Cevireddi Bhaskar Reddy
-
‘హోదా’ కోసం పోరాడితే బందిపోట్లా?
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అభ్యంతరం సభా హక్కుల కమిటీ ముందు వాదనలు సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఎమ్మెల్యేలను బందిపోట్లతో పోలుస్తారా? టీడీపీ వైఖరి ఇదేనా?’’ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సభా హక్కుల(ప్రివిలేజెస్) కమిటీ ముందు అభ్యంతరం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో ఏపీ శాసనసభలో జరిగిన సంఘటనలపై గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన ఏర్పాటైన ప్రివిలేజెస్ కమిటీ ముందు గురువారం భాస్కర్‌రెడ్డి హాజరై తన వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ (కమిటీ సభ్యుడు) చేసిన వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం తెలిపారు. ‘‘కొందరు బందిపోట్లు ఒక గ్రామాన్ని దోపిడీ చేసిన తరువాత.. ఇలా ఎందుకు చేశారని ఎవరైనా ప్రశ్నిస్తే రాష్ట్ర ప్రజల మేలు కోసం దోపిడీ చేశాం అన్నట్లుగా ఉంది మీరంతా (వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు) అసెంబ్లీలో వ్యవహరించిన తీరు’’ అని శ్రావణ్ వ్యాఖ్యానించగా చెవిరెడ్డి తీవ్ర నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న తమను బందిపోట్లు అని ఎలా అంటారని చెవిరెడ్డి ప్రశ్నించారు.మరో సభ్యుడు కురుగొండ్ల రామకృష్ణ.. భాస్కర్‌రెడ్డికి అడ్డుతగులుతూ ‘‘మీరంతా తప్పు చేసి కమిటీ ముందుకు వస్తున్నారు’’ అని అన్నారు. ‘‘మీరు ముందుగానే మేము తప్పు చేశామనే నిర్ణయానికి వచ్చినపుడు ఇక నేనెందుకు వాదనలు వినిపించాలి. ఇక మేం ఏం చెప్పినా ప్రయోజనం ఏముంటుంది’’ అంటూ ఈ విచారణను తాను వాకౌట్ చేస్తున్నానని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రకటించారు. అర్ధంతరంగా బయటకు వచ్చేశారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఏ తప్పూ చేయలేదు: కొడాలి నాని శాసనసభ సమావేశాల్లో తానెలాంటి తప్పూ చేయలేదని, తనపై చర్య తీసుకోవడానికి వీల్లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని స్పష్టం చేశారు. ఆయన గురువారం సభా హక్కుల కమిటీ ముందు హాజరై తన వాదన వినిపించారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ముగిసిన ప్రివిలేజెస్ కమిటీ విచారణ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో చోటు చేసుకున్న సంఘటనలపై ఏర్పాటైన ప్రివిలేజెస్ కమిటీ తన విచారణను గురువారం పూర్తి చేసింది. తమ నివేదికను జనవరి మొదటి వారంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు సమర్పించనున్నట్లు కమిటీ చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు వెల్లడించారు.విచారణ ముగిశాక సూర్యారావు మీడియాతో మాట్లాడారు. విచారణ పూర్తయినట్లేనని వెల్లడించారు. ఇంకెవరనీ పిలవాల్సిన అవసరం లేదన్నారు. -
సీఏలు దేశాభివృద్ధికి తోడ్పడాలి
సీఏల ముగింపు సదస్సులో రాష్ట్ర ఎన్నికల అధికారి రమేశ్‌కుమార్ తిరుపతి: చార్టర్డ్ అకౌంటెంట్లు దేశాభివృద్దికి తోడ్పడాలని రాష్ట్ర ఎన్నికల అధికారి ఎన్.రమేశ్‌కుమార్ పేర్కొన్నారు. సమాజంలో నిరంతర మార్పులు అవసరమని చెప్పారు. బుధవారం తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీ మైదానంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ఆధ్వర్యంలో జరిగిన సదరన్ ఇండియా రీజనల్ కౌన్సిల్ (ఎస్‌ఐఆర్‌సీ) 48వ వార్షిక సదస్సు ముగింపు సమా వేశంలో ఆయన మాట్లాడారు. దక్షిణభారత దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన 2,500 మంది సీఏలు హాజరయ్యారు. రమేశ్‌కుమార్ మాట్లాడుతూ సీఏ వృత్తి ఎంతో గొప్పదని, ప్రతి వ్యక్తి, సంస్థ ఆడిటర్ల సలహాలను తీసుకొని వ్యక్తిగతం గానూ అభివృద్ది సాధించాలని సూచించా రు. ఐసీఏఐ చైర్మన్ ఎం.దేవరాజారెడ్డి మాట్లాడుతూ సీఏ కోర్సు నిర్వహణలో అనేక మార్పులు తెస్తున్నామని, కొత్త సిలబస్ అందుబాటులోకి తెస్తున్నామని, దీని వల్ల సీఏ కోర్సుకు అంతర్జాతీయ స్థారుులో గుర్తింపు లభిస్తుందన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రసంగిస్తూ దేశంలో పెద్దనోట్ల రద్దువల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కార్యక్రమంలో ఐసీఏఐ వైస్ చైర్మన్ నీలేశ్ శివ్జీ వికమ్‌సే, ఐస్ఐఆర్సీ చైర్మన్ ఫల్గుణకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
తిరుమలలోనూ మీ వ్యాపారాలా..?
