గిరిజన మహిళల సమస్యలు తెలుసుకుంటున్న మాధవి
సాక్షి, విశాఖ సిటీ : ఆమె స్వచ్ఛమైన గిరిజనాలకు ప్రతీక. కల్మషం లేని మనుషుల మధ్య పెరుగుతూ.. పోరాటాలే అనుభవాలుగా.. తండ్రి ఆశయాలకనుగుణంగా రాజకీయాల వైపు అడుగులు వేశారు. తండ్రి మూడుసార్లు ఎమ్మెల్యే అయినా.. ఇసుమంత అహం లేని వ్యక్తిత్వంతో గిరిజనుల మనసుల్లో చెరగని ముద్రవేసుకున్నారు. కాంట్రాక్టు ఉపాధ్యాయినిగా పనిచేస్తూ.. వైఎస్ హయాంలో ఆ కొండకోనల్లో జరిగిన అభివృద్ధిని మళ్లీ చూడాలన్న కాంక్షతో జగనన్న బాటలో నడిచేందుకు సిద్ధమయ్యారు. ఆమె.. 26 ఏళ్ల గొడ్డేటి మాధవి. అరకు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేస్తున్నారు.
ప్రత్యర్థి అనుభవమంత వయసులేకపోయినా ఆ బినామీ కొండను ఢీకొట్టి.. గిరిజనుల జీవితాల్లో కొత్త శకానికి నాందిపలుకుతానంటున్నారు. గిరిజనాల సంక్షేమాన్ని గాలికొదిలేసిన కిశోర్ చంద్రదేవ్, ఆయన కుమార్తె తనకేమాత్రం ప్రత్యర్థులు కారని, అరకు నియోజకవర్గ సమస్యలే అసలైన ప్రత్యర్థులని, వాటిపై విజయమే లక్ష్యమంటున్న మాధవి అంతరంగం ఆమె మాటల్లోనే...
జగనన్న మాటలు ఎప్పటికీ మర్చిపోలేను.
సాధారణ గిరిజన మహిళగా నేను చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. గిరిపుత్రుల కష్టాలు చూస్తూ పెరిగిన నాకు ఎప్పటికైనా వారికి సాయపడాలనే తపన తీవ్రంగా ఉండేది. అందుకు రాజకీయాల్లోకి రావడమే మార్గమని గుర్తించాను. మా నాన్న దేముడు ఎమ్మెల్యేగా పనిచేయడంతో ఆయన నాకు స్ఫూర్తిగా నిలిచారు. ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాక 2017 నుంచి వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కాంట్రాక్ట్ ఉపాధ్యాయినిగా చేస్తున్న నన్ను గుర్తించి, తోటి గిరిజనులకు సాయపడాలనే నా ఆకాంక్షను తెలుసుకుని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అరకు టిక్కెట్ కేటాయించారు. ఆ విషయం తెలియగానే తీవ్ర ఉద్వేగానికి గురయ్యాను.
గిరిజన మహిళలను అత్యున్నత పదవిలో చూడాలన్నదే తన లక్ష్యమని పాదయాత్ర సమయంలో జగనన్న చెప్పిన మాటలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. గిరిపుత్రులపై వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎలాంటి వాత్సల్యం చూపించారో.. అదే అభిమానాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చాటుకున్నారు. నాపై పూర్తి విశ్వాసముంచి టిక్కెట్ ఇచ్చినందుకు ఆయన నమ్మకాన్ని నిలబెడతాను. నాకు టికెట్ దక్కగానే.. మూడు రోజుల నుంచి నియోజకవర్గ ప్రజలు ఫోన్ చేస్తూ ఆశీర్వదిస్తున్నారు. ప్రచారానికి వెళ్తున్నప్పుడు వారి కష్టార్జితంలోంచి రూ.200, రూ.500 చేతిలో పెడుతూ ఎన్నికల ఖర్చులకు అవసరమవుతాయమ్మా.. అంటూ దీవిస్తున్నారు. ఇంతకంటే ఈ జీవితానికి ఏం కావాలి. ఇదంతా జగనన్న ఇచ్చిన గౌరవం. ఆ గౌరవాన్ని నిలబెడతాను. విజయాన్ని కానుకగా ఇస్తాను.
ఇంటర్‌లోనే నాపై రాజన్న ముద్ర
గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలన నా జీవితంపై బలమైన ముద్రవేసింది. ఆ సమయంలో నేను ఇంటర్ చదువుతున్నాను. ఆయన సంక్షేమ పథకాలు మా ప్రాంతంలో ఎందరో బతుకులకు దారి చూపాయి. అందరికీ విద్య, వైద్యం అందడం చూసి ప్రజా సేవ చేయాలనే నా కోరిక బలపడింది. ఒక్క వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలోనే తప్ప ఎప్పుడూ మా అరకు, చుట్టుపక్కల ప్రాంతాల్లో అభివృద్ధి జరిగింది లేదు. చదువుకోడానికి సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లం.
వైద్య సదుపాయాలు లేక ఎందరో కళ్లముందే ప్రాణాలు విడిచేవారు. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రయ్యాక మా బతుకులు బాగుపడ్డాయి. 108 వాహనం మా గిరిపుత్రుల ఆయుష్షు పెంచింది. ఆయన మరణానంతరం మళ్లీ అభివృద్ధి పడకేసింది. ఇప్పుడు ప్రజా సంక్షేమం కోసం జగనన్న పడుతున్న కష్టం చూసి నేను కూడా గిరిజనులకు ఏదొకటి చేయాలని నిర్ణయించుకున్నాను. రాజన్న రాజ్యం జగన్‌తోనే సాధ్యమని అర్థమయ్యాక వైఎస్సార్‌సీపీ పార్టీలో చేరి గిరిజన ప్రాంతాల్లో చురుగ్గా పనిచేస్తున్నాను.
మా ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం, సంక్షేమం.. అందుకే నా పోరాటం
నాన్న మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా.. నేను చాలా సాధారణ జీవితమే గడిపాను. ప్రజాసమస్యల పరిష్కారానికి నాన్న చేసిన కృషి నన్ను ఎంతో ప్రభావితం చేసింది. రాజకీయాల్లోకి వచ్చే ముందు.. నాన్న స్నేహితులు, బంధువులు, ప్రజలు సమావేశమై జగనన్నతో నడవమని సూచించారు. ఆ దిశగా అడుగులు వేశాను. జగనన్న నాపై పూర్తి నమ్మకముంచి ఈ బాధ్యత అప్పగించారు. నేను సమస్యల్లో నుంచి వచ్చాను. వాటన్నింటినీ పరిష్కరించాలి. మా ప్రజలకు ముఖ్యంగా కావాల్సింది విద్య, వైద్యం.
ఏజెన్సీలో వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. వారికి సరైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. వైద్యులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించి.. అన్ని వేళలా పూర్తిస్థాయి వైద్యం అందించాలనుకుంటున్నాను. నాణ్యమైన విద్యను అందిస్తే.. గిరిజనుల్లో చైతన్యం వస్తుంది. ఏజెన్సీలో మాతా శిశుమరణాలు తగ్గుముఖం పట్టాయని టీడీపీ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికీ ఆ తరహా మరణాలు ఆగలేదు. ఈ ప్రధాన సమస్యలు పరిష్కరిస్తే చాలు.. మన్యంలో మనసున్న మారాజు రాజన్న పాలన మరోసారి వస్తుంది. దాని కోసం రేయింబవళ్లూ కృషి చేస్తాను.
డబ్బే ప్రధామనుకుంటే నాకు టిక్కెట్ దక్కేదా?
ఈ ఎన్నికల్లో అంగ, అర్థబలమున్న వైరిచర్లను ఢీకొట్టగలరా? అని అడుతున్నారు. డబ్బే ప్రధానమని అనుకుంటే.. జగన్‌మోహన్‌రెడ్డి గారు సామాన్యురాలైన నాకు టిక్కెట్ ఇచ్చేవారా.? మా నాన్న దేముడు 1994 నుంచి 2004 వరకూ ఎమ్మెల్యేగా విజయం సాధించేవారా.? అని వారికి సమాధానం చెబుతున్నాను. డబ్బుకంటే.. ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవడమే ప్రధానం. ఎన్నికల్లో అదే ఆయుధం. గిరిజన గుండెల్లో రాజన్న సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన అడుగుజాడల్లో జగనన్న కూడా నడుస్తున్నారు. ఆ రెండే నా బలం. మా ప్రజలు డబ్బు ఇచ్చినా తీసుకునే స్థితిలో లేరు. వారికి కావల్సిందల్లా మౌలిక వసతులు.
నా ఏకైక లక్ష్యం అదే
మా నియోజకవర్గంలో సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న వ్యక్తి చేయలేనిది చేసి చూపించాలనే రాజకీయాల్లోకి వచ్చాను. నాకు తెలిసినంత వరకూ నా ప్రత్యర్థి ఒక్కరే. మా అరకు నియోజకవర్గ సమస్యలే నా అసలైన ప్రత్యర్థులు. ఆ సమస్యలపై విజయమే నా ముందున్న ఏకైక లక్ష్యం.
30 సంవత్సరాలు ఎంపీగా పనిచేశాననే గొప్ప చెప్పుకోవడమే తప్ప.. టీడీపీ అభ్యర్థి వైరిచర్ల ఏనాడైనా అరకు ప్రజల సమస్యల్ని పార్లమెంట్‌లో ప్రస్తావించారా? సమస్యలు పరిష్కరించేందుకు కనీసం కృషి చేశారా.? ఏమీ చేయలేదు. ఆయన హయాంలో ఏదైనా అభివృద్ధి జరిగితే.. నేనిలా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన వచ్చి ఉండేది కాదేమో. ఆయన ఎవరో కూడా పాడేరు, రంపచోడవరం మొదలైన ప్రాంతాల ప్రజలకు ఇప్పటికీ తెలీదు. టీడీపీలోకి వెళ్లినా, కాంగ్రెస్ వారసత్వాన్ని పోగొట్టుకోవడం ఆయనకు ఇష్టం లేదు. అందుకే కుమార్తెను కాంగ్రెస్ నుంచి పోటీ చేయిస్తున్నారు.
– కరుకోల గోపీకిశోర్‌రాజా
Comments
Please login to add a commentAdd a comment