అంధులు, మూగ, చెవిటి, మానసిక వికలాంగులు 1,153 మంది గురువారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆనందపరవశులయ్యారు. చెన్నైకి చెందిన మూడు స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక ప్రతిభావంతులను తిరుమల కొండకు తీసుకొచ్చి వారికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. వీరు మహద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లేలా టీటీడీ అధికారులు, సిబ్బంది సహకారం అందించారు. దర్శన సమయంలో వీరు ‘పెరుమాళ్ సామీ.. ఏలుమలై ఎంగటేశా..!’ అంటూ గోవింద నామాలు పలికారు. మాటలు రానివారు సైతం స్వామిని దర్శించుకుని చేతితో ఒకరికొకరు సైగలు చేసుకుంటూ ఆనంద పరవశులయ్యారు. కంటి చూపులేని వారు సైతం ‘మేమంతా మనసుతో స్వామిని దర్శించాం’ అంటూ తన్మయత్వాన్ని వ్యక్తం చేశారు.
శ్రీవారి దర్శనానికి 14 గంటలు
తిరుమలలో గురువారం భక్తుల రద్దీ పెరిగింది. రెండు రోజులుగా భక్తుల రద్దీ సాధారణ స్థాయిలో ఉండడంతో లఘు దర్శనం అమలుచేశారు. గురువారం అనూహ్యంగా భక్తులు పెరిగారు. రెండు నడకదారుల్లో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు.