సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా ఉప్పరపల్లెలో వజ్రాల అన్వేషణకు మైనింగ్ శాఖ త్వరలో టెండర్లు పిలవనుంది. ఉప్పరపల్లె ప్రాంతంలో వజ్రాల లభ్యత ఉన్నట్లు ఇటీవల జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) ధృవీకరించి, ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ప్రాథమిక సర్వే (జీ–4) ప్రకారం వజ్రాల లభ్యత ఉన్నట్లు తేలింది. గతంలో జీ–4 సర్వే ఆధారంగా గనులకు వేలం నిర్వహించకూడదని కేంద్రం స్పష్టం చేయడంతో వజ్రాల గనిపై ముందడుగు పడలేదు.
ఆదాయం పెంచుకోవాల్సిన నేపథ్యంలో కేంద్రం ఇటీవలే తాజాగా ఎంఎండీఆర్ (మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) చట్టాన్ని సవరించి జీ–4 సర్వే ప్రకారం గనుల్ని లీజుకిచ్చే అవకాశం కల్పించింది. దీంతో ఉప్పరపల్లెలో వజ్రాల గనికి సానుకూలత ఏర్పడింది. వాస్తవానికి మైనింగ్ శాఖ గతంలోనే ఈ ప్రాంతంలో వజ్రాల లభ్యత ఉన్నట్లు గుర్తించింది. కేంద్రం ఆంక్షలు, వజ్రాల వెలికితీత కష్టతరం కావడం, భారీగా ఖర్చయ్యే పరిస్థితి ఉండడంతో అప్పట్లో దానిపై అంతగా దృష్టి సారించలేదు.
మరింత లోతుగా సర్వే
తాజాగా కేంద్ర ప్రభుత్వ వైఖరి మారడంతోపాటు వజ్రాల వెలికితీతకు అవకాశాలు మెరుగు పడడంతో మరింత లోతుగా అన్వేషణ కోసం టెండర్లు పిలవడానికి సిద్ధమైంది. జీ–4 సర్వే ఆధారంగా ఈ గనికి వేలం నిర్వహించి కాంపోజిట్ లీజు ఇవ్వనున్నారు. ఈ లీజు తీసుకున్న వారు వెంటనే మైనింగ్ చేసుకునే అవకాశం ఉండదు. ఆ బ్లాకుల్లో ఖనిజం ఎక్కడ, ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి సొంతంగా జీ–3, జీ–2, జీ–1 స్థాయి సర్వేలు చేయించుకోవాల్సి ఉంటుంది.
వైఎస్సార్ జిల్లా ఉప్పరపల్లె గ్రామంలో వజ్రాల నిక్షేపాలు ఉన్న భూములు
ఇందుకు రెండు నుంచి ఐదేళ్లు అవకాశం ఇస్తారు. ఆ తర్వాత వారికిచ్చిన కాంపోజిట్ లీజును సాధారణ లీజుగా మార్పు చేస్తారు. ఉప్పరపల్లె ప్రాంతంలో 37.65 చదరపు కిలోమీటర్లలో వజ్రాల లభ్యతకు అవకాశం ఉన్నట్లు ప్రాథమిక అంచనాల్లో తేలింది. లీజు పొందిన సంస్థ పూర్తి స్థాయిలో సర్వేలు చేస్తే, వజ్రాల లభ్యత గురించి పూర్తి సమాచారం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మైనింగ్ శాఖ టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపింది. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే టెండర్లు పిలవనున్నట్లు మైనింగ్ శాఖ అధికారులు తెలిపారు.
AP: వజ్రాల వేటకు ఓకే
Published Sun, Dec 12 2021 3:32 AM | Last Updated on Sun, Dec 12 2021 3:07 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment