- ఖనిజ సంపద దోపిడీకే టీడీపీలో చేరిక
- దమ్ముంటే పదవికి రాజీనామా చేయాలి
- పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్
పాడేరు: గిరిజనులకు మేలు చేస్తుందన్న నమ్మకంతో పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అరకు ఎంపీ సీటును కొత్తపల్లి గీత ఇచ్చారని, గిరిజనులు కూడా నమ్మి ఓట్లు వేస్తే విశ్వాసఘాతకురాలిగా మారడం దారుణమని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి దుయ్యబట్టారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో శనివారం ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు.
కొత్తపల్లి గీతకు ఆత్మగౌరవం లేదు సరికదా, సంస్కారం కూడా లోపించిందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఈ విధంగా ఆమె పార్టీ మారేవారా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికే గీత అక్రమాలు ఎన్నో వెలుగు చూశాయన్నారు. ఉద్యోగం చేసిన సమయంలో అవినీతి ఆరోపణలు ఉండగా, చివరకు నామినేషన్ దాఖలు విషయంలోనూ ఫోర్జరీ సంతకాలతో రాజ్యాంగంలోని పార్లమెంట్ వ్యవస్థను ఆమె అపహాస్యం చేశారన్నారు.
తప్పుడు కులధ్రువీకరణ పత్రంతో ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు అనుభవించిన కొత్తపల్లి గీతపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌లకు ఇటీవల ఫిర్యాదు చేశామని విచారణ జరుగుతోందని చెప్పారు. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు ముఖ్యమంత్రి ప్రకటన చేయడంతో ఆ ఖనిజ సంపద దోపిడీలో కొత్తపల్లి గీత భాగస్వామి కావడానికే ఆ పార్టీవైపు మొగ్గుచూపుతున్నారని ఈశ్వరి ఆరోపించారు.
ఆస్తులు, వ్యాపారాలు పెంచుకునే లక్ష్యంతోనే అధికార పార్టీలోకి వెళుతున్న పరిస్థితిని గిరిజనులంతా గమనిస్తున్నారని ఆమె తెలిపారు. ఆమెకు నీతి నిజాయతీలుంటే వైఎస్సార్‌సీపీ భిక్షతో దక్కిన ఎంపీ పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ సర్పంచ్ వర్తన పిన్నయ్యదొర పాల్గొన్నారు.