ప్రాణత్యాగానికి సిద్ధం: వైఎస్ఆర్ సీపీ ఎమ‍్మెల్యేలు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం అవసరం అయితే ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రివిలేజెస్ కమిటీ సమావేశం ఎదుట హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసమే అసెంబ్లీని స్తంభింపచేశామన్నారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం హోదాపై తమ పోరు కొనసాగుతుందని స్పష్టం చేశారు. అవసరం అయితే వందసార్లు బల్లలు ఎక్కుతానని, వెయ్యిసార్లు మైకు లాగుతానని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ బెదిరింపులకు భయపడేది లేదని, ఎమ‍్మెల్యేలుగా ప్రజల ఆకాంక్షలనే తెలియచేశామన్నారు. ఎమ‍్మెల్యేల ఫిరాయింపుల కేసును పట్టించుకోని ప్రభుత్వం తమ విషయంలో మాత్రం అత్యుత్సాహం ప్రదరిస్తోందని ముత్యాలనాయుడు, సునీళ్ కుమార్, సంజీవయ్య, జోగులు అన్నారు.
మరోవైపు ప్రివిలేజెస్ కమిటీ చైర‍్మన్ గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ మొత్తం 12మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చామని, నిన్న, ఇవాళ విచారణకు హాజరు కాని మరో ముగ్గురిని డిసెంబర్ 2న విచారిస్తామన్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోగా స్పీకర్కు నివేదిక సమర్పిస్తామని ఆయన తెలిపారు.