Araku Lok Sabha
-
కొత్తపల్లి గీతకు డిపాజిట్ దక్కేనా?
సాక్షి, విశాఖపట్నం: ఆమె పేరు కొత్తపల్లి గీత. 2014లో అరకు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ తరఫున ఎంపీగా గెలుపొందారు. అప్పట్లో ఆమెకు 4,13,191 ఓట్లు పోలయ్యాయి. సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణిపై ఆమె 91,398 ఓట్ల మెజారిటీ సాధించారు. ఎంపీ అయిన కొన్నాళ్లకే ఆమె వైఎస్సార్సీపీని వీడారు. ఆపై 2018లో సొంతంగా జన జాగృతి పార్టీని స్థాపించారు. ఆ పార్టీ తరఫున 2019 ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలిచారు. 2014లో అరకు నుంచి 4 లక్షలకు పైగా ఓట్లను, 90 వేలకు పైగా ఆధిక్యాన్ని సాధించిన ఆమె అదంతా తన బలంగా భావించారు. ఆ నమ్మకంతో 2019 ఎన్నికల్లో పోటీ చేసిన ఆమెకు తన సత్తా ఏపాటిదో తెలిసొచ్చింది. 2019 ఎన్నికలకు విశాఖ లోక్‌సభ నియోజకవర్గంలో 18,29,300 మంది ఓటర్లున్నారు.వీరిలో 12,39,754 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో కొత్తపల్లి గీతకు 1,158 మంది మాత్రమే ఓట్లు వేశారు. ఇది మొత్తం ఓట్లలో 0.09 శాతం మాత్రమే కావడం విశేషం. దీంతో ఆమె డిపాజిట్లు కోల్పోవడమే కాదు.. నోటాకు పడిన ఓట్లలో ఒక శాతం కూడా పొందలేక పోయారు. 2019 విశాఖ లోక్‌సభ స్థానానికి 14 మంది పోటీ చేశారు. వీరందరిలో ఆమె అత్యల్పంగా 1,158 ఓట్లు మాత్రమే సాధించి 13 వ స్థానంలో నిలిచారు. మిగిలిన 12 మంది ఆమెకంటే ఎక్కువ ఓట్లను సాధించిన వారే! వీరిలో విజయం సాధించిన వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణకు 4,36,906 ఓట్లు లభించాయి. ఆ తర్వాత టీడీపీ అభ్యర్థి భరత్‌కు 4,32,492, జనసేన అభ్యర్థి వీవీ లక్ష్మీనారాయణకు 2,88,874, బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరికి 33,892, నోటాకు 16,646 ఓట్లు వచ్చాయి. బలం తెలిసి.. బీజేపీలో చేరి.. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయంతో జనంలో తనకు వ్యక్తిగతంగా ఎంత బలముందో గీతకు తేటతెల్లమైంది. 2014లో వచ్చిన ఓట్లను చూసి తనను తాను అతిగా ఊహించుకున్న ఆమెకు అదంతా తన బలం కాదన్న వాస్తవం అర్థమైంది. దీంతో ఎన్నో ఆశలతో స్థాపించిన జన జాగృతి పార్టీకి మనుగడ లేదన్న నిర్ధారణకు వచ్చిన ఆమె ఆ పార్టీ చాప చుట్టేసి 2019 జూన్‌లో బీజేపీలో విలీనం చేశారు. తాను కూడా బీజేపీలో చేరిపోయారు. అరకులో మరోసారి పరీక్ష ఈసారి ఎన్నికల్లో కొత్తపల్లి గీత అరకు లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యరి్థగా పోటీ చేస్తున్నారు. అరకు నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత ఎన్నికల్లో కనీసం 1,200 ఓట్లు కూడా తెచ్చుకోలేని గీత ఈ ఎన్నికల్లో ఎలా విజయం సాధిస్తారోనని అరకు పార్లమెంటరీ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లా ఓటర్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. తొలిసారి ఎంపీగా పోటీ చేసి నాలుగు లక్షలకు పైగా ఓట్లతో గెలిచి.. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి వందల ఓట్లకు దిగజారిన అభ్యర్థి ఈమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
అరకు పార్లమెంట్లో బీజేపీకి గడ్డు పరిస్థితి..!
అరకు పార్లమెంట్ పరిధిలో ఏమాత్రం క్యాడర్‌లేని బీజేపీ ఈ ఎన్నికల్లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో నేరుగా పోటీచేస్తే కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చినా ఓటమి తప్పలేదు.వైఎస్సార్సీపీ 2014 ఎన్నికల్లో 91,398 ఓట్లు, 2019లో 2,23,999 ఓట్ల ఆధిక్యతతో అరకు ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ పరిస్థితుల్లో కూటమి తరఫున బీజేపీ అభ్యర్థగా పోటీచేస్తున్న కొత్తపల్లి గీతకు మిగతా పార్టీల శ్రేణుల నుంచి సహకారం లభించే పరిస్థితి కానరావడం లేదు. రంపచోడవరం: అరకు పార్లమెంట్ పరిధిలో ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలు పాలకొండ, కురుపాం, సాలూరు, అరకువేలీ, పాడేరు, రంపచోడవరంతో పాటు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం పార్వతీపురం ఉంది. వైఎస్సార్ సీపీ పార్టీ ఆవిర్భావం నాటి నుంచి గిరిజనులు జగన్మోహన్రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారు. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థులను ఆఖండ మెజారిటీతో గెలిపించారు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తరఫున అరకు ఎంపీ సీటును బీజేపీకి కేటాయించారు. గత రెండు దఫాల ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఆ పార్టీ పరిస్థితి దయనీయంగానే ఉందని రాజకీయ పరిశీలకులు విశ్లే స్తున్నారు. ఈ పరిస్థితుల్లో అభ్యర్థి కొత్తపల్లి గీతకు వ్యతిరేకంగా గిరిజన సంఘాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. గిరిజన వ్యతిరేకి అయిన ఆమెను ఓడించాలని పిలుపునిస్తున్నాయి. కూటమిపైనే ఆశలు.. అరకు పార్లమెంట్ పరిధిలో బీజేపీకి సొంత బలం లేకపోయినా సీట్లు సర్దుబాటులో భాగంగా టికెట్ దక్కంచుకున్నా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ పార్లమెంట్‌లోని అసెంబ్లీల పరిధిలో ఆ పార్టీకి పెద్దగా క్యాడర్ కూడా లేదు. టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్నా ఆ పార్టీ శ్రేణులు సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. 2014లో వైఎస్సార్సీకి 91,398 ఓట్ల ఆధిక్యత.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 4,13,191 ఓట్లు దక్కించుకుని విజయం సాధించింది. టీడీపీ, బీజేపి ఉమ్మడి అభ్యరి్థకి 3,21,793 ఓట్లు, కాంగ్రెస్‌కు 52,884 ఓట్లు వచ్చాయి. వైఎస్సార్సీపీ అభ్యరి్థకి 91,398 ఓట్ల మెజారిటీ వచ్చింది. రెండు పార్టీల ఓట్లు కలిపితే 3,74,677 ఓట్లు వచ్చాయి. ఇలా రెండింటిని కలిపినా వైఎస్సార్సీకి 38,514 ఓట్ల ఆధిక్యత ఉంది. 2019లోనూ 2,23,999 ఓట్ల మెజారిటీ.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఎటువంటి పొత్తులు లేకుండా ఒంటరిగా ఎన్నికల బరిలో నిలవగా కేవలం 17,867 ఓట్లు మాత్రమే సాధించింది. అంటే నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. వైఎస్సార్ సీపీ 5,62,190 ఓట్లు సాధించగా టీడీపీకి 3,38,101, జనసేనకు 42,794 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 2,24,089 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. ఈ రెండు దఫాల ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే బీజేపీకి సొంత బలం లేనట్టేనని స్పష్టమవుతోంది. బలమైన పార్టీగా.. అరకు పార్లమెంట్ పరిధిలోని గ్రామాల్లో వైఎస్సార్సీపీ గ్రామస్థాయిలో మరింత పటిష్టంగా ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అరకు పార్లమెంట్ పరిధిలో ఒక అసెంబ్లీ స్థానం మినహా అన్నింటిని కైవసం చేసుకుంది. 