గీతపై ఫిర్యాదు ప్రివిలేజెస్ కమిటీకి
ప్రాథమిక విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని స్పీకర్ సూచన
సాక్షి, న్యూఢిల్లీ: అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై వచ్చిన పార్టీ ఫిరాయింపు ఫిర్యాదును లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రివిలేజెస్ కమిటీకి పంపారు. కొత్తపల్లి గీత వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచి ఆంధ్రప్రదేశ్‌లోని అధికార టీడీపీలో చేరారని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి గత ఏడాది లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూలులో పొందుపరిచిన నిబంధనల మేరకు కొత్తపల్లి గీతపై అనర్హత వేటు వేయాలని కోరారు.
ఈ నేపథ్యంలో స్పీకర్ కొత్తపల్లి గీతను∙వివరణ కోరారు. ఆమె పంపిన వివరణపై తిరిగి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రతిస్పందన కోరారు. ఈ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో జూలై 4న ఈ అంశాన్ని లోక్‌సభ సభ్యుల (ఫిరాయింపును అనుసరించి అనర్హత) నిబంధనలు–1985లోని 7(4) నిబంధన కింద స్పీకర్ ప్రివిలేజెస్ కమిటీకి పంపుతూ ప్రాథమిక విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సూచించారు.