merit students
-
ప్రైవేటు వారి... పాట! ఇంజనీరింగ్ కాలేజీల మేనేజ్మెంట్ సీట్ల వేలం దందా
ర్యాంకులతో సంబంధం లేదు.. మెరిట్ మాటే లేదు.. రూల్స్ గీల్స్ జాన్తా నై..లక్షల్లో వసూళ్లు.. ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికే సీటు..ముందే విక్రయాలు.. పేరుకు అడ్మిషన్లు అంటూ ప్రకటనలు..సీట్ల కోసం వెళ్లే మెరిట్ విద్యార్థులకు గేట్లు బంద్..సీట్లు లేవని వాచ్మన్లతోనే చెప్పిస్తూ వెళ్లగొడుతున్న తీరు..సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని చాలా ప్రైవేటు, కార్పొరేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల దందా విచ్చలవిడిగా సాగుతోంది. ఉన్నత విద్యా మండలి ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీకి గత నెల 31న అనుమతించింది. పలు కాలేజీలు ప్రవేశ ప్రకటనలు ఇచ్చి, దరఖాస్తులు ఆహ్వానించాయి. కానీ, దీంతో ఆయా కాలేజీలకు వెళ్లిన విద్యార్థులకు చేదు అనుభవం ఎదురవుతోంది. ‘ఇంకెక్కడి సీట్లు... ఎప్పుడో అయిపోయాయి’ అంటూ సెక్యూరిటీ సిబ్బందితో గెంటివేయిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. దీనిపై ఉన్నత విద్యా మండలికి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. అధికారులు, నేతలు కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నాయి. ఈఏపీసెట్ పరీక్ష ఫలితాలు రావడంతో సీట్ల వ్యాపారం జోరందుకుందని పేర్కొంటున్నాయి. ఏటా ఇదే దందా.. యాజమాన్య కోటా సీట్ల భర్తీకి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి అడ్మిషన్ల ప్రకటన వెలువడ్డాకే సీట్లు భర్తీ చేయాలి. విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించాలి. తొలుత జేఈఈ మెయిన్స్ ర్యాంకర్లకు, తర్వాత ఈఏపీసెట్ ర్యాంకర్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇంకా సీట్లు ఉంటే.. ఇంటర్లో మెరిట్ మార్కులను పరిగణనలోకి తీసుకుని సీట్లు ఇవ్వాలి. యాజమాన్య కోటాలోని 30శాతం సీట్లలో 15శాతం సీట్లను ఇలా భర్తీ చేయాలి. ‘అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ)’ నిర్ధారించిన మేరకు మాత్రమే ఫీజు వసూలు చేయాలి. మరో 15 శాతం సీట్లను ప్రవాస భారతీయులు సిఫార్సు చేసిన విద్యార్థులకు (ఎన్నారై కోటా) కింద కేటాయించాలి. ఈ కేటగిరీలో ఏడాదికి 5 వేల డాలర్ల ఫీజు (సుమారు రూ.4.2 లక్షలు) వసూలు చేసుకోవచ్చు. కానీ కాలేజీలు ఈ నిబంధనలేవీ పట్టించుకోవడం లేదు. బ్రాంచీని బట్టి ఐదారు లక్షల నుంచి 20 లక్షల దాకా డబ్బులు తీసుకుని సీట్లను వేలం పాటలో అమ్మేసుకుంటున్నాయి. ఆ విద్యార్థులు మాత్రమే తమ కాలేజీకి దరఖాస్తు చేసుకున్నారని, వారి మెరిట్ మేరకే సీట్లు ఇచ్చామని చూపుతున్నాయి. మంచి ర్యాంకులు, మార్కులు వచ్చిన విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వకుండా చూసుకుంటున్నాయి. ఏటా ఈ దందా ఇలాగే కొనసాగుతోంది. ఈ క్రమంలోనే నీట్ మాదిరిగా.. ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్లకు కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేపడితే బాగుంటుందని ఉన్నత విద్యా మండలి గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కానీ కాలేజీ యాజమాన్యాలు తమ పలుకుబడితో దీనిని అడ్డుకున్నాయి. రూ. 1,500 కోట్ల ‘వ్యాపారం’ రాష్ట్రంలోని 175 ఇంజనీరింగ్ కాలేజీల్లో 156 ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి. మొత్తంగా 1,12,069 సీట్లు ఉండగా.. అందులో ప్రైవేటు కాలేజీల్లోని సీట్లు 1.06 లక్షలు. ఈ సీట్లలో 30శాతం యాజమాన్య కోటా కింద కాలేజీలే భర్తీ చేసుకుంటాయి. ఇందులో సుమారు 20వేల సీట్లు కంప్యూటర్స్, అనుబంధ బ్రాంచీలవే. వాటికి డిమాండ్ చాలా ఎక్కువ. ఈ సీట్లను కాలేజీని బట్టి కనిష్టంగా రూ. 8 లక్షల నుంచి గరిష్టంగా రూ. 