తెలుగుదేశం పార్టీ తిరుపతి నియోజకవర్గ నేతలకు ఎడతెగని చిక్కొచ్చి పడింది. వరుస ఓటములను పక్కనపెడితే పార్టీ అధినేత చంద్రబాబు పెట్టే క్లాసుల టార్చర్‌కి ఒక్కో నేతకి నరాలు తెగిపోతున్నాయి. దీంతో బాబును సంతృప్తి పరిచేందుకు ఇష్టారాజ్యంగా నోరు పారేసుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియని నిస్పృహలో బండబూతులు తిట్టేస్తున్నారు. తీరా తాము తిట్టిన తిట్లు.. ఆ రెండు పేపర్లు, ఆ టీవీల్లో వచ్చేలా చేసేందుకు నానాతంటాలు పడుతున్నారు. వచ్చిన తర్వాత ఆ కటింగ్‌లు, క్లిప్పింగ్‌లు అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి పంపించి ‘బాబు గారికి చూపించండి... ఎవరెవరు ఎట్లా మాట్లాడారో చూడమనండి’ అని చెప్పుకుని బరువు దించుకుంటున్నారు. ఆ తర్వాత ఒకరినొకరు ఓదార్చుకుంటున్నారు. ఇంతకూ టీడీపీ నేతలకొచ్చిన బాధేమిటో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంకా పూర్తిగా తెలియాలంటే కాస్త ఈ కథనం చదవండి.
సాక్షి ప్రతినిధి, తిరుపతి : కళ్లారా అభివృద్ధి కనిపిస్తుంటే కాదని ఎవరైనా అనగలరా.. ? తమ హయాంలో ఎన్నడూ జరగని అభివృద్ధి, తిరుపతి ప్రగతి ఇప్పుడు కళ్లకు కట్టినట్టు చూస్తూ.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గానీ.. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిని గానీ ఏమైనా మాట్లాడగలరా? నియోజకవర్గ ఆవిర్భావం నుంచి ఎక్కువసార్లు ప్రాతినిథ్యం వహించామని గొప్పగా చెప్పుకునే టీడీపీ నేతలకు.. ఇదిగో అప్పట్లో తిరుపతికి ఇది చేశాం అని ప్రకటించుకునే పరిస్థితి ఉందా?.. అస్సలు లేదనే వాస్తవం వారికి బాగా తెలుసు. ఈ విషయం కాసేపు పక్కన పెట్టి మూడేళ్లలో వైఎస్సార్‌సీపీ హయాంలో తిరుపతిలో జరిగిన అభివృద్ధిని ఒకింత పరిశీలిద్దాం.
► టీడీపీ హయాం చివర్లో శంకుస్థాపన చేసి వదిలేసిన శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఇప్పటికే 80 శాతం పనులు పూర్తిచేసింది. కోవిడ్ ఆటంకాలు తెచ్చినా, తొలిదశ ఫ్లెఓవర్‌ను ఆర్నెల్ల క్రితమే అందుబాటులోకి తెచ్చింది. 2023 తొలినాళ్లకు పూర్తి స్థాయిలో రాష్ట్రంలోనే అతిపెద్దదైన ఆరు కిలోమీటర్ల ఫ్లెఓవర్‌ను అందుబాటులోకి తేనుంది.
► దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న అన్నమయ్యమార్గ్, డాక్టర్ వైఎస్సార్ మార్గ్ మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణాన్ని పూర్తిచేసింది.
► కొత్తగా మరో 12 మాస్టర్ ప్లాన్ రోడ్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ఇందులో గొల్లగానిగుంట రోడ్డు పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
► అదేవిధంగా ప్రజలు దాదాపు నాలుగు దశాబ్దాలుగా నిరీక్షిస్తున్న కొర్లగుంట మాస్టర్ ప్లాన్ రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
► మునుపెన్నడూ లేని విధంగా రూ.164 కోట్లతో తిరుపతి శివారు ప్రాంతాల్లో మౌలిక వసతులను కల్పించారు.
► ప్రకాశం పార్కు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
► ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న వినాయక్‌సాగర్ అభివృద్ధి కొలిక్కి వచ్చింది.
► మటన్ మార్కెట్, కూరగాయల మార్కెట్‌ల వికేంద్రీకరణ, శ్మశానవాటికల ఆధునికీకరణ, గొల్లవాని గుంట క్రికెట్ స్టేడియం, మూడు మోడల్ అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్మాణం, మరో మూడు నిర్మాణ దశలో, వైఎస్సార్ మార్గ్‌లో మోడ్రన్ స్కూలు నిర్మాణం... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.. ఎన్నెన్నో.. ఇవన్నీ కూడా కేవలం తిరుపతి నగర పరిధిలో ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి చొరవతో మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన అభివృద్ధి పనులు.. ఇక నగరంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు టీటీడీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, తిరుపతి చెంత పారిశ్రామిక అభివృద్ధి... ఇలా చెప్పుకుంటే కొదవే లేదు.
అందుకే విపక్షాలు పోటీకి దూరం
మునుపెన్నడూ ఎరుగని రీతిలో తిరునగరి ప్రగతి బాటలో పయనిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశమే లేకుండా పోయింది. పోనీ టీడీపీ అధినేత చంద్రబాబును స్ఫూర్తిగా తీసుకుని గట్టిగా అబద్ధాలు ఆడదామని అనుకుంటే చైతన్యవంతులైన తిరుపతి ప్రజలు చూస్తూ ఊరుకోరు. అది తెలిసిన టీడీపీ నేతలు ఎన్నికలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క వార్డు టీడీపీ సొంతమైంది. ఈ పరిస్థితుల్లోనే ఇటీవల జరిగిన టౌన్ బ్యాంక్ ఎన్నికలకు దూరంగా ఉండాలని భావించారు. కానీ అధినేత బాబు ఒత్తిడి మేరకు చోటామోటా నేతలు రంగంలోకి దిగి డిపాజిట్లు కోల్పోయారు.
బాబు ఒత్తిడి భరించలేక శ్రుతి తప్పి మాట్లాడుతున్న టీడీపీ నేతలు
అయితే చంద్రబాబు క్లాస్‌లు, ఒత్తిడి భరించలేని టీడీపీ నేతలు టౌన్ బ్యాంక్ ఎన్నికల ఓటమి తర్వాత తమ నోళ్లకు పనిచెప్పారు. నోటికొచ్చినట్టు పేట్రేగిపోతున్నారు. తమకు అనుకూల మీడియాలో ఆ వార్తలు రాయించుకుని చంద్రబాబుకు పంపించుకుని ‘సార్.. ప్రభుత్వాన్ని తిట్టేశాం.. భూమనను విమర్శించాం..’ అని చెప్పుకుంటున్నారు. దీనివల్ల బాబు వద్ద మార్కులు పొందడం ఏమో గానీ తిరుపతి ప్రజల్లో మాత్రం పచ్చనేతలు బాగా పలుచనవుతున్నారనేది మాత్రం వాస్తవం.
మూడేళ్లలో ఇంటింటా సంక్షేమ వెలుగులు
మూడేళ్లలో తిరుపతిలో పార్టీలు, రాజకీయాలకు సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయి. దీనికి తోడు ఎమ్మెల్యే భూమన నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారితో మమేకమయ్యారు. నగరంలో జరిగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లోనే కాదు.. వేడుకల్లోనూ వారిని భాగస్వామ్యం చేశారు. తొలిసారి తిరుపతి నగరం పుట్టిన రోజు వేడుకలను ప్రజల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.. తిరుపతి వేదికగా జరిగిన జాతీయ కబడ్డీ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఇక చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ఈ ఏడాది తిరుపతి గంగమ్మ జాతరను అంగరంగ వైభవంగా జరిపారు.
Comments
Please login to add a commentAdd a comment