కార్మికులకు వైఎస్‌ఆర్ సీపీ అండ
తిరుపతి: ఆర్టీసీ కార్మికులకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఆర్టీసీ వైఎస్‌ఆర్ మజ్దూర్ యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం తిరుపతి కోటకొమ్మల వీధిలోని వైఎస్‌ఆర్ సీపీ కార్యాలయంలో జరిగింది. యూనియన్ రాష్ర్ట ప్రధానకార్యదర్శి టీఎస్‌ఎస్.ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఆర్టీసీ కార్మిక సంఘాలు స్వార్థ ప్రయోజనాలకు పరిమితమైన నేపథ్యంలో వైఎస్‌ఆర్ మజ్దూర్ యూనియన్ నిస్వార్థంగా కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ఆ స్ఫూర్తిని కొనసాగించి ఆర్‌టీసీ కార్మికుల సమస్యలపై సైనికుల్లా పోరాడి రాజకీయాలు, యూనియన్లకు అతీతంగా ఆందరి మన్ననలు చూరగొనాలన్నారు. సమస్యల పరిష్కారం వైఎస్‌ఆర్ మజ్దూర్ యూనియన్ ద్వారా మాత్రమే సాధ్యం అవుతుందన్న నమ్మకాన్ని కార్మికుల్లో కల్పించాలని కోరారు. అందుకు తమవంతు సహకారం ఉంటుందని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి డిపోలో వైఎస్‌ఆర్ మజ్దూర్ యూనియన్ పతాకాలు రెపరెపలాడే రోజులు వస్తాయన్నారు. యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదన్న నిరాశ, నిస్పృహలను విడనాడాలని కోరారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి లాంటి పోరాట పటిమ గల నాయకులు పార్టీలో ఉన్నారని వారి నాయకత్వంలో సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేయాలన్నారు.
యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి ప్రసంగిస్తూ రాష్ట్రంలో ఉన్న 70 వేల మంది ఆర్టీసీ కార్మికులు చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదన్నారు. గతంలో చంద్రబాబు పాలనలో ఆర్టీసీ సంస్థ రూ.5600 కోట్ల నష్టాల్లో కూరుకు పోయినపుడు గట్టెక్కించి సంస్థను కాపాడిన ఘనత వైఎస్‌ఆర్‌దేనని చెప్పారు. అందుకు కృతజ్ఞతగా తాము పదవులు త్యజించి ఆ మహానేత పేరుమీద యూనియన్ ఏర్పాటు చేసుకున్నామన్నారు.
పార్టీ అండదండలతో ఆర్టీసీలో అతిపెద్ద యూనియన్‌గా ఆవిర్భవించడం తథ్యమన్నారు. సమావేశంలో యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీవీఎస్ రెడ్డి, లతారెడ్డి, వి.రవి, జిల్లా రీజనల్ కార్యదర్శి పీసీ.బాబు, వివిధ డిపోల అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పాలగిరి ప్రతాప్‌రెడ్డిని కార్మికులు ఘనంగా సన్మానించారు.