20లక్షల వరకూ అమ్ముకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 15వేల సీట్లను కాలేజీలు అమ్మేసుకున్నాయని సమాచారం. అంటే సుమారు రూ.1,500 కోట్ల మేరకు దందా జరిగినట్టు తెలిసింది. ఇంత భారీగా సాగుతున్న అక్రమ వ్యవహారంలో చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు, ‘సహకారం’ అందిస్తున్న ప్రజాప్రతినిధులకు వాటాలు వెళ్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా.. ఈ సీట్ల అమ్మకం వ్యవహారం యథేచ్ఛగా సాగిపోతోందని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. వెళ్లిన వాళ్లను వెళ్లినట్టే వెనక్కి పంపుతూ.. – హైదరాబాద్‌లోని ఓ రాజకీయ ప్రముఖుడి కాలేజీకి ఒక జేఈఈ ర్యాంకర్ దరఖాస్తుతో వెళ్లాడు. కానీ సీట్లు ఎప్పుడో భర్తీ అయిపోయాయని చెప్తూ.. గేట్ వద్ద నుంచే వాచ్మెన్ వెనక్కి పంపేశాడు. చేసేదేమీ లేక ఫిర్యాదు చేసేందుకు ఆ విద్యార్థి ఉన్నత విద్యా మండలికి వచ్చాడు. – రంగారెడ్డి జిల్లాలోని ఓ టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు కోసం ఓ విద్యార్థి వెళ్లాడు. అతడికి ఈఏపీసెట్‌లో 20వేల ర్యాంకు వచ్చింది. అయితే సీట్లు పెరిగితే అడ్మిషన్ ఇచ్చే విషయం చూద్దామని యాజమాన్యం చెప్పి పంపిందని.. సీఎస్ఈ కోసమైతే రూ.12 లక్షలు సిద్ధం చేసుకోవాలని సూచించిందని ఆ విద్యార్థి వెల్లడించాడు. – కౌన్సెలింగ్ సందర్భంగా ఓ విద్యారి్థకి రాష్ట్రంలో టాప్ టెన్‌లో ఉండే ఓ కాలేజీలో మెకానిక్ బ్రాంచీలో సీటు వచ్చింది. అయితే సీఎస్ఈ సీటు ఇవ్వాలని ఆ విద్యార్థి కాలేజీని కోరగా.. కొత్త సీట్లు వచ్చాక ఇస్తామని, ఇప్పుడే రూ.18 లక్షలు కట్టేస్తే ఖరారు చేస్తామని తేల్చి చెప్పింది. నిబంధనలు విధిగా పాటించాలి యాజమాన్య కోటా సీట్ల భర్తీలో కాలేజీలు కచ్చితంగా నిబంధనలు పాటించాలి. ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించాలి. ప్రతి కాలేజీ వెబ్సైట్ అందుబాటులో ఉంచాలి. దీనిపై ఇప్పటికే కాలేజీలకు సర్క్యులర్ కూడా ఇచ్చాం. ఎవరికైనా అన్యాయం జరిగితే మండలికి ఫిర్యాదు చేయవచ్చు. – ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, ఉన్నత విద్యా మండలి కార్యదర్శి దోపిడీకి అడ్డుకట్ట వేసేదెప్పుడు? యాజమాన్య కోటా సీట్ల దందాను అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. యాజమాన్యాలకు కొమ్ముగాయడమే ఈ పరిస్థితికి కారణం. యాజమాన్య కోటా సీట్లను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయాలి. ఈ దిశగా తక్షణం చర్యలు చేపట్టాలి. – చింతకాయల ఝాన్సీ, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఇంత అన్యాయమా? ఇంజనీరింగ్ కాలేజీల సీట్ల వ్యాపారాన్ని అడ్డుకోలేక పోవడానికి కారణాలేమిటో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. నోటిఫికేషన్ ఇచ్చే నాటికే సీట్లు అమ్మేస్తుంటే అధికారులు ఎందుకు నియంత్రించడం లేదు. ఈ వ్యవహారంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికైనా యాజమాన్య కోటా సీట్లను ప్రభుత్వమే భర్తీ చేయాలి. – టి.నాగరాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫిర్యాదు చేశా.. చర్యలు తీసుకుంటారా? శ్రీదేవి విమెన్స్ కాలేజీలో బి కేటగిరీ సీటు కోసం వెళ్లిన యాస శ్రీకీర్తిరెడ్డి అనే విద్యారి్థని యాజమాన్యం లోపలికి కూడా రానివ్వలేదు. ప్రవేశ ప్రకటన ఇచ్చి ఇలా చేయడం దారుణం. దీనిపై ఉన్నత విద్యా మండలికి ఫిర్యాదు చేశాం. ఏం చర్య తీసుకుంటుందో చూడాలి. – డాక్టర్ కురువ విజయకుమార్, ఓయూ జేఏసీ అధ్యక్షుడు -
ఎంసెట్ కౌన్సెలింగ్‌కు దూరంగా టాపర్లు! కారణమిదే!
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్‌లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్లో చాలా మంది కౌన్సెలింగ్‌కు దూరంగా ఉన్నారు. ఎలాంటి ఆప్షన్లు ఇవ్వకపోవడమే కాదు, కనీసం రిజిస్ట్రేషన్ కూడా చేసుకోలేదు. టాప్–200లోపు ర్యాంకర్లలో ఒక్కరు కూడా ఎంసెట్ కౌన్సెలింగ్ జోలికి వెళ్లలేదు. 300లోపు ర్యాంకర్లలో కేవలం ఒక్కరు, 1000లోపు ర్యాంకర్లలో 23 మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 50వేల నుంచి 2.5 లక్షల వరకు ర్యాంకులు వచ్చినవారే ఎక్కువగా కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రాష్ట్ర ఎంసెట్ విభాగం ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం 81,856 మంది కౌన్సెలింగ్‌కు రిజిస్టర్ చేసుకున్నారు. వారు ఈ నెల 12వ తేదీ వరకు ఆప్షన్లు ఇవ్వడానికి సమయం ఉంది. సాధారణంగా ఎంసెట్‌లో మంచి ర్యాంకు వచ్చిన విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌లోనూ మంచి ర్యాంకు సాధిస్తుంటారు. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల కోసం ప్రయత్నిస్తారు. అందుకే ఎంసెట్ కౌన్సెలింగ్‌కు దూరంగా ఉంటుంటారు. అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఈ నెల 12లోపు ఆప్షన్లు ఇవ్వకపోతే సీట్లు కోల్పోయే అవకాశం ఉంటుంది. 42వేల కంప్యూటర్ ఇంజనీరింగ్ సీట్లు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,07,039 ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. ఇందులో తొలి విడత కౌన్సెలింగ్‌లో 76,359 సీట్లను చేర్చారు. మిగతావి యాజమాన్య కోటా కింద భర్తీ చేస్తారు. కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తున్న సీట్లలో ఏకంగా 42,087 వరకు కంప్యూటర్ ఇంజనీరింగ్ సీట్లే ఉన్నాయి. విద్యార్థుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు ఇటీవలే.. సీఎస్సీ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు పెంచారు. -