ఏపీ సీఎంపై వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెవిరెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: చేతిలో అధికారం ఉంది కదా అని కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి వెలసిన తిరుమలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన వ్యాపార ప్రయోజనాలకు వాడుకోవడం తగదని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. బాబు సొంత సంస్థ ‘హెరిటేజ్’ ఉత్పత్తులను దేవదేవుని సన్నిధి తిరుమలలో అమ్ముకోవడానికి టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ ఆగమేఘాలపై ఎలా అనుమతులిచ్చిందని ప్రశ్నించారు. -
శ్రీవారి వైభవాన్ని వెలుగులోకి తెచ్చిన ‘సాధు’
యూనివర్సిటీక్యాంపస్: టీటీడీలో పని చేసి, అన్నమయ్య సంకీర్తనలను వెలుగులోకి తెచ్చిన పండితులు, పరిశోధకులు సాధు సుబ్రమణ్యశాస్త్రి సేవలను టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కొనియాడారు. సాధు సుబ్రమణ్యం శాస్త్రి 30వ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక శ్వేత భవనం ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా కరుణాకరరెడ్డి మాట్లాడుతూ సాధు సుబ్రమణ్యం శాస్త్రి తమిళనాడు ప్రాంతానికి చెందినవారని, 1920-30 సంవత్సరాల మధ్య డెప్యుటేషన్‌పై శ్రీవారి ఆలయ ఇన్స్పెక్టర్గా వచ్చారన్నారు. ఈ సమయంలో ఆయన శ్రీవారిపై అన్నమయ్య రాసిన సంకీర్తనల రాగిరేకులను వెలుగులోకి తెచ్చి పరిశోధనలు చేశారన్నారు. అన్నమయ్య కీర్తనల్లోని భక్తితత్వాన్ని, శ్రీవారి వైభవాన్ని అందరికీ తెలిసేలా చేయడంలో ఆయన కృషి ఎంతో ఉందన్నారు. సాధు సుబ్రమణ్య శాస్త్రి ఎంతో మేధావి అయినప్పటికీ ఆయన్ను ఎవరు గుర్తించలేదని తెలిపారు. ఆయన తన చివరి రోజుల్లో తిరుపతి వీధుల్లో దుర్భర జీవితం గడిపారన్నారు. తాను టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో ఆయన చేసిన కృషిని గుర్తించి శ్వేత భవనం ఎదుట విగ్రహాన్ని ఏర్పాటు చేశానని చెప్పారు. ఆ సమయంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి టీటీడీ బోర్డు సభ్యులుగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు హర్ష, రామస్వామి వెంకటేశు, దుద్దేల బాబు, కట్టా గోపియాదవ్, మోహన్, బొమ్మగుంట రవి, గౌరి, చాను పాల్గొన్నారు. -
యువకుల్లో ఆధ్యాత్మిక చైతన్యం
ఉచితంగా వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెవిరెడ్డి ప్రయత్నం అద్భుతం కరుణాకర రెడ్డి ప్రశంస తిరుపతి : ‘‘తనకున్న భక్తిని పదిమందికి పంచుతూ గ్రామాల్లో మరింతగా ఆధ్యాత్మిక విలువలు పెంపొందించేదుకు నా తమ్ముడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చేపట్టిన వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమం అద్భుతమైంది’’ అని తిరుపతి మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని ప్రతి ఏడాది ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలోని గ్రామాలకు ఉచితంగా వినాయక విగ్రహాలను అందిస్తుంటారు. ఇందులో భాగంగా బుధవారం చేపట్టిన వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని భూమన కరుణాకరరెడ్డి పూజచేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకుల్లో ఆధ్యాత్మిక చైతన్యం, ఐక్యతను పెంచేందుకు చెవిరెడ్డి చేపట్టిన ఉచిత విగ్రహాల పంపిణీ కార్యక్రమం చాలా మంచిదని కొనియాడారు. గ్రామాల్లో విలువలు, ఆధ్యాత్మిక చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం వినాయక విగ్రహాల పంపిణీ ద్వారా చేస్తున్నారన్నారు. ప్రతి ఏడాదీ కొనసాగుతుంది : చెవిరెడ్డి యువకులు ఐకమత్యంగా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితిని పురస్కరించుకుని ప్రతి ఏడాదీ వినాయక విగ్రహాలను ఉచితంగా అందిస్తానని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. గత ఏడాది 680 విగ్రహాలు ఇచ్చానన్నారు. ఈ ఏడాది విగ్రహాలకు రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగిందన్నారు. యువకుల్లో ఆధ్యాత్మిక చైతన్యం పెంచేందుకోసం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానన్నారు. కష్టపడేతత్వం, ఆధ్యాత్మిక లక్షణాలు ఉంటే ఏధైనా సాధించవచ్చన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల గ్రామాలకు 20 లక్షల రూపాయల ఖర్చుతో 720 విగ్రహాలు ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉపేంద్రరెడ్డి, కొటాల చంద్రశేఖర్‌రెడ్డి, పొట్టేలు మునస్వామి, చిన్నీయాదవ్, శ్రీరాములు, నంగా బాబురెడ్డి, భాను పాల్గొన్నారు. -
టీటీడీ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటానా?
దెక్కడి చోద్యం.. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసిన చెవిరెడ్డి తిరుపతి : అసెంబ్లీ సమావేశాలు వేదికగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి టీటీడీ నిర్వహణలోని కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీశారు. మేనేజ్మెంట్ కోటా అమలు చేస్తుం డడం వల్ల మెరిట్ విద్యార్థులు, రిజర్వేషన్ కోటా విద్యార్థులు అవకాశాలు కోల్పోతున్నారని ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు. మేనేజ్మెంట్ కోటాలో 52 శాతం మార్కులు వచ్చిన వారు సీట్లు పొందుతుంటే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 81 శాతం మార్కులు పొందినా సీట్లు దక్కడం లేదని అన్నారు. ఓసీ మెరిట్ కోటాలో 87 శాతం వద్ద అడ్మిషన్లు ఆగిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా లేనపుడు ప్రభుత్వ అనుబంధ సంస్థగా ఉన్న టీటీడీలో ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. కొందరు టీటీడీ అధికారులు తమ పరపతి పెంచుకోవడానికి, పైరవీలు చేసుకోవడానికి మేనేజ్మెంట్ కోటాను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. మేనేజ్మెంట్ కోటా కింద టీటీడీ కళాశాలల్లో అడ్మిషన్లు పొందుతున్న కొందరు విద్యార్థులు ఉచిత బస, భోజన సౌకర్యాలు పొంది తరగతులకు సరిగా వెళ్లకుండా సొంత వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని అర్హతలు ఉండి అడ్మిషన్లు పొందలేకపోతున్న మెరిట్ విద్యార్థులకు, రిజర్వేషన్ కోటా విద్యార్థులకు ఏ రకంగా న్యాయం చేస్తారని ఆయన ప్రశ్నించారు. టీటీడీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ సరిగా అమలు కావడం లేదన్నారు. నివేదికలు తెప్పిస్తాం సభలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి లేవనెత్తిన అంశంపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు సమాధానం ఇస్తూ టీటీడీలో ఇలా జరుగుతున్నట్లు తమ దృష్టికి రాలేదన్నారు. నివేదికలు తె ప్పించుకుని తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
కార్మికులకు వైఎస్ఆర్ సీపీ అండ
తిరుపతి: ఆర్టీసీ కార్మికులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఆర్టీసీ వైఎస్ఆర్ మజ్దూర్ యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం తిరుపతి కోటకొమ్మల వీధిలోని వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో జరిగింది. యూనియన్ రాష్ర్ట ప్రధానకార్యదర్శి టీఎస్ఎస్.ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు స్వార్థ ప్రయోజనాలకు పరిమితమైన నేపథ్యంలో వైఎస్ఆర్ మజ్దూర్ యూనియన్ నిస్వార్థంగా కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ఆ స్ఫూర్తిని కొనసాగించి ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సైనికుల్లా పోరాడి రాజకీయాలు, యూనియన్లకు అతీతంగా ఆందరి మన్ననలు చూరగొనాలన్నారు. సమస్యల పరిష్కారం వైఎస్ఆర్ మజ్దూర్ యూనియన్ ద్వారా మాత్రమే సాధ్యం అవుతుందన్న నమ్మకాన్ని కార్మికుల్లో కల్పించాలని కోరారు. అందుకు తమవంతు సహకారం ఉంటుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి డిపోలో వైఎస్ఆర్ మజ్దూర్ యూనియన్ పతాకాలు రెపరెపలాడే రోజులు వస్తాయన్నారు. యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదన్న నిరాశ, నిస్పృహలను విడనాడాలని కోరారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి లాంటి పోరాట పటిమ గల నాయకులు పార్టీలో ఉన్నారని వారి నాయకత్వంలో సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేయాలన్నారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి ప్రసంగిస్తూ రాష్ట్రంలో ఉన్న 70 వేల మంది ఆర్టీసీ కార్మికులు చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదన్నారు. గతంలో చంద్రబాబు పాలనలో ఆర్టీసీ సంస్థ రూ.5600 కోట్ల నష్టాల్లో కూరుకు పోయినపుడు గట్టెక్కించి సంస్థను కాపాడిన ఘనత వైఎస్ఆర్దేనని చెప్పారు. అందుకు కృతజ్ఞతగా తాము పదవులు త్యజించి ఆ మహానేత పేరుమీద యూనియన్ ఏర్పాటు చేసుకున్నామన్నారు. పార్టీ అండదండలతో ఆర్టీసీలో అతిపెద్ద యూనియన్‌గా ఆవిర్భవించడం తథ్యమన్నారు. సమావేశంలో యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీవీఎస్ రెడ్డి, లతారెడ్డి, వి.రవి, జిల్లా రీజనల్ కార్యదర్శి పీసీ.బాబు, వివిధ డిపోల అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పాలగిరి ప్రతాప్‌రెడ్డిని కార్మికులు ఘనంగా సన్మానించారు. -
టీడీపీ మంత్రులది దిగజారుడుతనం
ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తిరుపతి రూరల్ : చిత్తూరు జిల్లాలో నాలుగైదు అసెంబ్లీ సీట్లు ఎర్రచంద్రనం డబ్బుతోనే వైఎస్సార్సీపీ గెలిచిందనడం టీడీపీ మంత్రుల దిగజారుడుతనానికి నిదర్శనమని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. అదే చిత్తూరు జిల్లాలో టీడీపీ గెలిచిన 6 సీట్లు ఎర్రచందనం డబ్బుతోనే గెలిచారా అంటూ మండిపడ్డారు. రాష్ట్ర మంత్రి దేవినేని ఉమ ఆదివారం వైఎస్ఆర్ సీపీ నేతలపై చేసిన వ్యాఖ్యలపై చెవిరెడ్డి స్పందించారు. తుమ్మలగుంటలోని తన స్వగృహంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘చిత్తూరు నగరానికి చెందిన ఎర్రచందనం స్మగ్లర్, టీడీపీ నేత బుల్లెట్ సురేష్ పీడీ యాక్ట్ కేసులో అరెస్టు అయ్యారు. చిత్తూరు కార్పొరేషన్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో బుల్లెట్ సురేష్ అందించిన డబ్బుతోనే గెలిచారా ? చంద్రబాబు, సీఎం రమేష్ అనుచరులు రెడ్డి నారాయణ, మహేష్ నాయుడు ఎర్రచందనం కేసులో అరెస్టు అయ్యారు. అప్పుడు రెడ్డి నారాయణ, మహేష్‌నాయుడుల ఎర్రచందనం స్మగ్లింగ్ దందాతో చంద్రబాబు, సీఎం రమేష్‌కు సంబంధం ఉందని అనుకోవాలా ? దేవినేని ఉమా సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. పాలన చేతగాక, ఏం చేయాలో తెలియక ప్రతిపక్ష నేతలపై తప్పుడు ఆరోపణలు చేయడం టీడీపీ నేతలు మానుకోవాలని హితవు పలికారు. అధికార పార్టీకి ప్రజలే ప్రతిపక్షం అయ్యేరోజులు ఎంతో దూరం లేవన్నారు. అధికారంలో ఉన్నవాళ్లు ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాలే తప్ప ప్రతిపక్షంపై నిరాధార అరోపణలు చేయడం మంచిది కాదన్నారు. 9 ఏళ్ల బాబు పాలనలో లక్ష మంది రైతులపై కేసులు పెట్టించిన ఘనత బాబుకే దక్కుతుందన్నారు. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ చంద్రబాబుకు మోసం చేయడం తప్ప ప్రజలకు మంచిచేసే గుణం లేదన్నారు. ఎస్‌ఎల్‌ఎల్బీసీ లెక్కల ప్రకారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఏటా 60 నుంచి 70 శాతం మంది రైతులు రుణాలు తీసుకున్నారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఖరీఫ్‌లో ఏ ఒక్క రైతుకూ ఒక్క రూపాయి కూడా రుణం ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ఖరీఫ్ సీజన్లో ఒక్క రూపాయి కూడా రుణం ఇవ్వని ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే దేశ చరిత్రలో చంద్రబాబు ప్రభుత్వమేనన్నారు. చంద్రబాబు చేసిన రుణ మాఫీ ఓ బూటకమన్నారు. బాబు తొలి సంతకమే ఓ మాయ అని విమర్శించారు. రుణ మాఫీపై ఇప్పటికీ తలాతోకలేని లేని ప్రకటన చేసి తమ్ముళ్ల చేత బలవంతంగా సంబరాలు చేయించడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. అడ్డగోలు రాష్ట్ర విభజనకు చంద్రబాబు కారణమన్నారు. రెండుకళ్ల సిద్ధాంతంతో చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశారన్నారు. ఆ పాపమే ఇప్పుడు ప్రజల పాలిట శాపంగా మారిందన్నారు. టీడీపీలో 420లను పెట్టుకుని ప్రతిపక్షంపై బురద చల్లడం బాధాకరమన్నారు. దెయ్యాలే వేదాలు వల్లించినట్టు చంద్రబాబు, టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ నేతలపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారన్నారు. -
నాటా సభల్లో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
తిరుపతి : అట్లాంటాలో నిర్వహించిన నాటా(నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్) మొదటి, ద్వితీయ సభల్లో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘మొదటి, ద్వితీయ సభలకు నన్ను ఆహ్వానించినందుకు కార్యవర్గ సభ్యుకు ధన్యవాదాలు. మీ అందరి ఆశీస్సులు, అభిమానం వల్లే నేను ఎమ్మెల్యేగా గెలుపొందాను. భారత సంస్కృతి సంప్రదాయాలను చాటుతూ.. తెలుగుదనం ఉట్టిపడేలా.. ప్రపంచంలోని తెలుగు వారంతా ఒక్కటే అని చాటుతూ నిర్వహించిన సభలు విజయవంతంగా జరిగాయి’’ అని కొనియాడారు. ఈ సభల్లో వివిధ రంగాల ప్రముఖులు, కళాకారులు పాల్గొన్నారు. -
కలసికట్టుగా పనిచేద్దాం
ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదాం అధికారులకు ఎమ్మెల్యే పిలుపు తిరుచానూరు : ప్రజల అభివృద్ధి కోసం అందరం కలసికట్టుగా పనిచేద్దామని, రాష్ట్రంలో చంద్రగిరి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదామని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అధికారులకు పిలుపునిచ్చారు. చంద్రగిరి నియోజకవర్గంలోని 6 మండలాలకు సంబంధించిన వివిధ శాఖల అధికారులతో(ఎంపీడీవోలు మినహా) పరిచయ కార్యక్రమాన్ని బుధవారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో శిల్పారామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్ధేశించి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడారు. ప్రజాప్రతినిధిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే కసి, పట్టుదల తనలో ఉన్నాయన్నారు. ఆ సంకల్పంతోనే మంచి కార్యక్రమాలు, మేలైన కార్యక్రమాలను ప్రజలకు అందించేందుకు తాను ఎప్పటికీ ముందుంటానన్నారు. అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరవేయడంలో కీలకపాత్రఅధికారులదేనన్నారు. అధికారులు-ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వయం లేకుంటే అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు. గతంలో జెడ్పీటీసీ సభ్యుడిగా, తుడా చైర్మన్‌గా, టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఎందరో ఐఏఎస్, ఇతర అధికారులతో కలిసి పనిచేశానన్నారు. తాను ఎప్పుడూ ఏ అధికారితోనూ నిబంధనలకు విరుద్ధంగా పనిచేయించలేదన్నారు. తుడా చైర్మన్‌గా దీర్ఘకాలంగా 3 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి తానేనని, పదవీకాలం ముగిసే రోజున ప్రజలు, అన్ని పార్టీల నాయకులతో పత్రికా ప్రతినిధుల సమక్షంలో ప్రజావేదిక ఏ ర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా నిబంధనలకు విరుద్ధంగా అధికారులతో పనిచేయించుకోనని, అధికారులు సైతం ఏ వ్యక్తికో, రాజకీయ పార్టీకో తలొగ్గి పనిచేయకూడదని పిలుపునిచ్చారు. తన మాట కఠినంగా, వ్యవహారశైలి ఆవేశంగా ఉంటుందే తప్ప వ్యక్తిగతంగా తాను కర్మసిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తినని, పాపభీతి కలిగిన వాడినని అన్నారు. తాను పల్లెలో పుట్టి పెరిగానని, పల్లె కష్టాలు తనకు తెలుసన్నారు. చదువుకునే సమయంలో మెటల్ రోడ్డులో కాలికి చెప్పులు లేకుండా కాలినడకన పాఠశాలకు వెళ్లిన క్షణాలను గుర్తుకు తెచ్చుకున్నారు. అప్పుడు కష్టపడి చదవడంతోనే అధికారులైన మీరు, తాను ప్రస్తుతం ఈ స్థానంలో ఉన్నామని గుర్తు చేశారు. పైరవీలతో తాను ఈస్థాయికి ఎదగలేదన్నారు. తనపై నమ్మకం ఉంచి నియోజకవర్గ ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించారని స్పష్టం చేశారు. ప్రస్తుతం గ్రామాలు అభివృద్ధి సాధించినా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని తీర్చేందుకు అందరం కలసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. దీనికి స్పందించిన అధికారులు ఇదివరకు భాస్కర్‌రెడ్డి అంటే ఒకలా ఆలోచించామని, ఇప్పుడు మీతో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రజాభివృద్ధికి కలసి పనిచేస్తామని ఎమ్మెల్యేకు భరోసా ఇచ్చారు. -
బాబూ.. ఎందుకీ కక్ష!
వైఎస్సార్సీపీపై చంద్రబాబు కక్ష సాధింపు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపణ సాక్షి, విశాఖపట్నం : చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీని ప్రతిపక్షంగా చూడకుండా.. శత్రువుగా చూస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని చంద్రగిరి ఎమ్మెల్యే, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన నగరంలోని వీజేఎఫ్ వినోదవేదికలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్ సీపీని ఏదోలా తొక్కేయాలన్న చంద్రబాబు కుట్రలు ఫలించవన్నారు. చిత్తూరు జిల్లాలోని జీడి నెల్లూరుకు చెందిన వైఎస్సార్ సీపీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు విజయానందరెడ్డిని ఎర్రచందనం కేసులో అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు పంపడం కక్ష సాధింపు చర్యగా పేర్కొన్నారు. ఎన్నికల ముందు వరకు ఎలాంటి కేసులూ ఆయనపై లేవని, ఇప్పుడు అకస్మాత్తుగా పీడీ చట్టం ప్రయోగించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కడపజిల్లాలో ఎర్రచందనం కేసులో ఉన్న రెడ్డి నారాయణకు జెడ్పీటీసీ, పీడీ చట్టం నమోదైన మహేష్‌నాయుడుకు సుండుపల్లి మండలం ఎంపీటీసీ స్థానానికి టీడీపీ బి-ఫారం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో చంద్రబాబు నాయుడుకు కూడా ఎర్రచందనం కేసులో భాగస్వామ్యమున్నట్టేనా? అని ప్రశ్నించారు. తానెప్పుడూ తప్పుడు దారిలో ఎదగాలనుకోలేదని, అలాంటివారికి సహకరించిందీ లేదని స్పష్టం చేశారు. విజయానందరెడ్డిపై ఆరోపణలు రుజువైతే ఉరి శిక్ష వేసినా తాము మద్దతిస్తామన్నారు. ఎర్రచందనం అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని వైఎస్సార్ సీపీ తరపున డిమాండ్ చేశారు. -
ప్రజల నమ్మకం..దేవుని ఆశీస్సులు గెలిపించాయి
కాలి నడకన తిరుమల వెళ్లిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తిరుపతి రూరల్, న్యూస్‌లైన్: ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకం.. దేవుని ఆశీస్సులే తనను గెలిపించాయని చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ తరపున విజ యం సాధించిన డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందితే కాలినడకన తిరుమలకు వచ్చి తలనీలాలు సమర్పిస్తానని శ్రీవారి చెంత గతంలో చెవిరెడ్డి మొక్కుకున్నారు. శుక్రవారం జరిగిన కౌంటింగ్‌లో చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో శ్రీవారికి మొక్కులు తీర్చుకునేందుకు శనివారం సాయంత్రం అలిపిరి పాదాల నుంచి కాలినడక మార్గా న తిరుమలకు వెళ్లారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూప్రజలు తన నాయకత్వంపై నమ్మకంతో గెలిపించారని ఆనందం వ్యక్తం చేశారు. తనను ఆదరించిన ఓటరు దేవుళ్లకు కృతజ్ఞతలు చెప్పా రు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం శక్తివంచన లేకుండా పోరాటం చేస్తానన్నారు. తన గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానన్నారు. ఆదరించిన నియోజకవర్గ ప్రజలు గర్వపడేలా నడుచుకుంటానని చెప్పారు. ఒకటి రెండు చోట్ల కార్యకర్తల్లో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకుని అందర్నీ కలుపుకుని వెళతానన్నారు. కులమతాలకు అతీతంగా అందరి సహకారంతో కలిసికట్టుగా నియోజకవర్గాన్ని ముందుకు నడిపిస్తానన్నారు. ఎక్కడా తనకు వ్యక్తిగతంగా, రాజకీయంగా శత్రువులు లేరన్నా రు. అందరి సహకారంతో గెలిచిన తనకు నియోజకవర్గ ప్రజలందరూ సమానమేనని ఆయన పేర్కొన్నా రు. అనంతరం శ్రీవారి పాదాలకు నమస్కరించి నడకను ప్రారంభించారు. దారి పొడవునా వెలసిన దేవతామూర్తుల ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయనతో పాటు కుటుం బ సభ్యులు, బంధువులు, వైఎస్సార్ సీపీ నాయకులు శ్రీవారి దర్శనానికి వెళ్లారు. -
గల్లా అవినీతి డబ్బును కరిగించండి
అవకాశ రాజకీయవాదులను తరిమికొట్టండి స్థానికుడైన నాకు ఒక్క అవవాశం ఇవ్వండి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చంద్రగిరి, న్యూస్‌లైన్: గల్లా అరుణకుమారి అక్రమంగా సంపాదించిన అవినీతి డబ్బుతో ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తోందని, ఆ అవినీతి డబ్బును ప్రజలే కరిగించాలని ప్రజలకు వైఎస్ఆర్ సీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రగిరి మండలం అగరాల పంచాయతీలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. అగరాల, ఐతేపల్లె, ముంగిలిపట్టు, కల్రోడ్డుపల్లెల్లో టీటీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన దాదాపు 1500 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ గల్లా అరుణకుమారి మన ఓట్లతో గెలిచి ప్రభుత్వ భూములు, చెరువులు, ఫారెస్ట్ భూములు, రైతుల పొలాలు, రోడ్లు, కాలువలను సైతం ఆక్రమించి ఫ్యాక్టరీలు పెట్టిందని గుర్తుచేశారు. కబ్జాలతో కోట్లు సంపాదించిన గల్లా ఆ డబ్బు ఎరచూపి ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. నియోజకవర్గంలో ఒక్క ఓవర్ బ్రిడ్జి లేకపోయినా కరకంబాడిలో ఫ్యాక్టరీ కోసం రూ.35 కోట్ల ప్రజాధనంతో ఫ్లైవోవర్ బ్రిడ్జి నిర్మించుకున్నారని మండిపడ్డారు. గల్లాను 3 పర్యాయాలు గెలిపిస్తే ప్రజల సమస్యలను విస్మరించి అక్రమంగా ఆస్తులను సంపాదించుకునేందుకే ప్రాధాన్యం ఇచ్చారన్నారు. స్థానికుడైన తనకు ఒక్క అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా తాను తుడా చైర్మన్‌గా గ్రామాలను ఉన్నతంగా అభివృద్ధి చేశానని చెప్పారు. ఓట్ల కోసం రాకముందే రూ.75 కోట్లతో సీసీ రోడ్లు, వైఎస్ఆర్ మహిళా భవనాలు నిర్మించానని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హేమేంద్రకుమార్‌రెడ్డి, మాజీ ఎంపీపీ వేణుగోపాల్‌రెడ్డి, మండల పార్టీ కన్వీనర్ కొటాల చంద్రశేఖర్‌రెడ్డి, నరసింగాపురం సింగిల్ విండో చైర్మన్ మల్లం చంద్రమౌళిరెడ్డి, ఏవీ రమణమూర్తి, ఐతేపల్లె సర్పంచ్ ఏసీ.శేఖర్, దేవారెడ్డి, భాస్కర్‌రెడ్డి, కోటీశ్వర్‌రెడ్డి, మస్తాన్, అగరాల సర్పంచ్ సుభాన్, ఉప సర్పంచ్ మదన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో టీఎన్ఎస్ఎఫ్ మాజీ అధ్యక్షుడు యశ్వంత్ చౌదరి, హేమాంబరనాయుడు, దేవరాజులనాయుడు, మాజీ సర్పంచ్ రవి, లాజర్, జయచంద్ర, దీనదయాల్ నాయుడు, రాజేంద్రనాయుడు, కల్రోడ్డు పల్లె ఉపసర్పంచ్ షణ్ముగం, టి. జయచంద్రారెడ్డి, టి. కృష్ణారెడ్డి, టి.రెడ్డెప్పరెడ్డి, పెద్ద ఎల్లప్పరెడ్డి, ఓ.జయచంద్రాశెట్టి, సుబ్రమణ్యంశెట్టి, మణికంఠ, సోమశేఖర్‌రెడ్డి, ఓ.యుగంధర్ తదితరులు ఉన్నారు. -
అధికారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే
త్వరలోనే కష్టాలన్నీ తీరుతాయి వైఎస్సార్ సీపీలోకి టీడీపీ నాయకులు సాయినగర్‌లో పార్టీ కార్యాలయం ప్రారంభం తిరుచానూరు, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో అధికారంలోకి రానున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే అని, వైఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అన్ని వర్గాల ప్రజల కష్టాలు తీరుతాయని ఆ పార్టీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి రూరల్ సాయినగర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ డీవీ.రమణ నూతనంగా ఏర్పాటుచేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సోమవారం చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజన్న పాలనలో ప్రజలందరూ సుఖం గా జీవించారని, ఆయన మరణానంతరం కాంగ్రెస్ పార్టీ నాయకుల పాలన మరోమారు తొమ్మిదేళ్ల టీడీపీ చీకటి పాలనను గుర్తుకు తెచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీ రెండూ ప్రజలను మోసం చేశాయన్నా రు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఆ రెండు పార్టీల నాయకులు ప్రజాసంక్షేమాన్ని విస్మరించారని మండిపడ్డారు. ఆరేళ్ల వైఎస్సార్ పాలనలో రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్‌గా వెలిగిందని కొనియాడారు. తిరిగి రాష్ట్రంలో రాజన్న రాజ్యాన్ని జగ నన్న స్థాపించనున్నారని, త్వరలోనే మనందరి కష్టాలు తీరుతాయని హామీ ఇచ్చారు. విశ్వసనీయతకు మారుపేరైన జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి మనమందరం సీలింగ్ ఫ్యాను గుర్తుకు ఓటేద్దామని పిలుపునిచ్చారు. అలాగే సాయినగర్ 1, 2, 3వ సెగ్మెంట్ల ఎంపీటీసీ అభ్యర్థులు టి.బుజ్జమ్మ, పద్మావతి, డీవీ.రమణ, జెడ్పీటీసీ అభ్యర్థి తలారి ఆనందమ్మను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. డీవీ.రమణ మాట్లాడు తూ ప్రజల సమస్యలపై సత్వరమే స్పందించే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుని తుమ్మల గుంట తరహాలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుం దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు చెవిరెడ్డి హనుమంతరెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, చెన్నారెడ్డి, శ్రీరాములురెడ్డి, లక్ష్మయ్య, చిన్నబ్బ, సుధాకర్‌రెడ్డి, నారాయణ, బాలాజీ, సత్య పాల్గొన్నారు. పార్టీలో చేరిన టీడీపీ నాయకులు స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం భారీ ఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. డీవీ.రమణ ఆధ్వర్యంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సమక్షంలో గ్రామ ఉపసర్పంచ్ ఉషారాణి, సావిత్రమ్మ, జగ్గయ్య, మంజులమ్మ, మునికృష్ణ, గాజుల భాస్కర్, నరసింహులు, కన్నయ్య, పెంచలయ్య, జీ.వెంకటేష్, షణ్ముగంఆచారి, కృష్ణమాచారితో పాటు దాదాపు 300మంది పార్టీలో చేరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు తామందరం కృషి చేస్తామని వారు చెప్పారు. -
నిరసన..ఉద్రిక్తత
తిరుపతిలో జైరాంరమేష్కుపరాభవం చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అరెస్ట్ తిరుపతి రూరల్, న్యూస్‌లైన్: రేణిగుంట ఎయిర్‌పోర్టు వద్ద బుధవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేంద్ర మంత్రి జైరాంరమేష్ విభజనకు కారకుడంటూ ఆయనను అడ్డుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నాయకత్వంలో సుమారు ఐదు వందల మంది మంత్రి కాన్వాయ్‌ను తిరుపతికి వెళ్లనివ్వకుండా అడుగడుగునా అడ్డుపడ్డారు.దాంతో భారీగా పోలీసులు మోహరించారు. పోలీసులను లెక్కచేయకుండా కార్యకర్తలు మంత్రిని ముప్పుతిప్పలు పెట్టారు. చేసేది లేక వచ్చిన దారినే మంత్రి తిరిగి ఎయిర్‌పోర్టుకు చేరుకుని సుమారు గంటన్నర వెయిట్ చేశారు. మంత్రి మధ్యాహ్నం 1.40 గంటలకు తిరుపతి ఎయిర్‌పోర్టులో దిగారు. అప్పటికే రేణిగుంట రమణావిలాస్ వద్ద కాపుకాచిన వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నాయకత్వంలో అడ్డగించేందుకు సిద్ధమయ్యారు. పోలీస్ అధికారులు రోప్ పార్టీని రంగంలోకి దించారు. అనేక మంది మహిళా కార్యకర్తలు పోలీసులను నెట్టుకుంటూ మంత్రి కారువైపు పరుగులు తీశారు. దీంతో ఖంగుతిన్న మంత్రి నాలుగు వందల మీటర్ల దూరం నుంచే వెంటనే కాన్వాయ్‌ను వెనక్కితిప్పి తిరిగి తిరుచానూరు రోడ్డు మీదుగా వెళ్లాలని చూశారు. కానీ రామకృష్ణాపురం కూడలి వద్ద వాహనాలను పెట్టి అడ్డుకున్నారు. దాంతో మంత్రి తిరిగి ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. సమైక్యవాదులు మంత్రిని నగరంలోకి అడుగుపెట్టనివ్వకపోవడంతో మంత్రి ముఖం చిన్నబోయింది. ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్లిన మంత్రికి భోజన ఏర్పాట్లు చేశారు. భోజనానంతరం సుమారు గంటన్నరపాటు మంత్రి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాలే దు. తిరుపతి పార్లమెంటు సభ్యులు చింతామోహన్ తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖర్‌బాబుకు ఫోన్ చేసి మంత్రికి జరిగిన పరాభవం గురించి వివరించారు. దీంతో పోలీసులు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగారు. మంత్రి రేణిగుంట చెక్‌పోస్టు వద్ద నుంచి తిరిగి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారనే విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఎయిర్పోర్ట్ మెయిన్‌గేట్ ఎదుట బైఠాయించారు. సుమారు గంట పాటు ధర్నా చేశారు. బయటకు వస్తే అడ్డుకుని తమ నిరసన తెలపాలని రోడ్డును 50 వాహనాలతో బ్లాక్ చేశారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న కార్లను పోలీసులు చేతులతో ముందువైపు టైర్లు పెకైత్తి రోడ్డు పక్కకు