
విద్యార్థినులతో పోసాని...
ఆ బాలికలు మట్టిలో మాణిక్యాలు.. పేదింటి విద్యాకుసుమాలు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, కష్టపడి చదివి అత్యున్నత ఫలితాలు సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించి పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటారు. వారే రష్మిత (9.8 జీపీఏ, వనస్థలిపురం జెడ్పీహెచ్‌ఎస్), టి.రాజేశ్వరి (9.7 జీపీఏ, సూరారం జెడ్పీహెచ్‌ఎస్), సఖినాబి (9.5 జీపీఏ, ఘట్కేసర్ జెడ్పీహెచ్‌ఎస్). ఈ చదువుల తల్లులకు చేయూతనందిస్తే భవిష్యత్ బంగారమవుతుందని.. ‘వెన్ను తడితే.. బంగారు భవితే’ శీర్షికతో ‘సాక్షి’ మే 30న కథనం ప్రచురించింది. దీనికి స్పందించిన సినీనటుడు పోసాని కృష్ణమురళి సాయం చేసేందుకు ముందుకొచ్చారు.
హిమాయత్‌నగర్ : బంజారాహిల్స్ రోడ్ నెంబర్.1 ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలోని టీవీ స్టూడియోలో గురువారం జరిగిన లైవ్ కార్యక్రమంలో పోసాని పైచదువుల నిమిత్తం విద్యార్థినులకు ఒక్కొక్కరికి రూ.1.50 లక్షల చెక్కు అందజేశారు. నూతన దుస్తులు కొనుక్కొని, కుటుంబసభ్యులతో సరదాగా గడపమని ఒక్కొక్కరికి మరో రూ.10వేల నగదు ఇచ్చారు. ఈ సందర్భంగా పొసాని తన చదువు, సేవా కార్యక్రమాల గురించి ‘సాక్షి’ లైవ్‌లో పంచుకున్నారు.
గొడ్లకాడ పెడతారని...
‘మాకు మొదట్లో చాలా ఆస్తులు ఉండేవి. అయితే కొన్ని కారణాలరీత్యా వాటిని కోల్పోయాం. ఆ రోజుల్లో నన్ను చదివించడం మావాళ్లకు కష్టమైంది. ఏడో తరగతిలో తప్పితే గొడ్లకాడ జీతం పెడతారని భయపడి పాస్ అయ్యాను. కళాశాలలో చేరేందుకు ఎన్నో కష్టాలు పడ్డాను. గుంటూరులోని ఓ హాస్టల్‌లో ఉంటూ చదువుకున్నాను. కుటుంబ పోషణ కోసం కూలీ పని చేశాను. ప్రతిరోజు సాయంత్రం పూలబుట్టలపై గోనె సంచి కుట్టగా వచ్చిన డబ్బులు, పక్కనే ఉన్న థియేటర్‌లో కౌంటర్‌లో కూర్చొని టికెట్లు విక్రయించగా వచ్చిన డబ్బులు తీసుకొని అర్ధరాత్రి లారీ ఎక్కి ఇంటికి వెళ్లేవాడిన’ని ఆనాటి కష్టాలను తలచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ‘ప్రతిరోజు పేపర్ చదివే అలవాటు ఉంది. ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం చూసి సాయం చేసేందుకు ముందుకొచ్చాను. ఇప్పటి వరకు 15 మందికి గుండె ఆపరేషన్లు చేయించాను. ఇప్పుడు వారంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. చదువుపై ఇష్టం ఉన్నవాణ్ని, కష్టం తెలిసినవాణ్ని కాబట్టే సాయం చేసేందుకు వెనుకాడలేదని’ చెప్పారు పోసాని.
‘సాక్షి’ టీవీ లైవ్‌లో...
భవితకు భరోసా...
మ్యాథ్స్ ప్రొఫెసర్ అవుతానని రాజేశ్వరి, కలెక్టర్ అవుతానని సఖినాబి, ఇంజినీర్ అవుతానని రష్మిత.. తమ ఇష్టాలను వెల్లడించారు. వీరి ముగ్గురి చదువులు పూర్తయి, ఉద్యోగాల్లో స్థిరపడే వరకూ అండగా ఉంటానని పోసాని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. తక్షణ ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి రూ.1.50 లక్షల చెక్కు అందజేశారు. ‘మీరు ఎంతో కష్టపడి చదివి మంచి మార్కులు సాధించారు. మీ అమ్మానాన్న, అన్నయ్యలతో కలిసి మంచి రెస్టారెంట్‌కు వెళ్లి కడుపు నిండా భోజనం చేయండి. తర్వాత కొత్త బట్టలు కొనుక్కొండ’ని ఒక్కొక్కరికి మరో రూ.10వేల నగదు అందజేశారు. పోసాని సాయానికి విద్యార్థినులు, కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మీరు ఉద్యోగాల్లో స్థిరపడ్డాక, మంచి బిర్యానీ తినిపించాలని పోసాని ఈ సందర్భంగా విద్యార్థినులతో చమత్కరించారు.
ఇది అల్లు అర్జున్ సాయమే...
‘ఈ మధ్య హీరో అల్లుఅర్జున్ నాకు ఫోన్ చేసి ‘పోసాని గారు మీతో మాట్లాడాలి. టైమ్ చూసుకొని ఇంటికి వస్తారా’ అని అడిగారు. నేను ఎప్పుడు ఆయన్ను ఏమీ అనలేదు. ఎందుకు పిలిచారా? అని నాలో సందిగ్ధం నెలకొంది. అల్లుఅర్జున్‌ని వెళ్లి కలవగానే నాకో సీల్డ్ కవర్ ఇచ్చారు. ఓపెన్ చేస్తే రూ.5 లక్షల చెక్కు ఉంది. సార్.. ఇది నాకెందుకు ఇస్తున్నారు? అని అడిగాను. దీంతో ఆయన ‘పోసాని గారు.. మీరు 30 ఏళ్ల నుంచి పరిశ్రమలో ఉన్నారు. ఎంతో మందిని పరిశ్రమకు పరిచయం చేశారు. చాలా మందికి సొంత డబ్బులతో సాయం చేస్తున్నారు. అవన్నీ నేను తెలుసుకున్నాను. అందుకే నా వంతుగా మీకు ఈ సాయం. కాదనకుండా తీసుకోండి’ అని అన్నారు.
ఆయన అంత చక్కగా చెప్పాక వద్దనలేకపోయాను. ఆ చెక్కు తీసుకొని బ్యాంక్‌లో వేశాను. కొద్ది రోజులకే ‘సాక్షి’లో ఈ కథనం చూసి సాయం చేసేందుకు వచ్చాను. దేవుడు అల్లు అర్జున్ రూపంలో నాకు సాయం చేశాడు. ఆ డబ్బును నేనేం చేసుకుంటాను. ఇలాంటి వారికి ఇస్తే వాళ్ల జీవితాలు బాగుపడతాయి కదా. ఆ ఆలోచనే నేనీ సాయం చేసేందుకు స్ఫూర్తినిచ్చింద’ని చెప్పారు పోసాని.
రుణపడి ఉంటా...
ప్రొఫెసర్ కావాలనేది నా కల. అది నెరవేరుతుందా? అని ఎప్పుడూ ఆలోచించేదాన్ని. ‘పది’ పరీక్షలు రాశాక, కాలేజీ చదువులు కష్టమనుకున్నాను. అయితే ‘సాక్షి’ పత్రిక మా ప్రతిభను గుర్తించి రాసింది. దానికి పోసాని సార్ స్పందించి సాయమందించారు. పోసాని గారికి జీవితాంతం రుణపడి ఉంటాను.
– రాజేశ్వరి
అనుకున్నది సాధిస్తా...
కలెక్టర్ కావాలనేది నా ఆకాంక్ష. ఇది నెరవేర్చేందుకు ముందుకొచ్చిన ‘సాక్షి’ దినపత్రికకు, నా చదువులు పూర్తయ్యే వరకూ భరోసానిచ్చిన పోసాని సార్‌కు రుణపడి ఉంటాను. నేను అనుకున్నది సాధించి... సాక్షి, పోసాని రుణం తీర్చుకుంటాను.
– సఖినాబి
దేవుడే పంపించాడు..
పరీక్షలు మరో 15రోజుల్లో ప్రారంభమనగా మా అమ్మ చనిపోయింది. చాలా కుంగిపోయాను. పరీక్షలు రాయలేనేమో అనుకున్నాను. కానీ ఇంజినీర్ కావాలనేది నా కల. అదే లక్ష్యంతో పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించాను. అయితే కాలేజీ ఫీజులు ఎలా? అని నాన్న సతమతమవుతున్న సమయంలో ‘సాక్షి’ మా గురించి కథనం రాసింది. పోసాని సార్ ముందుకొచ్చి సాయమందించారు. వీరిని దేవుడే మా దగ్గరికి పంపాడు.
– రష్మిత
Comments
Please login to add a commentAdd a comment