ఎమ్మెల్యే రోజాపై కక్ష సాధింపు కుట్రలు
విజయవాడ: ఎమ్మెల్యే రోజాపై టీడీపీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మరో ఏడాదిపాటు ఆమెపై సస్పెన్షన్ కొనసాగించాలని కుట్ర చేస్తున్నారని ఆయన శనివారమిక్కడ వ్యాఖ్యానించారు. మహిళా సమస్యలపై రోజా రాజీలేని పోరాటం చేస్తున్నారని, ఆమెను ఎదుర్కొనే ధైర్యం లేకనే ...గొంతు నొక్కాలని చూస్తున్నారని విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రోజా మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పలేదని అని ప్రివిలేజ్ కమిటీ ఎలా నిర్ణయానికి వస్తుందని ఆయన అడిగారు.
ప్రివిలేజ్ కమిటీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విచారకరమని, ఇలాంటి చర్యల వల్ల కమిటీ పై గౌరవం తుగ్గుతోందని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అనితను తన వ్యాఖ్యలు బాధించి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నానని రోజా తెలిపారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా రోజా సస్పెన్షన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విశ్వేశ్వరరెడ్డి సూచించారు.
అలాగే అసెంబ్లీ స్పీకర్ అనుమతి లేకుండా వీడియోలు విడుదల చేసినవారిపై ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎమ్మెల్యే రోజా అనని మాటలను అన్నట్లుగా మార్పులు చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారన్నారు. ఆ వీడియో ఫుటేజ్‌లను ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు...టీడీపీ కార్యాలయంలో విడుదల చేశారని, ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. అయితే వాటితో తనకు సంబంధం లేదని, తాను ఎలాంటి అనుమతి ఇవ్వలేదని స్పీకర్ దానిపై విచారణకు ఆదేశించారన్నారు.
అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ఇచ్చిన వీడియోకు... ఆ వీడియోకు ఎలాంటి సంబంధం లేదన్నారు. వాళ్లు ఆరోపిస్తున్న క్లిప్పింగ్స్ అందులో లేవనే విషయం స్పష‍్టంగా అర్థం అవుతుందన్నారు. రోజాపై దుష్ప్రచారం చేయడానికి కుట్ర పన్నుతున్నారని, అలాంటి పరిణామం శాసనసభ గౌరవానికి మంచిది కాదన్నారు. టీడీపీ చర్యలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.