సాక్షి, శ్రీకాకుళం: అనుభవం పనిచెయ్యలేదు.. రాజ కుటుంబమనే గౌరవమూ దక్కలేదు. మూడు దశాబ్దాలుగా అధికారాన్ని కట్టబెడితే.. చేసిన మంచి ఏమీ లేదని గ్రహించిన గిరిపుత్రులు రాజుని ఇంటికి సాగనంపారు. మట్టి మనిషి చేతిలో ఘోర పరాభవాన్ని పరిచయం చేశారు. స్వచ్ఛమైన గిరి పుత్రికకు తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు. కల్మషం లేని మనుషులంతా కలకాలం గుర్తుండిపోయే విజయాన్ని జగనన్నకు కానుకగా అందించారు. తండ్రీ కూతుళ్లకు తగిన గుణపాఠం చెప్పారు. అరకు పార్లమెంట్ స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడింది. పోరాటాలే అనుభవాలుగా.. తండ్రి ఆశయాల కోసం రాజకీయాల వైపు అడుగులు వేసిన గొడ్డేటి మాధవి తెగువ.. తిరుగులేని విజయాన్ని అందించింది. ప్రత్యర్థి అనుభవమంత వయసు లేకపోయినా.. బినామీ కొండను ఢీకొట్టి.. అమాయక గిరిజనుల్లో కొత్త శకానికి నాంది పలికారు.
ఉపాధ్యాయురాలిగా ప్రస్థానం ప్రారంభించిన మాధవి.. ముప్ఫై ఏళ్లుగా రాజకీయ చక్రం తిప్పుతున్న కిశోర్‌చంద్రదేవ్‌ని ఇంటికి సాగనంపారు. మొదటి రౌండ్ ప్రారంభమైనప్పటి నుంచి ఎక్కడా వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్‌కు అవకాశం ఇవ్వకుండా.. మాధవి ముందంజలో దూసుకుపోయారు. మొత్తంగా మాధవికి 5,51,560 ఓట్లు పోలవ్వగా.. కిశోర్‌చంద్రదేవ్‌కు 3,34,214 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ తరఫున బరిలో దిగిన వైరిచర్ల కుమార్తె శృతిదేవి 17,479 ఓట్లకే పరిమితమై డిపాజిట్లు కోల్పోయారు. ఈమె కంటే నోటాకు (47,376) రెండున్నర రెట్లు అధికంగా ఓట్లు పోలవ్వడం గమనార్హం. తొలి రౌండ్‌లో మొదలైన వైఎస్సార్‌సీపీ ఆధిక్యం ఎక్కడా తగ్గకుండా దూసుకుపోయింది. మొత్తంగా 2 లక్షల 17 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. కాగా, పాలకొండ నియోజకవర్గం నుంచి గొడ్డేటి మాధవికి 68241 ఓట్లు పోలవ్వగా, టీడీపీ అభ్యర్థి కిశోర్‌చంద్రదేవ్‌కు 53202 ఓట్లు పోలయ్యాయి. జనసేన అభ్యర్థి వి.గంగులయ్యకు 2933 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి వై.శృతీదేవికి 1305 ఓట్లు పోలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment