‘హోదా’ కోసం పోరాడితే బందిపోట్లా?
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అభ్యంతరం
సభా హక్కుల కమిటీ ముందు వాదనలు
సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఎమ్మెల్యేలను బందిపోట్లతో పోలుస్తారా? టీడీపీ వైఖరి ఇదేనా?’’ అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సభా హక్కుల(ప్రివిలేజెస్) కమిటీ ముందు అభ్యంతరం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో ఏపీ శాసనసభలో జరిగిన సంఘటనలపై గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన ఏర్పాటైన ప్రివిలేజెస్ కమిటీ ముందు గురువారం భాస్కర్‌రెడ్డి హాజరై తన వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ (కమిటీ సభ్యుడు) చేసిన వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం తెలిపారు. ‘‘కొందరు బందిపోట్లు ఒక గ్రామాన్ని దోపిడీ చేసిన తరువాత.. ఇలా ఎందుకు చేశారని ఎవరైనా ప్రశ్నిస్తే రాష్ట్ర ప్రజల మేలు కోసం దోపిడీ చేశాం అన్నట్లుగా ఉంది మీరంతా (వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు) అసెంబ్లీలో వ్యవహరించిన తీరు’’ అని శ్రావణ్ వ్యాఖ్యానించగా చెవిరెడ్డి తీవ్ర నిరసన తెలిపారు.
రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న తమను బందిపోట్లు అని ఎలా అంటారని చెవిరెడ్డి ప్రశ్నించారు.మరో సభ్యుడు కురుగొండ్ల రామకృష్ణ.. భాస్కర్‌రెడ్డికి అడ్డుతగులుతూ ‘‘మీరంతా తప్పు చేసి కమిటీ ముందుకు వస్తున్నారు’’ అని అన్నారు. ‘‘మీరు ముందుగానే మేము తప్పు చేశామనే నిర్ణయానికి వచ్చినపుడు ఇక నేనెందుకు వాదనలు వినిపించాలి. ఇక మేం ఏం చెప్పినా ప్రయోజనం ఏముంటుంది’’ అంటూ ఈ విచారణను తాను వాకౌట్ చేస్తున్నానని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రకటించారు. అర్ధంతరంగా బయటకు వచ్చేశారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
ఏ తప్పూ చేయలేదు: కొడాలి నాని
శాసనసభ సమావేశాల్లో తానెలాంటి తప్పూ చేయలేదని, తనపై చర్య తీసుకోవడానికి వీల్లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని స్పష్టం చేశారు. ఆయన గురువారం సభా హక్కుల కమిటీ ముందు హాజరై తన వాదన వినిపించారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
ముగిసిన ప్రివిలేజెస్ కమిటీ విచారణ
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో చోటు చేసుకున్న సంఘటనలపై ఏర్పాటైన ప్రివిలేజెస్ కమిటీ తన విచారణను గురువారం పూర్తి చేసింది. తమ నివేదికను జనవరి మొదటి వారంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు సమర్పించనున్నట్లు కమిటీ చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు వెల్లడించారు.విచారణ ముగిశాక సూర్యారావు మీడియాతో మాట్లాడారు. విచారణ పూర్తయినట్లేనని వెల్లడించారు. ఇంకెవరనీ పిలవాల్సిన అవసరం లేదన్నారు.