2019 ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ స్థానాలను దక్కించుకుని క్షేత్రస్థాయిలో మన్యంలో బలమైన పునాది వేసింది. కూటమి క్యాడర్ చెల్లాచెదురు అరకు పార్లమెంట్ పరిధిలోని రంపచోడవరం, అరకువేలీ, పాడేరు నియోజకవర్గాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన (కూటమి) పార్టీల క్యాడర్ వర్గపో రు కారణంగా చెల్లాచెదురైంది. టీడీపీ విషయానికొస్తే రెండుగా చీలిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ఎంపీ అభ్యర్థి (బీజేపీ) కొత్తపల్లి గీతకు ఎంతవరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకమే. ♦ అరకు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీకి చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు సివేరి అబ్రహం, సియ్యారి దొన్నుదొర తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. దీనివల్ల ఆ పార్టీ ఉనికి కోల్పోయే పరిస్థితి ఎదుర్కొంటోంది. ♦ పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆ పార్టీ అధిష్టానంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. రెబల్‌గా పోటీచేసి అమీతుమీ తేల్చుకుంటానని ఆమె ఇప్పటికే హెచ్చరించారు. ♦ రంపచోడవరం అసెంబ్లీ మిరియాల శిరీషాదేవికి టికెట్ కేటాయింపు నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు అరకు ఎంపీ బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీతపై గుర్రుగా ఉన్నారు. ఈ టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరితోపాటు మరో మాజీ ఎమ్మెల్యే కూడా ఆశించారు. వీరి కాకుండా పారీ్టలోకి కొత్తగా వచ్చిన మిరియాల శిరీషా దేవికి టికెట్ కేటాయింపుపై వారు జీర్ణించుకోలేకపోతున్నారు. శిరీషకు సహకరించేది లేదని వారి అనుచరులు ఇప్పటికే ప్రకటించారు. కూటమి అభ్యర్థికి అరకు, పాడేరు, రంపచోడవరంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. -
మట్టి కరిచిన 30 ఏళ్ల అనుభవం
సాక్షి, శ్రీకాకుళం: అనుభవం పనిచెయ్యలేదు.. రాజ కుటుంబమనే గౌరవమూ దక్కలేదు. మూడు దశాబ్దాలుగా అధికారాన్ని కట్టబెడితే.. చేసిన మంచి ఏమీ లేదని గ్రహించిన గిరిపుత్రులు రాజుని ఇంటికి సాగనంపారు. మట్టి మనిషి చేతిలో ఘోర పరాభవాన్ని పరిచయం చేశారు. స్వచ్ఛమైన గిరి పుత్రికకు తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు. కల్మషం లేని మనుషులంతా కలకాలం గుర్తుండిపోయే విజయాన్ని జగనన్నకు కానుకగా అందించారు. తండ్రీ కూతుళ్లకు తగిన గుణపాఠం చెప్పారు. అరకు పార్లమెంట్ స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడింది. పోరాటాలే అనుభవాలుగా.. తండ్రి ఆశయాల కోసం రాజకీయాల వైపు అడుగులు వేసిన గొడ్డేటి మాధవి తెగువ.. తిరుగులేని విజయాన్ని అందించింది. ప్రత్యర్థి అనుభవమంత వయసు లేకపోయినా.. బినామీ కొండను ఢీకొట్టి.. అమాయక గిరిజనుల్లో కొత్త శకానికి నాంది పలికారు. ఉపాధ్యాయురాలిగా ప్రస్థానం ప్రారంభించిన మాధవి.. ముప్ఫై ఏళ్లుగా రాజకీయ చక్రం తిప్పుతున్న కిశోర్‌చంద్రదేవ్‌ని ఇంటికి సాగనంపారు. మొదటి రౌండ్ ప్రారంభమైనప్పటి నుంచి ఎక్కడా వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్‌కు అవకాశం ఇవ్వకుండా.. మాధవి ముందంజలో దూసుకుపోయారు. మొత్తంగా మాధవికి 5,51,560 ఓట్లు పోలవ్వగా.. కిశోర్‌చంద్రదేవ్‌కు 3,34,214 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ తరఫున బరిలో దిగిన వైరిచర్ల కుమార్తె శృతిదేవి 17,479 ఓట్లకే పరిమితమై డిపాజిట్లు కోల్పోయారు. ఈమె కంటే నోటాకు (47,376) రెండున్నర రెట్లు అధికంగా ఓట్లు పోలవ్వడం గమనార్హం. తొలి రౌండ్లో మొదలైన వైఎస్సార్సీపీ ఆధిక్యం ఎక్కడా తగ్గకుండా దూసుకుపోయింది. మొత్తంగా 2 లక్షల 17 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. కాగా, పాలకొండ నియోజకవర్గం నుంచి గొడ్డేటి మాధవికి 68241 ఓట్లు పోలవ్వగా, టీడీపీ అభ్యర్థి కిశోర్‌చంద్రదేవ్‌కు 53202 ఓట్లు పోలయ్యాయి. జనసేన అభ్యర్థి వి.గంగులయ్యకు 2933 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి వై.శృతీదేవికి 1305 ఓట్లు పోలయ్యాయి. -
ఆ ఐదేళ్లూ మా బతుకుల్లో సంక్షేమాన్ని చూశా..
సాక్షి, విశాఖ సిటీ : ఆమె స్వచ్ఛమైన గిరిజనాలకు ప్రతీక. కల్మషం లేని మనుషుల మధ్య పెరుగుతూ.. పోరాటాలే అనుభవాలుగా.. తండ్రి ఆశయాలకనుగుణంగా రాజకీయాల వైపు అడుగులు వేశారు. తండ్రి మూడుసార్లు ఎమ్మెల్యే అయినా.. ఇసుమంత అహం లేని వ్యక్తిత్వంతో గిరిజనుల మనసుల్లో చెరగని ముద్రవేసుకున్నారు. కాంట్రాక్టు ఉపాధ్యాయినిగా పనిచేస్తూ.. వైఎస్ హయాంలో ఆ కొండకోనల్లో జరిగిన అభివృద్ధిని మళ్లీ చూడాలన్న కాంక్షతో జగనన్న బాటలో నడిచేందుకు సిద్ధమయ్యారు. ఆమె.. 26 ఏళ్ల గొడ్డేటి మాధవి. అరకు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేస్తున్నారు. ప్రత్యర్థి అనుభవమంత వయసులేకపోయినా ఆ బినామీ కొండను ఢీకొట్టి.. గిరిజనుల జీవితాల్లో కొత్త శకానికి నాందిపలుకుతానంటున్నారు. గిరిజనాల సంక్షేమాన్ని గాలికొదిలేసిన కిశోర్ చంద్రదేవ్, ఆయన కుమార్తె తనకేమాత్రం ప్రత్యర్థులు కారని, అరకు నియోజకవర్గ సమస్యలే అసలైన ప్రత్యర్థులని, వాటిపై విజయమే లక్ష్యమంటున్న మాధవి అంతరంగం ఆమె మాటల్లోనే... జగనన్న మాటలు ఎప్పటికీ మర్చిపోలేను. సాధారణ గిరిజన మహిళగా నేను చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. గిరిపుత్రుల కష్టాలు చూస్తూ పెరిగిన నాకు ఎప్పటికైనా వారికి సాయపడాలనే తపన తీవ్రంగా ఉండేది. అందుకు రాజకీయాల్లోకి రావడమే మార్గమని గుర్తించాను. మా నాన్న దేముడు ఎమ్మెల్యేగా పనిచేయడంతో ఆయన నాకు స్ఫూర్తిగా నిలిచారు. ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాక 2017 నుంచి వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కాంట్రాక్ట్ ఉపాధ్యాయినిగా చేస్తున్న నన్ను గుర్తించి, తోటి గిరిజనులకు సాయపడాలనే నా ఆకాంక్షను తెలుసుకుని వైఎస్ జగన్మోహన్రెడ్డి అరకు టిక్కెట్ కేటాయించారు. ఆ విషయం తెలియగానే తీవ్ర ఉద్వేగానికి గురయ్యాను. గిరిజన మహిళలను అత్యున్నత పదవిలో చూడాలన్నదే తన లక్ష్యమని పాదయాత్ర సమయంలో జగనన్న చెప్పిన మాటలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. గిరిపుత్రులపై వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎలాంటి వాత్సల్యం చూపించారో.. అదే అభిమానాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి చాటుకున్నారు. నాపై పూర్తి విశ్వాసముంచి టిక్కెట్ ఇచ్చినందుకు ఆయన నమ్మకాన్ని నిలబెడతాను. నాకు టికెట్ దక్కగానే.. మూడు రోజుల నుంచి నియోజకవర్గ ప్రజలు ఫోన్ చేస్తూ ఆశీర్వదిస్తున్నారు. ప్రచారానికి వెళ్తున్నప్పుడు వారి కష్టార్జితంలోంచి రూ.200, రూ.500 చేతిలో పెడుతూ ఎన్నికల ఖర్చులకు అవసరమవుతాయమ్మా.. అంటూ దీవిస్తున్నారు. ఇంతకంటే ఈ జీవితానికి ఏం కావాలి. ఇదంతా జగనన్న ఇచ్చిన గౌరవం. ఆ గౌరవాన్ని నిలబెడతాను. విజయాన్ని కానుకగా ఇస్తాను. ఇంటర్‌లోనే నాపై రాజన్న ముద్ర గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలన నా జీవితంపై బలమైన ముద్రవేసింది. ఆ సమయంలో నేను ఇంటర్ చదువుతున్నాను. ఆయన సంక్షేమ పథకాలు మా ప్రాంతంలో ఎందరో బతుకులకు దారి చూపాయి. అందరికీ విద్య, వైద్యం అందడం చూసి ప్రజా సేవ చేయాలనే నా కోరిక బలపడింది. ఒక్క వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలోనే తప్ప ఎప్పుడూ మా అరకు, చుట్టుపక్కల ప్రాంతాల్లో అభివృద్ధి జరిగింది లేదు. చదువుకోడానికి సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లం. వైద్య సదుపాయాలు లేక ఎందరో కళ్లముందే ప్రాణాలు విడిచేవారు. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రయ్యాక మా బతుకులు బాగుపడ్డాయి. 108 వాహనం మా గిరిపుత్రుల ఆయుష్షు పెంచింది. ఆయన మరణానంతరం మళ్లీ అభివృద్ధి పడకేసింది. ఇప్పుడు ప్రజా సంక్షేమం కోసం జగనన్న పడుతున్న కష్టం చూసి నేను కూడా గిరిజనులకు ఏదొకటి చేయాలని నిర్ణయించుకున్నాను. రాజన్న రాజ్యం జగన్‌తోనే సాధ్యమని అర్థమయ్యాక వైఎస్సార్సీపీ పార్టీలో చేరి గిరిజన ప్రాంతాల్లో చురుగ్గా పనిచేస్తున్నాను. మా ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం, సంక్షేమం.. అందుకే నా పోరాటం నాన్న మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా.. నేను చాలా సాధారణ జీవితమే గడిపాను. ప్రజాసమస్యల పరిష్కారానికి నాన్న చేసిన కృషి నన్ను ఎంతో ప్రభావితం చేసింది. రాజకీయాల్లోకి వచ్చే ముందు.. నాన్న స్నేహితులు, బంధువులు, ప్రజలు సమావేశమై జగనన్నతో నడవమని సూచించారు. ఆ దిశగా అడుగులు వేశాను. జగనన్న నాపై పూర్తి నమ్మకముంచి ఈ బాధ్యత అప్పగించారు. నేను సమస్యల్లో నుంచి వచ్చాను. వాటన్నింటినీ పరిష్కరించాలి. మా ప్రజలకు ముఖ్యంగా కావాల్సింది విద్య, వైద్యం. ఏజెన్సీలో వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. వారికి సరైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. వైద్యులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించి.. అన్ని వేళలా పూర్తిస్థాయి వైద్యం అందించాలనుకుంటున్నాను. నాణ్యమైన విద్యను అందిస్తే.. గిరిజనుల్లో చైతన్యం వస్తుంది. ఏజెన్సీలో మాతా శిశుమరణాలు తగ్గుముఖం పట్టాయని టీడీపీ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికీ ఆ తరహా మరణాలు ఆగలేదు. ఈ ప్రధాన సమస్యలు పరిష్కరిస్తే చాలు.. మన్యంలో మనసున్న మారాజు రాజన్న పాలన మరోసారి వస్తుంది. దాని కోసం రేయింబవళ్లూ కృషి చేస్తాను. డబ్బే ప్రధామనుకుంటే నాకు టిక్కెట్ దక్కేదా? ఈ ఎన్నికల్లో అంగ, అర్థబలమున్న వైరిచర్లను ఢీకొట్టగలరా? అని అడుతున్నారు. డబ్బే ప్రధానమని అనుకుంటే.. జగన్మోహన్రెడ్డి గారు సామాన్యురాలైన నాకు టిక్కెట్ ఇచ్చేవారా.? మా నాన్న దేముడు 1994 నుంచి 2004 వరకూ ఎమ్మెల్యేగా విజయం సాధించేవారా.? అని వారికి సమాధానం చెబుతున్నాను. డబ్బుకంటే.. ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవడమే ప్రధానం. ఎన్నికల్లో అదే ఆయుధం. గిరిజన గుండెల్లో రాజన్న సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన అడుగుజాడల్లో జగనన్న కూడా నడుస్తున్నారు. ఆ రెండే నా బలం. మా ప్రజలు డబ్బు ఇచ్చినా తీసుకునే స్థితిలో లేరు. వారికి కావల్సిందల్లా మౌలిక వసతులు. నా ఏకైక లక్ష్యం అదే మా నియోజకవర్గంలో సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న వ్యక్తి చేయలేనిది చేసి చూపించాలనే రాజకీయాల్లోకి వచ్చాను. నాకు తెలిసినంత వరకూ నా ప్రత్యర్థి ఒక్కరే. మా అరకు నియోజకవర్గ సమస్యలే నా అసలైన ప్రత్యర్థులు. ఆ సమస్యలపై విజయమే నా ముందున్న ఏకైక లక్ష్యం. 30 సంవత్సరాలు ఎంపీగా పనిచేశాననే గొప్ప చెప్పుకోవడమే తప్ప.. టీడీపీ అభ్యర్థి వైరిచర్ల ఏనాడైనా అరకు ప్రజల సమస్యల్ని పార్లమెంట్లో ప్రస్తావించారా? సమస్యలు పరిష్కరించేందుకు కనీసం కృషి చేశారా.? ఏమీ చేయలేదు. ఆయన హయాంలో ఏదైనా అభివృద్ధి జరిగితే.. నేనిలా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన వచ్చి ఉండేది కాదేమో. ఆయన ఎవరో కూడా పాడేరు, రంపచోడవరం మొదలైన ప్రాంతాల ప్రజలకు ఇప్పటికీ తెలీదు. టీడీపీలోకి వెళ్లినా, కాంగ్రెస్ వారసత్వాన్ని పోగొట్టుకోవడం ఆయనకు ఇష్టం లేదు. అందుకే కుమార్తెను కాంగ్రెస్ నుంచి పోటీ చేయిస్తున్నారు. – కరుకోల గోపీకిశోర్‌రాజా -
సై అంటే సై అంటున్న తండ్రి, కూతుళ్లు
రాజ వంశాలు... వారి వైభవం, వైరం, చరిత్ర గురించి చెప్పుకోకుంటే ఉత్తరాంధ్ర రాజకీయాలు అసంపూర్తే. రాజుల కాలం నాటి విభేదాలు ఇప్పటికీ వారి మధ్య కొనసాగుతున్నాయి. అయితే, ఈసారి ఏకంగా కురుపాం రాజ కుటుంబంలోని తండ్రీ– కూతురు తలపపడుతుండటం ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మార్చింది. సాక్షి, అమరావతి : రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని కురుపాం రాజ వంశానికిచెందిన వైరిచర్ల కుటుంబం మరోసారి నిరూపిస్తోంది. ఈ కుటుంబానికి చెందిన తండ్రీ, తనయలు అరకు లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ పడనున్నారు. ఎందుకంటే అరకు లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా కిశోర్‌చంద్రదేవ్ పోటీ చేయనున్నారు. నాలుగు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్(ఎస్)లోనూ అనంతరం కాంగ్రెస్(ఐ)లో ఆయన ఢిల్లీస్థాయిలో కీలక పాత్ర పోషించారు. తాజాగా ఆయన టీడీపీలో చేరారు. అయితే బద్ధవ్యతిరేక టీడీపీలో చేరడం ఆయన కుమార్తె శృతీదేవికి ఏమాత్రం నచ్చలేదు. తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ఆమెచెప్పారు. అంతేకాదు కాంగ్రెస్ అరకు ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు కూడా చేశారు. తండ్రి కోసం శృతీదేవి వెనక్కి తగ్గుతారని భావించినప్పటికీ ఆమె మాత్రం తన నిర్ణయానికే కట్టుబడ్డారు. కాగా చంద్రబాబు ప్రకటించిన టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితాలో కిశోర్‌చంద్రదేవ్‌కు స్థానం కల్పించారు. అదేవిధంగా కాంగ్రెస్ విడుదల చేసిన ఎంపీ అభ్యర్థుల జాబితాలో శృతీదేవికి అరకు ఎంపీ టికెటును కేటాయించారు. అంటే తండ్రి టీడీపీ అభ్యర్థిగా... తనయ కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్లు దక్కించుకున్నారు. కురుపాం రాజకుటుంబంలోని రాజకీయ వైచిత్రి సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కాగా. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధారణ గిరిజన కుటుంబానికి చెందిన గొడ్డేటి మాధవిని తమ అభ్యర్థిగా ప్రకటించడంపట్ల సర్వత్రా సానుకూలత వ్యక్తమవుతోంది. -
‘ఏం అడగాలో టీడీపీకే క్లారిటీ లేదు’
సాక్షి, ఢిల్లీ: కేంద్రాన్ని ఏం అడగాలో టీడీపీకే క్లారిటీ లేదని అరకు ఎంపీ కొత్తపల్లి గీత విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ఇచ్చిన నిధుల విషయంలో స్పష్టత లేదని వ్యాఖ్యానించారు. రాజకీయాలకు అతీతంగా అందరం రాష్ట్రం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ఎంత నిధులు వచ్చాయో కేంద్రం నుంచి స్పష్టత రావాల్సి ఉందన్నారు. రాజకీయ అవసరాల కోసం కాకుండా రాష్ట్రం కోసం పోరాడాలని, ప్రజల్ని నష్టపరచకుండా నాయకులు వ్యవహరించాలని సూచించారు. రైల్వేజోన్ విశాఖకు రావాలని, అది విశాఖ ప్రజల హక్కు అని వ్యాఖ్యానించారు. విజయవాడకు ఎయిమ్స్ రావడం వల్ల ఉత్తరాంధ్రకు నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు. అన్ని సంస్థలు విజయవాడ, అమరావతికే వెళ్తున్నాయని, ఉత్తరాంధ్రకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. -
వైసీపీకి దూరం: ఎంపీ కొత్తపల్లి గీత
టీడీపీ ప్రభుత్వంతో కలసి పనిచేస్తానని వెల్లడి న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో అరకు లోక్‌సభ స్థానం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందిన ఎంపీ కొత్తపల్లి గీత ఇక నుంచి తాను ఆ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుతో మంగళవారం ఆమె ఇక్కడ భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘సీఎం చంద్రబాబుని కలిశాను. నా నియోజకవర్గంలో అభివృద్ధికి సహకరించాలని కోరాను. టీడీపీ ప్రభుత్వంతో కలసి పనిచేస్తా’ అని గీత అన్నారు. అనర్హత వేటు పడితే తిరిగి పోటీ చేసి గెలుస్తానని ఆమె చెప్పారు. ప్రస్తుతం ఏ పార్టీలోనూ చేరబోనన్నారు.