నెట్టారు. అనంతరం చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు ధర్నా చేస్తున్న ముఖ్య నాయకులు కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని పోలీస్ వాహనంలో తీసుకుపోయేందుకు ప్రయత్నించగా మహిళా కార్యకర్తలు అడ్డుకున్నారు. కార్యకర్తలపై కళ్లెర్రజేసి పోలీస్ జులుం ప్రదర్శించారు. లాఠీచార్జ్ చేశారు. మహిళలని కూడా చూడకుండా నెట్టివేశారు. ముఖ్యులు అనుకున్న వారందరినీ అరెస్ట్ చేశారు. చెవిరెడ్డిని విడుదల చెయ్యాలంటూ మహిళలు, మరింత మంది పార్టీ నాయకులు బీడు భూముల్లో పరుగులు పెట్టి అరెస్టు చేసి తీసుకెళుతున్న వాహనాలను అడ్డగించారు. పోలీసులు వారిని వెంబడించడంతో గందరగోళం నెల కొంది. పొలాలన్నీ ఆందోళనా కారులు, పోలీసులతో నిండిపోయాయి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ఎస్సీసెల్ కన్వీనర్ దామినేటి కేశవులు, సింగం గోవిందరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ మెంబర్ గుణశేఖర్‌నాయుడు, నంగాబాబురెడ్డి, చంద్రగిరి మండల కన్వీనర్ కొటాల చంద్రశేఖర్‌రెడ్డి, పాకాల మండల కన్వీనర్ చెన్నకేశరెడ్డి, చిన్నియాదవ్, రుద్రగోపి, చిల్లకూరి యుగంధర్‌రెడ్డి, కోటేశ్వర్‌రెడ్డి, మణిరెడ్డి, భాను, నెన్నూరుగిరి, పుష్పకాంత్రెడ్డి, అశోక్, నవీనమ్మ, నారాయణరెడ్డి, ఫరూక్, ఆనందభాస్కర్‌రెడ్డి, మస్తాన్ పాల్గొన్నారు. డొంకరోడ్లలో మంత్రి కాన్వాయ్ విమానాశ్రయంలో ఉన్న మంత్రి జైరాంరమేష్ ఆందోళనకారులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారని తెలుసుకున్న తరువాత బయలుదేరారు. కాన్వాయ్ వెళ్లిన రోడ్డులో మంత్రి వెళ్లలేదు. ప్రభుత్వం ఇచ్చిన కారు కాకుండా ఎంపీ చింతామోహన్ ఏర్పాటు చేసిన ఇన్నోవా కారులో సంతగేట్ వద్ద నుంచి పాత రేణిగుంట రోడ్డు ద్వారా నగరంలోకి వచ్చారు. ఈ రోడ్డు పూర్తిగా డొంకరోడ్డుగా ఉంది. ఈ రోడ్డు ద్వారా మంత్రి వస్తుండడంతో స్థానికులంతా వింతగా చూశారు. అర్బన్ ఎస్పీ రాజశేఖర్‌బాబు పెలైట్ కారులాగా ముందు వెళుతుండగా మంత్రి కారు దీనిని ఫాలో అయింది. కేంద్ర మంత్రి ఈ దారిలో వస్తున్నారనే విషయం ట్రాఫిక్ పోలీస్‌లకు కూడా తెలియకపోవడంతో సాధారణ వాహనాలు రోడ్డుపైకి రావడంతో అక్కడక్కడ కాన్వాయ్కి బ్రేకులు పడ్డాయి. సాధారణంగా వీవీఐపీలు బైపాస్ రోడ్డు మీదుగా మెడిక ల్ కాలేజీకి చేరుకుంటారు. కానీ మంత్రిని పోలీ సులు తుడారోడ్డు, మున్సిపల్ ఆఫీస్ సర్కిల్, అన్నారావు సర్కిల్ మీదుగా మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. దీనికి కారణం అడ్డుకుంటారనే భయం. విలేకరుల సమావేశం గంటన్నర... మంత్రి మెడికల్ కాలేజీకి చేరుకున్న తరువాత విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో సుమారు గంట న్నర సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. ప్రెస్‌మీట్ జరుగుతుండగా నలుగురు టీడీపీ కార్యకర్తలు రెండు కార్లలో వచ్చి రెండు టీడీపీ జెండాలు చూపించి సమైక్యాంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. వారి ని పోలీసులు అరెస్ట్ చేయడంతో పోలీసు లు డౌన్‌డౌన్ అంటూ నినదించారు. ఫలించిన వైఎస్ఆర్ సీపీ వ్యూహం కేంద్ర మంత్రి జైరాం రమేష్‌కు తీవ్ర నిరసన తెలపాలని వైఎస్ఆర్ సీపీ వారు రూపొందించిన వ్యూహం ఫలించింది. ఎలాగైనా మంత్రిని అడ్డుకోవాలని, నిరసన తెలపాలనే విషయంలో సక్సెస్ అయ్యారు. అంతా అయోమయం.. గందరగోళం జైరాం రమేష్ తిరుపతికి వచ్చే విషయాన్ని గోప్యంగా ఉంచారు. కేంద్ర మంత్రిని అడ్డుకుంటారని ఎవ్వరూ ఊహించలేదు. చెవిరెడ్డి ఆందోళనను పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పసిగట్టలేక పోయారు. ఒక్కసారిగా ఆందోళనకారులు రోడ్డుపైకి దూకడంతో పోలీసులు, కాంగ్రెస్‌పార్టీ నాయకులు అయోమయానికి గురయ్యారు. ఊహిం చని ఈ పరిణామంతో ముఖ్యంగా పోలీసులకు ముచ్చెమటలు పట్టిం చాయి. ఎంపీ చింతా మోహన్‌పై జైరాం మండిపడ్డట్టు సమాచారం. ఆందోళనాకారులను అడ్డుకోలేకపోయారేం... ఆమాత్రం సమాచారం సేకరించలేరా అని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కాంగ్రెస్ పార్టీలోని ఓ నాయకుడు చెప్పారు. -
సమైక్య జోరు..నిరసనల హోరు
=రెండో రోజూ మిన్నంటిన ఆందోళనలు =పలమనేరులో ఒంటికాలిపై దీక్షలు =చంద్రగిరిలో రైలుపట్టాలపై వంటావార్పు =చెవిరెడ్డి అరెస్ట్ సాక్షి, తిరుపతి: రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రెండవ రోజైన శనివారమూ రాస్తారోకోలు, నిరసనలు మిన్నంటాయి. తిరుపతి శివారులోని తుమ్మలగుంట ప్రాంతంలో మధ్యాహ్నం ఒంటి గంటకు వైఎస్ఆర్సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత రైలుపట్టాలపై వంటావార్పూ చేపట్టారు. పోలీసులు అక్కడకు చేరుకుని చెవిరెడ్డితో పాటు పార్టీ నాయకులు గోవిందరెడ్డి, దామినేడు కేశవులు, మరో ఆరుగురిని అరెస్ట్ చేసి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నాయకత్వంలో తుడా కార్యాలయ సర్కిల్ వద్ద రిలే నిరాహారదీక్ష చేపట్టారు. చంద్రగిరి క్లాక్‌టవర్ వద్ద పార్టీ నాయకులు కొటాల చంద్రశేఖర్‌రెడ్డి, చెల్లకూరి యుగంధర్రెడ్డిల నాయకత్వంలో ఆకులు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి నాయకత్వంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. పార్టీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం ఆధ్వర్యంలో నారాయణవనంలో ధర్నా నిర్వహించారు. నాగలాపురంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. పార్టీ మండల కన్వీనర్ నరేంద్రరెడ్డి గంగమ్మకు పూజలు నిర్వహించి, సోనియా గాంధీకి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు. పార్టీ చిత్తూరు జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, నియోజకవర్గ సమన్వయకర్త ఏఎస్.మనోహర్ వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దుకాణాలు మూయించి, బైక్ ర్యాలీ చేపట్టారు. జిల్లా కార్యాలయాలనూ మూయిం చి, గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం, ఎస్ఆర్పురం, కార్వేటినగరం, పాలసముద్రం మండలాల కన్వీనర్లు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి సూచన మేరకు పట్టణంలో రాస్తారోకో, బంద్ చేపట్టారు. పార్టీ నాయకులు రేవంత్కుమార్రెడ్డి, బాలాజీనాయుడుల నాయకత్వంలో జాతీయ రహదారిపై ఒంటికాలితో నిరసన వ్యక్తం చేశారు. వి.కోటలో పార్టీ నాయకులు సురేష్, అరుణ్కుమార్రెడ్డిల నాయకత్వంలో మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. మదనపల్లెలో ఎమ్మెల్సీ దేశాయితిప్పారెడ్డి ఎంబీటీ రోడ్డును దిగ్బంధించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త షమీమ్‌అస్లాం పాఠశాలలు మూయించి, ర్యాలీ చేపట్టారు. మైనారిటీ నాయకుడు పీఎస్.ఖాన్ ఎన్టీఆర్ సర్కిల్లో ధర్నా నిర్వహించారు. పార్టీ కుప్పం నియోజకవర్గ సమన్వకర్త సుబ్రమణ్యం రెడ్డి ఆధ్వర్యలో నిరసనలు చేపట్టారు. నగరి నియోజకవర్గం పుత్తూరు మండలంలోని తడుకు వద్ద సర్పంచ్‌లు సుశీలమ్మ, సుధాకరయ్య రాస్తారోకో చేపట్టారు. నిండ్ర షుగర్ ఫ్యాక్టరీ వద్ద జాతీయ రహదారిపై పార్టీ నాయకుడు శ్యామ్‌లాల్ నాయకత్వంలో రాస్తారోకో నిర్వహించారు. నగరిలో మునిసిపల్ మాజీ చైర్మన్ విజయకుమార్ ర్యాలీ నిర్వహించారు. -
చిత్తూరు, మదనపల్లెలో వైఎస్సార్ సీపీ నాయకుల అరెస్ట్
సాక్షి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు బుధవారం నిర్వహించిన రహదారుల దిగ్బంధం విజయవంతమైంది. జిల్లాలోని జాతీయ రహదారులన్నీ మూసుకుపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చిత్తూరు, మదనపల్లెలో పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నాయకత్వంలో తిలక్‌రోడ్డులోని సెంట్రల్ పార్కు ఎదుట రాస్తారోకో చేశారు. చంద్రగిరి నాగాలమ్మ సర్కిల్ వద్ద పార్టీ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తిరుపతి-చిత్తూరు రోడ్డును దిగ్బంధించారు. 50 ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డంగా పెట్టి వాహనాలను అడ్డుకున్నారు. నేండ్రగుంట వద్ద చిత్తూరు రోడ్డుపై షామియానాలు వేసి, రోడ్డుపైనే భోజనాలు చేశారు. చిత్తూరులో పార్టీ సమన్వయకర్త ఏఎస్.మనోహర్ నాయకత్వంలో మురకంబట్టులోని చిత్తూరు-తిరుపతి రోడ్డు, వరిగిపల్లెలోని చిత్తూరు-బెంగళూరు రోడ్డు, కలెక్టరేట్ వద్ద వేలూరు రోడ్డును, యాదమరి వద్ద చిత్తూరు-పుత్తూరు రోడ్డును దిగ్బంధించారు. కలెక్టరేట్, యాదమరి వద్ద పార్టీ న గర కన్వీనర్ రఘునాథరెడ్డి, పలువురు కార్యకర్తలు, నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. మదనపల్లెలో పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి నాయకత్వంలో పుంగనూరు, తిరుపతి రోడ్లను దిగ్బంధించారు. ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డితోపాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేసి, సాయంత్రం విడిచి పెట్టారు. పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి నాయకత్వంలో చెన్నై-బెంగళూరు రోడ్డును దిగ్బంధించారు. పార్టీ నాయకురాలు ఆశాలత కూడా పాల్గొన్నారు. బెరైడ్డిపల్లె, గంగవరం, పెద్దపంజాణి మండలాల్లో పార్టీ నాయకులు కృష్ణమూర్తి, శంకర్‌రెడ్డి నాయకత్వంలో రహదారులను అడ్డుకున్నారు. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు ఎంబీటీ, బెంగళూరు, చింతామణి, తిరుపతి రోడ్లను దిగ్బంధించారు. లిడ్కాప్ మాజీ చైర్మన్ రెడ్డెప్ప, నాగభూషణం, వెంకటరెడ్డి యాదవ్, నాగరాజురెడ్డి, భాస్కర్‌రెడ్డి ఉదయం 5గంటలకే చెట్లను రోడ్డుపై పడేసి, రాకపోకలను అడ్డుకున్నారు. కుప్పంలో వేదాంగంపల్లె, ప్రభుత్వాస్పత్రి , తంబిగానిపల్ల్లె వద్ద అడ్డుకున్నారు. శాంతి పురం, గుడుపల్లె మండలాల్లో రహదారులను దిగ్బంధించారు. పార్టీ సమన్వయకర్త సుబ్రమణ్యంరెడ్డి ఆధ్వర్యంలో వాహనాలను అడ్డుకున్నారు. శ్రీకాళహస్తిలోని ఏపీ సీడ్స్ సర్కిల్ వద్ద పార్టీ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు వరప్రసాదరావు అధ్వర్యంలో రహదారులను దిగ్బంధించారు. నగరిలో పార్టీ జిల్లా కన్వీనరు నారాయణస్వామి ఆధ్వర్యంలో పుత్తూరు-నారాయణవనం బైపాస్ రోడ్డుపై బైఠాయించారు. నగరిలో కేజే కుమార్, భాస్కర్‌రెడ్డి, నిండ్రలో శ్యామ్‌లాల్, వడమాలపేటలో ఉమాపతి నాయకత్వంలో రహదారులను అడ్డుకున్నారు. సత్యవేడులో పార్టీ సమన్వయకర్త ఆదిమూలం ఆధ్వర్యంలో నారాయణవనం- నాగలాపురం రోడ్డు, పిచ్చాటూరులోని చెన్నై జాతీయ రహదారులను దిగ్బంధించారు. పూతలపట్టులో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తలుపులపల్లి బాబురెడ్డి, నాయకులు రాజరత్నంరెడ్డి, సమన్వయకర్తలు రవిప్రసాద్, పూర్ణం రంగంపేట క్రాస్ వద్ద బైఠాయించారు. పూతలపట్టులో సుబ్బారెడ్డి, వినయ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి చిత్తూరు రోడ్డుపై బైఠాయించారు. బంగారుపాళ్యంలో పార్టీ సమన్వయకర్త సునీల్‌కుమార్ నాయకత్వంలో బెంగళూరు- చెన్నై జాతీయ రహదారిని, తవణంపల్లిలో సమన్వయకర్త రవిప్రసాద్ చిత్తూరు-అరగొండ రోడ్డును దిగ్బం ధించారు. వెదురుకుప్పం మండలంలో పేట ధనంజయరెడ్డి, కార్వేటినగరంలో శ్రీరాములునాయుడు, జీడీనెల్లూరులో తమ్మిరెడ్డి, పెనుమూరులో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు నరసిం హులు, ఎస్ఆర్పురంలో అనంతరెడ్డి, పాలసముద్రంలో సుందరరాజులు ఆయా మండలాల్లోని రోడ్డుపై బైఠాయించారు. వాల్మీకిపురంలో పార్టీ సమన్వయకర్త చింతల రామచంద్రారెడ్డి నాయకత్వంలో తిరుపతి-మదనపల్లె రహదారిని అడ్డుకున్నారు. తంబళ్లపల్లెలో పార్టీ నాయకులు మాధవరెడ్డి, రవీందర్‌రెడ్డి ములకలచెరువు రోడ్డును దిగ్బంధించారు.