‘బీ’ కేటగిరీ భర్తీ బాధ్యత యాజమాన్యాలదే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల్లో ‘బీ’ కేటగిరీ సీట్లను ఆయా కళాశాలలే భర్తీ చేసుకోనున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో 32, 33 విడుదల చేసింది. ఈ సీట్ల భర్తీ పారదర్శకంగా, నిబంధనల ప్రకారం మెరిట్ ప్రాతిపదికన జరిగేలా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఈ సీట్ల భర్తీ కోసం ఏపీ ఈఏపీసెట్ అడ్మిషన్లను నిర్వహించే సాంకేతిక విద్యాశాఖ కాంపిటెంట్ అథారిటీగా వ్యవహరించనుంది. ఈ సీట్ల భర్తీకి ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా విద్యార్థులు నేరుగా లేదా ఆయా కాలేజీలకు వెళ్లి దరఖాస్తులు సమర్పించవచ్చు. కాలేజీలకు అందిన దరఖాస్తుల్లో మెరిట్ విద్యార్థులను ఆయా సీట్లకు ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేయాలి. ఈ ప్రక్రియ అంతా అందరికీ తెలిసేలా ఎప్పటికప్పుడు నిర్దేశిత పోర్టల్‌లో వివరాలు పొందుపరుస్తారు. మొత్తం సీట్లలో 70 శాతం ‘ఏ’ కేటగిరీ కింద కన్వీనర్ ద్వారా ప్రభుత్వం భర్తీ చేస్తుంది. మిగతా 30 శాతంలో సగం సీట్లను ఎన్నారై కోటాలో ఆయా కాలేజీలు భర్తీ చేసుకోవచ్చు. వాటిలో మిగిలిన సీట్లను, నాన్ ఎన్నారై సీట్లను ఈ ప్రత్యేక పోర్టల్ ద్వారా భర్తీ చేస్తారు. ఎన్నారై సీట్లకు 5 వేల డాలర్లను, నాన్ ఎన్నారై సీట్లకు ‘ఏ’ కేటగిరీకి నిర్ణయించిన ఫీజులకు మూడు రెట్ల వరకు ఆయా కాలేజీలు వసూలు చేయవచ్చు. బీ కేటగిరీ భర్తీ మార్గదర్శకాలు ఇలా: ► ఏపీ ఈఏపీసెట్ అడ్మిషన్ల కమిటీ నోటిఫికేషన్ జారీ చేసే వరకు బీ కేటగిరీ సీట్లను భర్తీ చేయడానికి వీల్లేదు. కమిటీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే అడ్మిషన్ ప్రక్రియ చేపట్టాలి. ► ఏఐసీటీఈ అనుమతి ఉన్న సంస్థలు ఆయా కోర్సులకు మంజూరైన ఇన్‌టేక్‌లో 15 శాతం మించకుండా ఎన్ఆర్ఐ సీట్లను సొంతంగా భర్తీ చేయవచ్చు. గ్రూప్ సబ్జెక్టులలో 50 శాతం మార్కులకు తగ్గకుండా లేదా అర్హత పరీక్షలో 50 శాతం మార్కులతో లేదా 10 స్కేల్లో 5కి సమానమైన క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ ఉన్న విద్యార్థులు ఈ ప్రవేశాలకు అర్హులు. ► మిగిలిన సీట్లను మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. జేఈఈ మెయిన్, నీట్లో ర్యాంక్ సాధించిన వారు, అర్హత పరీక్షలో నిర్దేశిత గ్రూప్ సబ్జెక్టులలో 45 శాతం మార్కులకు తక్కువ కాకుండా సాధించిన వారు, ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారితో సహా అందరు అభ్యర్ధులను ఎంపిక చేయవచ్చు. ► జేఈఈ, నీట్ ర్యాంకర్లు లేని పక్షంలో మెరిట్ ప్రాతిపదికన ఈఏపీ సెట్ పరీక్షలో అర్హత సాధించిన అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేయాలి. ► ఆ తర్వాత ఏవైనా సీట్లు ఇంకా మిగిలిపోతే, నిర్దేశించిన గ్రూప్ సబ్జెక్టులలో 45 శాతం (రిజర్వుడు) కేటగిరీలకు చెందిన అభ్యర్థులైతే 40 శాతం) మార్కులను లేదా మొత్తం మార్కులలో ఆ మేరకు మార్కులు పొందిన అభ్యర్థులతో మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేయాలి. ► వెబ్ పోర్టల్ ద్వారా కేటగిరీ ‘బీ’ సీట్ల కోసం విద్యార్ధులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కళాశాలకు వెళ్లి అందచేసే దరఖాస్తులను యాజమాన్యాలు వెబ్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. ► విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని కాలేజీల్లో ’బీ’ కేటగిరీ సీట్లకు దరఖాస్తు చేసుకునే విధంగా కాంపిటెంట్ అథారిటీ షెడ్యూల్ ప్రకటిస్తుంది. ► ఎంపిక ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత సంబంధిత కళాశాల యాజమాన్యం ఆ జాబితాను లాగిన్ ద్వారా వెబ్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. ఎంపికలు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే జాబితాను తిరస్కరిస్తారు. -
కలలో కూడా ఊహించని గిఫ్ట్.. అవేమిటో తెలిస్తే షాక్..!
