నిరసన..ఉద్రిక్తత | Such humiliation jairanrame | Sakshi
Sakshi News home page

నిరసన..ఉద్రిక్తత

Published Thu, Feb 27 2014 3:08 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

నిరసన..ఉద్రిక్తత - Sakshi

నిరసన..ఉద్రిక్తత

  •     తిరుపతిలో జైరాంరమేష్‌కుపరాభవం
  •      చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అరెస్ట్
  •  తిరుపతి రూరల్, న్యూస్‌లైన్: రేణిగుంట ఎయిర్‌పోర్టు వద్ద బుధవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేంద్ర మంత్రి జైరాంరమేష్ విభజనకు కారకుడంటూ ఆయనను అడ్డుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నాయకత్వంలో సుమారు ఐదు వందల మంది మంత్రి కాన్వాయ్‌ను తిరుపతికి వెళ్లనివ్వకుండా అడుగడుగునా అడ్డుపడ్డారు.దాంతో భారీగా పోలీసులు మోహరించారు. పోలీసులను లెక్కచేయకుండా కార్యకర్తలు మంత్రిని ముప్పుతిప్పలు పెట్టారు. చేసేది లేక వచ్చిన దారినే మంత్రి తిరిగి ఎయిర్‌పోర్టుకు చేరుకుని సుమారు గంటన్నర వెయిట్ చేశారు.

    మంత్రి మధ్యాహ్నం 1.40 గంటలకు తిరుపతి ఎయిర్‌పోర్టులో దిగారు. అప్పటికే రేణిగుంట రమణావిలాస్ వద్ద కాపుకాచిన వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నాయకత్వంలో  అడ్డగించేందుకు సిద్ధమయ్యారు. పోలీస్ అధికారులు రోప్ పార్టీని రంగంలోకి దించారు. అనేక మంది మహిళా కార్యకర్తలు పోలీసులను నెట్టుకుంటూ మంత్రి కారువైపు పరుగులు తీశారు. దీంతో ఖంగుతిన్న మంత్రి నాలుగు వందల మీటర్ల దూరం నుంచే వెంటనే కాన్వాయ్‌ను వెనక్కితిప్పి తిరిగి తిరుచానూరు రోడ్డు మీదుగా వెళ్లాలని చూశారు. కానీ రామకృష్ణాపురం కూడలి వద్ద వాహనాలను పెట్టి అడ్డుకున్నారు. దాంతో మంత్రి తిరిగి ఎయిర్‌పోర్టుకు వెళ్లారు.

    సమైక్యవాదులు మంత్రిని నగరంలోకి అడుగుపెట్టనివ్వకపోవడంతో మంత్రి ముఖం చిన్నబోయింది. ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్లిన మంత్రికి భోజన ఏర్పాట్లు చేశారు. భోజనానంతరం సుమారు గంటన్నరపాటు మంత్రి ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు రాలే దు.  తిరుపతి పార్లమెంటు సభ్యులు చింతామోహన్ తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖర్‌బాబుకు ఫోన్ చేసి మంత్రికి జరిగిన పరాభవం గురించి వివరించారు. దీంతో పోలీసులు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగారు.
     
    మంత్రి రేణిగుంట చెక్‌పోస్టు వద్ద నుంచి తిరిగి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారనే విషయం తెలుసుకున్న వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు  ఎయిర్‌పోర్ట్ మెయిన్‌గేట్ ఎదుట బైఠాయించారు. సుమారు గంట పాటు ధర్నా చేశారు. బయటకు వస్తే అడ్డుకుని తమ నిరసన తెలపాలని రోడ్డును 50 వాహనాలతో బ్లాక్ చేశారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న కార్లను పోలీసులు చేతులతో ముందువైపు టైర్లు పెకైత్తి రోడ్డు పక్కకు నెట్టారు. అనంతరం  చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు ధర్నా చేస్తున్న ముఖ్య నాయకులు కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని పోలీస్ వాహనంలో తీసుకుపోయేందుకు ప్రయత్నించగా మహిళా కార్యకర్తలు అడ్డుకున్నారు. కార్యకర్తలపై కళ్లెర్రజేసి పోలీస్ జులుం ప్రదర్శించారు. లాఠీచార్జ్ చేశారు.

    మహిళలని కూడా చూడకుండా నెట్టివేశారు. ముఖ్యులు అనుకున్న వారందరినీ అరెస్ట్ చేశారు. చెవిరెడ్డిని విడుదల చెయ్యాలంటూ మహిళలు, మరింత మంది పార్టీ నాయకులు బీడు భూముల్లో పరుగులు పెట్టి అరెస్టు చేసి తీసుకెళుతున్న వాహనాలను అడ్డగించారు. పోలీసులు వారిని వెంబడించడంతో గందరగోళం నెల కొంది. పొలాలన్నీ ఆందోళనా కారులు, పోలీసులతో నిండిపోయాయి.
     
    ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా ఎస్సీసెల్ కన్వీనర్ దామినేటి కేశవులు, సింగం గోవిందరెడ్డి, జిల్లా  స్టీరింగ్ కమిటీ మెంబర్ గుణశేఖర్‌నాయుడు, నంగాబాబురెడ్డి, చంద్రగిరి మండల కన్వీనర్ కొటాల చంద్రశేఖర్‌రెడ్డి, పాకాల మండల కన్వీనర్ చెన్నకేశరెడ్డి, చిన్నియాదవ్, రుద్రగోపి, చిల్లకూరి యుగంధర్‌రెడ్డి, కోటేశ్వర్‌రెడ్డి, మణిరెడ్డి, భాను, నెన్నూరుగిరి, పుష్పకాంత్‌రెడ్డి, అశోక్, నవీనమ్మ, నారాయణరెడ్డి, ఫరూక్, ఆనందభాస్కర్‌రెడ్డి, మస్తాన్  పాల్గొన్నారు.
     
    డొంకరోడ్లలో మంత్రి కాన్వాయ్
     
    విమానాశ్రయంలో ఉన్న మంత్రి జైరాంరమేష్ ఆందోళనకారులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారని తెలుసుకున్న తరువాత బయలుదేరారు. కాన్వాయ్ వెళ్లిన రోడ్డులో మంత్రి వెళ్లలేదు. ప్రభుత్వం ఇచ్చిన కారు కాకుండా ఎంపీ చింతామోహన్ ఏర్పాటు చేసిన ఇన్నోవా కారులో సంతగేట్ వద్ద నుంచి పాత రేణిగుంట రోడ్డు ద్వారా నగరంలోకి వచ్చారు. ఈ రోడ్డు పూర్తిగా డొంకరోడ్డుగా ఉంది.  ఈ రోడ్డు ద్వారా మంత్రి వస్తుండడంతో స్థానికులంతా వింతగా చూశారు. అర్బన్ ఎస్పీ రాజశేఖర్‌బాబు పెలైట్ కారులాగా ముందు వెళుతుండగా మంత్రి కారు దీనిని ఫాలో అయింది. కేంద్ర మంత్రి ఈ దారిలో వస్తున్నారనే విషయం ట్రాఫిక్ పోలీస్‌లకు కూడా తెలియకపోవడంతో సాధారణ వాహనాలు రోడ్డుపైకి రావడంతో అక్కడక్కడ కాన్వాయ్‌కి బ్రేకులు పడ్డాయి. సాధారణంగా వీవీఐపీలు బైపాస్ రోడ్డు మీదుగా మెడిక ల్ కాలేజీకి చేరుకుంటారు. కానీ మంత్రిని పోలీ సులు తుడారోడ్డు, మున్సిపల్ ఆఫీస్ సర్కిల్, అన్నారావు సర్కిల్ మీదుగా మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. దీనికి కారణం అడ్డుకుంటారనే భయం.
     
    విలేకరుల సమావేశం గంటన్నర...
     మంత్రి మెడికల్ కాలేజీకి చేరుకున్న తరువాత విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో సుమారు గంట న్నర సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. ప్రెస్‌మీట్ జరుగుతుండగా నలుగురు టీడీపీ కార్యకర్తలు రెండు కార్లలో వచ్చి రెండు టీడీపీ జెండాలు చూపించి సమైక్యాంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. వారి ని పోలీసులు అరెస్ట్ చేయడంతో పోలీసు లు డౌన్‌డౌన్ అంటూ నినదించారు.
     
    ఫలించిన వైఎస్‌ఆర్ సీపీ వ్యూహం
     కేంద్ర మంత్రి జైరాం రమేష్‌కు తీవ్ర నిరసన తెలపాలని వైఎస్‌ఆర్ సీపీ వారు రూపొందించిన వ్యూహం ఫలించింది. ఎలాగైనా మంత్రిని అడ్డుకోవాలని, నిరసన తెలపాలనే విషయంలో సక్సెస్ అయ్యారు.
     
    అంతా అయోమయం.. గందరగోళం
     జైరాం రమేష్ తిరుపతికి వచ్చే విషయాన్ని గోప్యంగా ఉంచారు. కేంద్ర మంత్రిని అడ్డుకుంటారని ఎవ్వరూ ఊహించలేదు. చెవిరెడ్డి ఆందోళనను పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పసిగట్టలేక పోయారు. ఒక్కసారిగా ఆందోళనకారులు రోడ్డుపైకి దూకడంతో పోలీసులు, కాంగ్రెస్‌పార్టీ నాయకులు అయోమయానికి గురయ్యారు. ఊహిం చని ఈ పరిణామంతో ముఖ్యంగా పోలీసులకు ముచ్చెమటలు పట్టిం చాయి. ఎంపీ చింతా మోహన్‌పై జైరాం మండిపడ్డట్టు సమాచారం. ఆందోళనాకారులను అడ్డుకోలేకపోయారేం... ఆమాత్రం సమాచారం సేకరించలేరా అని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కాంగ్రెస్ పార్టీలోని ఓ నాయకుడు చెప్పారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement