GSI
-
వజ్ర సంకల్పం
కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లో వజ్రాల నిక్షేపాలు ఉన్నాయనే విషయాన్ని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) గుర్తించింది. కర్నూలు జిల్లా తుగ్గలి, మద్దికెర మండలాల్లోని తుగ్గలి, జొన్నగిరి, పగిడిరాయి, కొత్తపల్లి, పెరవలి, అగ్రహారం, హంప, యడవలి, మద్దికెరతోపాటు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని గంజికుంట, తట్రకల్లు, రాగులపాడు, పొట్టిపాడు, కమలపాడు, గూళపాళ్యం, ఎన్ఎంపీ తండా గ్రామాల్లో తరచూ వజ్రాలు లభ్యమవుతున్నాయి. ఈ ప్రాంతంలోని భూమి పొరల్లో కింబర్లైట్ పైప్‌లైన్ ఉందని గనులు భూగర్భ శాఖ నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే తొలకరి జల్లులు కురిసే జూన్‌లో తుగ్గలి, మద్దికెర మండలాల్లో వజ్రాల అన్వేషణ కొన్నేళ్లుగా ముమ్మరంగా సాగుతోంది. ఈ ఏడాది మే మొదటి వారంలోనే వర్షాలు కురిశాయి. ఆ వెంటనే వజ్రాన్వేషణ మొదలైంది. ఇప్పటికే కొందరికి వజ్రాలు దొరికాయి కూడా. ఈ ప్రాంతంలోని పొలాలన్నీ జనంతోనే నిండిపోయాయి. కర్నూలు, నంద్యాలతో పాటు అనంతపురం, కడప, చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి వజ్రాన్వేషకులు తరలివచ్చారు. ఒక్కొక్కరు వారం, పది, పదిహేను రోజులపాటు ఇక్కడే మకాం వేస్తున్నారు. ఓ వైపు వజ్రాల కోసం జనాలు పొలాల్లో తిరుగుతుంటే.. వజ్రాన్వేషకులు తిరగడం వల్ల పొలం గట్టిబారి వ్యవసాయానికి ఇబ్బందిగా ఉంటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు తమ పొలాల్లోకి ఎవరూ రావొద్దని విజ్ఞప్తి బోర్డులు తగిలిస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, కర్నూలువజ్రాలు ఎలా లభ్యమవుతాయంటే.. మన దేశంలో డైమండ్ మైనింగ్ మధ్యప్రదేశ్‌లోని పన్నాలో ఉంది. అక్కడ భూమిలోని రాళ్లను తవ్వితీసి వజ్రాల తయారీ ప్రక్రియ చేపడతారు. వజ్రకరూర్, తుగ్గలి, జొన్నగిరి ప్రాంతాల్లోని భూగర్భంలో 150 మీటర్ల లోతున వజ్రాలు ఉంటాయి. భూమిలో వాతావరణ మార్పులు జరిగినప్పుడు అవి బయటకు వస్తాయి. ఆ తర్వాత వెదరింగ్ (వికోశీకరణ) వల్ల అంటే ఎండకు ఎండి, వర్షానికి తడిసి పగిలిపోతాయి. వర్షాలు, వరదలు వచ్చినపుడు ఆ రాళ్ల ముక్కలు పొలాల్లో అక్కడక్కడా దొరుకుతుంటాయి. వాగులు, వంకల ద్వారా కూడా వజ్రాలు నీటిలో కొట్టుకుని ఇతర ప్రాంతాలకు చేరతాయి. అలా చెల్లాచెదురైన వజ్రాలే ఇప్పుడు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో లభిస్తున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే నాణ్యమైన వజ్రాలు వజ్రాల మైనింగ్ కోసం వజ్రకరూర్‌లో వజ్రాల ప్రక్రమణ కేంద్రాన్ని 1969లో ఏర్పాటు చేశారు. వజ్రాన్వేషణపై ఇది పెద్దగా దృష్టి సారించలేదు. ఆ తర్వాత ఓ ఆ్రస్టేలియన్ కంపెనీ వచ్చి కొద్దికాలం పాటు సర్వే చేసి తిరిగి వెళ్లింది. ఆఫ్రికాతో పాటు చాలా దేశాలతో పోలిస్తే ఇక్కడి వజ్రాలు చాలా నాణ్యమైనవి, విలువైనవి. అందుకే వీటి వెలికితీతపై ప్రత్యేక దృష్టి సారిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని పలువురు కోరుతున్నారు. ‘సీమ’లో ఏజెంట్ల తిష్ట వర్షాకాలం వస్తే జనాలు ఎలా తరలివస్తారో.. వజ్రాల వ్యాపారులు కూడా గుత్తి, గుంతకల్లు, జొన్నగిరి, పెరవలిలో మకాం వేసి వజ్రాల కొనుగోలుకు ప్రయత్నిస్తారు. ఇందుకోసం వజ్రాలు లభ్యమయ్యే గ్రామాల్లో ఏజెంట్లను సైతం నియమించుకుంటున్నారు. వజ్రం దొరికిందనే సమాచారం వస్తే ఏజెంట్లు వాలిపోతారు. వజ్రం దొరికిన వారిని వ్యాపారుల వద్దకు తీసుకెళ్లి రేటు కుదురుస్తారు. వజ్రం విలువైనదైతే వ్యాపారులే వారి వద్దకు వెళ్తారు. వ్యాపారుల మధ్య పోటీ పెరిగితే బహిరంగ వేలం వేస్తారు. వజ్రం నాణ్యత(క్యారెట్)ను బట్టి రూ.20 వేల నుంచి రూ.20 లక్షల వరకు కొనుగోలు చేస్తారు. జిల్లా చరిత్రలో 2022లో లభించిన 30 క్యారెట్ల వజ్రమే అత్యంత విలువైంది. ఈ ఏడాది ఇప్పటికే 9 వజ్రాలు లభ్యమయ్యాయి. గతేడాది సరైన వర్షాలు లేవు. అయినప్పటికీ 18 వజ్రాలు దొరికాయి. ఇక్కడ వజ్రాలను స్థానిక వ్యాపారులకే విక్రయిస్తారు. ఇక్కడి వ్యాపారులు అంత నమ్మకం సాధించారు. చెప్పిన ధర చెప్పినట్టు ఇస్తారు. అదే ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇస్తే దానిని స్వా«దీనం చేసుకుని పైసా కూడా ఇవ్వరనే అభిప్రాయంతో వారు అధికారులకు చెప్పకుండా విక్రయిస్తారు. విదేశాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఆఫ్రికా, అంగోలా, కాంగోతో పాటు చాలా దేశాల్లో ఇదే తరహాలో వజ్రాలు లభిస్తాయి. వాటిని అల్యూవియల్ డైమండ్స్ అంటారు. అక్కడ ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. వజ్రాలు లభించిన వారు నేరుగా ఆ కేంద్రానికి వచ్చి చూపిస్తారు. వజ్రాల నాణ్యత ఆధారంగా కొంత మొత్తం చెల్లిస్తారు. వజ్రాలను లీగల్‌గా ప్రభుత్వం ప్రక్రియను పూర్తి చేసి విక్రయిస్తుంది. కర్నూలు జిల్లాలో ఏటా సగటున 50–60 వజ్రాలు లభిస్తున్నాయి. అలాగే వజ్రకరూరు ప్రాంతంలో కూడా ఏటా 30–40 వజ్రాలు లభిస్తాయి. అంటే ఈ రెండు జిల్లాల్లో ఏటా వంద వజ్రాలు లభిస్తున్నాయి. మైనింగ్ చేస్తే రూ. వందల కోట్ల విలువైన సంపద ప్రభుత్వానికి లభించే అవకాశం ఉంది. వజ్రాన్ని గుర్తు పడతాం మాది కలికిరి. హైదరాబాద్‌లోని స్నేహితుడు, నేను కలిసి మూడు రోజుల క్రితం ఇక్కడికి వచ్చాం. దొరికితే వజ్రం. లేదంటే కాలక్షేపంగా ఉంటుందని వచ్చాం. మేం బంగారం నగలు తయారు చేస్తాం. వజ్రం ఎలా ఉంటుందో సులువుగా గుర్తుపడతాం. – రామాంజులాచారి, కలికిరి, అన్నమయ్య జిల్లా ఐదోసారి వచ్చా వానొస్తే మా ఊరోళ్లంతా రైలెక్కి గుత్తిలో దిగి జొన్నగిరికి వస్తాం. నేను ఇక్కడికి ఐదేళ్ల నుంచి వస్తున్నాను. వచ్చి వారమైంది. ఐదేళ్లలో ఒక్క వజ్రం కూడా దొరకలేదు. తిండీ తిప్పలకు ఇబ్బందిగా ఉంది. మాతో పాటు వచ్చిన కొంతమందికి వజ్రాలు దొరుకుతున్నాయి. మాకు ఆశ చావక వెతుకుతున్నాం. – ఈరయ్య, రామాపురం, వినుకొండ, పల్నాడు జిల్లా -
బోరు బావి నుంచి బంగారం.. భారీగా ఎగబడుతున్న జనం
సాధారణంగా బోరు వేస్తే నీరు వస్తుంది, అదృష్టం బాగాలేకపోతే అది కూడా లేదు. అయితే ఇటీవల ఒక రైతు భూమిలో బోరు వేస్తే ఏకంగా బంగారం పొడి బయటకు వచ్చిందని తెలిసింది. ఇంతకీ వచ్చింది బంగారమేనా? ఈ సంఘటన ఎక్కడ జరిగిందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం. ఒడిశాలోని బొలంగీర్ జిల్లా చంచన బహాలి గ్రామానికి చెందిన మహమ్మద్ జావెద్ అనే రైతు తన భూమిలో బోరు వేస్తే బురదతో పాటు బంగారం పడిందంటూ పెద్దయెత్తున ప్రచారం జరిగింది. దీంతో అక్కడికి పెద్ద ఎత్తున జనం ఎగబడ్డారు. ఈ విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు బోరు నుంచి వెలువడిన మట్టి శాంపిల్ తీసి టెస్ట్ చేయడానికి పంపించారు. (ఇదీ చదవండి: ఎందెందు వెదకి చూసినా భారతీయ సీఈఓలు అందందే గలరు! వందల కోట్ల జీతాలు తీసుకుంటున్న మనోళ్లు) స్థానిక ఖప్రఖోల్ తహసీల్దార్ ఆదిత్య ప్రసాద్ మిశ్రా బోరును పరిశీలించి తరువాత సీజ్ చేశారు. పసుపు రంగులో మట్టితో కలిసి బయటపడిన నమూనాలలో తప్పకుండా బంగారు కణికలు ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే ల్యాబ్ టెస్ట్ తరువాత అతి అసలైన బంగారమా? కాదా? అని తెలుస్తుంది. (ఇదీ చదవండి: Personal Loan: పర్సనల్ లోన్ తీసుకోవాలా? ఇది మీకోసమే!) డైరెక్టరేట్ ఆఫ్ మైన్స్ అండ్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్ఐ) ఇటీవల జరిపిన సర్వేల ప్రకారం, ఒడిశాలోని డియోగర్, కియోంజర్, మయూర్‌భంజ్‌తో సహా మూడు జిల్లాల్లో బంగారం నిల్వలు ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ జాబితాలో బొలంగీర్ లేదు. అయితే ఆ ప్రాంతంలో గ్రాఫైట్, మాంగనీస్, విలువైన రాళ్లు ఉన్నాయని జిఎస్ఐ గతంలోనే తెలిపింది. -
రియల్ కేజీఎఫ్.. దేశంలోనే అత్యధిక బంగారం నిల్వలు.. ఎక్కడంటే!