primary school in China rewarded 20 excellent students with piglets: మన దేశంలో బాగా చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకై వారిని పై చదువులు చదివించడమే లేక ఉపయుక్తమైన బహుమతులు ఇవ్వడం వంటివి చేస్తాం. అంతేందుకు మంచి ప్రతిభావంతులైతే ఉన్నత చదువు కోసం విదేశాలకు పంపించడమో లేక ఆర్థిక సహాయం చేయడమో కూడా చేస్తాం. కానీ చైనాలో పేద మెరిట్ విద్యార్థులకు విచిత్రమైన గిఫ్ట్‌లు ఇస్తారు. నిజానికి మనకు అది బహుమతిలా అనిపించదు. పైగా మనం కలలో కూడా ఊహించని విచిత్రమైన గిఫ్ట్ అది. అసలు విషయంలోకెళ్తే...యునాన్ ప్రావిన్స్‌లోని యిలియాంగ్ కౌంటీలోని జియాంగ్యాంగ్ ఎలిమెంటరీ స్కూల్ 20 మంది విద్యార్థులకు పందిపిల్లలను బహుమతిగా ఇచ్చింది. ఈ మేరకు ఆ పాఠశాల ఉపాధ్యాయుడు హౌ చాంగ్లియాంగ్ మాట్లాడుతూ.. "గ్రామీణ విద్య, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మధ్య సంబంధాలను పెంపొందించే ప్రయత్నంలో షాంఘై జియాంగ్వు ప్రజా సంక్షేమ నిధి ద్వారా పందిపిల్లలను స్పాన్సర్ చేశాం. ఈ పాఠశాలలో 65 మంది విద్యార్థులు ఉన్నారు. నేను నా భార్య లీ యుడాన్తో సహా నలుగురు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. మేము అకడమిక్ మెరిట్ ఆధారంగా 20 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారికి పంది పిల్లలను బహుమతులుగా ఇచ్చాం. ఈ రకమైన బహుమతుల ద్వారా వారిని ప్రోత్సహించడమే కాక వారి తల్లిదండ్రులకు ఒక విధమైన సాయం అదించగలిగాం" అని చెప్పారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో వినియోగదారులు ఇంత చిన్న వయసులో పందిని సంపాదించగలగడం చాలా గొప్ప విషయం అంటూ వ్యగ్యంగా రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: రైళ్లు గమ్యానికి చేరక మునుపే సరకు అంతా స్వాహా...దెబ్బకు ఈ కామర్స్ సంస్థలు కుదేలు) -
వైద్య విద్యార్థులకు ధ్రువపత్రాల తలనొప్పి
సాక్షి, హైదరాబాద్: ‘నీట్’లో మెరిట్ ర్యాంకు సాధించిన రాష్ట్ర విద్యార్థులు సమస్యల వలయంలో చిక్కుకున్నారు. రాష్ట్రస్థాయిలో దరఖాస్తు చేసుకోవడానికి ముందే అఖిల భారత కోటా సీట్లకు మొదటి విడత కౌన్సిలింగ్ నిర్వహించారు. అందులో కొందరు తెలంగాణ విద్యార్థులు సీట్లు సాధించారు. గడువు సమీపించడంలో వివిధ రాష్ట్రాల్లోని వైద్య కాలేజీల్లో ఫీజులు చెల్లించి చేరిపోయారు. అటువంటి మెరిట్ విద్యార్థులు తెలంగాణలో సీటు పొందలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో కౌన్సిలింగ్‌కు హాజరయ్యే పరిస్థితి వారికి లేకుండా పోయింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా కూడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఒరిజినల్స్ ఇవ్వకపోవడంతో ఇక్కడి కౌన్సిలింగ్లో పాల్గొనలేని పరిస్థితి నెలకొంది. ఒరిజినల్స్ మాత్రమే వెరిఫికేషన్‌కు ఇవ్వాలని, ఎక్కడో కాలేజీలో చేరినట్లుగా కస్టోడియన్ సర్టిఫికెట్ ఇస్తే అనుమతి ఇవ్వలేమని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నిబంధన విధించడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అఖిల భారత కోటాలో మొదటి విడత ప్రవేశాల్లో కాలేజీలో చేరడానికి ఈనెల మూడో తేదీతో గడువు ముగిసిపోయింది. అఖిల భారత కోటాలో తొలి విడత ప్రవేశ ప్రక్రియ ప్రారంభమయ్యే నాటికి తెలంగాణలో అసలు సర్టిఫికెట్ల వెరిఫికేషనే ప్రారంభం కాలేదు. దీంతో ఇతర రాష్ట్రాల్లో అఖిల భారత కోటాలో చేరాల్సి వచ్చింది. అక్కడ సర్టిఫికెట్లు ఉండిపోవడంతో ఇక్కడ సమర్పించలేకపోయారు. దీంతో ఇక్కడ స్థానికులైనా మొదటి విడతలో కనీసం పోటీ పడడానికి కూడా అవకాశాలు లేకుండా పోయాయి. దీంతో స్థానికంగా సీట్లు పొందలేక, తప్పని పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల్లోనే కొనసాగాల్సి వస్తుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కస్టోడియన్ సర్టిఫికెట్లకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. కస్టోడియన్ సర్టిఫికెట్లను అనుమతించబోమని ముందే నిర్ణయం తీసుకున్నామని విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. వాస్తవంగా ఈనెల మూడో తేదీ నాటికి అఖిల భారత సీట్లలో చేరడానికి గడువుందని, కానీ మన రాష్ట్రంలో మొదటి విడతకు సంబంధించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ గత నెల 30వ తేదీ వరకుందని ఆయన పేర్కొన్నారు. 7 నుంచి 9 వరకు వెబ్ ఆప్షన్లు.. మొదటి విడత వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఈనెల ఏడో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు జరుగుతుందని కరుణాకర్‌రెడ్డి తెలిపారు. పదో తేదీన ఎవరెవరికి ఎక్కడ సీటు వచ్చిందో జాబితా విడుదల చేస్తామన్నారు. -
ఒక్కో విద్యార్థికి 20 లక్షలివ్వండి: సుప్రీం
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో మెరిట్ విద్యార్థులకు కాకుండా అనర్హులకు ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లు కట్టబెట్టిన ఓ మెడికల్ కాలేజీపై సుప్రీంకోర్టు కొరడా ఝుళి పించింది. ఈ ఘటనలో నష్టపోయిన 19 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కళాశాలను జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ యు.యు.లలిత్‌ల ధర్మాసనం ఆదేశించింది. బాధితులకు చెల్లించాల్సిన రూ.3.8 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రవేశ్ నియంత్రణ్ కమిటీ వద్ద డిపాజిట్ చేయాలని సూచించింది. మహారాష్ట్రలోని డా.ఉల్హాస్ పాటిల్ వైద్య కళాశాల 2012–13లో 19 మంది మెరిట్ విద్యార్థులకు సీట్లను నిరాకరించింది. ఈ కేసును తొలుత విచారించిన బాంబే హైకోర్టు కాలేజీ గుర్తింపును, అఫిలియేషన్‌ను రద్దుచేయాలని ఆదేశించింది. దీంతో కళాశాల యాజమాన్యం సుప్రీంను ఆశ్రయించింది. కేసును విచారించిన న్యాయస్థానం ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షలు చెల్లించాలని, మూడు నెలల్లో నిర్ణీత మొత్తం చెల్లించకుంటే బాంబే హైకోర్టు ఉత్తర్వుల్ని అమలుచేస్తామని హెచ్చరించింది. -
దేవుడు అల్లు అర్జున్ రూపంలో సాయం చేశాడు
ఆ బాలికలు మట్టిలో మాణిక్యాలు.. పేదింటి విద్యాకుసుమాలు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, కష్టపడి చదివి అత్యున్నత ఫలితాలు సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించి పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటారు. వారే రష్మిత (9.8 జీపీఏ, వనస్థలిపురం జెడ్పీహెచ్ఎస్), టి.రాజేశ్వరి (9.7 జీపీఏ, సూరారం జెడ్పీహెచ్ఎస్), సఖినాబి (9.5 జీపీఏ, ఘట్కేసర్ జెడ్పీహెచ్ఎస్). ఈ చదువుల తల్లులకు చేయూతనందిస్తే భవిష్యత్ బంగారమవుతుందని.. ‘వెన్ను తడితే.. బంగారు భవితే’ శీర్షికతో ‘సాక్షి’ మే 30న కథనం ప్రచురించింది. దీనికి స్పందించిన సినీనటుడు పోసాని కృష్ణమురళి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. హిమాయత్‌నగర్ : బంజారాహిల్స్ రోడ్ నెంబర్.1 ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలోని టీవీ స్టూడియోలో గురువారం జరిగిన లైవ్ కార్యక్రమంలో పోసాని పైచదువుల నిమిత్తం విద్యార్థినులకు ఒక్కొక్కరికి రూ.1.50 లక్షల చెక్కు అందజేశారు. నూతన దుస్తులు కొనుక్కొని, కుటుంబసభ్యులతో సరదాగా గడపమని ఒక్కొక్కరికి మరో రూ.10వేల నగదు ఇచ్చారు. ఈ సందర్భంగా పొసాని తన చదువు, సేవా కార్యక్రమాల గురించి ‘సాక్షి’ లైవ్‌లో పంచుకున్నారు. గొడ్లకాడ పెడతారని... ‘మాకు మొదట్లో చాలా ఆస్తులు ఉండేవి. అయితే కొన్ని కారణాలరీత్యా వాటిని కోల్పోయాం. ఆ రోజుల్లో నన్ను చదివించడం మావాళ్లకు కష్టమైంది. ఏడో తరగతిలో తప్పితే గొడ్లకాడ జీతం పెడతారని భయపడి పాస్ అయ్యాను. కళాశాలలో చేరేందుకు ఎన్నో కష్టాలు పడ్డాను. గుంటూరులోని ఓ హాస్టల్లో ఉంటూ చదువుకున్నాను. కుటుంబ పోషణ కోసం కూలీ పని చేశాను. ప్రతిరోజు సాయంత్రం పూలబుట్టలపై గోనె సంచి కుట్టగా వచ్చిన డబ్బులు, పక్కనే ఉన్న థియేటర్లో కౌంటర్లో కూర్చొని టికెట్లు విక్రయించగా వచ్చిన డబ్బులు తీసుకొని అర్ధరాత్రి లారీ ఎక్కి ఇంటికి వెళ్లేవాడిన’ని ఆనాటి కష్టాలను తలచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ‘ప్రతిరోజు పేపర్ చదివే అలవాటు ఉంది. ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం చూసి సాయం చేసేందుకు ముందుకొచ్చాను. ఇప్పటి వరకు 15 మందికి గుండె ఆపరేషన్లు చేయించాను. ఇప్పుడు వారంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. చదువుపై ఇష్టం ఉన్నవాణ్ని, కష్టం తెలిసినవాణ్ని కాబట్టే సాయం చేసేందుకు వెనుకాడలేదని’ చెప్పారు పోసాని. ‘సాక్షి’ టీవీ లైవ్‌లో... భవితకు భరోసా... మ్యాథ్స్ ప్రొఫెసర్ అవుతానని రాజేశ్వరి, కలెక్టర్ అవుతానని సఖినాబి, ఇంజినీర్ అవుతానని రష్మిత.. తమ ఇష్టాలను వెల్లడించారు. వీరి ముగ్గురి చదువులు పూర్తయి, ఉద్యోగాల్లో స్థిరపడే వరకూ అండగా ఉంటానని పోసాని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. తక్షణ ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి రూ.1.50 లక్షల చెక్కు అందజేశారు. ‘మీరు ఎంతో కష్టపడి చదివి మంచి మార్కులు సాధించారు. మీ అమ్మానాన్న, అన్నయ్యలతో కలిసి మంచి రెస్టారెంట్‌కు వెళ్లి కడుపు నిండా భోజనం చేయండి. తర్వాత కొత్త బట్టలు కొనుక్కొండ’ని ఒక్కొక్కరికి మరో రూ.10వేల నగదు అందజేశారు. పోసాని సాయానికి విద్యార్థినులు, కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మీరు ఉద్యోగాల్లో స్థిరపడ్డాక, మంచి బిర్యానీ తినిపించాలని పోసాని ఈ సందర్భంగా విద్యార్థినులతో చమత్కరించారు. ఇది అల్లు అర్జున్ సాయమే... ‘ఈ మధ్య హీరో అల్లుఅర్జున్ నాకు ఫోన్ చేసి ‘పోసాని గారు మీతో మాట్లాడాలి. టైమ్ చూసుకొని ఇంటికి వస్తారా’ అని అడిగారు. నేను ఎప్పుడు ఆయన్ను ఏమీ అనలేదు. ఎందుకు పిలిచారా? అని నాలో సందిగ్ధం నెలకొంది. అల్లుఅర్జున్‌ని వెళ్లి కలవగానే నాకో సీల్డ్ కవర్ ఇచ్చారు. ఓపెన్ చేస్తే రూ.5 లక్షల చెక్కు ఉంది. సార్.. ఇది నాకెందుకు ఇస్తున్నారు? అని అడిగాను. దీంతో ఆయన ‘పోసాని గారు.. మీరు 30 ఏళ్ల నుంచి పరిశ్రమలో ఉన్నారు. ఎంతో మందిని పరిశ్రమకు పరిచయం చేశారు. చాలా మందికి సొంత డబ్బులతో సాయం చేస్తున్నారు. అవన్నీ నేను తెలుసుకున్నాను. అందుకే నా వంతుగా మీకు ఈ సాయం. కాదనకుండా తీసుకోండి’ అని అన్నారు. ఆయన అంత చక్కగా చెప్పాక వద్దనలేకపోయాను. ఆ చెక్కు తీసుకొని బ్యాంక్‌లో వేశాను. కొద్ది రోజులకే ‘సాక్షి’లో ఈ కథనం చూసి సాయం చేసేందుకు వచ్చాను. దేవుడు అల్లు అర్జున్ రూపంలో నాకు సాయం చేశాడు. ఆ డబ్బును నేనేం చేసుకుంటాను. ఇలాంటి వారికి ఇస్తే వాళ్ల జీవితాలు బాగుపడతాయి కదా. ఆ ఆలోచనే నేనీ సాయం చేసేందుకు స్ఫూర్తినిచ్చింద’ని చెప్పారు పోసాని. రుణపడి ఉంటా... ప్రొఫెసర్ కావాలనేది నా కల. అది నెరవేరుతుందా? అని ఎప్పుడూ ఆలోచించేదాన్ని. ‘పది’ పరీక్షలు రాశాక, కాలేజీ చదువులు కష్టమనుకున్నాను. అయితే ‘సాక్షి’ పత్రిక మా ప్రతిభను గుర్తించి రాసింది. దానికి పోసాని సార్ స్పందించి సాయమందించారు. పోసాని గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. – రాజేశ్వరి అనుకున్నది సాధిస్తా... కలెక్టర్ కావాలనేది నా ఆకాంక్ష. ఇది నెరవేర్చేందుకు ముందుకొచ్చిన ‘సాక్షి’ దినపత్రికకు, నా చదువులు పూర్తయ్యే వరకూ భరోసానిచ్చిన పోసాని సార్‌కు రుణపడి ఉంటాను. నేను అనుకున్నది సాధించి... సాక్షి, పోసాని రుణం తీర్చుకుంటాను. – సఖినాబి దేవుడే పంపించాడు.. పరీక్షలు మరో 15రోజుల్లో ప్రారంభమనగా మా అమ్మ చనిపోయింది. చాలా కుంగిపోయాను. పరీక్షలు రాయలేనేమో అనుకున్నాను. కానీ ఇంజినీర్ కావాలనేది నా కల. అదే లక్ష్యంతో పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించాను. అయితే కాలేజీ ఫీజులు ఎలా? అని నాన్న సతమతమవుతున్న సమయంలో ‘సాక్షి’ మా గురించి కథనం రాసింది. పోసాని సార్ ముందుకొచ్చి సాయమందించారు. వీరిని దేవుడే మా దగ్గరికి పంపాడు. – రష్మిత -
మెరిట్ విద్యార్థుల కోసం కార్పొరేట్ వేట
-
మధువర్ధన్‌రెడ్డిది సర్కారు హత్యే
కదిరి: ‘మొన్న రిషితేశ్వరి ర్యాగింగ్‌తో కన్నుమూసింది. నిన్న మధువర్ధన్రెడ్డిని కూడా అదే ర్యాగింగ్ భూతం మింగేసింది. ప్రభుత్వం మొద ట్లోనే తగిన చర్యలు తీసుకున్నట్లైతే ర్యాగింగ్ భూతానికి మధు బలయ్యేవారు కాదు. మధువర్ధన్‌రెడ్డిది ముమ్మాటికీ ఆత్మహత్య కాదు..సర్కారు హత్య’ అని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. మధువర్ధన్‌రెడ్డి తండ్రి బ్రహ్మానందరెడ్డి, సోదరుడు ఉదయ్‌భాస్కర్‌రెడ్డి, కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి శనివారం అన్ని విద్యార్థి సంఘాలు అనంతపురం జిల్లా కదిరిలో మానవహారంతో పాటు రాస్తారోకో నిర్వహించారు. ర్యాగింగ్‌పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించక పోవడంతోనే వరుసగా మెరిట్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు రాఘవేంద్ర, రాజేంద్ర తదితరులు పేర్కొన్నారు. ‘‘అక్కడ జరిగిన విషయం నా కొడుకు ఇంటికొచ్చి చెప్పగానే నేను ఆ కళాశాల వారితో మాట్లాడాను. వారు నా మాటలను పెద్దగా పట్టించుకోలేదు. ఈ జూలై 25వ తేదీన కూడా నా కొడుకు మధు, నేను మరోసారి ఆ కాలేజ్‌కి వెళ్లి అడిగాం. నన్ను ర్యాగింగ్ చేసి, బాగా కొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మా వాడు వాళ్లను గట్టిగా అడిగాడు. వాళ్లు ‘ఆఆఆఆ..ఇవన్నీ మామూలే. అలాంటి వాటిని పెద్దగా పట్టించుకోకూడదు..ర్యాగింగ్ అనేది కామన్’’ అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో నా కొడుక్కు కోపమొచ్చింది..లగేజ్ తీసుకొని వచ్చేశాం. మళ్లీ 30వ తేదీ వాళ్లే ఫోన్ చేసి ‘‘మీ వాడు మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్. వాడు కచ్చితంగా ఇంటర్లో నెల్లూరు టాపర్‌గా ఉంటాడు. మీవాడితో పాటు మా కాలేజ్‌కి కూడా మంచి పేరొస్తుందని చెప్పడంతో వాడితోనే మాట్లాడండని ఫోన్ మధుకు ఇచ్చాను. వాళ్లు ఏం మాట్లాడారో..ఏమో గానీ నా బిడ్డను మాత్రం పోగొట్టుకున్నానయ్యా..వాడు చాలా మంచోడూ..చాలా తెలివైనవాడు..’’ అంటూ ఆ విద్యార్థి తండ్రి బ్రహ్మానందరెడ్డి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆ విద్యార్థి కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించి, నిందితులను కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఆ కళాశాల గుర్తింపును రద్దు చేసి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ వచ్చే వరకూ ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని జాతీయ రహదారిపైనే 3 గంటల పాటు బైఠాయించారు. తొలుత తహసీల్దార్ నాగరాజు అక్కడికి చేరుకొని నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. వారు వినకపోయేసరికి పోలీసులు ఆర్డీఓ రాజశేఖర్‌ను అక్కడికి పిలిపించి నచ్చజెప్పేలా చూశారు. ఈ సంఘటనపై విచారణ వేగవంతం చేశామని, ర్యాగింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి ఇప్పటికే కదిరి డీఎస్పీ ఎన్వీ రామాంజనేయులు నెల్లూరుకు వెళ్లి ఆ కళాశాల విద్యార్థులు, యాజమాన్యంతో వేర్వేరుగా మాట్లాడి విచారిస్తున్నారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇవ్వడంతో శాంతించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ విద్యార్థి విభాగంతోపాటు ఏబీవీపీ, ఏఐఎస్ఎఫ్, ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు పాల్గొన్నారు. -
టీటీడీ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటానా?
దెక్కడి చోద్యం.. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసిన చెవిరెడ్డి తిరుపతి : అసెంబ్లీ సమావేశాలు వేదికగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి టీటీడీ నిర్వహణలోని కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీశారు. మేనేజ్మెంట్ కోటా అమలు చేస్తుం డడం వల్ల మెరిట్ విద్యార్థులు, రిజర్వేషన్ కోటా విద్యార్థులు అవకాశాలు కోల్పోతున్నారని ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు. మేనేజ్మెంట్ కోటాలో 52 శాతం మార్కులు వచ్చిన వారు సీట్లు పొందుతుంటే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 81 శాతం మార్కులు పొందినా సీట్లు దక్కడం లేదని అన్నారు. ఓసీ మెరిట్ కోటాలో 87 శాతం వద్ద అడ్మిషన్లు ఆగిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా లేనపుడు ప్రభుత్వ అనుబంధ సంస్థగా ఉన్న టీటీడీలో ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. కొందరు టీటీడీ అధికారులు తమ పరపతి పెంచుకోవడానికి, పైరవీలు చేసుకోవడానికి మేనేజ్మెంట్ కోటాను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. మేనేజ్మెంట్ కోటా కింద టీటీడీ కళాశాలల్లో అడ్మిషన్లు పొందుతున్న కొందరు విద్యార్థులు ఉచిత బస, భోజన సౌకర్యాలు పొంది తరగతులకు సరిగా వెళ్లకుండా సొంత వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని అర్హతలు ఉండి అడ్మిషన్లు పొందలేకపోతున్న మెరిట్ విద్యార్థులకు, రిజర్వేషన్ కోటా విద్యార్థులకు ఏ రకంగా న్యాయం చేస్తారని ఆయన ప్రశ్నించారు. టీటీడీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ సరిగా అమలు కావడం లేదన్నారు. నివేదికలు తెప్పిస్తాం సభలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి లేవనెత్తిన అంశంపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు సమాధానం ఇస్తూ టీటీడీలో ఇలా జరుగుతున్నట్లు తమ దృష్టికి రాలేదన్నారు. నివేదికలు తె ప్పించుకుని తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
మెరిట్ విద్యార్థులకు ఆర్థిక సాయం
-
సాల్సా 4 వాటర్
డ్యాన్స చేస్తే ఏం వస్తుంది? ఆనందం! అంతేనా? సామాజికసేవకు కావలసిన చైతన్యం కూడా అంటున్నారు ఈ యువకులు... వీళ్లు మామూలు విద్యార్థులు... మెరిట్ విద్యార్థులు ఎంతమాత్రం కాదు. గొప్ప విద్యావంతులుగానో, వ్యాపారవేత్తలుగానో ఎదిగే అవకాశం లేనివారు. అయినా తమకు చేతనైనంతలో సేవ చేసి చూపిస్తున్నారు! ప్రస్తుతం ప్రపంచంలో తాగడానికి సురక్షితమైన నీటి సదుపాయం లేని వారి సంఖ్య 783 మిలియన్లు (ఒక మిలియన్‌కి పదిలక్షలు). ఇంకోరకంగా చెప్పాలంటే ప్రపంచ జనాభాలో ప్రతి పదిమందిలో ఒకరికి సురక్షితమైన నీరు అందుబాటులో లేదు. దీనివల్ల వారికి అనారోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయి. చిన్నారులకు అత్యంత భయంకరమైన వ్యాధులు సోకుతున్నాయి. ఈ విషయం తెలిసినప్పుడు ఎవరైనా బాధపడతారు. గ్లాస్గో యూనివర్సిటీలో చదువుతున్న కొంతమంది విద్యార్థులకు కూడా ఇలాగే బాధేసింది. ట్రెండీ, మోడ్రన్, అర్బనైజ్డ్ అయిన వీరు ఈ విషయంలో బాధపడి ఊరుకోలేదు, తామేం చేయలేం... అనే అభిప్రాయానికి రాలేదు. మనసుంటే మార్గం ఉంటుందన్నట్టుగా... వాటర్ విషయంలో వారి వితరణ మొదలైంది. సాల్సాను సొమ్ముచేసుకొన్నారు! యూకే పరిధిలోని యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గోలో ‘సాల్సా’ అంటే పిచ్చి. సాల్సా వచ్చిన వాళ్లు మిగిలిన వారి దృష్టిలో ఆరాధ్యులే! అలాంటి సాల్సా డాన్స్ నేర్చుకొని వర్సిటీలో హీరోలు అయిపోదామని చాలామంది స్టూడెంట్స్ అనుకొంటుంటారు. అలాంటి నేపథ్యంలో సాల్సాకూ చారిటీకి ముడిపెట్టారు కొంతమంది స్టూడెంట్స్. తాము సాల్సా డాన్స్ నేర్పిస్తామని, నేర్చుకొన్నవారు డబ్బు చెల్లించాల్సి ఉంటుందని, ఆ డబ్బును పేద ప్రజలకు మంచినీటిని అందించేందుకు వినియోగిస్తామని ప్రకటించారు. అలా ‘సాల్సా 4 వాటర్’ స్టూడెంట్స్ ఎన్జీవో ప్రస్థానం మొదలైంది. అనేక వర్సిటీలకు... ఒక మనిషికి ఒక ఏడాది పాటు సురక్షితమైన నీటిని అందివ్వడానికి అయ్యే ఖర్చు 15 పౌండ్లు (ఒక పౌండ్ అంటే రూ.101)గా లెక్కగట్టారు విద్యార్థులు. ఈ లెక్కన వీలైనంత ఎక్కువమంది కోసం తాము నిధుల సేకరణ చేపట్టాలని భావించారు. చారిటీ కార్యక్రమం గురించి సమాచారం అందుకొని వర్సిటీలో నూటయాభై మంది డాన్స్ మాస్టర్లు ముందుకొచ్చారు. నేర్చుకోవాలనుకొంటున్నవారు ఒక్కో క్లాస్‌కు మూడు పౌండ్లు చెల్లించాల్సి ఉంటుంది. అలా యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గోలో మొదలైన ఈ నిధుల సేకరణకార్యక్రమం ఇప్పుడు యూకే మొత్తం విస్తరించింది. అనేక వర్సిటీల్లో ఊపందుకొంది. యువతీ యువకుల ఆదరణ చూరగొంది. సూపర్ సక్సెస్ అయ్యింది! సాల్సా ద్వారా వీరంతా కలసి ఇప్పటివరకూ వేల డాలర్ల నిధులు సేకరించారు. వేలాది మందికి సురక్షిత నీటి సదుపాయాన్ని కలిగించారు. ఈ స్టూడెంట్స్ స్ఫూర్తి మిగతా దేశాలకూ పాకింది. చెక్ రిపబ్లిక్, స్వీడన్, ఫ్రాన్స్ దేశాల్లోని అనేక వర్సిటీల్లో ‘సాల్సా 4 వాటర్’ ఎన్జీవో కార్యక్రమాలు విస్తరించాయి. వివిధ వ్యాపారసంస్థలు ఈ ఎన్జీవోకి అవార్డులు, రివార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి. సాల్సాకు ఉన్న క్రేజ్‌ను చారిటీగా మార్చాలనే ఐడియా శామ్ కండల్ అనే గ్లాస్గో యూనివర్సిటీ విద్యార్థిది. అయితే కార్యాచరణలో వర్సిటీలోని అందరి విద్యార్థులదిగా మొదలైంది. ఉమ్మడిగా, ఉత్సాహంగా ఊపందుకొంది. సామాజికసేవకు తమ వంతు సహకారాన్ని అందిస్తోంది. ఛారిటీ కార్యక్రమం గురించి సమాచారం అందుకొని వర్సిటీలో నూటయాభై మంది డాన్స్మాస్టర్లు ముందుకొచ్చారు. నేర్చుకోవాలనుకొంటున్న వారు ఒక్కో క్లాస్‌కు మూడు పౌండ్లులు చెల్లించాల్సి ఉంటుంది. అలా యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గోలో మొదలైన ఈ నిధులసేకరణ కార్యక్రమం ఇప్పుడు యూకే మొత్తం విస్తరించింది. అనేక వర్సిటీల్లో ఊపందుకొంది. -
ప్రత్యేక ప్రతిభావంతులకు శ్రీవారి దర్శనం
అంధులు, మూగ, చెవిటి, మానసిక వికలాంగులు 1,153 మంది గురువారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆనందపరవశులయ్యారు. చెన్నైకి చెందిన మూడు స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక ప్రతిభావంతులను తిరుమల కొండకు తీసుకొచ్చి వారికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. వీరు మహద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లేలా టీటీడీ అధికారులు, సిబ్బంది సహకారం అందించారు. దర్శన సమయంలో వీరు ‘పెరుమాళ్ సామీ.. ఏలుమలై ఎంగటేశా..!’ అంటూ గోవింద నామాలు పలికారు. మాటలు రానివారు సైతం స్వామిని దర్శించుకుని చేతితో ఒకరికొకరు సైగలు చేసుకుంటూ ఆనంద పరవశులయ్యారు. కంటి చూపులేని వారు సైతం ‘మేమంతా మనసుతో స్వామిని దర్శించాం’ అంటూ తన్మయత్వాన్ని వ్యక్తం చేశారు. శ్రీవారి దర్శనానికి 14 గంటలు తిరుమలలో గురువారం భక్తుల రద్దీ పెరిగింది. రెండు రోజులుగా భక్తుల రద్దీ సాధారణ స్థాయిలో ఉండడంతో లఘు దర్శనం అమలుచేశారు. గురువారం అనూహ్యంగా భక్తులు పెరిగారు. రెండు నడకదారుల్లో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు.