో గత 40 – 50 ఏళ్లుగా ‘డెడ్ రెంట్’ కడుతున్న గనుల యజమానులు లబోదిబో అంటున్నారు. ఇంత దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? అని వాపోతున్నారు.నెలకు 30 – 50 వేల టన్నులు..ఈ ప్రాంతంలో దొరికే మైకా క్వార్ట్జ్ ఖనిజాన్ని ప్రతి నెలా 30 వేల నుంచి 50 వేల టన్నులను తవ్వి ఎగుమతులు చేసే అవకాశాలున్నాయి. ప్రభుత్వానికి టన్నుకు కేవలం రూ.230 చొప్పున రాయల్టీ చెల్లించాల్సి ఉంది. నిత్యం సైదాపురం మండలంలో 1,000 టన్నులు, ఇతర ప్రాంతాల్లో మరో 500 టన్నులు దొరికే అవకాశం ఉంది.అధికారిక మైనింగ్‌దారులకు బెదిరింపులుజిల్లాలో మైనింగ్ దందాను చేజిక్కించుకున్న స్థానిక సీనియర్ ప్రజాప్రతినిధి అనుచరులు అధికారికంగా అనుమతులున్న గనులు యజమానులపై బెదిరింపులకు దిగుతున్నారు. అధికారిక గనుల్లో ఉన్న ముడిసరుకును సైతం తమకే ఇవ్వాలని, తాము చెప్పిన ధరకే అప్పగించాలని నెల్లూరులో ఓ చోటా నేత బెదిరింపులకు దిగారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఉన్న కార్యాలయానికి గనుల యజమానులను పిలిపించుకుని తీవ్ర స్థాయిలో హెచ్చరికలకు దిగినట్లు సమాచారం. ముడిసరుకు ఇవ్వకుంటే గనుల నుంచి మీ లారీలు వెళ్లలేవని, పలు రకాల కేసులు నమోదు చేయించి లీజులు రద్దు చేయిస్తామంటూ బెదిరించినట్లు ఓ గని యజమాని వాపోయాడు.రాత్రి వేళ అక్రమ రవాణా..స్థానిక ప్రజాప్రతినిధి అనుచర వర్గం గత రెండు నెలలుగా రాత్రి వేళల్లో సైదాపురం నుంచి అనుమతులు లేకుండా తెల్ల క్వార్ట్జ్ను నిత్యం భారీ స్థాయిలో అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటోంది. మండలంలో 40 గనుల్లో నిల్వలున్న క్వార్ట్జ్ను స్థానిక వ్యాపారులతో మాట్లాడుకుని అక్రమ రవాణా చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మైన్ల పర్మిట్లతో సైదాపురం క్వార్ట్జ్ను చెన్నైకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. స్థానిక వ్యాపారుల నుంచి టన్ను రూ.2 వేల నుంచి రూ.5 వేలు వంతున కొనుగోలు చేసి చెన్నై మార్కెట్లో రూ.50 వేలు వంతున విక్రయిస్తున్నారు. ఇందులో స్థానిక ప్రజాప్రతినిధి కీలకంగా వ్యవహరిస్తుండడంతో రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూసేందుకు సాహసించడం లేదు. నెలవారీ మామూళ్లతో కళ్లకు గంతలు కట్టుకున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.విస్తార గనులు.. అపార సంపద సైదాపురం, పొదలకూరు, చేజర్ల, ఉదయగిరితోపాటు తిరుపతి జిల్లాలోని గూడూరు ప్రాంతాల్లో దొరికే మైకా, మైకా క్వార్ట్జ్, క్వార్ట్జ్, పల్స్పర్, వర్ముఖ్లైట్ ఖనిజాలకు విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. ఇక్కడ ఏడు భూగర్భ గనులు, 130 ఓపెన్ మైనింగ్ క్వారీలు, 26 కాలం చెల్లిన గనులున్నాయి. ఒక్క సైదాపురంలోనే 70 ఓపెన్ క్వారీలు ఉండగా మిగతావి ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిలో మరో వందేళ్ల పాటు మైనింగ్ చేసినా తరగని అపార మైకా క్వార్ట్జ్ నిల్వలు ఉన్నాయి. ప్రధానంగా సైదాపురం మండలంలో దొరికే మైకా క్వార్ట్జ్ ఖనిజానికి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. ఇక్కడ ఖనిజ సంపద అపారంగా ఉండడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ గనులపై కన్నేసింది. ఆర్నెళ్లుగా అన్ని రకాల మైనింగ్ అనుమతులను నిలిపివేసింది. -
కేంద్ర వైద్యుల విరమణ 65 ఏళ్లకు
కేంద్ర కేబినెట్ పచ్చజెండా - ఆరోగ్య నిపుణుల కొరతను అధిగమించేందుకు నిర్ణయం న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య సర్వీసు(సీహెచ్ఎస్)లో ఉన్న వైద్యుల పదవీ విరమణ వయసును 62 నుంచి 65 ఏళ్లకు పెంచడానికి కేంద్ర కేబినెట్ అంగీకరించింది. దేశంలో తీవ్రంగా ఉన్న వైద్య నిపుణుల కొరతను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇది జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను మెరుగ్గా అమలుపరచడానికి, రోగుల సంరక్షణ, వైద్య విద్యా కార్యకలాపాలకూ దోహదం చేస్తుందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. బుధవారమిక్కడ జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీహెచ్‌ఎస్‌లో నాలుగు వేల మంది వైద్యులున్నారు. సీహెచ్ఎస్లోని నాన్-టీచింగ్, ప్రత్యేక ఆరోగ్య నిపుణులు, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ల పదవీ విరమణను 62 ఏళ్ల నుంచి 65 పెంచనున్నట్లు కేంద్రం తెలిపింది. ఆరు ఒప్పందాలకు ఆమోదం హిందూమహా సముద్రంలో భారీగా ఉన్న ఖనిజ సంపదను వెలికితీసేందుకు అంతర్జాతీయ సముద్రగర్భ ప్రాధికార సంస్థ (ఐఎస్ఏ)తో కుదుర్చుకున్న ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. తైవాన్‌తో విమాన సర్వీసులు, సౌదీ అరేబియాతో కుదుర్చుకున్న కార్మిక సహకార ఒప్పందం తదితర మొత్తం 6 ఒప్పందాలకు పచ్చజెండా ఊపింది. -
ఖనిజ సంపదను గుర్తించడంలో జీఎస్ఐ పాత్ర కీలకం
కేంద్ర ఉక్కు, గనుల శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ హైదరాబాద్: దేశంలోని ఖనిజ సంపదను గుర్తించడంలో జీఎస్ఐ పాత్ర కీలకమైనదని కేంద్ర ఉక్కు, గనుల శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అన్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్‌లోని బండ్లగూడ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ)లో జీఎస్ఐ ఎంప్లాయీస్ సంఘ్ అఖిల భారత ప్రథమ సమావేశాలకు ఆయనతో పాటు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేంద్రసింగ్ తోమర్ మాట్లాడుతూ.. జీఎస్ఐ కార్మికులు కష్టపడి పనిచేసి దేశ సంపదను పెంచాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నూతన మైనింగ్ చట్టాలను తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారన్నారు. జీఎస్ఐ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. దేశ ఖనిజ సంపదను ఏ ఒక్కరికీ దారదత్తం చేయబోమని, కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.పీఎఫ్ సమాచారాన్ని ఉద్యోగుల సెల్‌ఫోన్‌కు పంపుతున్నామని తెలిపారు. జీఎస్ఐలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని, వాటిలో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జీఎస్ఐ ఎంప్లాయీస్ సంఘ్ అధ్యక్షుడు ఎం.సుధాకర్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో బీజేపీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, అఖిల భారత బీఎంఎస్ అధ్యక్షుడు బీఎన్.రాయ్, సౌత్‌జోన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సామ బాల్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బీఎంఎస్ అధ్యక్షుడు ఎస్.మల్లేశం, ప్రధాన కార్యదర్శి రవిశంకర్, రాధాకృష్ణన్, ఢిల్లీ బీఎంఎస్ ప్రధాన కార్యదర్శి నరేంద్రపాల్ సింగ్, జీఎస్ఈఈఎస్ చైర్మన్ ఎం.కిషన్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ సింగ్, నాయకులు ఎ.శ్రీనివాస్, యాదయ్య గౌడ్, జైస్వాన్, రసూల్‌ఖాన్, అనిల్‌కుమార్ పాల్గొన్నారు. -
బాక్సైట్ కోసమే కొత్త చట్టం
