చేయని తప్పుకు రోజాకు 14 నెలలు శిక్షా?
విజయవాడ: చేయని తప్పుకు ఎమ్మెల్యే రోజాను శాసనసభ నుంచి సస్పెండ్ చేశారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి అన్నారు. మహిళల సమస్యలపై నిలదీస్తున్న రోజా గొంతు నొక్కాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆమె శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కొత్త రాజధానిలో తెలుగుదేశం ప్రభుత్వం కొత్త సంప్రదాయాలకు తెర తీస్తోంది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్షానికి సభలో మాట్లాడటానికి అవకాశం ఇస్తుందని భావించాం. అయితే ప్రతిపక్ష నేతపై ఏ రకంగా వ్యక్తిగత విమర్శలు చేస్తోందో గమనించే ఉంటారు. సమస్యలను లేవనెత్తితే...ఆ అంశాలను పక్కదాని పట్టించేందుకు ప్రభుత్వం వ్యక్తిగత దూషణలకు దిగుతోంది.
ఎమ్మెల్యే రోజాపై మరో ఏడాదిపాటు సస్పెన్షన్ కొనసాగించాలని ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు చేయడం దారుణం. చేయని తప్పుకు రోజా 14 నెలలు శిక్ష అనుభవించారు. మళ్లీ కొత్తగా ఎమ్మెల్యే అనిత అంశాన్ని తెరమీదకు తెచ్చి మరో ఏడాది సస్పెండ్ చేయాలని చూడటం దారుణం. రోజా చేసిన తప్పేంటి?. టీడీపీ సర్కార్ హయాంలో ఎమ్మార్వో వనజాక్షిపై దాడి, రితేశ్వరి ఆత్మహత్యం అంశం, కాల్‌మనీ దారుణాలపై అసెంబ్లీ సాక్షిగా నిలదీశారనే కక్షపూరితంగా సస్పెండ్ చేశారు.
తాజాగా అనంతపురం జిల్లాలో పయ్యావుల కేశవ్ వర్గం ఓ మహిళపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆ అంశాన్ని నిలదీసిందుకా? లేక విశాఖలో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తామంటే అడ్డుకున్నందుకా రోజాను సస్పెండ్ చేసింది. రోజాను చూస్తే చంద్రబాబుకు ఎందుకంత భయం?. దళితల కోసం ఏనాడు పోరాటం చేయని అనితా ఈరోజు రాజకీయ మైలేజ్ కోసం రోజాను ఇరికిస్తున్నారు. హత్య చేసిన ఖూనీకోరుకు ఒకేసారి శిక్షవేస్తారు. అలాగే దోషికి శిక్ష విధించేటప్పుడు చివరి కోరిక అడుగుతారని... అలాంటిది ఏకపక్షంగా సస్పెన్షన్ చేసిన రోజాను... ప్రభుత్వం వివరణ అడగకపోవడం మహిళగా సిగ్గుపడుతున్నా. మహిళల పట్ల ప్రభుత్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు.’ అని అన్నారు.