బంగారం గనుల నేపథ్యంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్’ సినిమా యావత్ దేశాన్ని ఊర్రూతలూగించిన సంగతి తెలిసిందే. నిన్న వరకు రీల్ లైఫ్‌లో బంగారం గనులు నేడు రియల్ లైఫ్‌లోనూ అదే తరహాలో బంగారం నిల్వ ఉన్నట్లు బీహార్‌లోని జముయి జిల్లాలో బయట పడింది. వివరాల ప్రకారం.. బీహార్‌లోని జముయి జిల్లా దేశంలోనే అతిపెద్ద బంగారం నిల్వలు ఉన్నాయని ఈ జిల్లా పరిధిలో బంగారం తవ్వకానికి అనుమతులు జారీ చేసే యోచనలో బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. జముయి జిల్లాలోని కర్మతియా, ఝఝా, సోనో వంటి ప్రాంతాల్లో బంగారం నిల్వలు ఉన్నట్లు సూచించిన జీఎస్ఐ నిర్ధారణలను విశ్లేషించిన తర్వాత పలు సంస్ధలతో సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభమవుతుందని అడిషనల్ చీఫ్ సెక్రటరీ కమ్ మైన్స్ కమిషనర్ హర్జోత్ కౌర్ బమ్రాహ్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక నెల వ్యవధిలో జీ3 (ప్రిలిమినరీ) దశ అన్వేషణ కోసం కేంద్ర ఏజెన్సీ లేదా ఏజెన్సీలతో ఎంఓయూ సంతకం చేసే అవకాశం ఉందని ఆమె చెప్పారు. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) సర్వే ప్రకారం జముయి జిల్లాలోని గోల్డ్ రిజర్వులో 222.88 మిలియన్ టన్నుల బంగారం, 37.6 టన్నుల ఖనిజాలు ఉన్నాయని తెలుస్తోంది. దేశంలో బంగారు నిల్వల్లో అత్యధిక వాటా బీహార్‌లో ఉందని కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గత ఏడాది లోక్‌సభకు తెలియజేశారు. బీహార్‌లో 222.885 మిలియన్ టన్నుల బంగారు లోహం ఉందని, ఇది దేశంలోని మొత్తం బంగారం నిల్వల్లో 44 శాతం అని లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. -
AP: వజ్రాల వేటకు ఓకే
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా ఉప్పరపల్లెలో వజ్రాల అన్వేషణకు మైనింగ్ శాఖ త్వరలో టెండర్లు పిలవనుంది. ఉప్పరపల్లె ప్రాంతంలో వజ్రాల లభ్యత ఉన్నట్లు ఇటీవల జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ధృవీకరించి, ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ప్రాథమిక సర్వే (జీ–4) ప్రకారం వజ్రాల లభ్యత ఉన్నట్లు తేలింది. గతంలో జీ–4 సర్వే ఆధారంగా గనులకు వేలం నిర్వహించకూడదని కేంద్రం స్పష్టం చేయడంతో వజ్రాల గనిపై ముందడుగు పడలేదు. ఆదాయం పెంచుకోవాల్సిన నేపథ్యంలో కేంద్రం ఇటీవలే తాజాగా ఎంఎండీఆర్ (మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్) చట్టాన్ని సవరించి జీ–4 సర్వే ప్రకారం గనుల్ని లీజుకిచ్చే అవకాశం కల్పించింది. దీంతో ఉప్పరపల్లెలో వజ్రాల గనికి సానుకూలత ఏర్పడింది. వాస్తవానికి మైనింగ్ శాఖ గతంలోనే ఈ ప్రాంతంలో వజ్రాల లభ్యత ఉన్నట్లు గుర్తించింది. కేంద్రం ఆంక్షలు, వజ్రాల వెలికితీత కష్టతరం కావడం, భారీగా ఖర్చయ్యే పరిస్థితి ఉండడంతో అప్పట్లో దానిపై అంతగా దృష్టి సారించలేదు. మరింత లోతుగా సర్వే తాజాగా కేంద్ర ప్రభుత్వ వైఖరి మారడంతోపాటు వజ్రాల వెలికితీతకు అవకాశాలు మెరుగు పడడంతో మరింత లోతుగా అన్వేషణ కోసం టెండర్లు పిలవడానికి సిద్ధమైంది. జీ–4 సర్వే ఆధారంగా ఈ గనికి వేలం నిర్వహించి కాంపోజిట్ లీజు ఇవ్వనున్నారు. ఈ లీజు తీసుకున్న వారు వెంటనే మైనింగ్ చేసుకునే అవకాశం ఉండదు. ఆ బ్లాకుల్లో ఖనిజం ఎక్కడ, ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి సొంతంగా జీ–3, జీ–2, జీ–1 స్థాయి సర్వేలు చేయించుకోవాల్సి ఉంటుంది. వైఎస్సార్ జిల్లా ఉప్పరపల్లె గ్రామంలో వజ్రాల నిక్షేపాలు ఉన్న భూములు ఇందుకు రెండు నుంచి ఐదేళ్లు అవకాశం ఇస్తారు. ఆ తర్వాత వారికిచ్చిన కాంపోజిట్ లీజును సాధారణ లీజుగా మార్పు చేస్తారు. ఉప్పరపల్లె ప్రాంతంలో 37.65 చదరపు కిలోమీటర్లలో వజ్రాల లభ్యతకు అవకాశం ఉన్నట్లు ప్రాథమిక అంచనాల్లో తేలింది. లీజు పొందిన సంస్థ పూర్తి స్థాయిలో సర్వేలు చేస్తే, వజ్రాల లభ్యత గురించి పూర్తి సమాచారం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మైనింగ్ శాఖ టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపింది. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే టెండర్లు పిలవనున్నట్లు మైనింగ్ శాఖ అధికారులు తెలిపారు. -
లావా చెక్కిన ‘స్తంభాలు’
ఈ చిత్రంలో కనిపిస్తున్నవి గండరాతి శిలలు.. కానీ సాధారణ రాయితో ఏర్పడ్డవి కాదు. భూపొరల నుంచి ఉప్పొంగిన లావా ఘనీభవించి ఇలా రాతిగా మారాయి. లావాతో ఏర్పడ్డ రాతి పొరలు సహజంగానే కనిపిస్తుంటాయి. కానీ ఉలితో శిల్పి చెక్కినట్టుగా ఇలా ఒకేరకం కడ్డీలుగా ఏర్పడటం మాత్రం కొంత అరుదే. వాటిని కాలమ్నార్ బసాల్ట్‌గా పిలుస్తారు. ఇలాంటి అరుదైన లావా రాతిస్తంభాలు ఆసిఫాబాద్ అడవుల్లో వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాల్లో గతంలో విస్తారంగా కనిపించిన ఈ లావా స్తంభాలు తెలంగాణ లో తొలిసారి కనిపించడం విశేషం. ఇలాం టి రాతిస్తంభాలు కొన్ని ప్రాంతాల్లో చాలా పొడవుగా ఉంటాయి. అలాంటి స్తంభాలతో ఏర్పడ్డ గుట్టలు కూడా ఉన్నాయి. ఆసిఫాబాద్ అభయారణ్యంలో వెలుగుచూసిన లా వా ‘రాతికడ్డీలు’ భూ ఉపరితలంలో చిన్న విగానే కనిపిస్తున్నా భూగర్భంలో మరింత పొడవుగా ఉండి ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ ప్రాంతంలో జీఎస్ఐ విభాగం పరిశోధన జరిపితే మరిన్ని కొత్త విషయాలు వెలుగుచూసే అవకాశం ఉంది. 6.5 కోట్ల సంవత్సరాల క్రితం.. దక్కన్ పీఠభూమి చాలా వరకు లావా ప్రవహించిన ప్రాంతమే. దాదాపు 6.5 కోట్ల సంవత్సరాల క్రితం భూగర్భంలోని పొరల్లో చోటుచేసుకున్న చర్య ఫలితంగా లోపలి నుంచి లావా ఉప్పొంగి మహారాష్ట్ర పూర్తి భాగం, రాజస్తాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల్లో కొంతభాగం చొప్పున ఆవరించిందని, వికారాబాద్ సమీపంలోని అనంతగిరి గుట్టలు అలా ఉప్పొంగిన లావా ఘనీభవించి ఏర్పడ్డవేనని ఔత్సాహిక పరిశోధకులు చెబుతున్నారు. చేవెళ్ల మీదుగా వికారాబాద్, ఇటు కర్ణాటక, అటు మహారాష్ట్ర వైపు ఇలా లావాతో రాతి పొరలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. దాదాపు 5 లక్షల చదరపు కి.మీ. మేర ఇవి ఏర్పడటం గమనార్హం. ఈ సాధారణ రాతి పొరలే కాకుండా కొన్ని ప్రత్యేక ఒత్తిళ్ల వల్ల అవి నిర్దిష్ట ఆకృతిలో స్తంభాలుగా ఏర్పడ్డాయి. వాటినే కాలమ్నార్ బసాల్ట్‌గా పేర్కొంటారు. – సాక్షి, హైదరాబాద్ జీఎస్ఐ పరిశోధన చేపట్టాలి... కొందరు ఔత్సాహికులు కొంతకాలం క్రితం ఆసిఫాబాద్ అభయారణ్యంలో పరిశోధించి ఈ రాళ్లను గుర్తించారు. ఆ చిత్రాలను నేను జీఎస్ఐ విశ్రాంత డిప్యూటీ డైరక్టర్ చకిలం వేణుగోపాల్‌కు పంపగా అవి కాలమ్నార్ బసాల్ట్‌గా ఆయన నిర్ధారించారు. ఈ అరుదైన రాళ్లకు సంబంధించి ఆ ప్రాంతంలో జీఎస్ఐ వెంటనే పరిశోధన చేపట్టాలి. – శ్రీరామోజు హరగోపాల్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ తెలంగాణలో తొలిసారే... మహారాష్ట్రలోని యావత్మాల్లో ఇటీవల రోడ్డు నిర్మాణం కోసం జరిపిన తవ్వకాల్లో భారీ కాలమ్నార్ బసాల్డ్ పొర వెలుగుచూసింది. ఆసిఫాబాద్ అడవిలో కనిపించిన శిలాస్తంభాల చిత్రాలు చూస్తే అవి కాలమ్నార్ బసాల్ట్గానే అనిపిస్తోంది. జీఎస్ఐ పరిశోధించి వాటిని అధికారికంగా తేలిస్తే తెలంగాణలో మొదటిసారి అలాంటి శిలారూపాలు రికార్డయినట్టవుతుంది. – చకిలం వేణుగోపాల్,జీఎస్ఐ విశ్రాంత డిప్యూటీ డైరక్టర్ -
కేంద్రం కీలక నిర్ణయం.. ఆ ప్రాంతాలన్నీ మూసివేత
-
కేంద్రం కీలక నిర్ణయం.. ఆ ప్రాంతాలన్నీ మూసివేత
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకీ విలయతాండవం చేస్తుండటంతో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మాహమ్మారిని కట్టడి చేసే పనిలో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలు, స్మారక స్థలాలు, మ్యూజియాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ప్రకటించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ సంరక్షణలో ఉండే స్మారక కట్టడాలు, స్థలాలు, మ్యూజియాలను మే 15వరకు మూసివేస్తున్నట్టు కేంద్రంలోని సీనియర్ అధికారులు ప్రకటించారు. గతేడాది కరోనా విశ్వరూపం చూపిన సందర్భంలో కూడా ఈ కట్టడాలన్నీ మూసివేయగా.. కొన్ని రోజుల తరువాత వైరస్ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టడంతో క్రమంగా ఆంక్షలు ఎత్తివేసిన విషయం తెలిసిందే. తాజాగా గతంలో కంటే వేగంగా కరోనా 2.0 కమ్ముకొస్తోంది. బుధవారం ఒక్కరోజే 2 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు కావడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కోవిడ్‌ను అదుపు చేసే చర్యల్లో భాగంగా మరోసారి కేంద్రం సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలను దశల వారీగా అమలు చేస్తున్నాయి. ( చదవండి: కోవిడ్-19 ఎఫెక్ట్ మహారాష్ట్రలో కిక్కిరిసిన రైల్వే స్టేషన్లు ) -
బంగారం నిక్షేపాలు అబద్ధం: జీఎస్ఐ
కోల్‌కతా/సోన్‌భద్ర: ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో 3వేల టన్నుల బంగారం నిల్వలు బయటపడ్డాయంటూ వచ్చిన వార్తలు వట్టివేనని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ)స్పష్టం చేసింది. ‘సోన్‌భద్రలో అంత భారీగా బంగారు నిల్వలను మేం కనుగొనలేదు. అటువంటి సమాచారమేదీ మేం ఇవ్వలేదు’ అని జీఎస్ఐ డైరెక్టర్ జనరల్ ఎం.శ్రీధర్ కోల్‌కతాలో శనివారం మీడియాకు తెలిపారు. తమ అన్వేషణలో ఇదే జిల్లాలో దాదాపు 52వేల టన్నుల ఇనుప ఖనిజం బయటపడిందనీ, ఇందులో టన్నుకు 3.03 గ్రాముల చొప్పున సాధారణ స్థాయిలో బంగారం ఉన్నట్లు తేలిందన్నారు. బహుశా ఈ వార్తనే సోన్‌భద్ర జిల్లా అధికారులు మరోలా వెల్లడించి ఉంటారని అన్నారు. -
రాకాసిబల్లి వేటలో జీఎస్ఐ
సాక్షి, హైదరాబాద్: రాక్షస బల్లుల శిలాజాల జాడ కనుక్కునేందుకు చాలాకాలం తర్వాత జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) మళ్లీ నడుం బిగించింది. మంచిర్యాల జిల్లా యామన్‌పల్లి పరిసరాల్లో ఆ విభాగం శాస్త్రవేత్తల బృందం మూడు రోజులపాటు పర్యటించి శిలాజాల ఆధారాలను కనుగొంది. రాకాసిబల్లితోపాటు కొన్ని ఇతర జంతువుల శిలాజాలుగా భావిస్తున్న రాళ్లపై ప్రాథమిక పరిశోధనలు చేసి వాటిల్లో శిలాజాలుగా గుర్తించిన వాటిల్లో కొన్నింటిని, మిగతావాటి నమూనాలను సేకరించారు. ‘రాళ్లలో రాక్షసబల్లి’శీర్షికతో మే 22న ‘సాక్షి’ప్రచురించిన కథనానికి ఆ విభాగం స్పందించింది. స్థానిక యామన్‌పల్లి సమీపంలో నిర్మించిన వంతెన రివిట్మెంట్ రాళ్లలో శిలాజాలను పోలిన రాళ్లున్న విషయంతోపాటు, ఇతర ప్రాంతాల్లో కనిపిస్తున్న కొన్ని జాడల వివరాలు, స్థానికులు కొందరు శిలాజాలను బేరం పెట్టిన తీరును ఆ కథనం వెలుగులోకి తెచ్చింది. 1970లలో ఇక్కడే డైనోసార్ అస్థిపంజరం లభించింది. మూడు రాక్షస బల్లులకు సంబంధించిన ఎముకలను సేకరించిన అప్పటి జీఎస్ఐ పరిశోధకులు వాటిని ఓ ప్రత్యేక పద్ధతిలో కూర్చి డైనోసార్ ఆకృతిని రూపొందించారు. ప్రస్తుతం హైదరాబాద్ బీఎం బిర్లా సైన్స్ మ్యూజియంలోని డైనోసోరియంలో ప్రదర్శనలో ఉన్న ఆకృతి అదే. కోల్‌కతా మ్యూజియం తర్వాత రాక్షసబల్లి రెండో అస్థిపంజరం మనదేశంలో ఇదే కావటం విశేషం. అప్పట్లో జీఎస్ఐ పరిశోధకులు యాదగిరి ఈ ప్రాంతంలో విస్తృతంగా పరిశోధనలు జరిపి వాటి ఆధారాలను గుర్తించారు. ఆయన మృతి చెందిన తర్వాత దాదాపు 2 దశాబ్దాలుగా జీఎస్ఐ ఇటువైపు చూడలేదు. దీంతో అప్పటినుంచి ఆయా ప్రాంతాల్లో అడపాదడపా శిలాజాలు వెలుగు చూస్తున్నా... వాటిపై స్థానికుల్లో అవగాహన లేకుండా పోయింది. దీంతో శిలాజాలను సాధారణ రాళ్లుగానే భావిస్తూ పనులకు వాడుకుంటున్నారు. ఇదేక్రమంలో ఇటీవల వంతెన రివిట్మెంట్లో కూడా వాడేశారు. అందులోని కొన్ని రాళ్లు శిలాజాలను పోలినట్టు ఉండటంతో ఔత్సాహిక చరిత్ర పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్, సముద్రాల సునీల్, పులిపాక సాయి తదితరులు వాటిచిత్రాలు సేకరించారు. వాటిని పుణెలోని డెక్కన్ కళాశాలలో పనిచేస్తున్న శిలాజాల నిపుణులు ప్రొఫెసర్ బాదామ్ దృష్టికి ‘సాక్షి’తీసుకెళ్లగా.. అందులో కొన్ని శిలాజాలేనని ధ్రువీకరించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని సచిత్రంగా వివరిస్తూ ‘సాక్షి’కథనం వెలువరించటంతో రెండు దశాబ్దాల తర్వాత జీఎస్ఐ మళ్లీ పరిశోధనలకు శ్రీకారం చుట్టింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా హైదరాబాద్ విభాగం సంచాలకులు మంజూషా మహాజన్ ఆదేశంతో శాస్త్రవేత్తల బృందం మూడు రోజులపాటు మంచిర్యాల జిల్లా యామన్పల్లితోపాటు సమీపంలోని పలు గ్రామాల శివార్లలో పర్యటించింది. వంతెన రివిట్మెంట్ రాళ్లను పరిశీలించి వాటిల్లో శిలాజాలున్నట్టు ప్రాథమికంగా గుర్తించింది. వెంట తెచ్చుకున్న రసాయనాలు, మైక్రోస్కోప్ ఆధారంగా ప్రాథమికంగా గుర్తించిన వాటిలో కొన్ని రాళ్లను వాళ్లు సమీకరించారు. కొన్నింటిని నమూనాలను సేకరించి తదుపరి పరిశీలనకు ల్యాబ్‌కు పంపారు. వాటి పూర్తి వివరాలు అందిన తర్వాత ఆయా ప్రాంతాల్లో తవ్వకాలు జరపాలని నిర్ణయించినట్టు తెలిసింది. శిలాజాల జాడలను అన్వేషిస్తున్నాం ‘సాక్షిలో ప్రచురితమైన కథనం ఆధారంగా ఆ ప్రాంతంలో పర్యటించాం. కొన్ని రాళ్లను ప్రాథమికంగా పరిశీలించినప్పుడు శిలాజాలనే తేలింది. పూర్తిస్థాయి పరిశీలన జరగాల్సి ఉంది. పక్షం రోజుల తర్వాత వాటికి సంబంధించిన నివేదిక వస్తుంది. ఆ తర్వాత చర్యలు తీసుకుంటాం. శిలాజాలపై ప్రజల్లో అవగాహన రావాల్సిన అవసరం ఉంది. వాటిని ధ్వంసం చేయొద్దు. వాటి ఆధారం గానే తదుపరి పరిశోధనలు జరుగుతాయి’అని జీఎస్ఐ హైదరాబాద్ సంచాలకులు మంజూషా మహాజన్ మంగళవారం ‘సాక్షి’కి వెల్లడించారు. వెంటనే చర్యలు చేపట్టాలి: హరగోపాల్ కోట్ల సంవత్సరాల క్రితం తిరగాడిన రాకాసి బల్లులు, నాటి ఇతర జంతువులు, పక్షులకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పటికీ వెలుగుచూసే అవకాశం ఉందని, అందుకు వాటి శిలాజాలు మాత్రమే ఏకైక ఆధారాలని ఔత్సాహిక పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా యామన్‌పల్లి పరిసరాల్లో గుర్తించినవి శిలాజాలేనని, అలాంటివి ఇంకా చాలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. జీఎస్ఐ వెంటనే తవ్వకాలు జరిపితే కోట్ల ఏళ్ల నాటి జంతువులు, పక్షులు, మొక్కల శిలాజాలు వెలుగు చూస్తాయని పేర్కొన్నారు. మరోవైపు వాటిని ధ్వంసం చేయకుండా సామాన్య జనంలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. -
రాష్ట్రంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇనుప ఖనిజ నిక్షేపాల ఆనవాళ్లను గుర్తించినట్లు జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) వెల్లడించింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో వజ్రపు గనుల ఆనవాళ్లను గుర్తించినట్లు జీఎస్ఐ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఎం.శ్రీధర్ తెలిపారు. దక్షిణ భారతదేశ ప్రగతిలో తమ శాఖ పలు కీలక ఆవిష్కరణలు చేసిందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తమ సంస్థ పలు ఖనిజ నిక్షేపాలను గుర్తించిందన్నారు. ఈ మేరకు 2016–17 సంవత్సరానికి సంబంధించి నివేదిక వివరాలను ఆయన వెల్లడించారు. తెలంగాణలో ఐరన్ ఓర్ నిక్షేపాలను తాము సర్వే ద్వారా గుర్తించామన్నారు. ఇవి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆర్నకోండ ఎర్రబాలి బ్లాక్, చందోలి, అంబారీపేట బ్లాకులు, ఉమ్మడి ఆదిలాబాద్‌లోని రబ్బనపల్లి, ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని గురిమల్ల, దబ్రీపేట, అబ్బాపూర్, మల్లంపల్లిలో 89.22 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజ నిక్షేపాలను తాము కనుగొన్నట్లు పేర్కొన్నారు. ఇక్కడే ఇనుము తయారీలో వాడే ముడి మాగ్నటైట్ నిక్షేపాలు సైతం ఉన్నాయని తెలిపారు. అయితే వీటితో నాణ్యమైన స్టీలును తయారు చేయలేమని చెప్పారు. కానీ వీటిని చిన్న చిన్న ఐరన్ పెల్లెట్ల తయారీకి వినియోగించవచ్చని తెలిపారు. దీనిపై పూర్తిస్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశామన్నారు. రాష్ట్ర విభజన హామీల్లో ముఖ్యమైన బయ్యారం స్టీలు ఫ్యాక్టరీకి ఈ నిక్షేపాలు ఊతంగా నిలుస్తాయని అన్నారు. దీంతో బయ్యారం స్టీలు ఫ్యాక్టరీపై పోరాడుతున్న ప్రభుత్వానికి ఇది మంచి పరిణామమని ఆయన అభివర్ణించారు. ఆంధ్రాలో వజ్రపు నిక్షేపాలు.. అనంతపురం జిల్లా వజ్రకరూర్ ప్రాంతంలో తక్కువ నాణ్యతగల ముడి వజ్రపు నిక్షేపాల ఆనవాళ్లు (కింబర్లేట్ పైప్)ను కనుగొన్నట్లు తెలిపారు. వీటిని శుద్ధి చేసి ఒక క్యారెట్ నాణ్యతగల వజ్రాలు ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు. -
‘బయ్యారం’ ఖనిజాన్వేషణ ప్రైవేటుకు
సాక్షి, హైదరాబాద్: ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలో ముడి ఇనుప ఖనిజం అన్వేషణ బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల పరిధిలోని ఖనిజ నిల్వలను గతంలోనే రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ)కు అప్పగించా రు. ఈ నేపథ్యంలో ఖనిజాన్వేషణకు ప్రైవేటు ఏజెన్సీలను పారదర్శకంగా ఎంపిక చేయాల్సిన బాధ్యతను టీఎస్ఎండీసీకి అప్పగిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) ద్వారా ఖమ్మం జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ మేరకు సెయిల్ ప్రతినిధులు ఖమ్మంలో పర్యటించి ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కనీసం 200 మిలియన్ టన్నుల ముడి సరుకు అవసరమని తేల్చారు. రాష్ట్రంలో 302 మిలియన్ టన్నుల ముడి ఇనుము నిల్వలు ఉన్నాయంటూ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక శాస్త్రీయంగా లేనందున 200 మిలియన్ టన్నుల ముడి ఇనుముపై పూర్తి నివేదిక ఇవ్వాలని సెయిల్ సూచించింది. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జీఎస్ఐతో సమన్వయం చేసుకుంటూ ముడి ఇనుము లభ్యతపై నివేదిక సిద్ధం చేసే బాధ్యతను ప్రభుత్వం గత ఫిబ్రవరిలో టీఎస్ఎండీసీకి అప్పగించింది. కొలిక్కిరాని ఖనిజాన్వేషణ ఖమ్మం, వరంగల్ జిల్లాల సరిహద్దులోని బయ్యారంలో 100 చదరపు కి.మీ. పరిధిలో జీఎస్ఐ, గనులు, భూగర్భ వనరుల శాఖ సంయుక్త సర్వే నిర్వహించింది. లభ్యత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న 60 చ.కి.మీ. పరిధిలో 14 చోట్ల డ్రిల్లింగ్ చేసి ఖనిజం లభ్యతపై అంచనాకు రావాలి. డ్రిల్లింగ్ ప్రక్రియ ఆలస్యమవుతుండటంతో మూడుచోట్ల ఖనిజాన్వేషణ బాధ్యతను సింగరేణికి అప్పగించారు. మరోవైపు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల పరిధిలో మరో 12 చోట్ల డ్రిల్లింగ్ చేయాలని జీఎస్ఐ తాజాగా ప్రతిపాదించింది. ఇప్పటికే బయ్యారంలో జీఎస్ఐ, సింగరేణి డ్రిల్లింగ్‌ను సకాలంలో పూర్తి చేయలేనందున కొత్తగా ప్రతిపాదించిన 12 పాయింట్లను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఇనుము లభ్యతపై స్పష్టత వస్తుందని టీఎస్ఎండీసీ వర్గాలు చెబుతున్నాయి. -
త్వరలో ఇస్రోతో రైల్వే ఒప్పందం!
న్యూఢిల్లీ: రైల్వేలో భద్రత, సామర్థ్యం మెరుగుపరిచేందుకు ఆ శాఖ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోతో త్వరలో పరస్పర ఒప్పందం కుదుర్చుకోనుంది. రైల్వే మార్గం, భవనాలు, భూములు, వర్క్‌షాప్‌ల వంటి తదితర విషయాలను భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్) ద్వారా తెలుసుకోనుంది. ఒప్పందం రైల్వే ప్రమాదాలు అరికట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. -
ఖనిజ సంపదను గుర్తించడంలో జీఎస్ఐ పాత్ర కీలకం
కేంద్ర ఉక్కు, గనుల శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ హైదరాబాద్: దేశంలోని ఖనిజ సంపదను గుర్తించడంలో జీఎస్ఐ పాత్ర కీలకమైనదని కేంద్ర ఉక్కు, గనుల శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అన్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్‌లోని బండ్లగూడ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ)లో జీఎస్ఐ ఎంప్లాయీస్ సంఘ్ అఖిల భారత ప్రథమ సమావేశాలకు ఆయనతో పాటు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేంద్రసింగ్ తోమర్ మాట్లాడుతూ.. జీఎస్ఐ కార్మికులు కష్టపడి పనిచేసి దేశ సంపదను పెంచాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నూతన మైనింగ్ చట్టాలను తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారన్నారు. జీఎస్ఐ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. దేశ ఖనిజ సంపదను ఏ ఒక్కరికీ దారదత్తం చేయబోమని, కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.పీఎఫ్ సమాచారాన్ని ఉద్యోగుల సెల్‌ఫోన్‌కు పంపుతున్నామని తెలిపారు. జీఎస్ఐలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని, వాటిలో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జీఎస్ఐ ఎంప్లాయీస్ సంఘ్ అధ్యక్షుడు ఎం.సుధాకర్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో బీజేపీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, అఖిల భారత బీఎంఎస్ అధ్యక్షుడు బీఎన్.రాయ్, సౌత్‌జోన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సామ బాల్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బీఎంఎస్ అధ్యక్షుడు ఎస్.మల్లేశం, ప్రధాన కార్యదర్శి రవిశంకర్, రాధాకృష్ణన్, ఢిల్లీ బీఎంఎస్ ప్రధాన కార్యదర్శి నరేంద్రపాల్ సింగ్, జీఎస్ఈఈఎస్ చైర్మన్ ఎం.కిషన్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ సింగ్, నాయకులు ఎ.శ్రీనివాస్, యాదయ్య గౌడ్, జైస్వాన్, రసూల్‌ఖాన్, అనిల్‌కుమార్ పాల్గొన్నారు.