సీలేరు: ఏజెన్సీలోని రూ.కోట్లు విలువైన ఖనిజ సంపదను తవ్వి తరలించుకుపోయేందుకే ప్రభుత్వం భూసేకరణలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందని రాష్ట్ర పౌరహక్కుల సంఘ ప్రధాన కార్యదర్శి సీహెచ్ చంద్రశేఖర్ అన్నారు. రాష్ట్రపౌరహక్కుల సంఘం సభ్యులు శనివారం బాక్సైట్ ఉన్న జీకేవీధి మండలం సప్పర్ల, గాలికొండ, ఎ.దారకొండ ప్రాంతాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల్లోని గిరిజనులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.బాక్సైట్‌కు వ్యతిరేకంగా ముద్రించిన కరపత్రాలను వారపుసంతలో పంపిణీ చేశారు. భూసేకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖనిజ సంపదను దోచుకోవడానికి వ్యతిరేకంగా ప్రతి గిరిజనుడు పోరాడాలని పిలుపునిచ్చారు. బాక్సైట్ తవ్వకాలతో గిరిజనులకు మరణశాసనమేనని అన్నారు. ఏళ్ల తరబడి ఆదివాసీల ఆధీనంలో ఉన్న భూములను లాక్కోవడానికే కొత్త చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. కోర్టులో కేసు వేసుకునేందుకు వీలు లేకుండా చట్టాన్ని రూపొందించారన్నారు. ఈ పర్యటనలో రాష్ట్ర నాయకులు మనోహర్, సుదర్శన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.చిట్టిబాబు, జాయింట్ సెక్రటరీ నారాయణరావు, నాయకురాలు అన్నపూర్ణ, విశాఖ జిల్లా జోనల్ జాయింట్ సెక్రటరీ జయంత్, సహాయ కార్యదర్శి సూర్యనారాయణ రావు, జిల్లా కోశాధికారి జ్ఞానానందం పాల్గొన్నారు. -
ఖనిజ సంపద దోపిడీ
అక్రమంగా లేటరైట్ తవ్వకాలు కాఫీ తోటలకు నష్టం అడ్డుకున్న గిరిజనులు క్వారీ వద్ద ఆందోళన చింతపల్లిరూరల్ : రాజుపాకల సమీపంలో బినామీ అనుమతులతో చేపట్టిన లేటరైట్ తవ్వకాలను వెంటనే నిలుపుదల చే సి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తు పంచాయతీ ప్రజలు గురువారం క్వారీ వద్ద ఆందోళన నిర్వహించారు. పెదబరడ పంచాయతీ రాజుపాకల జంక్షన్ నుంచి క్వారీ వర కు ర్యాలీ నిర్వహించి క్వారీ ప్రాంతంలో బహిరంగ సమావేశం ఏర్పాటు చేశారు. పంచాయతీ సర్పంచ్ బోయిన సత్యనారాయణ, ఎంపీటీసీ మర్రి సింగారమ్మ, మాజీ ఎంపీపీ ఉల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో సాగిన ఈ కార్యక్రమంలో పంచాయతీలోని రాజుపాకలు, దిగుపాకలు, సిరిపురం, రాజుబంద, చెరపల్లి, నడిగుంట గ్రామాల గిరిజనులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గిరిజన ప్రతినిధులు మాట్లాడుతూ గిరిజనుల పేరిట బినామీ కాంట్రాక్టును చేజిక్కిం చుకుని అటవీ చట్టాలను తుంగలోకి తొక్కి రూ.కోట్లు విలువ చేసే ఖనిజ సంపదను దోచుకుపోతున్నా.. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, అధికారు లు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లేటరైట్ తవ్వకాల ఫలితంగా చుట్టు పక్కల ఉన్న 150 ఎకరాల్లో సాగవుతున్న కాఫీ తోటలు పాడైపోయే అవకాశం ఉందన్నారు. ఏజెన్సీలో చట్టాలను పక్కాగా అమలు చేయాల్సిన అధికారులు ప్రకటనలకే పరిమితమవుతున్నారని వాపోయా రు. ఎన్నిమార్లు ఐటీడీఏ పీవో, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకు వెళ్లినా ప్ర యోజనం లేకుండా పోయిందన్నారు. సబ్ కలెక్టర్ ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వి.సత్యవతి, పీసా కమిటీ ఉపాధ్యక్షులు నూకరాజు, వి.ఆనంద్, జి.అబ్బాయినాయుడు పాల్గొన్నారు. -
ఎంపీ గీత తీరు దారుణం
ఖనిజ సంపద దోపిడీకే టీడీపీలో చేరిక దమ్ముంటే పదవికి రాజీనామా చేయాలి పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్ పాడేరు: గిరిజనులకు మేలు చేస్తుందన్న నమ్మకంతో పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అరకు ఎంపీ సీటును కొత్తపల్లి గీత ఇచ్చారని, గిరిజనులు కూడా నమ్మి ఓట్లు వేస్తే విశ్వాసఘాతకురాలిగా మారడం దారుణమని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి దుయ్యబట్టారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో శనివారం ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. కొత్తపల్లి గీతకు ఆత్మగౌరవం లేదు సరికదా, సంస్కారం కూడా లోపించిందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఈ విధంగా ఆమె పార్టీ మారేవారా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికే గీత అక్రమాలు ఎన్నో వెలుగు చూశాయన్నారు. ఉద్యోగం చేసిన సమయంలో అవినీతి ఆరోపణలు ఉండగా, చివరకు నామినేషన్ దాఖలు విషయంలోనూ ఫోర్జరీ సంతకాలతో రాజ్యాంగంలోని పార్లమెంట్ వ్యవస్థను ఆమె అపహాస్యం చేశారన్నారు. తప్పుడు కులధ్రువీకరణ పత్రంతో ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు అనుభవించిన కొత్తపల్లి గీతపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లకు ఇటీవల ఫిర్యాదు చేశామని విచారణ జరుగుతోందని చెప్పారు. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు ముఖ్యమంత్రి ప్రకటన చేయడంతో ఆ ఖనిజ సంపద దోపిడీలో కొత్తపల్లి గీత భాగస్వామి కావడానికే ఆ పార్టీవైపు మొగ్గుచూపుతున్నారని ఈశ్వరి ఆరోపించారు. ఆస్తులు, వ్యాపారాలు పెంచుకునే లక్ష్యంతోనే అధికార పార్టీలోకి వెళుతున్న పరిస్థితిని గిరిజనులంతా గమనిస్తున్నారని ఆమె తెలిపారు. ఆమెకు నీతి నిజాయతీలుంటే వైఎస్సార్సీపీ భిక్షతో దక్కిన ఎంపీ పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ సర్పంచ్ వర్తన పిన్నయ్యదొర పాల్గొన్నారు. -
బాక్సైట్ జోలికొస్తే.. బుల్లెట్‌తో బుద్ధి
మావోయిస్టుల హెచ్చరిక కారడవుల్లో భారీ సమావేశం పోరుకు రాజకీయ నేతలకు పిలుపు పెద్ద ఎత్తున గిరిజనుల హాజరు అనేక గ్రామాల్లో గిరిజనుల ర్యాలీలు, నిరసనలు చింతపల్లిరూరల్: విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాల జోలికి వస్తే ఆయుధాలతో బుద్ధి చెబుతామని గాలికొండ ఏరియా కమిటీ, ఆదివాసీ విప్లవ రైతుకూలీ సంఘం నేతలు హెచ్చరించారు. శనివారం కొయ్యూరు, జీకేవీధి మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలో బాక్సైట్‌కు వ్యతిరేకంగా గిరిజన సంప్రదాయ ఆయుధాలతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. వందలాదిగా తరలి వచ్చిన ఆదివాసీలను ఉద్దేశించి సమావేశంలో విప్లవ నేతలు మాట్లాడారు. అడవిపై సర్వాధికారాలు ఆదివాసీలకే ఉన్నప్పటికీ అడవుల్లో ఉన్న ఖనిజ సంపదను దోచుకుపోయేందుకు ప్రయత్నం చేపడుతున్న తెలుగుదేశం ప్రభుత్వానికి ఆదివాసీలంతా బుద్ధి చెప్పాలని కోరారు. సంవత్సరాల కాలంగా అడవిలో ఉన్న సంపదను కాపాడుకుంటున్న ఆదివాసీలకు అన్ని రకాలుగా ముప్పు వాటిల్లే ప్రయత్నాన్ని చేపడుతున్న ప్రభుత్వాన్ని గ్రామగ్రామాన ఆదివాసీలంతా ఎదురొడ్డి పోరాటం చేయాలన్నారు. మన్యం పితూరి సైన్యంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై ఉద్యమాన్ని చేపట్టాలని కోరారు. విలువైన బాక్సైట్‌ను ఏదో ఒకలా తరలించుకుపోయేందుకు ప్రతి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. నిన్న మొన్నటి వరకు తాము బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకమని చెప్పిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ఏవేవో బూటకాలు చెబుతూ ఐటీడీఏ పేరున దొడ్డిదారిన బాక్సైట్ తవ్వకాలను చేపడతామని ప్రకటించిందని మావోయిస్టు నేతలు గుర్తు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించడాన్ని బట్టి అడవిలో ఉన్న సంపదపై సామ్రాజ్యవాదులు దృష్టి సారించారని అర్ధమవుతోందని చెప్పారు. బాక్సైట్ తవ్వకాలతో మన్యసీమకు ఎంతో నష్టం వాటిల్లుతుందని చెప్పారు. ఈ తవ్వకాలకు వ్యతిరేకంగా గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్కరు పోరాటం చేయాలని, అన్ని రాజకీయ పక్షాలు చిత్తశుద్ధితో ఉద్యమాలు చేపట్టాలని కోరారు. ఏజెన్సీలో మావోయిస్టు పార్టీని పూర్తిగా నిర్మూలించే విధంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేపడుతోందని విమర్శించారు. ప్రతి ఒక్కరూ ఉద్యమకారులై పోరాడాలని సూచించారు. తుపాకీ తూటాలతోనే నూతన ప్రజాస్వామ్యం ఏర్పాటుకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలన్నారు. బాక్సైట్ తవ్వకాలకు వచ్చే దొంగలను తరిమి కొట్టేందుకు సంప్రదాయ ఆయుధాలను సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మన్యంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు బాక్సైట్ తవ్వకాల వ్యతిరేక ఉద్యమంలో పాత్ర వహించాలని కోరారు. కొయ్యూరు, జీకేవీధి మండలాల నుంచి ఆదివాసీ గిరిజనులు తమ సాంప్రదాయ కత్తి, గొడ్డలి, విల్లంబులతో ఆడ, మగ తేడా లేకుండా ఈ సమావేశానికిహాజరయ్యారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా మావోయిస్టు నేతలతో కలిసి పెద్ద ఎత్తున ఆదివాసీలు నినాదాలు చేశారు. ఈ నినాదాలతో అటవీ ప్రాంతం దద్దరిల్లింది. -
బాక్సైట్ సభ ఆటంకానికి యత్నం
జర్రెలలో బహిరంగ సభ ప్రభుత్వం తీరుపై గిరిజనుల ఆందోళన పెద్ద ఎత్తున మోహరించిన బలగాలు పోలీసులతో నేతల వాగ్వాదం జీకేవీధి: బాక్సైట్‌కు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ, పలు పార్టీల ప్రజా ప్రతినిధులు ఆదివారం మండలంలోని జర్రెలలో చేపట్టిన సభకు గిరిజనులు హాజరుకాకుండా పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సభ నిర్వహించకుండా విఫలయత్నం చేశారు. ఉదయం 8 గంటల నుంచేఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున మోహరించారు. చింతపల్లి మీదుగా జర్రెల వెళ్ళే రహదారిలో చౌడుపల్లి వద్ద తనిఖీలు చేపట్టారు. మన్యంలోని విలువైన ఖనిజ సంపదను కాపాడుకునే ప్రయత్నంలో మారుమూల జర్రెల, మొండిగెడ్డ, వంచుల పంచాయతీల పరిధిలోని వివిధ గ్రామాల గిరిజనులు ఈ సభకు హాజరు కావాలి. పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తారోనన్న భయంతో అనేక గ్రామాల గిరిజనులు రాలేకపోయారు. ముందుగానే ఈ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ మారుమూల గ్రామాల గిరిజనులు పెద్ద సంఖ్యలో హాజరై తమ నిరసన వ్యక్తం చేశారు. సభ జరుగుతుండగా ఓ గిరిజనుడ్ని అదుపులోకి తీసుకోవడంతో ప్రజా ప్రతినిధులు. పోలీసుల మధ్య సుమారు 2 గంటలపాటు వాగ్వాదం చోటుచేసుకుంది. సమావేశంలో వివిధపార్టీల నాయకులు మాట్లాడుతుండగా గునుకురాయికి చెందిన సూకూరు చిన్నారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై గతంలో కేసులు ఉన్నాయని అందుకే తమ వెంట తీసుకు వెళుతున్నామని చెప్పడంతో అక్కడున్నవారంతా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రజా ప్రతినిధులంతా పట్టుబట్టడంతోఎట్టకేలకు పోలీసులు అతడ్ని విడిచి పెట్టారు.