
వైసీపీకి దూరం: ఎంపీ కొత్తపల్లి గీత
టీడీపీ ప్రభుత్వంతో కలసి పనిచేస్తానని వెల్లడి
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో అరకు లోక్‌సభ స్థానం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందిన ఎంపీ కొత్తపల్లి గీత ఇక నుంచి తాను ఆ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుతో మంగళవారం ఆమె ఇక్కడ భేటీ అయ్యారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘సీఎం చంద్రబాబుని కలిశాను. నా నియోజకవర్గంలో అభివృద్ధికి సహకరించాలని కోరాను. టీడీపీ ప్రభుత్వంతో కలసి పనిచేస్తా’ అని గీత అన్నారు. అనర్హత వేటు పడితే తిరిగి పోటీ చేసి గెలుస్తానని ఆమె చెప్పారు. ప్రస్తుతం ఏ పార్టీలోనూ చేరబోనన్నారు.