ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కళాకారులకు అండగా ఉంటామన్నారు ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి. రాష్ట్రంలోని ఆర్టిస్టులు, టెక్నీషియన్లందరికీ ఐడీ కార్డులు ఇస్తామన్నారు. బుధవారం నాడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 'ఏపీలో ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరికీ ఐడీ కార్డులు ఇస్తాం. దానివల్ల బయటవారికి ఆర్టిస్టుల ఎంపిక సులభతరమవుతుంది. సినిమా రంగంలో మా అసోసియేషన్ ఉంది కానీ, మాలో మెంబర్ అవాలంటే డబ్బులివ్వాలి. ఇతర అసోసియేషన్‌లోనూ డబ్బులు తీసుకుంటారు. కానీ ఇక్కడ ఒక్క రూపాయి కూడా కమీషన్ తీసుకోము. ప్రభుత్వం నిర్ణయించిన ఐదు విభాగాల్లో నంది నాటక అవార్డులకు ఎటు వంటి విమర్శలకు తావులేకుండా ఉత్తమ కళాకారులను ఎంతో పారదర్శకంగా ఎంపిక చేస్తున్నట్లు ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి తెలిపారు.
పోసాని కృష్ణ మురళి పాత్రికేయులతో మాట్లాడుతూ.. 'నంది నాటక పురస్కారాలకై ఉత్తమ కళాకారులను ఎంపిక చేసేందుకు అనుసరిస్తున్న ప్రక్రియను వివరించారు. ఈ అవార్డులకు కళాకారుల పతిభ, సామర్థ్యం ఆధారంగానే ఉత్తమ కళాకారులను ఎంపిక చేయడం జరుగుతుందని, ఈ ఎంపికలో ఎటు వంటి సిఫార్సులకు తావు ఉండదని ఆయన స్పష్టం చేశారు. విభాగాల వారీగా ఎంతో అనుభవం ఉన్న వారినే న్యాయ నిర్ణేతలుగా నియమించడం జరిగిందన్నారు. న్యాయ నిర్ణేతల ప్రొఫైల్స్‌ను ఏపీఎఫ్‌డీసీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. నిర్ణయించిన కార్యాచరణ ప్రకారం ఈ న్యాయ నిర్ణేతలు క్షేత్ర స్థాయిలో పర్యటన జరిపి విభాగాల వారీగా తుది ప్రదర్శనకు కళాకారులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. పద్య నాటక విభాగానికి సంబందించిన న్యాయ నిర్ణేతలు తమ పర్యటనను సెప్టెంబరు 8 న కర్నూలు నుండి ప్రారంభించి 18 వ తేదీతో విశాఖపట్నంలో ముగిస్తారన్నారు. సాంఘిక నాటకం, యువజన నాటిక విభాగం న్యాయ నిర్ణేతలు సెప్టెంబరు 10 న పిఠాపురంలో ప్రారంభమై 18వ తేదీతో కర్నూలులో తమ పర్యటనను ముగిస్తారన్నారు. అదే విధంగా సాంఘిక నాటికలు, బాలల నాటికల న్యాయ నిర్ణేతలు సెప్టెంబరు 7న అనంతపురంలో ప్రారంభమై 18 వ తేదీన విశాఖపట్నంలో తమ పర్యటనను ముగిస్తారన్నారు. తుది ప్రదర్శనకు అర్హమైన కళా బృందాలను సెప్టెంబరు 19 వ తేదీ కల్లా ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు.
విభాగాల వారీగా అందిన ధరఖాస్తులు
ఈ ఏడాది పద్య, సాంఘిక నాటకం, బాలల, యువజన నాటికలతో పాటు నాటక రంగ తెలుగు రచనలు అనే ఐదు విభాగాల్లో నంది నాటక పురస్కారాలను అందజేసేందుకు అర్హులైన కళాకారులు, రచయితల నుంచి మొత్తం 118 ధరఖాస్తులు అందాయన్నారు. వీటిలో నాటక రంగ తెలుగు రచన విభాగానికై 3 ధరఖాస్తులు, పద్యనాటకానికై 26, సాంఘిక నాటకానికై 22, యువజన నాటికకు 9, సాంఘిక నాటికకు 49, బాలల నాటిక విభాగంలో 9మొత్తం 118 ధరఖాస్తులు అందినట్లు ఆయన తెలిపారు. వీటిలో నాటక రంగ తెలుగు రచన విభాగం క్రింద ఒక పుస్తకాన్ని ఎంపిక చేయాల్సి ఉందన్నారు. అదే విధంగా పద్యనాటకానికై 10 దరఖాస్తులను, సాంఘిక నాటకానికై 6, యువజన నాటికకు 5, సాంఘిక నాటికకు 12, బాలల నాటిక విభాగంలో 5 మొత్తం 39 ధరఖాస్తుదారులను తుది ప్రదర్శన కోసం ఎంపిక చేయాల్సి ఉందన్నారు.
