హోదా కోసమే మా నిరసన
- మేమెవరినీ అగౌరవ పర్చలేదు
- మాకు దురుద్దేశం లేదు
- రెండోరోజు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల వివరణ
- సభా హక్కుల కమిటీ ముందు ఐదుగురి హాజరు
- నేడు కూడా ఇద్దరు కమిటీ సభ్యుల డుమ్మా
సాక్షి, హైదరాబాద్: ‘ప్రత్యేక హోదా అంశం తీవ్రతను చాటి చెప్పాలనే ఉద్దేశంతోనే శాసనసభలో మేం నిరసన వ్యక్తం చేశాం... దీని వెనుక ఎలాంటి దురుద్దేశం లేదు... ఎవరినీ అగౌరవపర్చలేదు... సీఎం చంద్రబాబు స్వయంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని తీర్మానాలు చేసి పంపి తానే కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటనకు స్వాగతం పలికితే మాకు కడుపులో భగ్గుమనదా... అందుకే అసెంబ్లీలో ప్రతిపక్షంగా ప్రజల తరఫున హోదాపై చర్చకు పట్టు బట్టాం. మేం చేసిం దేమీ తప్పుగా భావించడం లేదు...హోదా సాధనకు ఎంత దూరమైనా పోరాటం చేస్తాం’ అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు రెండో రోజు ఏపీ శాసనసభా హక్కుల కమిటీ ముందు హాజరై తమ వివరణ ఇచ్చారు. గత అసెంబ్లీ సమావేశాల్లో హోదా అంశంపై చర్చ జరగాలంటూ నిరసన తెలిపిన నేపథ్యంలో 12 మంది విపక్ష ఎమ్మెల్యేలకు హక్కుల కమిటీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఆ మేరకు తొలిరోజైన మంగళవారం ఆరుగురికి గాను నలుగురు ఎమ్మెల్యేలు , రెండో రోజైన బుధవారం మరో ఆరుగురికి గాను ఐదుగురు హాజరై తమ వాదనలు వినిపించారు. రెండో రోజున ఆళ్ల రామకృష్ణారెడ్డి (మంగళగిరి), బూడి ముత్యాలనాయుడు (మాడుగుల), కంబాల జోగులు (రాజాం), కిలివేటి సంజీవయ్య (సూళ్లూరుపేట), ముత్తిరేవుల సునీల్‌కుమార్ (పూతలపట్టు) విడివిడిగా కమిటీ ముందుకు వచ్చారు. అంతకుముందే వారు తమ వివరణలను తెలియజేస్తూ కమిటీకి లేఖలు అందజేశారు. విదేశీ పర్యటనలో ఉన్నందున హాజరు కాలేకపోతున్నానని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల) లేఖ పంపారు. సభా హక్కుల కమిటీకి చైర్మన్ గొల్లపల్లి సూర్యారావుతో సహా ఐదుగురు సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జ్యోతుల నెహ్రూ, శ్రావణ్‌కుమార్, బి.సి.జనార్థన్‌రెడ్డి బుధవారం హాజరైనప్పటికీ మరో ఇద్దరు టీడీపీ సభ్యులు నందమూరి బాలకృష్ణ, కురుగొండ్ల రామకృష్ణ గైర్హాజరయ్యారు. డిసెంబర్ 2న మళ్లీ కమిటీ సమావేశం కావాలని, ఇప్పుడు హాజరు కాని ఎమ్మెల్యేలు పిన్నెల్లి , కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఆ రోజు పిలవాలని నిర్ణయించారు. బుధవారం కమిటీ ముందు ఎమ్మెల్యేలు హాజరై వివరణ ఇచ్చినపుడు చోటు చేసుకున్న అంశాల పూర్వాపరాలు విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇలా ఉంది.
చంద్రబాబు మోసం వల్లే ఇదంతా: ఆళ్ల
తొలుత సభ్యులొక్కొక్కరి చేత విడిగా కమిటీ ప్రమాణాలు చేయించింది. శాసనసభా వ్యవహారాల్లో తానెప్పుడూ సంయమనంతో వ్యవహరిస్తూ ఓపిగ్గానే ఉంటానని... ప్రత్యేక హోదా కావాలన్న ఆకాంక్ష ప్రజల్లో బలీయంగా ఉంటే వారి మనోభావాలను అసెంబ్లీలో కాక మరెక్కడ ప్రతిబింబింప జేయాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి కమిటీ ముందు నివేదించారు. మీ నాయకుడు జగన్ మిమ్మల్ని ఇలా చేయమని ప్రేరేపించారా? ఆయనకు మైక్ ఇవ్వక పోతే ఇలా చేస్తారా? అని శ్రావణ్ ప్రశ్నించినపుడు... ‘ఒకళ్లు ప్రేరేపించడం ఏమిటి? హోదాపై మా వాణి వినిపించడానికి ఆరోజు అన్ని దార్లూ మూసేశారు. మేమేం చేయాలి?’ అని ఆళ్ల ప్రశ్నించారు. క్రాస్ ఎగ్జామినేషన్ వద్దు వారు ఇచ్చే వివరణ వినండి అని శ్రావణ్‌ను పెద్దిరెడ్డి వారించారు.
కేంద్రానికి తెలియాలనే : సంజీవయ్య
ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రజల మనోభావాలేమిటో, సమస్య తీవ్రత ఎలా ఉందో కేంద్ర ప్రభుత్వానికి తెలియజెప్పడానికే అసెంబ్లీలో అలా చేయాల్సి వచ్చిందని కిలివేటి సంజీవయ్య చెప్పారు. వీడియో దృశ్యాల్లో తొలుత సంజీవయ్య ఎక్కడ ఉన్నదీ సభ్యులెవరూ గుర్తించలేదు. సంజీవయ్యే జోక్యం చేసుకుని తానెక్కడ ఉన్నదీ వారికి చూపారు. అలా ఎందుకు చేశారని గొల్లపల్లి ప్రశ్నించినపుడు... ‘పోడియంను ఎమ్మెల్యేలు చుట్టుముట్టడం కొత్తేమీ కాదని అందరికీ తెలుసు. బయట ప్రజల్లో ప్రత్యేక హోదా ఆకాంక్ష బలీయంగా ఉన్నపుడు అసెంబ్లీలో చర్చకు తావివ్వకుంటే స్పీకర్‌ను ఒప్పించేందుకే అలా చేయాల్సి వచ్చింది. సభలో అలాంటి సంఘటనలు జరక్కూడదు. కానీ చర్చకు తావివ్వడం లేదన్న ఆవేశంలో అలా చేయక తప్పలేదు’ అని సంజీవయ్య వివరణ ఇచ్చారు.
హోదా కోసమే: సునీల్‌కుమార్
తాము అసెంబ్లీలో నిరసన తెలపడం వెనుక ప్రత్యేక హోదా కావాలన్న బలీయమైన ఆకాంక్షే తప్ప ఇంకేమీ లేదని తమకు ఎలాంటి దురుద్దేశం లేదని సునీల్‌కుమార్ అన్నారు. మీరు గొడవ చేస్తే ప్రత్యేక హోదా వస్తుందా? అని గొల్లపల్లి ప్రశ్నించగా... ‘మౌనంగా ఉంటే తమ ప్రకటనతో సంతృప్తిగా ఉన్నారని కేంద్ర ప్రభుత్వం భావించే అవకాశం ఉంది. సమస్య తీవ్రత బయట ప్రజల్లో ఎంత ఉందో తెలియ జెప్పడానికే అలా చేయాల్సి వచ్చింది’ అని సునీల్ కుమార్ తెలిపారు.
తప్పనిస్థితిలో...: ముత్యాలనాయుడు
వాస్తవానికి అసెంబ్లీలో ఇలాంటి పరిస్థితులు రాకూడదని తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే తాము నిరసనకు దిగాల్సి వచ్చిందని బూడి ముత్యాలనాయుడు తెలిపారు. వీడియో దృశ్యాలు చూపించినపుడు నాయుడు 8వ తేదీనాటి క్లిప్పింగ్‌లో ప్లకార్డు పట్టుకుని వెనుక నుంచుని ఉన్నారు. 9వతేదీన ఆయన దృశ్యాల్లో లేరు. 10వ తేదీన మాత్రం స్పీకర్ పోడియం దగ్గర నుంచుని ఉన్నట్లుగా తల మాత్రం కనిపించింది. వీటిపై వివరణ అడిగినపుడు సభలో ప్లకార్డు ప్రదర్శించడం తప్పని భావించడం లేదన్నారు. సభలో వాయిదా తీర్మానం ఇచ్చినా అనుమతించరు, చర్చకు అవకాశం కల్పించలేదు ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా మా నిరసన ఎలా తెలియ జేయాలని కంబాల జోగులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రత్యేక హోదా కావాలన్న ప్రజల ఆకాంక్షకు అనుగుణంగానే నిరసన తెలిపామని చెప్పారు.