టీడీపీ మంత్రులది దిగజారుడుతనం
- ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
తిరుపతి రూరల్ : చిత్తూరు జిల్లాలో నాలుగైదు అసెంబ్లీ సీట్లు ఎర్రచంద్రనం డబ్బుతోనే వైఎస్సార్‌సీపీ గెలిచిందనడం టీడీపీ మంత్రుల దిగజారుడుతనానికి నిదర్శనమని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. అదే చిత్తూరు జిల్లాలో టీడీపీ గెలిచిన 6 సీట్లు ఎర్రచందనం డబ్బుతోనే గెలిచారా అంటూ మండిపడ్డారు. రాష్ట్ర మంత్రి దేవినేని ఉమ ఆదివారం వైఎస్‌ఆర్ సీపీ నేతలపై చేసిన వ్యాఖ్యలపై చెవిరెడ్డి స్పందించారు. తుమ్మలగుంటలోని తన స్వగృహంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు.
‘చిత్తూరు నగరానికి చెందిన ఎర్రచందనం స్మగ్లర్, టీడీపీ నేత బుల్లెట్ సురేష్ పీడీ యాక్ట్ కేసులో అరెస్టు అయ్యారు. చిత్తూరు కార్పొరేషన్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో బుల్లెట్ సురేష్ అందించిన డబ్బుతోనే గెలిచారా ? చంద్రబాబు, సీఎం రమేష్ అనుచరులు రెడ్డి నారాయణ, మహేష్ నాయుడు ఎర్రచందనం కేసులో అరెస్టు అయ్యారు. అప్పుడు రెడ్డి నారాయణ, మహేష్‌నాయుడుల ఎర్రచందనం స్మగ్లింగ్ దందాతో చంద్రబాబు, సీఎం రమేష్‌కు సంబంధం ఉందని అనుకోవాలా ? దేవినేని ఉమా సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
పాలన చేతగాక, ఏం చేయాలో తెలియక ప్రతిపక్ష నేతలపై తప్పుడు ఆరోపణలు చేయడం టీడీపీ నేతలు మానుకోవాలని హితవు పలికారు. అధికార పార్టీకి ప్రజలే ప్రతిపక్షం అయ్యేరోజులు ఎంతో దూరం లేవన్నారు. అధికారంలో ఉన్నవాళ్లు ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాలే తప్ప ప్రతిపక్షంపై నిరాధార అరోపణలు చేయడం మంచిది కాదన్నారు. 9 ఏళ్ల బాబు పాలనలో లక్ష మంది రైతులపై కేసులు పెట్టించిన ఘనత బాబుకే దక్కుతుందన్నారు. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ చంద్రబాబుకు మోసం చేయడం తప్ప ప్రజలకు మంచిచేసే గుణం లేదన్నారు.
ఎస్‌ఎల్‌ఎల్బీసీ లెక్కల ప్రకారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఏటా 60 నుంచి 70 శాతం మంది రైతులు రుణాలు తీసుకున్నారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఖరీఫ్‌లో ఏ ఒక్క రైతుకూ ఒక్క రూపాయి కూడా రుణం ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ఖరీఫ్ సీజన్‌లో ఒక్క రూపాయి కూడా రుణం ఇవ్వని ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే దేశ చరిత్రలో చంద్రబాబు ప్రభుత్వమేనన్నారు. చంద్రబాబు చేసిన రుణ మాఫీ ఓ బూటకమన్నారు. బాబు తొలి సంతకమే ఓ మాయ అని విమర్శించారు.
రుణ మాఫీపై ఇప్పటికీ తలాతోకలేని లేని ప్రకటన చేసి తమ్ముళ్ల చేత బలవంతంగా సంబరాలు చేయించడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. అడ్డగోలు రాష్ట్ర విభజనకు చంద్రబాబు కారణమన్నారు. రెండుకళ్ల సిద్ధాంతంతో చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశారన్నారు. ఆ పాపమే ఇప్పుడు ప్రజల పాలిట శాపంగా మారిందన్నారు. టీడీపీలో 420లను పెట్టుకుని ప్రతిపక్షంపై బురద చల్లడం బాధాకరమన్నారు. దెయ్యాలే వేదాలు వల్లించినట్టు చంద్రబాబు, టీడీపీ నేతలు వైఎస్‌ఆర్‌సీపీ నేతలపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారన్నారు.