బాబూ.. ఎందుకీ కక్ష!
- వైఎస్సార్‌సీపీపై చంద్రబాబు కక్ష సాధింపు
- చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపణ
సాక్షి, విశాఖపట్నం : చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీని ప్రతిపక్షంగా చూడకుండా.. శత్రువుగా చూస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని చంద్రగిరి ఎమ్మెల్యే, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపించారు.
సోమవారం ఆయన నగరంలోని వీజేఎఫ్ వినోదవేదికలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్ సీపీని ఏదోలా తొక్కేయాలన్న చంద్రబాబు కుట్రలు ఫలించవన్నారు. చిత్తూరు జిల్లాలోని జీడి నెల్లూరుకు చెందిన వైఎస్సార్ సీపీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు విజయానందరెడ్డిని ఎర్రచందనం కేసులో అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు పంపడం కక్ష సాధింపు చర్యగా పేర్కొన్నారు.
ఎన్నికల ముందు వరకు ఎలాంటి కేసులూ ఆయనపై లేవని, ఇప్పుడు అకస్మాత్తుగా పీడీ చట్టం ప్రయోగించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కడపజిల్లాలో ఎర్రచందనం కేసులో ఉన్న రెడ్డి నారాయణకు జెడ్‌పీటీసీ, పీడీ చట్టం నమోదైన మహేష్‌నాయుడుకు సుండుపల్లి మండలం ఎంపీటీసీ స్థానానికి టీడీపీ బి-ఫారం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో చంద్రబాబు నాయుడుకు కూడా ఎర్రచందనం కేసులో భాగస్వామ్యమున్నట్టేనా? అని ప్రశ్నించారు.
తానెప్పుడూ తప్పుడు దారిలో ఎదగాలనుకోలేదని, అలాంటివారికి సహకరించిందీ లేదని స్పష్టం చేశారు. విజయానందరెడ్డిపై ఆరోపణలు రుజువైతే ఉరి శిక్ష వేసినా తాము మద్దతిస్తామన్నారు. ఎర్రచందనం అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని వైఎస్సార్ సీపీ తరపున డిమాండ్ చేశారు.