టీటీడీ కళాశాలల్లో మేనేజ్‌మెంట్ కోటానా?
- దెక్కడి చోద్యం..
- అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసిన చెవిరెడ్డి
తిరుపతి : అసెంబ్లీ సమావేశాలు వేదికగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి టీటీడీ నిర్వహణలోని కళాశాలల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీశారు. మేనేజ్‌మెంట్ కోటా అమలు చేస్తుం డడం వల్ల మెరిట్ విద్యార్థులు, రిజర్వేషన్ కోటా విద్యార్థులు అవకాశాలు కోల్పోతున్నారని ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు. మేనేజ్‌మెంట్ కోటాలో 52 శాతం మార్కులు వచ్చిన వారు సీట్లు పొందుతుంటే ఎస్‌సీ, ఎస్టీ విద్యార్థులు 81 శాతం మార్కులు పొందినా సీట్లు దక్కడం లేదని అన్నారు.
ఓసీ మెరిట్ కోటాలో 87 శాతం వద్ద అడ్మిషన్లు ఆగిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కళాశాలల్లో మేనేజ్‌మెంట్ కోటా లేనపుడు ప్రభుత్వ అనుబంధ సంస్థగా ఉన్న టీటీడీలో ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. కొందరు టీటీడీ అధికారులు తమ పరపతి పెంచుకోవడానికి, పైరవీలు చేసుకోవడానికి మేనేజ్‌మెంట్ కోటాను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.
మేనేజ్‌మెంట్ కోటా కింద టీటీడీ కళాశాలల్లో అడ్మిషన్లు పొందుతున్న కొందరు విద్యార్థులు ఉచిత బస, భోజన సౌకర్యాలు పొంది తరగతులకు సరిగా వెళ్లకుండా సొంత వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని అర్హతలు ఉండి అడ్మిషన్లు పొందలేకపోతున్న మెరిట్ విద్యార్థులకు, రిజర్వేషన్ కోటా విద్యార్థులకు ఏ రకంగా న్యాయం చేస్తారని ఆయన ప్రశ్నించారు. టీటీడీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ సరిగా అమలు కావడం లేదన్నారు.
నివేదికలు తెప్పిస్తాం
సభలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి లేవనెత్తిన అంశంపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు సమాధానం ఇస్తూ టీటీడీలో ఇలా జరుగుతున్నట్లు తమ దృష్టికి రాలేదన్నారు. నివేదికలు తె ప్పించుకుని తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.