కళాకారులకు గుర్తింపు కార్డులు జారీ చేస్తాం……
రాష్ట్రంలోని కళాకారులు అందరికీ గుర్తింపు కార్డులు జారీచేయాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్రానికి చెందిన కళాకారులు ఎక్కడున్నా సరే వారికి ఈ గుర్తింపు కార్డులు జారీచేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా ఆ కళాకారుల వివరాలను అన్నింటిని అఫీషియెల్ వెబ్‌సైట్‌లో అందరికీ అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. ఏజంట్ల ప్రమేయం ఏమాత్రం లేకుండా సినిమా నిర్మాతలకు, దర్శకులకు ఎటు వంటి కళాకారులు కావాల్సి ఉన్నా నేరుగా వారి వివరాలను అందజేయడం జరుగుతుందన్నారు. తద్వారా కళాకారులు సినిమా నిర్మాతలు, దర్శకుల నుండి నేరుగా జీవనోపాది పొందేందుకు అవకాశం ఏర్పడు తుందన్నారు. అదే విధంగా ఏజంట్లకు ఎటు వంటి కమిషన్ చెల్లించాల్సిన పరిస్థితి కూడా తలెత్తదని ఆయన తెలిపారు.
న్యాయ నిర్ణేతలు వీరే……
నాటక రంగ తెలుగు రచనలకు సంబందించి ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ (చీరాల), ఆచార్య గుమ్మా సాంబశివ రావు (విజయవాడ) మరియు ఆచార్య ఎన్.వి.కృష్ణారావును (గుంటూరు) న్యాయ నిర్ణేలుగా నియమించడం జరిగిందన్నారు. పద్యనాటక విభాగానికై కురుటి సత్యం నాయుడు (విశాఖపట్నం), ఎమ్.కుమార్ బాబు (తెనాలి), మెతుకపల్లి సూర్య నారాయణ యాదవ్ (ఏలూరు); సాంఘిక నాటకం, యువజన నాటికకు ఆకుల మల్లేశ్వర రావు (తిరుపతి), పి.శివ ప్రసాద్ (విశాఖపట్నం), ఎస్.ఆర్.ఎస్. ప్రసాద్ (ప్రొద్దుటూరు) మరియు సాంఘిక, బాలల నాటిక విభాగానికి డా.కె.జి.వేణు (విశాఖపట్నం), డా.దాసిరి నల్లన్న (తిరుపతి) మరియు పి.సుమ (సుబ్రహ్మణ్యం) (ఒంగోలు) వారిని న్యాయ నిర్ణేతలుగా నియమించడం జరిగిందని ఆయన తెలిపారు .
ఇకపై కమీషన్‌లకు చెక్
జూనియర్ ఆర్టిస్టులు ఎంతో కష్టపడుతున్నా వారి డబ్బు సగం ఏజెంటే తింటున్నాడు. వారికి రూ.400 ఇస్తే అందులో రూ.200 ఏజెంటే కమీషన్ తీసుకుంటున్నాడు. కాబట్టి ఏజెంట్ల మధ్యవర్తిత్వమే వద్దు. డైరెక్టర్ ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తే కళాకారుల వివరాలన్నీ వస్తాయి. ఎటువంటి మధ్యవర్తిత్వం లేకుండా డైరెక్ట్‌గా సినిమాలు చేయాలి. వారికి ఇంకా ఎటువంటి రాయితీలు ఇవ్వాలనేది ఆలోచిస్తున్నాం' అని తెలిపారు.
బన్నీ రూ.5 లక్షలిచ్చాడు
అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రావడంపై ఆయన స్పందిస్తూ.. 'బన్నీ చాలా మంచివాడు. నన్ను ఎంతో అభిమానిస్తాడు. ఓసారి నాకు రూ.5 లక్షలు ఇచ్చాడు. నాకెందుకిచ్చావని అడిగితే మీరు డబ్బు వృథా చేయరు, చాలామందికి గుండె ఆపరేషన్ చేయించారు, అది నాకు తెలుసు. మీరు మంచిపనికే ఉపయోగిస్తారు. అందుకే ఇచ్చానని చెప్పాడు. ఆ డబ్బును ఆర్థిక స్థోమత లేక చదువు ఆపేసిన ముగ్గురు విద్యార్థులకు చెరో లక్షన్నర ఇచ్చాను. దాన్ని చదువుకోసం వాడమని చెప్పాను. మిగిలిన రూ.50 వేలను మళ్లీ ముగ్గురికి పంచేసి కొత్త బట్టలు కొనుక్కోమన్నాను. ఈ డబ్బులిచ్చింది అల్లు అర్జున్, ఆయనకు థ్యాంక్స్ చెప్పమని లైవ్‌లో పిల్లలతో థ్యాంక్స్ చెప్పించాను' అని పేర్కొన్నారు పోసాని కృష్ణమురళి.
చదవండి: ఆ ఫోటోలు లీక్ అవడంతో నిద్రలేని రాత్రులు.. ఉగ్రదాడితో బెదిరింపులు..
Comments
Please login to add a commentAdd a comment