ఖనిజ సంపదను గుర్తించడంలో జీఎస్‌ఐ పాత్ర కీలకం
కేంద్ర ఉక్కు, గనుల శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్
హైదరాబాద్: దేశంలోని ఖనిజ సంపదను గుర్తించడంలో జీఎస్‌ఐ పాత్ర కీలకమైనదని కేంద్ర ఉక్కు, గనుల శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అన్నారు. హైదరాబాద్ ఎల్‌బీ నగర్‌లోని బండ్లగూడ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ)లో జీఎస్‌ఐ ఎంప్లాయీస్ సంఘ్ అఖిల భారత ప్రథమ సమావేశాలకు ఆయనతో పాటు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేంద్రసింగ్ తోమర్ మాట్లాడుతూ..
జీఎస్‌ఐ కార్మికులు కష్టపడి పనిచేసి దేశ సంపదను పెంచాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నూతన మైనింగ్ చట్టాలను తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారన్నారు. జీఎస్‌ఐ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. దేశ ఖనిజ సంపదను ఏ ఒక్కరికీ దారదత్తం చేయబోమని, కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.పీఎఫ్ సమాచారాన్ని ఉద్యోగుల సెల్‌ఫోన్‌కు పంపుతున్నామని తెలిపారు. జీఎస్‌ఐలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని, వాటిలో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
జీఎస్‌ఐ ఎంప్లాయీస్ సంఘ్ అధ్యక్షుడు ఎం.సుధాకర్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో బీజేపీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, అఖిల భారత బీఎంఎస్ అధ్యక్షుడు బీఎన్.రాయ్, సౌత్‌జోన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సామ బాల్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బీఎంఎస్ అధ్యక్షుడు ఎస్.మల్లేశం, ప్రధాన కార్యదర్శి రవిశంకర్, రాధాకృష్ణన్, ఢిల్లీ బీఎంఎస్ ప్రధాన కార్యదర్శి నరేంద్రపాల్ సింగ్, జీఎస్‌ఈఈఎస్ చైర్మన్ ఎం.కిషన్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ సింగ్, నాయకులు ఎ.శ్రీనివాస్, యాదయ్య గౌడ్, జైస్వాన్, రసూల్‌ఖాన్, అనిల్‌కుమార్ పాల్గొన్నారు.